అనుకున్నంత సులువుగా, సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు సినీ దర్శకుడు పూరిజగన్నాధ్ విచారణ వ్యవహారం. జస్ట్ ప్రశ్నలతో వదిలేస్తారు అనుకుంటే, ఆధారాలు, ఇతరత్రా వ్యవహారాలు ముందు పెట్టి, క్రాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అయిదు గంటలకు ముగియాల్సిన విచారణను రాత్రి ఎనిమిది వరకు పొడిగించారు. పైగా పూరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, గడచిన మూడు నెలల్లోగా డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అన్నది నిర్ధారించేందుకు చకచకా ఏర్పాట్లు చేయడం విశేషం.
అప్పటికప్పుడు ఉస్మానియా నుంచి సర్జన్ ను రప్పించారు. అంటే పూరి విషయంలో సిట్ చాలా సీరియస్ గానే వున్నట్లు కనిపిస్తోంది. నిజానికి డ్రగ్స్ సర్క్యులేట్ చేయకపోతే పూరికి వచ్చిన సమస్య లేదనుకున్నారంతా. కానీ ఇప్పుడు విషయం వేరే టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పూరిని అసలు బేసిక్ లెవెల్ నుంచి పిక్స్ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
కెల్విన్ తో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే సాక్ష్యాలు సిట్ దగ్గర వున్నాయని, అవి పూరికి చూపించారని వార్తలు బయటకు పొక్కాయి. పూరికి డ్రగ్స్ అలవాటు వుందని ప్రూవ్ అయినా, అలాగే కెల్విన్ తో ఆర్థిక లావాదేవీలు వున్నాయని ప్రూవ్ అయినా, కనీసపు ఆధారాలు వుంటే అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే అలా చేసే ముందు పకడ్బందీగా ఫిక్స్ చేసే దిశగా సిట్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.