Advertisement


Home > Articles - Kapilamuni
మోడీ ‘‘జై బ్రాహ్మిణ్’’ వ్యూహం!

చాలా శోచనీయమైన రెండో విషయం ఏమిటంటే.... ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా కులాల ప్రాతిపదిక మీదనే జరగబోతున్నది. శోచనీయమైన తొలి విషయం ఏమిటంటే.. రాష్ట్రపతి ఎన్నిక కూడా కులాలే గీటురాయిలాగా ప్రచారంలోకి రావడం!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక దేశమైన భారత్‌లో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవులకు ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ దేశానికి కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రాబోతున్నారు. అయితే ఇంత కీలకమైన ఎన్నికలకు కులం ప్రాతిపదిక కింద ప్రచారంలోకి రావడం చాలా దారుణమైన సంగతి. రాష్ట్రపతి స్థానానికి మోడీ అండ్ కో ఎన్డీయే తరఫున ప్రతిపాదించిన అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అర్హతల గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు.

ఈ దేశానికి రాష్ట్రపతిగా, ప్రథమపౌరుడిగా ఉండదగిన, దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలవవలసిన గౌరవప్రదమైన స్థానానికి ఆయన యోగ్యతల గురించి అందరికీ విశ్వాసం ఉంది. అయితే ఆయనకున్న అర్హతలన్నిటినీ మించి కులం ఒక్కటే బహుళ ప్రచారానికి నోచుకుంది. నేలబారు కమలనాయకులు.. తమ మోడీ.. దళితుడిని రాష్ట్రపతిని చేస్తున్నారంటూ టముకు వేసి.. కోవింద్ ను ఒక రకంగా అవమానించారు.

ఆ పదవికి పోటీ పెట్టదలచుకున్న కాంగ్రెస్.. రాష్ట్రపతి పదవి అనేది ఎస్సీ రిజర్వుడు సీట్ అయినట్లుగా...  అర్హతల పరంగా కాకుండా కనీసం కులాల కొలబద్ధ మీదనైనా ప్రత్యర్థికి సరితూగాలన్నట్లుగా దళితకార్డును ప్రయోగించి మీరాకుమార్ ను పోటీపెట్టింది. ఈ దేశానికి మహిళా రాష్ట్రపతిని అందించిన రికార్డు కూడా కాంగ్రెస్ పేరిటే ఉంది.

అయితే మహిళ కావడం మినహా ఆ పదవికి సరితూగే మరే అర్హతా లేదని ఆమె తన పదవీకాలంలో పలుమార్లు నిరూపించుకున్నారు. మీరాకుమార్ అభ్యర్థిత్వం కూడా అదే తరహాలో... కాంగ్రెస్ పార్టీకి దళిత అర్హత తప్ప.. మరేమీ అవసరం అనిపించినట్లు లేదు. ఈదేశంలోని అత్యున్నత పదవికి కులాన్ని ప్రాతిపదికగా ఈ అగ్రపార్టీలు భావించే స్థితిలో ఉండడం.. ప్రజలకు నిజంగా సిగ్గు చేటు!

దాని తర్వాత.. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. గెలుస్తామో లేదో తెలియని ఎన్నికల్లో ఒక పావులాగా వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ మనవడిని రంగంలోకి తెచ్చింది. మహాత్మా గాంధీ మీద గౌరవంతో.. మోడీ మరియు ఎన్డీయే ఈ పదవికి పోటీ పెట్టకూడదంటూ కాంగ్రెస్ ఆంక్షలు కూడా విధించింది. ఇదెక్కడి బెదిరింపు? కానీ, మోదీ దాన్ని ఖాతరు చేసే స్థితిలో లేరు. ఉపరాష్ట్రపతికి  కూడా పోటీ అభ్యర్థిని మోహరించడానికే ఎన్డీయే సిద్ధమవుతున్నది.

వారు కూడా కులాల లెక్కతీసి తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలోపడ్డట్లుగా ఢిల్లీ వర్గాల సమాచారం. మహాత్ముడి మనవడు అంటే వైశ్యకులానికి చెందిన వారు గనుక.. తాము కూడా పోటీగా అగ్రవర్ణాల వారినే ఎంచుకోవడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడచిన తర్వాత.. మహాత్మాగాంధీ కులం గురించి ఆలోచిస్తున్నామంటే బాధ కలుగుతుంది. కానీ రాజకీయ క్రీడ అలా ఉంది. ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు! మోడీ కోటరీ.. ఉపరాష్ట్రపతి స్థానానికి బ్రాహ్మిణ్ అభ్యర్థిని బరిలోకి దించడానికి యోచిస్తున్నట్లుగా భోగట్టా. 

కులాల ప్రాతిపదిక మీద దేశ అత్యున్నత పదవుల్లోకి వ్యక్తులు ఈ ఎన్నికల ద్వారా ప్రవేశించవచ్చుగాక... కానీ.. కులాల ప్రాధాన్యాలను స్పృహలో ఉంచుకోకుండా... వారు విధులు నిర్వర్తించాలని కోరుకుందాం!!

- కపిలముని 
-kapilamuni.a@gmail.com