Advertisement


Home > Articles - Kapilamuni
విద్యా వ్యాపారం అటు నరహంతకులు.. ఇటు ధూర్త ప్రేక్షకులు

పదిహేనేళ్ల ప్రాయం అంటే... అప్పుడప్పుడే లోకాన్ని తమ సొంత కళ్లతో చూసే వయస్సు. తమ సొంత అనుభవాలతో ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే మనస్సు. సరిగ్గా ఆ వయస్సులో తెలుగు రాష్ట్రాల్లో పసితనం... వసివాడిపోతోంది. తెలుగు ఇళ్లలో మొగ్గ తొడుగుతున్న బతుకుల్లో 'పదిహేనేళ్ల' ప్రాయం దాటాక.. పువ్వులుగా వికసిస్తున్నవి ఎన్ని? మొగ్గగానే తునిగిపోతున్నవి ఎన్ని? తమ సహజ పరిమళాల్ని కోల్పోయి... ప్లాస్టిక్‌ పూలుగా రూపాంతరం చెందుతున్నవి ఎన్ని? పువ్వులుగా వికసిస్తున్నవి.. దుర్భిణిలో వెతకాలి.

మొగ్గగా తునిగిపోతున్నవి.. మనకు ప్రతినిత్యం దినపత్రికల్లో కొల్లలుగా కనిపిస్తాయి. ప్లాస్టిక్‌ పూలుగా రూపాంతరం చెందుతున్నవి.... తమ సహజాతమైన ప్రవృత్తులు ఏమిటో తమకే తెలియకుండానే.. ఇంజినీరింగ్‌ కాలేజీలో 'మౌల్డ్‌' అవుతూ ఉంటాయి.

రేపటి తరాల తెలుగులోకాన్ని నిర్జీవ యంత్రాల్లా, నిస్తేజ సాంకేతిక కార్మికుల్లా... కడతేరిపోయినంత వరకూ శవాల్లా... మిగిలిపోయిన వారంతా జీవచ్ఛవాల్లా... మార్చేస్తున్న ఈ విష సంస్కతులకు ముగింపు లేదా? విద్యావ్యాపారం ముసుగులో చెలరేగుతున్న... ఈ నరహంతకుల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే నాధుడేలేరా? 17ఏళ్ల ప్రాయంలో ఎన్ని బతుకులు కడతేరిపోతే ఏముందిలే.. వాళ్లకు ఓటుహక్కు లేదు కదా...? అనుకునే ధూర్తపాలకులు దృతరాష్ట్ర పాలన సాగిస్తున్నంత కాలమూ... ఈ కర్కోటక చండామార్కుల చండాలపు శృంఖలాల నుంచి పసిపిల్లల విద్యావికాసానికి విముక్తి లేదు గాక లేదు!!

విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం ?

విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుః ?

విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరా దేవతా ?

విద్యా రాజసు పూజ్యతేనహి ధనం విద్యా విహీనః పశుః ??

అని భర్తహరి శ్లోకం.

విద్య అనేది మనిషికి అందాన్నిస్తుంది. దాగిఉండే ధనంగా భాసిల్లుతుంది. విద్య భోగాలను కలిగిస్తుంది. గురువులకే గురువుగా ఉంటుంది. విద్య బంధువు లాంటిది. విదేశాల్లో అదే గొప్ప దేవత. ధనంకాదు, విద్య రాజుల నడుమ పూజ్యతను కలిగిస్తుంది. విద్యలేని వాడు పశువుతో సమానం అని ఈ శ్లోక భావం.. కానీ ఆధునిక తరంలో ఇదే శ్లోకానికి అసలు భాష్యాలు వేరే ఉంటున్నాయి.

