Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

అమిత్ షా: విక్రమార్క సింహాసనం!

అమిత్ షా: విక్రమార్క సింహాసనం!

మీకు విక్రమార్క సింహాసనం కథ తెలుసా...

అనగనగా భోజరాజు ఓనాడు సేనతో కలిసి వెళ్తుండగా ఓ మొక్కజొన్న పొలంలోని మంచె మీదనుంచి రైతు పిలిచి.. ‘‘రాజా నా ఆతిథ్యం స్వీకరించండి.. కంకులు ఆరగించండి’’ అన్నాడుట. రాజు, సైనికులు గుర్రాలు దిగి కంకులు తుంచుకునేలోగా.. రైతు మంచె దిగి వచ్చి.. రాజును పొలం నాశనం చేస్తున్నారని తిట్టడం ప్రారంభించాట్ట. ఆశ్చర్యపోయిన భోజరాజు.. తిరిగి బయల్దేరే సరికి.. రైతు మళ్లీ మంచె ఎక్కి.. అదేంటి రాజా.. ఆతిథ్యం తీసుకోమంటే.. నా మాట ఆలకించకుండా వెళ్తున్నావే..’’ అన్నాట్ట.

భోజుడికి అతడి వాలకం ఆశ్చర్యం కలిగించింది. తక్షణం ఆ పొలం కొనేసి.. మంచె ఉన్న చోట తవ్విస్తే కింద విక్రమార్క సింహాసనం దొరికింది. దాని మీద ఉంటే చాలా ఔదార్యంతో మాట్లాడడం సహజంగా వస్తుందని అనిపించింది.

అదీ విక్రమార్క సింహాసనానికి సంబంధించిన కథ!

ఇప్పుడు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరిస్తున్న తీరు కూడా అలాగే ఉంది. మొన్నటికి మొన్న తెలుగుదేశం ఎంపీ మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కలిసి మంతనాలకు ఆయన సమక్షానికి వెళ్తే చాలా లోకువకట్టి స్పందించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన మాటలను బట్టి కేంద్రం ఏం సాయం చేసేట్టు లేదని.. స్వయంగా ఎంపీ రామ్మోహనే మీడియాకు వెల్లడించారు.

నిన్నటికి నిన్న.. చంద్రబాబు ఎంపీలతో సమావేశం పెట్టుకుని.. అవసరమైతే తెగతెంపులు చేసుకుందాం.. అని డిసైడ్ కాగానే.. అమిత్ షా నుంచి ఫోనొచ్చింది. ‘‘మీ ప్రతినిధుల్ని పంపండి మాట్లాడుకుందాం కదా.. ఎందుకు తీవ్ర నిర్ణయాలు’’ అంటూ బుజ్జగింపు అని సమాచారం.

మరి మొన్న ప్రతినిధులతో అలా స్పందించి.. నిన్న ప్రతినిధుల్ని పంపమంటూ పురమాయించి.. ఏంటీ చిత్రమైన ధోరణి అనుకుంటున్నారు జనం. అందునకే ఆయన విక్రమార్క సింహాసనం మీదున్నట్లుగా ఉన్నదని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు గానీ.. జనం మాత్రం దీనిని ‘‘రెండు నాల్కల ధోరణి’’ అంటారు మరి!!

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?