బోస్ ధిక్క‌ర‌ణ‌..ఆయ‌న‌తో జ‌గ‌న్‌ కీల‌క భేటీ!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్రాపురం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ, కోన‌సీమ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు తోట త్రిమూర్తుల‌ను సీఎం జ‌గ‌న్ పిలిపించుకున్నారు. అలాగే…

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్రాపురం వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ, కోన‌సీమ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు తోట త్రిమూర్తుల‌ను సీఎం జ‌గ‌న్ పిలిపించుకున్నారు. అలాగే కోస్తాంధ్ర కోఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కూడా తోట త్రిమూర్తుల‌తో క‌లిసి సీఎంతో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రామ‌చంద్రాపురం టికెట్‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌కు ఇస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనే తాను స‌పోర్ట్ చేయ‌న‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో నేరుగా చెప్పిన‌ట్టు రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. అవ‌స‌ర‌మైతే పార్టీని వీడేందుకైనా వెనుకాడ‌న‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

దీంతో రామ‌చంద్రాపురంలో వైసీపీకి న‌ష్టం క‌ల‌గించ‌కుండా దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఇందులో భాగంగానే తోట త్రిమూర్తుల‌తో సీఎం జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రామ‌చంద్రాపురంలో తోట త్రిమూర్తుల‌కు బ‌ల‌మైన ప‌ట్టు వుంది. 1994లో తోట స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అక్క‌డి నుంచి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2019 వ‌ర‌కూ టీడీపీ, పీఆర్‌పీ త‌ర‌పున పోటీ చేసి గెలుస్తూ ఓడుతూ వ‌చ్చారు.

2019లో ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న వైసీపీలో చేరారు. మండ‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఆయ‌న్ను జ‌గ‌న్ నియ‌మించారు. గ‌త ఎన్నిక‌ల్లో మండ‌పేట నుంచి పిల్లి పోటీ చేసి ఓడిపోయారు. రామ‌చంద్రాపురం నుంచి మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. దీంతో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు ఏ నియోజ‌కవ‌ర్గం లేకుండా పోయింది. దీన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. 

రామ‌చంద్రాపురం నుంచి 2004లో పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందారు. అనంత‌ర కాలంలో పిల్లిని వైఎస్సార్ చేర‌దీసి మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. అందుకే వైఎస్సార్‌పై పిల్లి సుభాష్‌కు ప్ర‌త్యేక ప్రేమాభిమానాలు.

కానీ మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో త‌న‌కు ఉనికే లేకుండా పోతోంద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. అందుకే పార్టీ రానున్న ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌క‌పోయినా స‌రే రామ‌చంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా అయినా బ‌రిలో దిగాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. 

బోస్ ఎదురు తిరిగితే రామ‌చంద్రాపురం, మండపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీపై ఎంత మేర‌కు ప్ర‌భావం చూపుతుంది? దాన్ని ఎలా భ‌ర్తీ చేసుకోవాల‌నే అంశాల‌పై తోట త్రిమూర్తుల‌తో జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసే తీరునుబ‌ట్టి, రామ‌చంద్రాపురంలో వైసీపీ గెలుపోట‌ములు ఆధార ప‌డి వుంటాయి.