Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

మమ్మల్ని మన్నించు లెనిన్!

మమ్మల్ని మన్నించు లెనిన్!

వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ అనే లెనిన్ విగ్రహాన్ని జాతి దురహంకారులు కూల్చివేయడం అనే ఘటన తెలియగానే కొంత తటస్థంగా ఉండే వారికి మనసు కలచి వేసినట్లు అవుతుంది. ఏ లండన్ లోనో, దక్షిణాఫ్రికాలోనో, అమెరికాలోనో మహాత్ముడి విగ్రహాన్ని పెడితే మనం ఎందుకు మురిసిపోతున్నాం? మొన్నటికి మొన్న ఇస్లాం మతరాజ్యం అయిన దుబాయ్ లో హిందూ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తే భారతీయ హిందువులంతా ఎందుకు మురిసిపోయారు? అదే దేశాల్లో మహాత్ముడి విగ్రహాలను, హిందూ దేవుళ్ల ప్రతిమలను కూల్చి, శిథిలం చేస్తే మనకు ఎలా ఉంటుంది? ఆఫ్గనిస్తాన్ లో బనియాన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్లు కూల్చివేసినప్పుడు మనం ఎలా స్పందించాం? ఎంత బాధ కలుగుతుంది? మనం అలాంటి బాధను- ఇతరులకు ఎందుకు కలిగిస్తున్నాం? ఇది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.

‘పరమత సహనానికి భారతదేశం పుట్టినిల్లు’ అని చిన్నప్పటినుంచి చదువుకున్నాం. ఈ దేశంలోకి చొరబడి. హిందూధర్మపు మూలాల్లోని లోపాల్లోకి చొరబడి.. విషంలా దేశమంతా విస్తరించిపోయిన.. ఇతర మతాల విషయంలోనే మనం సహనం పాటిస్తూ ఉంటాం. ఆ ఇతర మతాల వారికి ఎన్నికల సమయంలో వరాలు ప్రకటిస్తూ ఉంటాం.. మరి ఈ దేశంలో పుట్టినది కానంత మాత్రాన.. ఒక రాజకీయ భావజాలాన్ని మనం సహించలేమా? ఈ దేశపు వ్యక్తి కానంత మాత్రాన.. మరోదేశపు నాయకుడు అయినంత మాత్రాన విగ్రహాలను కూల్చేస్తామా? తాలిబన్లకు మనకు తేడా ఏం ఉంది?

భాజపా కార్యకర్తలు ఈ దురాగతానికి పాల్పడడాన్ని జాతి ఖండించాలి. భాజపా అంటే వారి మూలాల్లో ఆరెస్సెస్ ఉంటుంది. అందుకే ఓ విషయం గుర్తు చేసుకోవాలని అనిపిస్తోది.

‘నమస్తే సదా వత్సలే మాతృభూమే’ అంటూ ఆరెస్సెస్ కార్యకర్తలు.. ప్రతిరోజూ మాతృదేశాన్ని, భగవంతుడిని కలిపి ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన గీతంలో వారు దేశభక్తిని చాటుకునే తరహా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆచరణలో, కాలక్రమంలో ఎంత అపభ్రంశంగా మారిపోయిందనే ఆరోపణలనైనా ఆరెస్సెస్ ఎదుర్కొంటూ ఉండవచ్చు గాక! కానీ, ఆరెస్సెస్ సంఘ్ శాఖల్లో ప్రతి ఉదయం ప్రతిధ్వనించే ఆ సంస్కృతగీతం.. ఉత్తేజం కలిగించే విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మాతృదేశాన్ని, భగవంతుడిని ఉమ్మడిగా ప్రార్థిస్తూ ఆ గీతం సాగుతుంది. అందులో కొన్ని పంక్తులు- వాటి అర్థాలు ఇలా ఉంటాయి. భగవంతుడిని ఉద్దేశించి-

‘త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయమ్..

శుభామాశిషన్ దేహి తత్ పూర్తయే

అజయ్యాంచ విశ్వస్య దేహీశ శక్తిమ్’

అంటూ ప్రార్థిస్తారు. ‘‘ఓ ప్రభూ... భగవంతుడా... నీయొక్క పనిలోనే మేమందరమూ నిబద్ధులై నిమగ్నమై ఉన్నాము... దాన్ని సఫలవంతంగా పూర్తి చేయడానికి శుభాశీస్సులను ప్రసాదించు...! ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా జయించలేనంత శక్తిని మాకు ప్రసాదించు ప్రభూ... ’’ అంటూ వేడుకొంటారు. భగవంతుడి యొక్క కార్యం అంటే ఇదేనా.. ఈ విధ్వంసమా? మీ భావజాలానికి విరుద్ధమైన వారి విగ్రహాలను కూలగొట్టడమా? భగవంతుడి శుభాశీస్సులు మీరు అడుగుతున్నది అందుకేనా? ప్రపంచంలో ఎవ్వరూ జయించలేనంత శక్తి మీకు అందుకే కావాలా?.. అనే సందేహాలు రేగుతున్నాయి.

‘సుశీలన్ జగద్యేన నమ్రమ్ భవేత్’ అని ఆ వెంటనే అంటారు. జగత్తంతా గౌరవించే ‘శీలం’ మాకు ప్రసాదించు అని అడుగుతారు ఆ గీతంలో. ఆ శీలం లక్షణం ఇలా విగ్రహాలు కూల్చడమేనా?

‘సమర్థా భవత్వా శిశా తేభృశమ్’ అంటూ భారతమాతను వైభవ శిఖరాల మీద సమర్థంగా నిలబెడతాం అని వారు ప్రార్థన చివరలో ప్రమాణం చేస్తారు!  ప్రపంచదేశాల ముందు .. మాతృభూమి వైభవాన్ని కాపాడే పద్ధతి ఇదేనా? ఇంతకంటె వేరే పద్ధతులేమీ ఈ కాషాయాంబరధారులకు స్ఫురించవా?

అందుకే.. వీరు పాల్పడుతున్న దురాగతాలకి.. తక్కిన జాతి వ్లాదిమిర్ లెనిన్ కు క్షమాపణ చెప్పుకోవాలి.

... కె.ఎ. మునిసురేష్ పిళ్లె

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?