విద్య అనేది దాన్ని వ్యాపారంగా మార్చుకున్న మనిషికి అందంలాంటి అహంకారాన్నిస్తుంది. వాడి ఖజానాలను నింపుతుంది. విచ్చలవిడి భోగాలను కలిగిస్తుంది. గురువులను కీలుబొమ్మల్లా ఆడించే నేర్పు నిస్తుంది. విద్య దాన్ని అంగడిలో అమ్మే వ్యాపారులను ఎంపీలుగా, మంత్రులుగా రాజుల (పాలకుల) సరసకు చేరుస్తుంది... ఇలాంటి అర్థాలు ఇప్పుడు సజీవమైన భావాలు.

అవును మరి... విద్యలేని వాడు పశువే కావొచ్చు... కానీ విద్య ఉన్నా లేకున్నా.. అదే వ్యాపారంగా అడ్డగోలుగా సామాజిక జీవితాల్ని ఛిద్రం చేసేస్తున్నవాడు.. ఎలాంటి పశువు అవుతాడు? బహుశా దానిని అభివర్ణించేంత జ్ఞానం భర్తహరికి లేదేమో.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లెక్కకు మిక్కిలిగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. అధికారులు ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో లెక్క రాసుకుంటూ తాము తనిఖీలు చేస్తున్నారు. పాలకులు సమీక్ష సమావేశుల పెట్టి.. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ఏం చేయాలో చెప్పేందుకు కమిటీలను వేస్తున్నారు.... ఇంతవరకూ అందరికీ కనిపిస్తున్నది.

కానీ ఎవ్వరికీ పట్టని సంగతులు ఏంటంటే.. కమిటీలు నివేదికలు ఇచ్చిన తర్వాత.. ఎక్కడికక్కడ వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం రకరకాల మాటలు చెబుతోంది. ఇకమీదట నెలనెలా యాజమాన్యాలతో మాట్లాడుతా అంటున్నారు. ఇంత అర్థరహితమైన హామీ మరొకటి ఉండదు. యాజమాన్యాలు వాస్తవాల్ని ముఖ్యమంత్రికి చెబుతాయా? అంతా బాగుందనే వారు అంటారు? ఆయన స్వయంగా పిల్లలతో మాట్లాడరు! మాట్లాడితే యాజమాన్యాల మీద ఫిర్యాదులు తన దృష్టికి నేరుగా వస్తాయని ఆయనకు భయంకావచ్చు.

వెర్రితలలు వేసిన వ్యాపారం

విద్యావ్యాపారం విశృంఖలంగా మారిపోయింది. ఇంజినీర్లను తయారుచేసి ఇస్తాం అనే హామీలతో తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. తమకలల్ని తాము నెరవేర్చుకోలేని అసమర్థులైన తల్లిదండ్రులు.. ''పిల్లల జీవితాల కోసమే కదా..''...  అని ఆత్మవంచన చేసుకుంటూ.. పిల్లల్ని తమ కలలను నెరవేర్చే యంత్రాలుగా చూసుకుంటున్నారు. వారి ఆశలే.. ఈ వ్యాపారానికి ఆయువుపట్టు. తల్లిదండ్రుల ఉపేక్షభావనే.. పిల్లల వేధింపులకు ఉత్ప్రేరకంగా పనిచేస్తోంది. మార్కులు వస్తేచాలు.. పిల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారో గమనించకుండా సాగిపోయే తల్లిదండ్రులు లేరని అనలేం.

కానీ.. అలాంటి వారున్నారు కదాని.. తమ కళాశాలకు వచ్చిన ప్రతివిద్యార్థినీ.. ఒకే స్థాయిలో రాచిరంపాన పెట్టేస్తుంటాయి కళాశాలలు. మాకు మార్కులు వద్దు మొర్రో.. చదువు వస్తే చాలు.. అనే తల్లిదండ్రులు ఉన్నా.. వారి పిల్లల్ని చిన్నచూపు చూడడం.. వేరే సెక్షన్లకు మార్చేసి.. అవమానించడం.. తద్వారా.. వారిలో ఆత్మన్యూనత పెంచడం ఈ కార్పొరేట్‌ కాలేజీలకు ఫ్యాషన్‌ అయిపోయింది.

