అమరావతి అంటే ఇంత కాలం ఒక సామాజిక వర్గానిదే అన్న ప్రచారం జరిగింది. కానీ ఇకపై అమరావతి అంటే అందరిదీ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. వెంకటపాలెం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ రాజధానిలో పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇంత కాలం పేరుకే అమరావతి రాజధాని అని ఆయన అన్నారు. అలాంటి రాజధానిలో నిరుపేదలకు, అక్కాచెల్లెళ్లకు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకునేందుకు కోర్టుకెళ్లారని విరుచుకుపడ్డారు.
రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాల్స్ వస్తుందని, కులాల సమతుల్యత దెబ్బతింటుందని ఇంతకాలం వాదించిన చరిత్ర వీళ్లదని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఇలాంటి పెత్తందారులు, దుర్మార్గమైన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. గతంలో ఇలాంటి దుర్మార్గులను, మనస్తత్వాన్ని, వాదనల్ని, రాతల్ని, టీవీ డిబేట్లని, రాజకీయ పార్టీల మానసిక, నైతిక దివాళాను చూశామా? అని ఆయన ప్రశ్నించారు.
ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారని జగన్ విరుచుకుపడ్డారు. పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు బినామీలు ఉండేందుకు అమెరికా, సింగపూర్ నుంచి మనుషులు రావొచ్చట అని వెటకరించారు.
కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదని ఈనాడు పత్రిక రాస్తోందని ధ్వజమెత్తారు. ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా? అని ఆయన ప్రశ్నించారు.
పేద వర్గాలు, పేద కులాలపై పెత్తందార్ల దోపిడీలను సహించి, భరించే కాలం పోయిందని జగన్ ప్రకటించారు. ఈ మార్పే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. మీ సోదరుడిగా అమరావతిని సామాజిక అమరావతిగా ఇక్కడి నుంచి పునాది రాయి వేస్తున్నట్టు జగన్ ప్రకటించారు.
ఇక నుంచి అమరావతి మనందరిది కాబోతోందని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఇదే ప్రాంతంలో అక్షరాలా 50793 మంది తన అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా నిలిచిపోతుందని జగన్ తెలిపారు.