Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : అరవింద్‌పై మేధావుల అసంతృప్తి - 2/2

 ఎమ్బీయస్‌ : అరవింద్‌పై మేధావుల అసంతృప్తి - 2/2

బిజెపిది పోలరైజేషన్‌ పాలిటిక్స్‌. ముస్లిములకు రాజకీయాధికారం లేకుండా చేస్తూ, వాళ్లకు టిక్కెట్లు యివ్వకుండా, వారిని బూచిగా చూపించి, హిందువుల ఓట్లన్నీ కులాలకు అతీతంగా సంఘటితం చేయడమే దాని రణనీతి. జనాభాలో 30% ముస్లిములున్న బెంగాల్‌లో అది పని చేయవచ్చేమో కానీ 12% మాత్రమే ఉన్న దిల్లీలో వర్క్‌ కాలేదు. ముస్లిముల వలన ప్రమాదం వస్తుందని ఏ హిందువూ అనుకోలేదు. ఈ విషయం అరవింద్‌కు తెలుసు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసుకు ప్రాముఖ్యత లేదు కాబట్టి ముస్లిములకు ఆప్‌ ఒకటే ఛాయిస్‌ అని అతనికి తెలుసు.

గతంలో అయితే ముస్లిములకు కాంగ్రెసు ప్రత్యామ్నాయంగా కనబడేది. కానీ యీసారి దాని పరిస్థితి బాగా లేదని అరవింద్‌ గ్రహించాడు. షీలా దీక్షిత్‌ 2019 జులైలో చనిపోతే కొన్ని నెలల దాకా ఆమె స్థానంలో రాష్ట్ర అధ్యక్షుణ్ని నియమించలేదు. చివరకు 15 ఏళ్లగా ఊరూపేరూ లేకుండా ఉన్న వృద్ధనాయకుడు సుభాష్‌ చోప్డాను పట్టుకుని వచ్చి చేశారు. ఆయన తన కూతురికి టిక్కెట్టు యిప్పించుకున్నాడు. మరో కాంగ్రెస్‌ నాయకుడు మహాబల్‌ మిశ్రా కొడుకు వినయ్‌ ఎన్నికలకు ముందు ఆప్‌లోకి గెంతాడు. ఆప్‌ అతనికి టిక్కెట్టిచ్చింది.

రాహుల్‌, ప్రియాంకాలు ఎన్నికలను అస్సలు పట్టించుకోలేదు. నామ్‌కే వాస్తే చెరో రెండు మీటింగులు పెట్టారు. ‘వీళ్లు సరిగ్గా పోటీ చేసి వుంటే మాకు మరిన్ని సీట్లు వచ్చేవి’ అని బిజెపి వాపోయింది. కాంగ్రెసు కారణంగా రెండు సీట్లలో ఆప్‌కు మార్జిన్‌ బాగా తగ్గిపోయింది తప్ప పెద్ద డామేజి కాలేదు. అందుకని అరవింద్‌ ముస్లిములకు ప్రత్యేకంగా అపీల్‌ చేయలేదు. ఆ ప్రాంతాల్లో తిరగనూ లేదు. సమర్థతతో నిర్వహించబడిన తన సంక్షేమ పథకాల కారణంగా పేదవర్గాలందరూ తనకు ఓటేస్తారని, వారిలో ముస్లిములు కూడా ఉంటారని, వేరే మతపరమైన విభజన అక్కరలేదని అనుకున్నాడు.

