ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టానని ప్రగల్భాలు పలికి, టీడీపీ-బీజేపీ పల్లకీ మోయడానికి కుదురుకున్న పవన్‌కల్యాణ్‌కు రామచంద్రయాదవ్ మూడో ప్రత్యామ్నాయం అంటే ఎలా వుండాలో చూపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై కొత్త పార్టీ అవతరించింది. ఈ పార్టీ భవిష్యత్ ఏంటనేది ఇప్పుడు చెప్పలేం. ప్రధానంగా అధికారం అణగారిన వర్గాలకు రావాలనే నినాదంతో చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్ర యాదవ్ కొత్తగా రాజకీయానికి శ్రీకారం చుట్టారు.
గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో భారత చైతన్య యువజన పార్టీ అని తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలను ఏకిపారేశారు. తాను ఇద్దరికీ సమాన దూరమని విమర్శల ద్వారా ధైర్యంగా ప్రకటించడం విశేషం.
ఏపీలో ఐదారు శాతం జనాభా కలిగిన కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నాయకులే పరిపాలిస్తున్నారని, తమకు అధికారం దక్కలేదనే బాధ, ఆవేదన మిగిలిన సామాజిక వర్గాల్లో వుంది. ఆ ఆవేదన, ఆక్రోశాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే తపన రామచంద్ర యాదవ్‌లో కనిపిస్తోంది. అతని ప్రసంగంలో ఎక్కడా డొంక తిరుగుడు లేదు. నేరుగానే టీడీపీ, వైసీపీ పాలనలను తూర్పార పట్టారు.
రామచంద్ర యాదవ్ నుంచి పవన్ కల్యాణ్ చాలా నేర్చుకోవాల్సి వుంది. రాజధాని పేరుతో చంద్రబాబునాయుడి భూదోపిడీని విమర్శించారు. కేవలం తన వర్గానికి భూములు దోచి పెట్టడం కోసం తాత్కాలిక రాజధాని పేరుతో ఏపీ సమాజాన్ని టీడీపీ వంచించిందని ఘాటు విమర్శ చేశారు. సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ అన్ని వర్గాలను మోసగించిందని తప్పు పట్టారు.
ఇదే సందర్భంలో వైసీపీ అరాచక పాలన చేస్తోందని దుయ్యబట్టారు. ఈ దశాబ్దంలో జరిగిన దురదృష్టకర ఘటన ఏదైనా ఉందంటే అది వైసీపీ ఆవిర్భావమే అని సంచలన విమర్శ చేశారు. అంతకంటే దురదృష్టకర సంఘటన వైసీపీకి అధికారం ఇవ్వడమే అని ఛీత్కరించుకున్నారు. ఈ సభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, బీపీ మండల్ మనుమడు ఫ్రొఫెసర్ సూరజ్ మండల్ పాల్గొనడం, వారు ప్రసంగించడం దళిత, బహుజనులను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని రామచంద్ర యాదవ్ రచించారు.
మొదటి సభలో ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రసంగించినట్టే కనిపించింది. పరిపాలన లోపాలను ఎత్తి చూపుతూ, తాను ప్రత్యామ్నాయ నాయకుడినని చూపేందుకు అతని ప్రయత్నం నుంచి పవన్ ఎంతో నేర్చువాల్సి వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వైఎస్ జగనే తనకు టార్గెట్ అంటూ, ఇప్పటికీ అదే పంథాలో పవన్ వెళితే, మూడో ప్రత్యామ్నాయంగా రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా నిలదొక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.