Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: నాటకరచయితగా ఆత్రేయ

ఎమ్బీయస్‍:  నాటకరచయితగా ఆత్రేయ

ఆత్రేయ శతజయంతి ఈ మే 7న జరిగింది. పదేళ్ల క్రితం ఆయనపై పెద్ద వ్యాసం రాశాను - ఆయన నాటకాలు, కవిత్వం, చమత్కారాలు కలిపి! ఇప్పటి పాఠకుల్లో చాలామంది చదివి వుండరు, చదివినా గుర్తుండి వుండదు అనే అభిప్రాయంతో కేవలం నాటకాల గురించి యీ వ్యాసం రాస్తున్నాను. ఆచార్య ఆత్రేయ అన్నది కలం పేరు. ఆయన అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. వాళ్ల గోత్రం ఆత్రేయస. అందువల్ల ఆయన తన గోత్రంలోంచి ఆత్రేయ, తన పేరు లోంచి ఆచార్య కలిపి ఆచార్య ఆత్రేయ అని పెట్టుకున్నారు. ఆత్రేయ పేరు వినగానే ఆయన పాటలు గుర్తుకు వస్తాయి, ఎవరికి? సంగీతాభిమానులకు. సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లకు ఆయన డైలాగ్స్ గుర్తుకు వస్తాయి. ఒకసారి ఆరుద్ర అన్నారు, ‘ఏమీ స్టఫ్‍ లేని సీన్ని కూడా డ్రమటైజ్‍ చేయగల శక్తి ఉంది ఆత్రేయకి’ అని.

సినిమా సంభాషణా రచన చేయడంలో ఆత్రేయ అల్టిమేట్‍ అని చెప్పాలి. సినిమా మీడియంకు తగ్గట్టు ఎంత తక్కువగా చెప్పాలి, ఎంత సూటిగా చెప్పాలి, ఎంత సులభంగా చెప్పాలి, ఎంత ప్రభావవంతంగా చెప్పాలి అన్నది ఆయన డైలాగ్స్ చూసే నేర్చుకోవాలి. సినిమాల్లో రాణించడానికి ఆత్రేయకు ఉపకరించినది - నాటక రచనలో అనుభవం. ఆయన నాటకాల ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. నటుడు కూడా. కాంగ్రెసులో తిరిగారు. గాంధీని అభిమానించారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెసు మ్యూవహారం చూసి విసిగి, కమ్యూనిస్టు పార్టీపై అభిమానం పెంచుకున్నారు. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకోసం ప్రచారం చేశారు కూడా.

‘‘తోడికోడళ్లు’’ సినిమా పాటలో ‘కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిచాన’ అంటూ శ్రమ దోపిడీ గురించి చెప్పిన పాట శ్రీశ్రీదనుకుంటారు చాలామంది. కానీ అది రాసినది ఆత్రేయే! తోడికోడళ్లు 1957లో విడుదలయింది. అంటే ఆత్రేయ కమ్యూనిస్టులపై అభిమానం ఉన్న రోజుల్లో రాసిన పాట అన్నమాట అది. తర్వాత తర్వాత ఆయనకు వాళ్లమీదా మనసు విరిగిందేమో తెలియదు. యాక్టివ్‍గా రాజకీయాల్లో పాల్గోలేదు. సినిమాల్లోకి వచ్చాక మనసు కవిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఆత్రేయ నాటకాలు కూడా ప్రేమ, సెంటిమెంటుతో ఉంటాయనుకుంటే పొరబాటు! ఆయనవన్నీ సోషల్‍ థీమ్సే! యుద్ధం వద్దనీ, శాంతి కావాలనీ, మతసామరస్యం ఉండాలనీ ఉద్బోధిస్తూ నాటకాలు రాశారు. మధ్య తరగతిని మేల్కొల్పాలని వారి మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ పవర్‍ఫుల్‍ డ్రామాలు రాశారు. డైలాగులు మహా పదునుగా ఉంటాయి. అయినా ఆయన నాటకాల్లో చమత్కారమూ ఉంటుంది.