అంత ధైర్యం ప్రభుత్వానికి ఎటూలేదు

ప్రతిఏటా స్కూలు ఫీజుల విషయంలో తల్లిదండ్రులు గొడవ చేస్తున్నప్పుడు... ఫీజుల నియంత్రణ గురించి పట్టించుకుంటుంది. ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజుల్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరి జూనియర్‌ కాలేజీల్ని మాత్రం ఎందుకు గాలికి వదిలేస్తోంది. ఎంత ఫీజు తీసుకోవాలో తామే చట్టబద్ధంగా నిర్ణయించే ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉందా? లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే.. విద్యావ్యాపారులు ఈ ప్రభుత్వాల్ని పోషిస్తున్నారనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి.

నిజానికి ఇలాంటి ఫీజుల నియంత్రణ ఉంటే అరాచకాలు కొంత తగ్గుతాయి. ఫీజులు మినహా.. ఐఐటీ, ఎక్సక్లూజివ్‌, లాంటి మాయ పేర్లతో కొత్త కోర్సులు పెట్టి.. అదనపు డబ్బు వసూలు చేసినా.. బిల్డింగ్‌ ఫండ్‌ లాంటివి దండుకునే పేరిట స్పెషల్‌ ఫోకస్‌ గ్రూపుల ఫీజులు తీసుకున్నా ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేసేంత నిబంధనలు ఉండాలి. ఒకటే ఎంపీసీ గ్రూపు చెప్పడానికి... అలాంటి స్పెషల్‌ డివిజన్లు బోలెడు ఉంటాయి. వాటి ముసుగులో రకరకాలుగా డబ్బు దండుకుంటూ ఉంటారు. విద్యార్థుల మధ్య అంతరాలు, వ్యత్యాసాలు, అవమానాలను కూడా సృష్టిస్తుంటారు. ఈ విధానాలు పోవాలంటే ఫీజులపై ప్రభుత్వం ఏకరీతి నియంత్రణ అవసరం. కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుదని కోరుకోవడం కూడా భ్రమ.

స్వతంత్ర కౌన్సెలర్లు ఉండాలి..

యాజమాన్యాలనే, లెక్చరర్లనే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరినంత కాలమూ పరిస్థితిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ. యాజమాన్యాల మోచేతి నీళ్లు తాగే అగత్యం లేని స్వతంత్ర కౌన్సెలర్లను ప్రతి కాలేజీలోనూ ఏర్పాటు చేయాలి. ప్రతి కాలేజీలోనూ ఎందరు విద్యార్థులు ఉన్నారనే దాన్ని బట్టి దామాషా ప్రకారం.. సైకాలజీ అనుభవం ఉన్న కౌన్సెలర్లను ప్రభుత్వం నియమించాలి. వారికి ప్రభుత్వమే వేతనం ఇవ్వాలి. ఆ వేతనాల్ని కాలేజీలనుంచి ప్రభుత్వం వసూలు చేసుకోవాలి.

ఈ కౌన్సెలర్లు ప్రతిరోజూ తమకు కేటాయించిన విద్యార్థులతో వన్‌-టూ-వన్‌ మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ధైర్యం చెబుతూ.. వారి ఆలోచన ఎక్కడైనా దారితప్పుతోంటే గ్రహించి దిద్దడానికి ప్రయత్నిస్తుండాలి. ఇలాంటి ఏర్పాటు ఉంటే తప్ప.. చావులు ఆగుతాయని ఆశించలేం. పైగా ఇలాంటి ఏర్పాటు వల్ల.. చిన్నారుల్ని కేవలం యంత్రాలుగా కాకుండా.. మనుషుల్లా తీర్చిదిద్దడం కూడా కుదురుతుందని అనుకోవచ్చు.