చివరకు అందరికీ ఆప్తుడై ‘బజరంగీ భాయిజాన్‌’గా పేరు తెచ్చుకున్నాడు. షహీన్‌బాగ్‌ ఉన్న ఓఖ్లా నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థికి అన్ని వర్గాల ఓట్లు పడడంతో ఏకంగా 72 వేల ఓట్ల మార్జిన్‌తో గెలిచాడు. వీళ్లతో పాటు దళితుల ఓట్లు కూడా పడ్డాయి. గతంలో దిల్లీలోని దళిత ఓట్లు బియస్పీకి పడేవి. కానీ అరవింద్‌ దళిత్‌ కాకపోయినా దళిత పక్షపాతిగా పేరు తెచ్చుకుని వాళ్ల ఓట్లు సంపాదిస్తున్నాడు. 12 రిజర్వ్‌ సీట్లలో మంచి మార్జిన్లతో ఆప్‌యే గెలిచింది. బియస్పీ తుడిచి పెట్టుకుపోయింది కానీ ఒక నియోజకవర్గంలో 10 వేల ఓట్లు పట్టుకుపోవడంతో ఆప్‌కి దెబ్బ పడి బిజెపి అభ్యర్థి 3600 ఓట్లతో గెలిచాడు.

ఇక పూర్వాంచల్‌ ఓటర్లపై కూడా అరవింద్‌కు నమ్మకం ఉంది. దిల్లీలోని 1.46 కోట్ల మందిలో 33.5% మంది బిహార్‌, యుపి నుంచి వచ్చినవాళ్లే కావడం, 30 నియోజకవర్గాల ఫలితాలను వాళ్లు ప్రభావితం చేయగలగడంతో వాళ్లపై చాలా పార్టీల దృష్టి పడింది. వీరిలో చాలామంది పేదలే. గతంలో వీళ్లు కాంగ్రెసుకు ఓటేసేవారు. 2015లో ఆప్‌ వాళ్ల మీద దృష్టి పెట్టి 11 మందికి టిక్కెట్లు యిచ్చింది. వాళ్లు గెలిచారు. వాళ్లుండే అక్రమ కాలనీల్లో ఆప్‌ రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసింది. వాళ్లకు ముఖ్యమైన పండగైన ఛాత్‌ను పబ్లిక్‌ హాలీడేగా ప్రకటించింది. మైథిలీ భాషను దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆప్షనల్‌ సబ్జక్టుగా చేర్చింది.

ఈసారి బిజెపి-జెడియు-ఎల్‌జెపి కూటమి 10 మంది పూర్వాంచలీ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెసు-ఆర్‌జెడి కూటమి 8 మందికి యివ్వగా ఆప్‌ 13 మందికి యిచ్చింది. బిజెపి వూర్వాంచలీలపైనే ఫోకస్‌ పెట్టి భోజపురి నటుడు, గాయకుడు మనోజ్‌ తివారికి 2017లో బిజెపి అధ్యక్ష పదవి యిచ్చింది. అతని ఆధ్వర్యంలోనే కార్పోరేషన్‌ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో విజయం సిద్ధించినా, అసెంబ్లీ ఎన్నికలకు చాలడని శంక వచ్చింది. కానీ మారిస్తే పూర్వాంచలీలకు కోపం వస్తుందని దడిసింది. అది పొరపాటైందని యిప్పుడు నాలిక కరుచుకుంటున్నారు.

మోదీ చేతిలో ఉన్న మరో ఆయుధం జాతీయవాదం. అది అరవింద్‌కు కొత్త కాదు. మోదీ గుజరాత్‌కే పరిమితమైన రోజుల్లో అరవింద్‌ దేశరాజధానిలో ఉద్యమకారుడిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌, శ్రీశ్రీ రవిశంకర్‌ వంటి వారిని ఒక వేదికపై తెచ్చి, యుపిఏ అవినీతిని బయటపెట్టి, కాంగ్రెసును భ్రష్టు పట్టించడంలో ప్రధాన పాత్ర అతనిదే. అప్పట్లో అతన్ని ఆరెస్సెస్‌ ఏజంటు అనేవారు. అయితే అతని వెనక్కాల బిజెపి వంటి వ్యవస్థ లేదు. అందువలన ఆ కాంగ్రెస్‌ వ్యతిరేకత మోదీకి కలిసివచ్చింది. దిల్లీలో ‘ఇండియా ఎగెనెస్ట్‌ కరప్షన్‌’ ఉద్యమంలో అరవింద్‌ భారత్‌మాతాకీ జై, శివాజీకీ జై నినాదాలూ యిప్పించాడు, భజనలూ, వందేమాతరాలూ పాడించాడు, దానితో బాటు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాలూ అనిపించాడు.

