వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిలోకి ప్రమోట్ అయి వెళుతున్నారంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం అంటూ పలువురు నాయకులు చర్చించుకోవడమూ, కథనాలు రావడమూ కూడా జరిగింది. ఆయన కేంద్రంలో లాబీయింగ్ చేసి అనాథలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాస్త ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చేలా చేయగలుగుతున్నారని, ఆ అవకాశం మిస్సవుతున్నదని చాలా మంది అనుకున్నారు. అది నిజమే కావొచ్చు.
కానీ తెలుగుదేశం నాయకుల్లో అంతకు మించిన భయం వ్యక్తం అవుతోంది. వెంకయ్య నాయుడు పూర్తిగా రాజకీయాల పరిధినుంచే పక్కకు తప్పుకుని రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిపోవడం అనేది.. వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి పెద్ద దెబ్బ అని వారు ఆందోళన చెందుతున్నారు. నిధుల దెబ్బ కంటే, రాజకీయ దెబ్బే పెద్దదని అనుకుంటున్నారు.
ఎలాగంటే.. ఆంధ్రప్రదేశ్లో భాజపా, తెలుగుదేశం మిత్రపక్షాలుగా పోటీచేశాయి. గెలిచిన తర్వాత కలిసే ప్రభుత్వం ఏర్పాటుచేశాయి. కానీ చాలా సందర్భాల్లో ఆ పార్టీల నాయకుల వైఖరి వైరి పక్షాల్లాగానే కనిపిస్తూ వచ్చింది. శత్రువులను డీల్ చేసినట్లుగా తెలుగుదేశం మీద, వారి పరిపాలనలో అవినీతి బాగోతాల మీద భాజపా నాయకులు ధ్వజమెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా మిత్రపక్షాలే తప్పుపట్టడం ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వం పరువు తీసేస్తుంది.
అయితే… భాజపా నాయకులు రెచ్చిపోయి, చంద్రబాబు సర్కారు పరువు బజార్న పడుతున్న ప్రతి సందర్భంలోనూ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకునే వారు. ఆయనను మీరి పోయేంత నాయకులు రాష్ట్రంలో లేరు గనుక.. భాజపా నాయకుల ఆగ్రహాన్ని చల్లబరిచేవారు. తాను స్వయంగా చంద్రబాబు సమర్థతను కీర్తిస్తూ.. ఇరు పార్టీల మధ్య సయోధ్య పుష్కలంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు.
ప్రధానంగా సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి భాజపా నాయకులు చంద్రబాబు సర్కారు మీద రెచ్చిపోయిన ప్రతి సందర్భంలోనూ వెంకయ్య క్రైసిస్ మేనేజిమెంట్ పాత్ర పోషించారంటే అతిశయోక్తి కాదు. అన్నిటినీ మించి.. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా కూడా అన్ని స్థానాలకు పోటీచేయగలిగినంత బలమైన పార్టీగా తమను తాము తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించడంలేదనే ఒక ఆరోపణ ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ సమయంలో వారికి అవకాశం ఉన్నా.. ఏపీలో చంద్రబాబు మీద అభిమానంతో భాజపా విస్తరణకు పెద్దగా కృషి చేయకుండా వెంకయ్య అడ్డుపడుతూ వచ్చారనేది కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడాయన ఉపరాష్ట్రపతి అయితే.. ఇక ఏపీ రాజకీయాల్లో భాజపాకు గైడెన్స్ ఇచ్చేది ఉండదు. భాజపా యథేచ్ఛగా విస్తరించి… వచ్చే ఎన్నికలనాటికి పొత్తుల్లేకుండా పోటీచేయగలం అనుకునే స్థాయికి రావచ్చు.. లేదా, కనీసం ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే పరిస్థితికి చేరుకోవచ్చు.
ఇలాంటి ఏ పరిణామం సంభవించినా సరే.. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అది దెబ్బే అవుతుంది. అందుకే ఆ పార్టీ నాయకుల్లో… వెంకయ్యనాయుడు కొత్త హోదా గురించి హర్షం కంటే విషాదమే ఎక్కువగా ధ్వనిస్తోంది. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా తెలుగుదేశానికి నష్టం అని అందరూ అంటున్నారు.