ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా హాని తలపెట్టాలని అనుకున్నప్పుడు 'నీ పప్పులు ఉడకవు' అంటాం. అంటే నువ్వు అనుకున్న పని చేయలేవని అర్థం. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి 'ప్రభుత్వాల పప్పులు' ఉడకవు. అశ్లీల వెబ్సైట్లను (పోర్న్ వెబ్సైట్లు) నిషేధించాలని ఏళ్ల తరబడి అనుకుంటున్నా చేయలేని కేంద్రం మొన్నీమధ్య ఆ పని చేసేసరికి హమ్మయ్య…సర్కారు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించిందని కొందరు సంతోషించారు. అయితే సంతోషించినవారికంటే వ్యతిరేకించినవారే ఎక్కువగా ఉన్నారని తేలడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అంతకుముందు 850 పోర్న్ వెబ్సైట్లను నిషేధించాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు ప్రొవైడర్లు ఉన్నారు. ఈ చర్య తీసుకోగానే చాలా వెబ్సైట్లు ఓపెన్ కాలేదు. దీంతో దేశంలో గగ్గోలు మొదలైంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ సామాజిక మీడియాలో చాలామంది చెలరేగిపోయారు.
కొందరు ప్రముఖులు కూడా పోర్న్ వెబ్సైట్లను నిషేధించాల్సిన అవసరం లేదని పత్రికల్లో వ్యాసాలు రాశారు. నిషేధించడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని, పోర్న్ వెబ్సైట్ల కారణంగా నేరాలు తగ్గుతాయనుకోవడం భ్రమ అని, ఇందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని వాదించారు. ఉరిశిక్ష వేసినంత మాత్రాన నేరాలు తగ్గుతున్నాయా అని ప్రశ్నించారు. పోర్న్ మీద నిషేధం లేని దేశాల్లో ఇండియాలో కంటే నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. పోర్న్ సైట్లను నిషేధించడం స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఓ తెలుగు పత్రికలో వ్యాసం రాశారు. చివరకు ఈ తలనొప్పి అంతా ఎందుకనుకున్న కేంద్రం 'ఛైల్డ్ పోర్న్ సైట్లను మాత్రమే బ్లాక్ చేయండి' అని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు చెప్పింది.
పోర్న్ సైట్లపై నిషేధం ఎత్తేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'మనది ప్రజాస్వామ్య దేశం. నియంతృత్వ దేశం కాదు' అన్నారు. 'మేం (ప్రభుత్వం) ప్రతి బెడ్రూములో ఉండలేం కదా' అని వ్యాఖ్యానించారు. పెద్దల సైట్లపై నిషేధం లేదని, ఛైల్డ్ పోర్న్‌పై నిషేధం ఉందని వివరించారు. మనది ప్రజాస్వామ్య దేశమే. కాదనం. కాని ప్రజాస్వామ్యం ఎక్కువైందని కొందరి అభిప్రాయం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పేరుతో మనం చాలా విషయాల్లో ఉదారంగా ఉన్నాం. ఇప్పటివరకు ర్యాగింగ్‌ను అరికట్టలేకపోయాం. ఇందుకు ఏపీలోని గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రితేశ్వరి ఆత్మహత్యే తాజా ఉదాహరణ. నడుస్తున్న బస్సులో అత్యాచారం చేయబోతే మరో అమ్మాయి బస్సులో నుంచి దూకేసిన సంఘటన తాజాగా జరిగింది. ఇలాంటిదే గతంలో పంజాబ్‌లో జరిగినప్పుడు ఓ మంత్రి 'ఇది దేవుడి సంకల్పం' అని వ్యాఖ్యానించారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి బాధ్యతగల మంత్రులు ఇటాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంది. వారిని ఏమీ చేయడానికి వీల్లేదు.
సినిమాలకు సెన్సార్ అక్కర్లేదనే వాదన ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సెన్సార్ అనేది స్వేచ్ఛను హరించినట్లేనని వాదిస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు సెన్సార్ వ్యవస్థను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి 'ప్రత్యేక హోదా' వంటి హామీలతో నాయకులు మోసం చేసినా ఏమీ చేయలేం. పార్లమెంటు సమావేశాలు పూర్తిగా జరగకపోయినా, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా ఏమీ చేయలేం. 'పార్లమెంటును నడవనీయకుండా చేయడం ప్రజాస్వామ్య హక్కు' అని గతంలో భాజపా నాయకులే చెప్పారని కాంగ్రెసు నాయకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో ఏం చేసినా కాదనేవారు లేరు. పట్టించుకునేవారు అంతకంటే లేరు. కాని కొన్ని దేశాల్లో నిర్ణయాలను ఉక్కు పాదంతో అమలు చేస్తారు. కొన్ని ఇలా చేయాలి కూడా. ఇంటర్నెట్ ఇంతగా అభివృద్ధి చెందకముందు పోర్న్ సినిమాలు క్యాసెట్ల రూపంలో వచ్చేవి. ఆ తరువాత సీడీలు, డీవీడీలు వచ్చాయి. కొన్ని దేశాల్లో వీటిని (లక్షల క్యాసెట్లను) బుల్డోజర్ల కింద పప్పు పుప్పు చేసిన సంఘటనలు ఉన్నాయి. మన దేశపు సీరియళ్లు ప్రజలపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని కొన్ని దేశాల్లో నిషేధించారు. విదేశాల్లో నేరాలకు కఠిన శిక్షలున్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏ విషయంలోనైనా సున్నితంగా ఉంటాం. కఠిన చర్యలు ఎప్పుడో తప్ప ఉండవు. పోర్న్ నిషేధం పట్ల గట్టిగా ఉంటే ఓటు బ్యాంకుకు దెబ్బ తగులుతుందని ప్రభుత్వం భావించిందేమో తెలియదు.