చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోసారి రెచ్చిపోయారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్‌కల్యాణ్ వెళ్లినప్పటి నుంచి ఆయనపై నారాయణ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీని బీజేపీతో కలిసేలా చేసేందుకు పవన్‌కల్యాణ్ దళారి పాత్ర పోషిస్తున్నారని ఇటీవల ఆయన చేసిన ఘాటు విమర్శ తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో ఏబీ బర్దన్ కమ్యూనిటీ భవన్‌ను ప్రారంభించిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ బీజేపీతో కలవడం ద్వారా రాజకీయంగా ఆత్మహత్యకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. మునిగిన పడవపై వారు ప్రయాణిస్తున్నారని విమర్శించారు. వాళ్లిద్దరికీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక తమ మద్దతు ఎవరికో చెబుతామన్నారు.
బీజేపీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్, చంద్రబాబు కలిసి రాజకీయాలు మొదలు పెట్టారన్నారు. బీజేపీతో రాజకీయంగా ఎవరు సంబంధాలు పెట్టుకున్నా వారు తెలుగు ప్రజలకు ద్రోహం చేసినట్టే అని ఆయన అన్నారు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయన్నారు. పార్లమెంట్‌లో ఏ బిల్లు పెట్టినా మొదట మద్దతు ఇచ్చేది వైసీపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా నిలబడడంపై నారాయణ ఆగ్రహంగా ఉన్నారని ఇటీవల ఆయన కామెంట్స్ తెలియజేస్తున్నాయి.