పాపంలో.. మీడియాకూ వాటా ఉంది!

తిలా పాపం తలా  పిడికెడు అన్నట్లుగా తయారౌతోంది. విద్యా వ్యాపారులు అందిస్తున్న ఆర్థిక దన్నుకు కక్కుర్తిపడి పిల్లల ప్రాణాలను బలిపెడుతున్నా ఉపేక్ష వహిస్తున్న పాలకులది అసలు పాపం అయితే... ఆ విద్యావ్యాపారాలకు బాకా ఊదుతూ... ఆత్మహత్యలు జరిగిన సందర్భాల్లో అప్రాధాన్యంతో ఆ వార్తలు ప్రచురిస్తున్న... ప్రకటనలకు కక్కుర్తి పడుతున్న మీడియాకూడా వాటా పుచ్చుకుంటోందని మనం గ్రహించాలి.

కేవలం విద్యావ్యాపారుల నుంచి వచ్చే కొన్నికోట్ల రూపాయల ప్రకటనల సొమ్ము రాకపోయినంత మాత్రాన దినపత్రికలు, టీవీ ఛానళ్లు మూత పడిపోతాయని అనుకోవడం పొరబాటు. కానీ కేవలం ఇలాంటి ప్రకటనలకోసం.. 'బిజినెస్‌'ను విస్తరించడం కోసం.. సకలదారుణాలకు యాజమాన్యాలు ఒడిగడుతున్న మాట వాస్తవం.

గతంలో మెడికల్‌ కౌన్సిల్‌లో ఓ నిబంధన ఉండేది. 'మేం మంచి వైద్యం చేస్తాం' అని ఎవ్వరూ ప్రకటన ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి డాక్టరూ మంచి వైద్యమే చేస్తాడు. అలా ప్రకటించుకోవడం అనైతికం అనే విలువలను అనుసరించేవాళ్లు. కార్పొరేట్‌ ఆస్పత్రులు వచ్చాక.. ఆ నిబంధనలో లూప్‌ హోల్స్‌ వెతికి , రకరకాల వక్రమార్గాల్లో ప్రకటనలు రూపొందించుకుంటూ.. ఆ నిబంధనకే పాతర వేసేశాయి. ప్రభుత్వం ధైర్యం చేసి... విద్యా వ్యాపారంలో ఉన్నవాళ్లు.. ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. ఏ రూపంలో ప్రకటనలు ఇచ్చినా సరే.. వారి గుర్తింపు రద్దవుతుంది.. అనే నిబంధన తేవాలి. అలాంటి కట్టుబాటు లేకుంటే.. వీరికి కళ్లేలు వేయడం కష్టం అవుతుంది. 

అధికారం తలకెక్కి.. 

అధికార గర్వం మనిషికి కన్నూమిన్నూ కానకుండా చేస్తుంది. భర్తహరి సుభాషితానికి మనం చెప్పుకున్న అర్థంలాగా.. ఈ విద్యావ్యాపారం వాటి యజమానులకు అధికారాన్ని అందిస్తోంది. ఈ వ్యాపారంలో పిల్లల చావులకు కారణం అవుతున్న వారే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నారు. ఇక్కడ దండుకుంటున్న వందల కోట్ల రూపాయలతో పార్టీలను పోషిస్తూ అగ్రతాంబూలం పుచ్చుకుంటున్నారు.

శాసన నిర్మాతల హోదాతో ఒకసారి అధికారంలోకి వెళ్లిన తర్వాత.. ఇక తమ విద్యావ్యాపారానికి మరింతగా లాకులు ఎత్తేయాలనుకుంటారే తప్ప.. అడ్డుకట్టవేసే చట్టాలకు వారెందుకు ప్రాణం పోస్తారు? కానీ.. దుర్మార్గమూ, వ్యాపారమూ, రాజకీయమూ.. అంతా కలగలుపుగా మారిపోయిన ఈ రోజుల్లో ఈ పోకడను అడ్డుకోవడం ఒకపట్టాన తెమిలేదికాదు.

