Advertisement

Advertisement


Home > Politics - Andhra

ష‌ర్మిల‌, సునీత ట్రాప్‌లో అవినాష్‌!

ష‌ర్మిల‌, సునీత ట్రాప్‌లో అవినాష్‌!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మెరుసుప‌ల్లి ష‌ర్మిల‌, వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత ట్రాప్‌లో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప‌డ్డార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చాలా కాలంగా అవినాష్‌రెడ్డిపై సునీత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు అవినాషే అని, ఆయ‌న్ను ఎలాగైనా జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో సునీత సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లి పోరాటం చేశారు. అయిన‌ప్ప‌టికీ అవినాష్ బెయిల్‌ను ర‌ద్దు చేయించ‌లేక‌పోయారు.

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌... సునీత‌కు ఒక తోడు దొరికింది. ఇద్ద‌రూ క‌లిసి అవినాష్ హంత‌కుడ‌ని, అలాంటి వ్య‌క్తికి క‌డ‌ప ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్ర‌చారంలో హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ష‌ర్మిల‌, సునీత‌కు అవినాష్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు మీరిద్ద‌రూ మ‌నుషులేనా అంటూ నిల‌దీశారు. త‌న‌పై విమ‌ర్శ‌ల‌ను వాళ్లిద్ద‌రికి విచ‌క్ష‌ణకే వ‌దిలేస్తున్న‌ట్టు అవినాష్ చెప్పారు. ఇంత‌టితో వాళ్లిద్ద‌రినీ అవినాష్ విడిచిపెట్టి వుంటే బాగుండేది.

ఇవాళ మ‌రోసారి ష‌ర్మిల‌, సునీత‌పై అవినాష్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. అన్యాయంగా త‌న‌ను వివేకా హ‌త్య కేసులో ఇరికించార‌ని ఆయ‌న వాపోయారు. త‌న‌ను, త‌న తండ్రిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. త‌న అక్క‌లిద్ద‌రూ చంద్ర‌బాబునాయుడి ట్రాప్‌లో ప‌డ్డార‌ని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. అందుకే చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే అక్క‌లిద్ద‌రూ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

వివేకా హ‌త్య గురించి మాట్లాడే అవ‌కాశం రావాల‌ని ష‌ర్మిల‌, సునీత ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అవినాష్ ఆ అవ‌కాశాన్ని ఇచ్చిన‌ట్టైంది. అస‌లు వివేకా హ‌త్య‌పై మాట్లాడొద్ద‌ని క‌డ‌ప కోర్టులో వైసీపీ పిటిష‌న్ వేయ‌డం, అందుకు త‌గ్గ‌ట్టు సానుకూల ఆదేశాలు పొందిన సంగ‌తి తెలిసిందే. 

వైసీపీ క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న అవినాష్ కోర్టు ఆదేశాల‌ను తానే ధిక్క‌రించిన‌ట్టు కాదా? అన‌వ‌స‌రంగా వాళ్ల‌తో మ‌ళ్లీ వివేకా హ‌త్య‌పై అవినాష్‌కు కౌంట‌ర్ ఇచ్చే పేరుతో విమ‌ర్శ‌లు చేయించుకోవ‌డం ఏంటో? ఏ కార‌ణంతో త‌న అక్క‌ల గురించి అవినాష్‌రెడ్డి మాట్లాడారో కానీ, వారి గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఆయ‌న శ్రేయోభిలాషులు కోరుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?