ఆత్రేయ మొదటి నాటకం 1943 నాటిది. అప్పటికి ఆయనకు 22 ఏళ్లు. బెర్నార్డ్ షా రాసిన ‘ది బ్లాక్‍ గర్స్ ఇన్‍ సెర్చ్ ఆఫ్‍ గాడ్‍’ అనే ఇంగ్లీషు నాటకం స్ఫూర్తిగా తీసుకుని ఇది రాశారు. మీకు అర్థమయే ఉంటుంది. ఆత్రేయగారికి ఇంగ్లీషు బాగా వచ్చే వుంటుందని. ఆయన ఇంటర్‍మీడియట్‍ చదివాక టీచర్స్ ట్రైనింగ్‍ అయ్యారు. నెల్లూరు మున్సిఫ్‍ కోర్టులో గుమాస్తాగా పనిచేశారు. నెల్లూరు నుండి వెలువడే ‘జమీన్‍రైతు’ పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేశారు. ఆత్రేయది నెల్లూరు జిల్లాయే. సూళ్లూరుపేట తాలూకాలో పుట్టారు. చిత్తూరులో విద్యాభ్యాసం జరిగింది. అందుకే ఆయన మాటల్లో ‘అవసరపడి’ అని వాడతారు. అంటే తొందరపడి అని అర్థం అన్నమాట. ..దక్షిణాది తెలుగు!

సరే, ఇంతకీ ఈ గౌతమబుద్ధ నాటకంలో మొదటిరంగం అంతా చీకటి. అందరూ బాధలు పడుతూంటారు. తర్వాత బుద్ధుడు విలాసజీవితం చూపిస్తారు. అతను తోటకెళ్లి తోటమాలితో మాట్లాడుతూండగానే తోటమాలి చచ్చిపోతాడు. మృత్యువు వచ్చి బుద్ధుడితో సంభాషిస్తుంది. రోగ, జరా మృత్యువుల గురించి వివరిస్తుంది. బుద్ధుడిలో ఆలోచనా పరంపర ప్రారంభమవుతుంది. శుద్ధోధనుడికి ఏడు కలలు వస్తాయి. ఈ సప్త స్వప్నాల ఉదంతం జాతక కథల్లో ఉందట. ఆ కలలకు పండితులు అర్థం చెప్తారు. మహాప్రస్థానం. తపస్సు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని తండ్రికి యిబురు వెళుతుంది. ఆఖరి రంగంలో అంతా వెలుగు. అందరూ ఆనందపడతారు.

దీనిలో పాటలు కూడా ఉంటాయి. నిజానికి ఆత్రేయ నాటకాలన్నిటిలో కూడా పాటలు ఉంటాయి. బుద్ధుడిని రంజింపజేయడానికి రాధాకృష్ణుల నృత్యగీతిక కూడా ఉంటుంది. ఈ నాటకం కొత్తరకంగా రాయాలని ఆత్రేయ పాత్రలకు పేర్లు పెట్టలేదు. కానీ దానివల్ల సాధించినదేమిటో అర్థం కాదు. ‘ప్రయోగం  ఫర్‍ ప్రయోగం సేక్‍’ అనిపిస్తుంది. నాటకం వల్ల బుద్ధుడిపై ఆత్రేయకున్న గౌరవం తేటతెల్లమవుతుంది.

