మనకు అమ్మా నాన్న తమిళమ్మాయిగా పరిచయమైన కేరళ కుట్టి అసిన్ పెళ్లికి సిద్ధమైందట. గజని తర్వాత ఉత్తరాదికి జెండా ఎత్తేసి ప్రస్తుతం బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణిస్తున్న అసిన్…త్వరలో పెళ్లి కూతురు కానుందని ఉత్తరాది మీడియా కధనం. ఇంకో ఏడాదిలో 30కి చేరుకోబోతున్న అసిన్..మైక్రోమాక్స్ వ్యవస్థాపకుడైన రాహుల్‌శర్మను ఆమె పెళ్లాడబోతోందని బోంబేటైమ్స్ వెల్లడించింది. అసిన్ కాబోయే హజ్బెండ్ రాహుల్ ఆమెకు ఖిలాడి 786లో సహనటుడైన హీరో అక్షయ్‌కుమార్ ద్వారా పరిచయమయ్యాడట.
కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదన్న ఆమె మాటలను బట్టి త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పడం ఖాయమేనని అంచనా వేస్తున్నారు. ‘‘ప్రస్తుతం నేను పాత ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ అన్నీ వరుసగా పూర్తి చేసేస్తున్నాను. వ్యక్తిగత జీవితానికి మరింత సమయం కేటాయించాలనుకుంటున్నాను. రెండేళ్లుగా కొత్త ప్రాజెక్టులేవీ అంగీకరించడం లేదు’’ అని అసిన్ చెప్పడంతో ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయనేది మరింత స్పష్టంగా తేలిపోయింది.
అభిషేక్ బచ్చన్, రిషికపూర్, స్మృతి ఇరానీ తదితరులతో అసిన్ నటించిన ఆల్ ఈజ్ వెల్ సినిమా ఈ ఆగస్టులోనే విడుదల కానుంది.