అరవింద్‌కు ఏ యిజమూ లేదు. దిల్లీ చెప్పుకోదగ్గ పారిశ్రామిక నగరం కాదు కాబట్టి అతను కార్మిక పక్షపాతా? పెట్టుబడిదారు పక్షపాతా అనే విషయం ఎవరూ చెప్పలేరు. అధికారంలోకి వచ్చాక అతని ఇజం ఒక్కటే పెట్టుకున్నాడు - సిటిజనిజం! పౌరులకు ప్రభుత్వం నుంచి రావలసిన కొన్ని హక్కులున్నాయి. అవి యివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అవి సమర్థవంతంగా యిస్తే చాలు. మతం, జాతీయత, లెఫ్ట్‌-రైట్‌ యివన్నీ సెకండరీయే అనుకున్నాడు.

నిజానికి మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలది యిలాటి ఫిలాసఫీయే. సెక్యులరిజం అంటారు, పూజలు, పునస్కారాలు ప్రభుత్వ ఖర్చుతో చేస్తారు, లెఫ్టూ కాదు, రైటూ కాదు. మైనారిటీ వ్యతిరేకీ కాదు, అలా అని వారిని ఉద్ధరించినదీ లేదు. హైదరాబాదులో పాతబస్తీ వంటి చోట్లలో తప్ప పోలరైజేషన్‌ మంత్రం యింకెక్కడా పారదు. ఎందుకంటే ముస్లిములు ఏదో చేసేస్తారన్న భయం తెలుగు రాష్ట్రాలలో లేదు. అందుకే సిద్ధాంత వైరుధ్యం ఉన్న బిజెపితో, కమ్యూనిస్టులతో, మజ్లిస్‌తో అందరితో నెయ్యం సలపగల చాకచక్యం వీరిది.

ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు పరిమితమైతేనే ప్రజలు హర్షిస్తున్నారు. జాతీయస్థాయి రాజకీయాలకు వెళితే వద్దంటున్నారు. అరవింద్‌ విషయంలోనూ అదే పాఠం చెప్పారు. అది గ్రహించి, అతను తన చేతిలో ఉన్నదంతా చేశాడు. మన్ననలు పొందాడు. ఇప్పుడు ప్రశాంత కిశోర్‌ బిహార్‌లో మరో అరవింద్‌ అవుదామని చూస్తున్నాట్ట. నీతీశ్‌ను వీడి బయటకు రాగానే, లాలూ వాళ్లు పిలుస్తున్నా వెళ్లటం లేదు. సొంతంగా పార్టీ పెట్టి తనను ప్రస్తుత రాజకీయనాయకులకు ప్రత్యామ్నాయంగా చూపుకుందా మనుకుంటున్నాట్ట.

అయితే అది అంత సులభమేమీ కాదు. దిల్లీ నగరరాజ్యం మాత్రమే. మామూలు రాష్ట్రంతో పోలిస్తే దూరాభారాలు పెద్దగా వుండవు కాబట్టి రహదారులపై, రవాణాపై పెద్దగా ఖర్చు పెట్టనక్కరలేదు. పోలీసు భారం కేంద్రానిదే. అక్షరాస్యత, తలసరి ఆదాయం వంటి విషయాల్లో దిల్లీ పౌరుడితో బిహారు పౌరుణ్ని పోల్చలేం. ఏ రాష్ట్రానికైనా సంక్షేమ పథకాలకు కేటాయించగలిగిన వాటా కొంతే ఉంటుంది. ఏ పథకాన్ని ఎంచుకుంటారు అనేది పాలకుడి విజ్ఞతకు సంబంధించిన అంశం.