ఆత్రేయ గారి రెండో నాటకం - ‘అశోక సమ్రాట్‍’. దీన్లో 9 అంకాలుంటాయి. కళింగ యుద్ధం నాటి కథ. అక్కడ పారిన రక్తం చూసి అశోకుడు  బౌద్ధుడిగా మారిపోయాడని చెప్పుకుంటాం కదూ, ఈ నాటకం అలా వుండదు. దీనిలో కథేమిటంటే - అశోకుడు పరిపాలిస్తున్నపుడు బౌద్ధం క్రమంగా వేళ్లూనుకుంటూంటుంది. ఆయన భార్య తిష్య కూడా బుద్ధుడంటే అభిమానం కలదే. యుద్ధాలతో మొహం మొత్తిన ప్రజలు  బౌద్ధాన్ని అభిమానిస్తున్నారని అశోకుడి అనుమానం. బౌద్ధుల్ని జైల్లో పెట్టి కళింగ యుద్ధం ప్రకటిస్తాడు.

కళింగ యుద్ధంలో జరిగిన హింస చూసి సర్వసేనాధిపతి కూడా ఎదురు తిరుగుతాడు. అశోకుడు అతణ్ని బందీ చేస్తాడు. అతను జైల్లో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కబురు తెలిసిన అతని భార్య శాంతి, యుద్ధానికి మ్యూతిరేకంగా ప్రజలను కూడగడుతుంది. తిష్య కూడా ఆమెకు మద్దతు నిస్తుంది. ఇక గత్యంతరం లేక అశోకుడు శాంతికి మళ్లుతాడు. ప్రజలు అతడు సన్యాసి కానక్కరలేదని, రాజుగా ఉంటూనే శాంతి నెలకొల్పమని  కోరతారు. ఈ నాటకం 1944లో రాశారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధం రోజులు. యుద్ధానికి వ్యతిరేకంగా సాగిందీ రచన. చచ్చిపోయిన ఓ సైనికుడి తల్లి అశోకుణ్ని నిలదీస్తుంది. ఆ ఘట్టాన్ని ఎన్టీయార్‍ తను 1992 లో తీసిన  ‘సమ్రాట్‍ అశోక’లో వాడుకున్నారు. ఆ పాత్ర భానుమతి వేశారు.

ఆయన 1945లో పరివర్తన అనే నాటకం రాశారు. ఈ నాటకం ద్వారా ఆయన ప్రజానాట్యమండలికి పరిచయమయ్యారు. ఈ నాటకంలో ఆత్రేయ కవిగా, మిక్కిలినేని కార్మికనాయకుడిగా వేశారు.  న్యూ థియేటర్స్ వారి సినిమా ‘హమ్‍రాహీ’ అని వుంది. దాని ఆధారంగా ‘పరివర్తన’ రాశారు ఆత్రేయ. దీన్ని కన్నడంలోకి ‘కలిపుంగవ’ అనే పేరుతో వేరేవారు అనువాదం చేశారు. ఈ నాటకాన్ని ఆత్రేయ బళ్లారి రాఘవ గారికి అంకితం ఇచ్చారు. కథేమిటంటే ఓ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో ఆశ్రితుడుగా ఓ కవి బతుకుతూంటాడు. అతనికి ఘోస్ట్‌రైటర్‍గా ఉంటాడు. యజమాని చెల్లెలు శోభ ఇతన్ని అభిమానిస్తూ ఉంటుంది. ఓ ఫ్యాక్టరీ వర్కరు ఓ ప్రమాదంలో చెయ్యి పోగొట్టుకుంటాడు. కాంపెన్సేషన్‍ ఎగ్గొట్టడానికి యజమాని ప్రయత్నిస్తాడు. వర్కర్స్ యునియన్‍ లీడరు వచ్చినా అతను లొంగడు. తన తప్పేమీ లేదని ఓ స్టేటుమెంటు తయారుచేయమని కవిని అడుగుతాడు. ఇంతలో శోభ వర్కరు ఇంటికి వెళ్లి చూసి వస్తుంది. అతనికి సహాయం చేస్తుంది. తన అన్నగారు కవి పుస్తకాలను తనపేర అచ్చు వేయించుకున్న విషయం బయటపెట్టి కవిని చైతన్యవంతుణ్ని చేస్తుంది. కవి తిరగబడతాడు. ఆ కవి పాత్ర ఆత్రేయ వేశారు.

