cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

హోదాపై అందరిదీ పక్కదారి ప్రయత్నమే

హోదాపై అందరిదీ పక్కదారి ప్రయత్నమే

ప్రత్యేక హోదా..అదో మాయా స్వప్నం. ప్రత్యేక హోదాపై ఆందోళన చేసిన, చేస్తున్న ప్రజలు పది మందిని పక్కకు పిలిచి, ఈ హోదా వల్ల ఆంధ్రకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఒరిగేదేమిటి? దీని వల్ల ఎవరికి అసలు సిసలు లాభం? అని అడగండి. సరైన సమాధానాలు వస్తాయోమే చూడండి. 

ఈ ప్రత్యేక హోదా అన్న పదాన్ని తొలిసారి జనాల మనసుల్లో నాటింది భారతీయ జనతాపార్టీ. ఇప్పడు తెలుగుదేశం పార్టీ గొంతు చించుకుంటున్న 'తలుపులు మూసి, వైర్లు కోసి, అన్యాయంగా విభజించారు' అన్న దాంట్లో ఎక్యూజ్డ్ నెంబర్ 2. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది తప్పు అయితే భాజపాదీ ముమ్మాటికీ తప్పే. అయితే, ఆ తప్పు కప్పి పుచ్చుకోవడానికి, తెలుగునాట, మోడీకి, భాజపాకు, మీదు మిక్కిలి వెంకయ్య నాయుడుకు ఎన్నికల వేళ అడ్డంకి లేకుండా వుండడానికి వాడిన పదం ప్రత్యేక హోదా.

పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం వెంకయ్య నాయుడు వీరోచితంగా పోరాడారని, అది సాధించారని, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా వుంటుదని ఊదర గొట్టారు. కావాలంటే, ఏ లైబ్రరీకి వెళ్లినా, లేదా నెట్ లో వెదికినా ఆ నాటి 'పచ్చ' పాత పత్రికలు దొరుకుతాయి. వాటినిండా ఇవే తరహా వార్తలు కనిపిస్తాయి.

దీంతో ప్రజలు, అదేదో అద్భుతం జరుగుతుందని, దాని వల్ల విభజన నష్టం పూర్తిగా పూడుకు పోతుందని అందరూ భావించారు. కానీ నిజానికి ఇక్కడో లాజిక్ మరిచిపోయారు. సమైక్య రాష్ట్రంలో వెనుక బడిందని, వివక్షకు గురయిందని, నష్టపోయిందని చెప్పి కదా, తెలంగాణను విడగొట్టారు. మరి అలా వెనుకబడి, వివక్షకు గురై, నష్టపోయిన తెలంగాణ కు కాకుండా ఆంధ్రకు ఎందుకు హోదా ఇస్తారు? ఇస్తే, మళ్లీ తెలంగాణలో ఉద్యమం రగులు కోదా? పోనీ రగులుకోకపోయినా, అక్కడ భాజపాకు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కాదా? కానీ జనాలకు ఇవేవీ పట్టనంతంగా ప్రచారం సాగిపోయింది. 

మళ్లీ తెరపైకి

సరే అయిందేదో అయిపోయింది. ఎన్నికలు జరిగిపోయాయి. విభజన పాప భారం అంతా భాజపా వాటా కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ ఖాతాలో వేసి, దానిని ఖతం చేసారు. సంతోషం. భాజపా వెంకయ్య హీరో అయిపోయారు. ఆయన మిత్రుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. అందరూ ఏరు దాటేసారు. పడవను తగలెట్టేసారు. ఇప్పుడు హోదా అన్న మాట గుర్తు చేసే, వారికి చాలా, చాలా ఇబ్బందిగా వుంటుంది. 

