cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

బాబు గారూ...ఇదెలా సాధ్యం?

బాబు గారూ...ఇదెలా సాధ్యం?

ఆర్థిక, సామాజిక హోదాలతో పని లేకుండా, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో గృహకల్పన చేయడమే నవ్యాంధ్ర రాజధాని అమరావతి లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిజంగా మెచ్చుకోదగ్గ, అద్భుత మైన ఆశయం. కానీ, అదెలా సాధ్యమన్నదే అర్థం కావడం లేదు. రాజధాని కోసం వేలాది ఎకరాల భూమి సేకరించారు. వివిధ నిర్మాణాలు, అవసరాలకు భూములును కేటాయించగా మిగిలిన వాటిలోనే ఇళ్ల నిర్మాణం కోసం ఏం చేసినా చేయాల్సి వుంటుంది. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తారు. వారు తమ ఇల్లు తాము నిర్మించుకుంటారు. లేదా రేటు వచ్చిందని, అవసరం లేదని అమ్ముకుంటే అమ్ముకుంటారు. అది వేరే విషయం. 

వీరు కాక, వేరెవరైనా రాజధాని నగరం నచ్చి, లేదా అక్కడ ఉద్యోగం, ఉపాథి వుండి, అక్కడే స్వంత ఇల్లు సంపాదించుకోవాలంటే ఎలా? ఇలా ఇళ్లు నిర్మించడానికో, ప్లాట్లు నిర్మించడానికో ప్రభుత్వం కొంత స్థలం రిజర్వు చేస్తుందా? పోనీ చేస్తుందే అనుకుందాం. మరి దాని బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? పభుత్వ భూమి, ప్రయివేటు డెవలప్ మెంట్, లాభం, ఆదాయం పంపంకం పద్దతిలోనా? ఇప్పటికే విశాఖ, విజయవాడ లాంటి పట్టణాభివృద్ధి సంస్థలు ఇలాగే తమకు నచ్చిన వారితో వ్యాపారాలు సాగించాయి గతంలో. ప్రభుత్వ స్థలం హాయిగా తీసుకుని, డెవలప్ మెంట్ చేసి, వ్యాపారం చేసుకున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. లేదా ప్రభుత్వమే డెవలప్ మెంట్ చేసి సైట్ల వ్యాపారం, ఫ్లాట్ల వ్యాపారం సాగిస్తుందా? పట్టణాభివృద్ధి సంస్థల మాదిరిగా? అది ఎంత సామాన్యుడికి అందుబాటులో వుంటుందో అందిరికీ ఎరుకే? 1990 దశకం దాటాక విశాఖ నగరాభివృద్ధి సంస్థ, మధ్యతరగతి కుటుంబీకుల కోసం లాటరీలో కనీస ధర నిర్ణయించి స్థలాలు అమ్మడం మానేసింది. అంతా వేలం పాటే? ఇక సామాన్యడుకి స్థానమెక్కడ? ఎన్నారైలు, రియల్టర్లు, పోటీ పడి, పావలా సైటును పది రూపాయిలకు కొని ప్రభుత్వానికి డబ్బులిచ్చారు. తరువాత వారు డబ్బు చేసుకున్నారు. మధ్యతరగడి వాడికి ప్రయివేటు అపార్ట్ మెంట్లే దిక్కయ్యాయి. పట్టణాభివృద్ధి సంస్థలు తమ అసలు లక్ష్యం నుంచి ఏనాడో పక్కకు తప్పుకుని, రియల్ ఎస్టేట్ సంస్థల బాబులుగా తయారయ్యాయి?

మరి అవి ప్రభుత్వ సంస్థలే. ఇప్పుడు అందరికీ సామాజిక, ఆర్థిక బేధాలతో సంబంధం లేకుండా ఇళ్ల కల్పన చేయాలన్న ఆశయం మరి పట్టణాభివృద్ధి సంస్థల దగ్గరకు వచ్చేసరికి ఏమయినట్లు? అప్పుడు లేని సదాశయం ఇప్పుడు ఎక్కడినుంచి వస్తుంది? పైగా రైతులకు స్థలం, కౌలు, అభివృద్ధి ఖర్చులు కలిపి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో గజం రేటును అమాంతం పెంచేసాయి. రాజధాని నిర్మాణం నాటికి మరింత పెరుగుతుంది. మరి అప్పుడు పెట్టే ధర సామాన్యుడికి అందుబాటులో వుంటుందా? అలా వుండాలంటే ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అమ్మాల్సి వుంటుంది. అలాంటపుడు కేటాయింపులకు పారదర్శకమైన విధానాలు అవలంబించాల్సి వుంటుంది. మళ్లీ అక్కడ అస్మదీయులు రంగప్రవేశం చేసి, అయినవారికి ఆకుల్లో అన్న చందం చేసే పరిస్థితి వుండకూడదు. కానీ ప్రభుత్వం దగ్గర ఆదాయం, నిధులు అంతంత మాత్రం కనుక, ఇలాంటి లాటరీ, సబ్సిడీ అనేవి ఊహించడానికే అనుమానంగా వుంది. వంద ఎకరాలు ప్రయివేటు రియల్టర్ కు ఇచ్చి, డెవలప్ చేసి, అయిదు ఎకరాలు ఖర్చులకు మీరు తీసుకోండి, అయిదు ఎకరాలు మాకు ఇవ్వండి, వాటిని జనాలకు అమ్ముతాం అని అనే పద్దతి అయితే మాత్రం, అవి ఎన్నారైలకు, రియల్టర్లకు తప్ప, మామూలు జనాలకు అందవు. 

 

 


×