వాలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కింది. పవన్ వ్యాఖ్యలతో వాలంటీర్ల పరువుకు నష్టం కలిగిందని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ న్యాయపోరాటానికి దిగడం విశేషం. ఈ మేరకు విజయవాడ సివిల్ కోర్టులో పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణ నిమిత్తం కోర్టు స్వీకరించినట్టు వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు.
వాలంటీర్లపై పవన్‌కల్యాణ్ నోరు జారడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పవన్ అనుచిత వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని అధికార వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాలంటీర్లకు అండగా నిలుస్తూ, పవన్‌పై న్యాయపోరాటానికి ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో పవన్‌పై పరువు నష్టం కేసు ఎన్నికల ముంగిట కీలక పరిణామంగా చెప్పొచ్చు.
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టుగా తమపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అవి తమను మానసికంగా కుంగివేశాయని, న్యాయం చేయాలని పిటిషన్‌లో వాలంటీర్ కోరారు. వాలంటీర్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాతే పవన్‌కల్యాణ్‌కు కోర్టు నోటీసులు పంపుతుందన్నారు. పవన్‌కల్యాణ్ కోర్టుకు రావాల్సి వుంటుందని వారు అభిప్రాయపడ్డారు.
పవన్ ఆరోపిస్తున్నట్టు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి తన దగ్గర ఆధారాలు వుంటే కోర్టుకు సమర్పించాల్సి వుంటుందన్నారు. పవన్ వ్యాఖ్యల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి వుందని న్యాయవాదులు అన్నారు. వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే ఉన్నారని వారు చెప్పుకొచ్చారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు వాలంటీర్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.
వాలంటీర్లపై తన అనుచిత వ్యాఖ్యలను పవన్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కోర్టుకు ఆయన సమర్పించే వివరాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కేవలం రాజకీయ అక్కసుతో ఆధారాలు లేకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడారా? లేక కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు ఏవైనా ఇచ్చాయా? అనేది చర్చనీయాంశమైంది.