శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న తమ్మినేని సీతారాం ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్నారు. ఈ ఒక్కసారి చాన్స్ అంటున్నారు. ఆయన 2024లో పోటీ చేయడం ఖాయం అంటున్నారు. ఆయన పోటీ అసెంబ్లీకా లేక పార్లమెంట్ కా అన్నది తేలడంలేదు. ఆముదాలవలసలో 1999 తరువాత రెండు దశాబ్దాల అనంతరం వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం గెలిచారు.
ఆయన అప్పటికే టీడీపీ, ప్రజారాజ్యం, మళ్లీ టీడీపీ ఇలా మూడు పార్టీలు మారి 2014కి ముందు వైసీపీలో చేరారు 2014లో ఆయన వైసీపీ టికెట్ మీద పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. జగన్ వేవ్ లో 2019లో గెలిచి స్పీకర్ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో తమ్మినేనికి ఆముదాలవలస టికెట్ దక్కదని అంటున్నారు. వైసీపీలో వర్గ పోరు పెరగడంతో పాటు తమ్మినేని మేనల్లుడే టీడీపీ నుంచి పోటీకి దిగడంతో తట్టుకునేందుకు కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు అని అంటున్నారు.
తమ్మినేనికి శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది. కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేనిని పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పార్టీ భావిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి అనేక దఫాలు కాళింగ సామాజికవర్గం గెలిచారు.
జిల్లావ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్న కాళింగుల నుంచి అత్యధిక కాలం ఎంపీ చేసిన వారుగా బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు ఉన్నారు. ఆయన తొలి లోక్ సభ కాలం నుంచి ఎంపీగా నెగ్గుతూ మొత్తం 26 ఏళ్ళ పాటు శ్రీకాకుళం లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేకపోయారు.
ఇటీవలనే బొడ్డేపల్లి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లాలో సామాజికంగా బలంగా ఉన్న రాజకీయంగా ఆధిపత్యం దక్కడంలేదన్న బాధ కాళింగులలో ఉంది. వైసీపీ వచ్చాక స్పీకర్ పదవిని ఇచ్చి గౌరవించింది. ఇపుడు లోక్ సభకు తమ్మినేనిని ఎంపీగా పంపించడం ద్వారా రెండు విధాలుగా రాజకీయ లాభం కోసం వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.