కానీ కాంగ్రెస్ పార్టీ, వైకాపా ఇప్పుడు తమ పని ప్రారంభించాయి. ఎన్నికల ముందు ఏ ప్రత్యేక హోదానైతే చూపించి, తాము సాధించామని, అదో అద్భుతవరమని భాజపా, తేదాపా చెప్పాయో, అదే ప్రత్యేక హోదా కోసం అవి ఉద్యమిస్తున్నాయి. అవి కూడా ప్రత్యేక హోదా అన్నది ఓ అద్భుతమని, అది లేకపోతే ఆంధ్రకు చాలా చాలా నష్టమన్నట్లు మాట్లాడుతున్నాయి. ప్రజలను రెచ్చగొడుతున్నాయి. అప్పుడు తేదేపా, భాజపా, ప్రజలకు నచ్చ చెప్పడానికి ప్రత్యేక హోదాను వాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ వైకాపా, రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నాయి. అందరికీ ఓకటే తప్పు.

ప్రత్యేక హోదా అన్నది రాష్ట్ర అభివృద్దికి ఓ అవకాశం. దాన్ని కాదనడానికి లేదు. కానీ అదే సంజీవిని..అదే అవశ్యం..మరోదారి లేదు అన్నట్లు మాట్లాడడం మాత్రం కరెక్టు కాదు. హోదా వల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమీ వుండదు. కొన్ని పరిశ్రమలు రావడం వల్ల ఉపాథి అవకాశాలు పెరగవచ్చు. కొన్ని నిధులు రావడం వల్ల అభివృద్ధి పనులు జరగవచ్చు. అంతే తప్ప మిగిలిన వ్యవహారాలన్నీ పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు, అలాగే బడా పెట్టుబడిదారులకు పనికివచ్చేవే. ఇలాంటప్పుడు నిధులు ఇస్తాము, పరిశ్రమలకు రాయతీలు ఇస్తాము అన్నా ఆనందంగా ఊ కొట్టవచ్చు. హోదా కోసం పట్టుబట్టకుండా. కానీ వైకాపా, కాంగ్రెస్ అలా అనడం లేదు. హోదా మాట మార్చారంటున్నాయి. అది నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు తక్షణ కర్తవ్యం రాని దాని కోసం ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమించడమా? లేక, రాజీమార్గంలో వెళ్లి మరిన్ని ప్రత్యామ్నాయాలు సాధించడమా?

ఎవరికి లాభం?

ఇప్పటికైనా అసలు ప్రత్యేక హోదా ఏమిటి? దాని వల్ల సామాన్యుడికి ఒరిగేదేమిటి? అన్నది స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఏం తీసుకోవాలో చెప్పగలగాలి. అలాగే హోదా ఇవ్వకుంటే, తమకేం కావాలో కేంద్రానికి కూడా వివరించగలగాలి. అలా పని జరిపించుకోవాలి తప్ప, నిరసనలు, బంద్ లు, ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం శూన్యం. ఇలా చేస్తే, భాజపా, తేదేపాల నిజరూపం బయటకు రావచ్చు. అంత మాత్రం చేత జనాల చేతిలోంచి చేజారిపోయిన ఓటు వెనక్కు రాదు కదా? మరో నాలుగేళ్ల తరువాత దానికోసం ఇప్పుడెందుకు హైరానా? కేంద్రంతో సఖ్యతతో పోయి, ఏదో ఒకటి సాధించుకు వచ్చే అవకాశం పాలక పార్టీకి ఇచ్చి, వేచి చూడొచ్చు కదా? 

అలా కూడా పాలక పార్టీలు ఏమీ చేయలేకపోతే, జనాలే అది గ్రహిస్తారు. ప్రతిపక్షాలు కూడా నిలదీయ వచ్చు. అంతే కానీ, బ్రహ్మ పదార్థం లాంటి ప్రత్యేక హోదాను పట్టుకుని, యాగీ చేయడం అంత సరికాదేమో? అసలు ప్రత్యేక హోదా ఏమిటి? లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి? అన్నిది ప్రభుత్వమే సక్రమంగా, సవివరంగా వివరిస్తే, అస్సలు జనాలు ఇక దాని గురించి మాట్లాడడం తగ్గిస్తారేమో?

 


×