‘బతుకమ్మ’కు మీడియా అండ

తెలంగాణ సాంస్కృతిక జీవనాడి, అత్యంత ప్రాచుర్యం ఉన్న  బతుకమ్మ పండగ   తొలిసారి ఈ ఏడాది ఘనంగా జరుగుతోందని అందరూ అంటున్నారు. అనుకుంటున్నారు. నిజమే చాలా ఘనంగా జరుగుతోంది. ఊరూవాడా పూలవనాలుగా మారిపోయాయి.  సబ్బండ…

తెలంగాణ సాంస్కృతిక జీవనాడి, అత్యంత ప్రాచుర్యం ఉన్న  బతుకమ్మ పండగ   తొలిసారి ఈ ఏడాది ఘనంగా జరుగుతోందని అందరూ అంటున్నారు. అనుకుంటున్నారు. నిజమే చాలా ఘనంగా జరుగుతోంది. ఊరూవాడా పూలవనాలుగా మారిపోయాయి.  సబ్బండ వర్ణాల వారు ఒక్కటైపోయి ఉత్సాహంగా బతుకమ్మలు ఆడుతున్నారు. సామాన్య జనమే కాదు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు (మహిళలతోపాటు పురుషులు కూడా) రాజకీయ నాయకులు, విద్యార్థులు…ఇలా సకల జనులు బతుకమ్మలు ఆడుతున్నారు. పాడుతున్నారు. ఈసారి వామపక్ష ప్రజా సంఘాల వారు కూడా బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకోవడం విశేషం. ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు ఎన్నడూ జరగలేదా? ఎందుకు జరగడంలేదు?  తెలంగాణలో శతాబ్దాలుగా పల్లెపట్టుల్లో బతుకమ్మలు ఆడుతున్నారు. ఈ అందమైన ప్రకృతి పండుగ పట్టణాలవారికి అంతగా తెలియదు. ఒకవేళ నిర్వహించినా అది నామమాత్రంగానే ఉంటోంది. పల్లెలు కూడా ఆధునిక పోకడలను ఒంటబట్టించుకున్నా అక్కడ బతుకమ్మ సజీవంగానే ఉంది. కాకపోతే ఈ ఏడాదే బతుకమ్మ వేడుకలు ఇంత ఘనంగా, ఈ సంబరాలు అంబరాన్ని అంటినట్లుగా జరుగుతన్నాయంటే మీడియా అండగా ఉండటమే కారణం.
     
కేసీఆర్‌ ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర ప్రభుత్వ పండుగలుగా అధికారికంగా ప్రకటించి నిధులు కూడా విడుదల చేయడంతో ఇది పండుగ కంటే ప్రభుత్వ కార్యక్రమంగా రూపాంతరం చెందింది. అందుకే సమస్త శాఖల అధికారులు, ఉద్యోగులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఏ పండుగలకైనా మీడియాలో ముఖ్యంగా టీవీ ఛానెళ్లలో యమ హడావిడి ఉంటుంది. ఇరవైనాలుగు గంటలపాటు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానెళ్లకు కాస్త వెరైటీ కార్యక్రమాలు రూపొందించాలంటే  పండుగలప్పుడే అవకాశం దొరుకుతుంది. అయితే ఈసారి ప్రభుత్వమే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తుండటంతో పత్రికల్లో కవరేజీ, ఛానెళ్లలో ప్రసారాలు ఎక్కువయ్యాయి. అదీకాక, ఈమధ్య కేసీఆర్‌ మీడియాపై కన్నెర్ర చేయడం, ఏకంగా రెండు ఛానెళ్లపై వంద రోజులకు పైగా నిషేధం కొనసాగిస్తుండటంతో అన్ని పత్రికలు, ఛానెళ్లు బాగా కవరేజీ ఇచ్చాయి. వాస్తవానికి ప్రతీ పండుగా జనజీవితంలో అంతర్భాగమే. వాటి చరిత్ర శతాబ్దాలనాటిది.
     
తరతరాలుగా ప్రజలు పండుగలను, పర్వదినాలను, జాతర్లను వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. మీడియా పరిమితంగా ఉన్న రోజుల్లోనూ,  వెయ్యి కాళ్ల జెర్రి మాదిరిగా విస్తరించిన ఈ కాలంలోనూ పండుగలు అదే జోష్‌తో జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ పండుగలను మీడియా బాగానే కవర్‌ చేసింది. వినాయకచవితి వేడుకలకు ముంబయి తరువాత హైదరాబాద్‌ పేరు చెబుతారు. ఈ వేడుకలకు ఏనాడు కవరేజీ తక్కువైంది? ఇదేమీ అధికారికంగా చేసేది కాదు కదా…! కాబట్టి పండుగలను  ఎవరో ఒకరు పనిగట్టుకొని ప్రమోట్‌ చేయాల్సిన అవసరం లేదు. కకాపోతే బోనాలు, బతుకమ్మ పండుగలు తెలంగాణకు ప్రత్యేకమైనవి. అసలు బతుకమ్మ వేడుకలు దసరా  నవరాత్రుల్లో అంతర్భాగమనే చెప్పాలి. బతుకమ్మకు సంబంధించి అనేక కథలున్నా ఇది కూడా అమ్మవారికి (దుర్గామాత) రోజుకొక అలంకారం చేయడమే. విజయవాడ కనకదుర్గకు కూడా ఈ తొమ్మిది రోజులూ రోజుకో అవతారంలో అలంకారం చేస్తారు. 
    
కాబట్టి దసరా అయినా బతుకమ్మ అయినా తెలుగువారందరి వేడుకగా చెప్పుకోవాలి. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంటును మరింత సజీవంగా ఉంచేందుకు అధికారిక పండుగగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కూతురు కవిత తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి బతుకమ్మను ఉద్యమానికి అనుసంధానం చేశారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును మరింత రాజేశారు. అప్పట్లో ఈ వ్యూహం ఉద్యమానికి బాగా దోహదం చేసిందనే చెప్పుకోవాలి. పండుగలను ఉద్యమానికి ఆయుధాలుగా వాడుకోవడం కొత్తేమీ కాదు. ఏది ఏమైనా తెలంగాణ కొత్త ప్రభుత్వం జనాల్లో జోష్‌ నింపింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పండుగలను అణచేశారనే భావనతో ఉన్న కేసీఆర్‌ సర్కారు కొత్త పుంతలు తొక్కింది. 

ఎం. నాగేందర్