బూటకపు మాటలు వద్దు!

60 రోజుల వ్యవధిలో 50 ఆత్మహత్యలు సంభవించాయంటే... ఈ చేదు గణాంకాలను ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబునాయుడు సీఎం హోదాలో స్వయంగా సమీక్షకు మీటింగ్‌ పెడితే.. అసలైన బాధ్యులు కాకుండా మొక్కుబడిగా ఉద్యోగుల్ని పంపిన అగ్రశ్రేణి కార్పొరేట్‌ కాలేజీలను ఏమని అనాలి? ఎనిమిది గంటలకు మించి తరగతుల్లో పిల్లల్ని ఉంచరాదన్న రెండు తెలుగు రాష్ట్రాల నిబంధనల్ని రకరకాల వక్రరూపాల్లో తుంగలో తొక్కేస్తున్నారు.

మార్కులు తగ్గితేచాలు.. తమ సూటిపోటి మాటలతో.. సెక్షన్లు మార్చేసే అవమానకరమైన చేతలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆత్మహత్య ఒక్కటి జరిగినా సరే.. యాజమాన్యం మీద క్రిమినల్‌ కేసుపెట్టి జైల్లో పెట్టే చట్టాలు వస్తేతప్ప... వాటి నియంత్రణకు వారు నిర్దిష్టమైన చర్యలు తీసుకోబోరని సామాజిక ఉద్యమకారులు అంటున్నారు.

ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతున్నాయి మొర్రో అంటే.. సోషల్‌ వర్క్‌ కంపల్సరీ చేయాలని, ఆ మార్కులు కూడా వారికి కలపాలని అదొక పరిష్కారం లాగా చంద్రబాబునాయుడు సెలవిస్తున్నారు. అసలే పిల్లల్ని కాలేజీలు రాచిరంపాన పెడుతోంటే.. ఈ అయిదు మార్కుల కోసం.. వారిని రోడ్ల మీద నానా పనులు చేయిస్తూ ప్రభుత్వం కూడా వేధిస్తుందన్నమాట.

అయినా.. కౌమారం దాటని చిన్నారుల విషయంలో.. 'కంపల్సరీ' అనే మాటను చంద్రబాబునాయుడు వాడడమే అత్యంత హేయం. వారి ఇష్టానికి విలువ లేదా? విద్యార్థులకు చదువుల ఒత్తిడి నుంచి రిలీఫ్‌ ఇవ్వాలనుకుంటే 5 మార్కులు కేటాయించి ప్రభుత్వం నిర్వహించే సోషల్‌ వర్క్‌ లాగానే.. ప్రభుత్వమే క్రీడలు నిర్వహిస్తూ, చేతివృత్తులు నేర్పుతూ.. వాటిలో ఒకటి పిల్లలు ఐచ్ఛికంగా ఎంచుకునే వెసులుబాటు ఇవ్వలేరా?

ఇంట్లో తల్లిదండ్రులు, యాజమాన్యాలు, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రులు అందరూ ఒకవైపు పిల్లలపై జాలి, ప్రేమ కురిపిస్తూనే 'బొమ్మరిల్లు ఫాదర్‌' పాత్రను పోషిస్తుంటారు. ఆ సినిమాలో కూడా ప్రకాష్‌ రాజ్‌కు క్లయిమాక్స్‌లో రియలైజేషన్‌ వస్తుంది. మరి ఈ చావులకు క్లయిమాక్స్‌ ఎప్పుడు? భర్తహరి సుభాషితంలో విద్య అందించే భోగాలు, సుఖాలు చదువుకునే పిల్లలకు అచ్చంగా దక్కేదెప్పుడు?

-కపిలముని

kapilamuni.a@gmail.com