10 రాష్ట్రాల్లో రైతు ఋణమాఫీ పథకం అమలు చేశారు. దానివలన రైతు కుటుంబం మాత్రమే లబ్ధి పొందుతుంది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 17% మాత్రమే. పైగా గ్రామాలలో వున్నవారందరూ రైతులు కారు. పైగా అది భారాన్ని తగ్గించనట్లువుతుంది తప్ప, యిప్పటికిప్పుడు మేలు జరుగుతున్నట్లు తోచదు. అదే ఉచిత విద్య, వైద్య, కొంతమేరకు ఉచిత నీటి సరఫరా, ఉచిత విద్యుత్‌, ఇంట్లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనగానే నెలసరి ఖర్చుల్లో ఆదా కళ్లకెదురుగా కనబడుతుంది. ఎప్పుడో పండగకి ..అన్న కానుకంటూ వచ్చేవాటి బదులు నెలనెలా కొంత మిగులుతుందంటే ఆనందమే కదా.

అరవింద్‌కు ఉన్న ఎడ్వాంటేజి ఏమిటంటే అతను ఐఐటి చదివిన మేధావి. ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌లో పని చేసిన అనుభవం ఉంది. పరివర్తన్‌ అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి, సమాచారహక్కు ఉద్యమం నడిపి చాలా సమాచారం సేకరించి, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అప్పుడే అధ్యయనం చేశాడు. ఆదాయం ఎక్కడ లీకేజీ అవుతోంది, ఖర్చు ఎందుకు పెరుగుతోంది అనేవాటిపై పూర్తి అవగాహన ఉంది. అందుకే జలమండలి, విద్యుత్‌ మండలిలో జరుగుతూ వస్తున్న దోపిడీలు ఆపి ప్రజలకు చౌకగా వాటిని అందించ గలిగాడు.

విద్యపై సగటు పౌరుడు దిల్లీలో నెలకు రూ. 8 వేలు ప్రయివేటు స్కూళ్లకు దోచి పెడుతున్నాడని గమనించి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం కేటాయించిన స్థలాలలో స్కూళ్లు కట్టిన ప్రయివేటు స్కూళ్లను ఆడిట్‌ చేయించాడు. మీకు యింత మిగులుతోంది కదా, ఫీజు అలా యిష్టం వచ్చినట్లు పెంచేస్తే ఎలా అంటూ దోపిడీ ఆపించాడు. వాటికి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లు ఏర్పరచి, క్లాసుకి విద్యార్థుల సంఖ్య 25కి తగ్గించి (గతంలో 90 ఉండేది), బోధనా స్థాయి పెంచడం చేత సామాన్యునికి విద్యపై ఖఱ్చు మిగిల్చాడు. 

ప్రతీ ఏటా బజెట్‌లో విద్యకు కేటాయించిన శాతం పెంచుకుంటూ పోయాడు. 2019-20లో జాతీయ సగటు 16% కాగా దిల్లీలో 28%. కొత్తగా 20 వేల క్లాసు రూములు చేర్చాడు. దిల్లీ ఉపముఖ్యమంత్రి శిశోడియా స్వయంగా పర్యవేక్షిస్తూ స్కూళ్లల్లో సదుపాయాలు పెంచాడు, ఆటస్థలాలు, ఆడిటోరియంను బాగు పరిచాడు, ప్రజలకు అందుబాటులో వుంటూ సమస్యలు వెంటనే పరిష్కరించేవాడు. బాగా పని చేసేవారిని ప్రోత్సహిస్తూ, చేయనివారిని నిలదీస్తూ స్కూళ్ల ప్రమాణాలు పెంచాడు.

