cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

అవినీతికి బంధాలు లేవు

అవినీతికి బంధాలు లేవు

పులిని చూస్తే పులి ఎన్నడు జడవుదు..మేక వస్తే మేక ఎన్నడు అదరదు..మాయరోగమదేమోగానీ మనిషి మనిషికి కుదరదు అంటాడు.. అందాలరాముడులోని ఓ పాటలో కవి. ఎంతో కట్టుగా వుంటూ, జీతాలు, ఇతర డిమాండ్లు సాధించుకునే ఎన్జీవోలు, వాళ్లను వాళ్లు వివిధ పనుల సందర్భంగా దోచుకునే తీరు చూస్తే ఈ లైన్లే గుర్తుకువస్తాయి. 

జనాలకు తెలిసినంత వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలంటే, పైసలు ఖర్చు చేయాలి. ఆర్టీవో, రెవెన్యూ, మెడికల్, ఇలా అన్నింటా. సామాన్య ప్రజలను వదిలేస్తే, వివిధ శాఖలతో పనులున్నవారు కూడా తమ తమ పనుల కోసం పైసలు ఖర్చుచేయాలి. సరే, వారికి బిల్లులు, రావాల్సిన మొత్తాలు వుంటాయి కాబట్టి కాస్త ఖర్చుచేసారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు లంచం సమర్పించుకునే ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీ కూడా వుంది. 

ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇవ్వడమా? అంటే వాళ్లకు కూడా ఏదో స్వలాభం వుండి వుండాలి అని అనుకోవద్దు. ఏ మాత్రం స్వలాభం లేకుండా, కేవలం వృత్తిరీత్యా తమకు రావాల్సిన దానికోసం డబ్బులు జల్లాల్సి రావడం అన్నది మరీ ఘోరం. పోనీ ప్రభుత్వ ఉద్యోగులు ఒక శాఖ వారు మరో శాఖకు డబ్బులు ఇవ్వడమా అంటే అదీ కాదు, తమ శాఖ ఉద్యోగులకే తాము ముడుపులు ఇవ్వాల్సి రావడం.

అదెలా అంటే, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉద్యోగులు  వుంటారు. వారికి జీతభత్యాలు, పిఎఫ్ అడ్వాన్సులు, ఎల్టీసీలు, ఇతరత్రా వ్యవహారాలు చూసే జనాలు అదే ఆఫీసులో వుంటారు. కానీ జీతాలు పెరిగినపుడు, అరియర్లు రాయాల్సి వచ్చినపుడు, ఇంక్రిమెంట్ అరియర్లు రాయాల్సి వచ్చినపుడు, ఏ అవసరం కోద్దీ పీఎఫ్ అడ్వాన్సు కావాలన్నపుడు వంద నుంచి ఉద్యోగికి రావాల్సిన మొత్తాలను బట్టి పెంచాల్సిందే.

ఆఫీసు గుమస్తా, సూపరింటెండెంట్, ట్రెజరీకి బిల్లులు తీసుకెళ్లే ఉద్యోగి ఇలా అందరూ కలిసి పంచుకోవడం పరిపాటి.

ఇక ట్రెజరీల అవినీతి చెప్పనక్కరలేదు. ట్రెజరీ ఉద్యోగీ ఎన్జీవోనే, అక్కడకు వెళ్లిన బిల్లులు ఎన్జీవోలవే. కానీ చేయి తడపక తప్పదు. కనసర్న్డ్ క్లర్క్, ఎస్టీవో కి ముడుపుల వాటా సమర్పించకతప్పదు. 

ఇక బదిలీలు వస్తే పండగే, ప్రతి శాఖకు జిల్లాస్థాయిలో లేదా ప్రాంతీయ స్థాయిలో కార్యాలయాలు వుంటాయి. అక్కడ ఉద్యోగుల విభాగాన్ని బట్టి గుమస్తాలు వుంటారు. సెక్షన్ సూపరింటెండెంట్ లు వుంటారు. అధికారులు వుంటారు. వీరందరికీ తడపాల్సిందే. 

ఒక ఎన్జీవో రిటైర్ అయితే అతను పని చేసిన కార్యాలయం నుంచి, అవసరమైతే ప్రాంతీయ కార్యాలయానికి లేదంటే, రాష్ట్ర కార్యాలయానికి ఫైనల్ బెనిఫిట్ లు, పింఛన్ల కాగితాలు నడవాలంటే, కాసులు సమర్పించుకోవాలి. తిరిగి అవన్నీ శాంక్షన్ అయి వచ్చాయంటే ట్రెజరీలో ముడుపులు కట్టాలి. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఇదే తరహా. ప్రజలు పనుల కోసం ఉద్యోగుల చేతులు తడుపుతారు. అదే ఉద్యోగులు, తమ పనుల కోసం సాటి ఉద్యోగల చేతులు తడుపుతారు. 

సాటి ఉద్యోగి కదా, మనతో పనిచేస్తున్నవాడే కదా, పాపం, మనం మన వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటి అన్నది ప్రభుత్వ విభాగాల్లో వుండదు. వంద నుంచి వెయ్యి రెండు వేల దాకా ముడుపులు కడుతూనే వుంటారు. ఇక వైద్య తదితర శాఖలలో బదిలీలు వస్తే పండగే. తమకు కోరిన ప్రాంతానికి బదిలీ కోసం వేలల్లో ఖర్చు చేయాల్సి వుంటుంది. 

మరి ఎన్జీవోల నాయకులు ఇది తప్పు, మనని మనం ఎక్స్ ప్లాయిట్ చేసుకోవడం ఏమిటి? జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల పనుల కోసం ఉద్యోగులే లంచం తీసుకోవడం ఏమిటి? అని ఎప్పుడన్నా చెప్పారా? అసలు ఆ పాయింట్ డిస్కషన్ కన్నా వచ్చిందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అలా జరిగి వుంటే ఈ తరహా వ్యవహారాలకు ఎప్పుడో ఫుల్ స్టాప్ పడేది కదా?

చాణక్య

writerchanakya@gmail.com

 


×