విద్య, వైద్యం, విద్యుత్‌, నీరు, రవాణా - యీ ఐదిటిపై అరవింద్‌ దృష్టి పెట్టాడు. వీటికి బజెట్‌లో 56% కేటాయించాడు. 400 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు నెలకొల్పాడు. 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితం కావడం చేత 31 లక్షల కుటుంబాలు, 200-400 యూనిట్ల వరకు సగం రేటు అనడంతో 12 లక్షల కుటుంబాలు లాభపడ్డాయి. 20 వేల లీటర్ల వరకు ఉచితం అనడంతో 14 లక్షల మందికి నీటి బిల్లు రావటం లేదు. రూ. 290 కోట్లు పెట్టి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాడు. 60 ఏళ్లు పైబడిన వారికి మూడు రోజుల తీర్థయాత్ర అంటూ ఏటా 77 వేలమందికి లాభం కలిగించాడు. 70 రకాల ప్రభుత్వ సర్వీసులను గుమ్మంలోనే అందించే ఏర్పాట్లు చేశాడు. కులం సర్టిఫికెట్టు, మారేజి సర్టిఫికెట్టు లాటి వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేకుండా యింటికే వస్తే ఎంత హాయి!

వీటన్నిటికి డబ్బు ఎక్కణ్నుంచి వచ్చింది అంటే- అరవింద్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ పనికి వచ్చింది. 2013-14లో రూ.3942 కోట్ల లోటు బజెట్‌ను 2017-18 వచ్చేసరికి రూ.113 కోట్ల మిగులు బజెట్‌గా మార్చాడు. రూ.325 కోట్ల ఎస్టిమేట్‌ ఉన్న ఫ్లయిఓవర్‌ ఒకదాన్ని రూ.250 కోట్లలో పూర్తి చేశాడు. గతంలో రూ. 300 కోట్ల ఫ్లయిఓవర్‌ ప్లాను చేసి, దానికి ఓ పట్టాన ఫండ్స్‌ రిలీజ్‌ చేయక ఆలస్యం చేయడంతో, మధ్యలో అవినీతితో చివరకు ఏ రూ.1500 కోట్లకో చేరేది. ఇతని ప్లానింగ్‌ బాగుంది. పైగా అవినీతి జరగకుండా చూశాడు.

ఇంకో అదృష్టమేమిటంటే షీలా దీక్షిత్‌ తన పరిపాలనలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాగా డెవలప్‌ చేసింది. అందువలన యితనికి దానిపై ఖర్చు మిగిలింది. ఇటీవలే వాటిపై బజెట్‌ కేటాయింపులు తగ్గిపోయాయని గ్రహించి (ట్రాన్స్‌పోర్టుపై 2013-14లో 17% ఖర్చు పెడితే 2018-19 నాటికి 10% మాత్రమే పెట్టారు) దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు. దిల్లీలో సీవేజ్‌, రోడ్ల పరిస్థితి బాగా లేదని 2019 ఆగస్టు 15 ఉపన్యాసంలో తనే ఒప్పుకున్నాడు. అలాగే యమునానదీ ప్రక్షాళన కూడా నెరవేర్చని హామీల్లో మిగిలింది. ఈసారి చేస్తానంటున్నాడు.

అరవింద్‌ గతంలో తనను తాను అరాచకవాది అని చెప్పుకునేవాడు. దూకుడుగా వెళ్లేవాడు. పార్టీలో నియంతగా ప్రవర్తించాడు. క్రమేపీ తన స్టయిల్‌ మార్చాడు. గతంలో పోస్టర్లలో సీరియస్‌గా కనబడేవాడు. ఇప్పుడు నవ్వుతూ కనబడ్డాడు. ఫక్తు ఫ్యామిలీమ్యాన్‌ అవతారం ఎత్తాడు. వయోవృద్ధులను తీర్థయాత్రకు పంపే కొడుకుగా, స్త్రీలకు బస్సుల్లో రక్షణ కల్పించే పెద్దన్నగా, స్కూలు పిల్లలకు బుద్ధులు చెప్పే అంకుల్‌గా కనబడ్డాడు. ఇంట్లో కిచెన్‌ గార్డెన్‌ చూసుకుంటూ, భార్యతో కలిసి పూజ చేస్తూ వున్న ఫోటోలు పబ్లిసిటీలో వాడారు. అతని భార్య సునీత ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌లో ఉన్నతాధికారిణి. అందువలన గత ఎన్నికలలో బయటకు వచ్చేది కాదు. ఇటీవల విఆర్‌ఆస్‌ తీసుకుంది కాబట్టి బయటకు వచ్చి యిళ్లకు వెళ్లి భర్తకు ఓట్లేయమని అర్థించింది. ఇవన్నీ ఇతను మనవాడే అనిపించాయి ఓటర్లకు. బిజెపి లీడర్లు అతన్ని పొద్దస్తమానం తిడుతూ వుండడంతో అతనిపై జాలి కూడా కలిగింది వాళ్లకు.

గతంలోనే చెప్పినట్లు బిజెపి తరఫున అరవింద్‌కు ప్రత్యామ్నాయం చూపకపోవడం పెద్ద పొరపాటైంది. బిజెపికి ద్వితీయశ్రేణి నాయకత్వం కొరవడింది. సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లే వంటి వారు లేని లోటు తెలిసింది. ఫిరాయింపుదారులను ఎడాపెడా చేర్చుకోవడం వలన ఎప్పణ్నుంచో ఉంటున్నవారికి కడుపుమంట కలిగింది. మనసు పెట్టి పనిచేయలేదు. ఏం చేసినా ఏం లాభం? మోదీ-అమిత్‌ ఏం తలచుకుంటే అదే జరుగుతుంది అని నిరాశ పడ్డారు. దాన్ని అరవింద్‌ క్యాష్‌ చేసుకున్నాడు.

‘బిజెపి గెలిస్తే అమిత్‌ షా ఒడియాకు చెందిన ఏ సంబిత్‌ పాత్రానో, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఏ అనురాగ్‌ ఠాకూర్‌నో ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే ఎలా వుంటుందో ఊహించి చూడండి’ అని అతను మీటింగుల్లో అనేవాడు. ఎందుకంటే బిజెపి మనోజ్‌ తివారి అనే భోజపురి గాయకుణ్ని దిల్లీ అధ్యక్షుడిగా (బహుశా ముఖ్యమంత్రిగా) ఎంపిక చేయడం దిల్లీలో ఎప్పణ్నుంచో సెటిలై ఉన్న పంజాబీలకు, హరియాణవీలకు, సింధీలకు కన్నెర్ర అయింది. దాన్ని యితను ఎన్‌క్యాష్‌ చేసుకున్నాడు. అంతా అయ్యాక యిప్పుడు బిజెపి వాళ్లే మనోజ్‌ తివారి బాడ్‌ ఛాయిస్‌ అంటున్నారు. అతన్ని ఎంపిక చేసిన అమిత్‌ను గట్టిగా అనడానికి ఎవరికీ ధైర్యం లేదు.

ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకుని వస్తామంటూ ముందుకు వచ్చిన అరవింద్‌ నేడు మెయిన్‌స్ట్రీమ్‌ పొలిటీషియన్‌గా మారిపోయాడు. అవినీతినిరోధానికి ప్రతీకగా వెలుగులోకి వచ్చిన అరవింద్‌ యిప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. అతనిపై, అతని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేనిమాట వాస్తవం.  కానీ అవినీతిని అతను రాజకీయాంశంగా చూడడం మానేశాడు. ఆప్‌ అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులు, ఫిరాయింపుదారులు ఉన్నారు, కొంతమందిపై క్రిమినల్‌ కేసులున్నాయి కూడా. నిధుల కోసం ఆప్‌ ఫండ్‌ రైజింగ్‌ డిన్నర్లు ఏర్పాటు చేసింది. ఎటొచ్చీ సామాన్యులకు కావసిన విద్య, వైద్యం అందించిన సమర్థపాలకుడిగా అరవింద్‌ పేరు తెచ్చుకుంటున్నాడు. అతను జాతీయ నాయకుడిగా ఎదగడానికి చాలా సమయం పడుతుంది.  (సమాప్తం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2020)

 [email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?