ఆత్రేయ రాసిన ‘వాస్తవం’ నాటకం 1946 నాటిది. అప్పటికే కాంగ్రెసువాళ్లు ప్రభుత్వంలోకి చేరడం, మంత్రులయ్యాక ఆదర్శాలు మరిచిపోవడం అదీ జరిగింది. షావుకార్లందరూ ఖద్దరు కట్టేసి, కాంగ్రెసుటోపీలు పెట్టేసి కమ్యూనిస్టులను అణచివేయడానికి చూడడం జరిగింది. అదే చూపుతారు ఆత్రేయ దీనిలో. స్వాతంత్య్రం వచ్చాక రాసిన నాటకం ‘ఈనాడు’ మతకల్లోలాల నేపథ్యంలో రాసినది. పురుషోత్తం, అక్బర్‍ అనే స్నేహితులు పక్కపక్కవాటాల్లో ఉంటారు. చాలా సఖ్యంగా ఉంటారు.  ఇతరప్రాంతాల్లో జరిగిన మతకల్లోలాల గురించి పేపర్లో వచ్చినది చదివి ఇతరులు ఆవేశపడుతూ ఉంటే వీళ్లు శాంతింపజేస్తూ ఉంటారు. ఆ ఊళ్లో ఓ ఇంగ్లీషు డాక్టరుంటాడు. స్వాతంత్య్రం వచ్చినందుకు విందు ఇస్తున్నానంటూ హిందువులను విడిగా, ముస్లిమ్‍లను విడిగా పిలుస్తాడు.

చివరికి ఈ ఊళ్లోనూ మతకలహాలు జరుగుతాయి. ఓ హిందూ మతోన్మాది  విసిరిన బాకు తగిలి గాంధీ ఫోటో పగిలిపోతుంది. ఈ మిత్రులిద్దరూ ఒకరి నొకర్ని కాపాడుకోబోయి చివరికి గూండాల చేతిలో హతం అవుతారు. ఇంగ్లీషు డాక్టర్‍ వికట్టాట్టహాసం చేస్తూ నిష్క్రమిస్తాడు. తమాషా ఏమిటంటే ఈ నాటకం రాసేనాటికి గాంధీ హత్య జరగలేదు. అప్పుడు ఆత్రేయ ఊహించినది కొన్ని నెలల తర్వాత వాస్తవంగా జరిగింది.ఈ నాటకానికి ‘ది బాన్‍ఫైర్‍’ అనే ఓ చిన్న కథ స్ఫూర్తి నిచ్చింది. ఈ కథ హజ్రాబేగం అనే ఆవిడ రాశారు. ‘న్యూ ఏజ్‍’ అనే కమ్యూనిస్టు పత్రికలో పడింది.

ఆచార్య ఆత్రేయను ట్రెండ్‍ సెటర్‍గా నిలిపిన నాటకం ఎన్‍.జి.ఓ. గుమాస్తా బతుకులను చూపిన ఈ నాటకానికి ముందులో పేరు ‘అద్దెకొంప’. రచనాకాలం 1948. మధ్యతరగతి భేషజాలను, వారి బతుకులలో డొల్లతనాన్ని చూపుతుందీ నాటకం. ఓ ప్రభుత్వాఫీసులో గుమాస్తా. రోగిష్టి భార్య. రోగిష్టి తండ్రి. పిల్లలు. చదువుకుంటున్న తమ్ముడు గోపీ. గోపీ ఈ పరిస్థితులను ఎదిరిస్తూంటాడు. ఇల్లు గడవటం లేదని చెప్పి బస్టాండ్‍లో పళ్లపొడి అమ్ముతాడు. అది తెలిసి అన్నగారు  ఫాల్స్ ప్రెస్టేజికి పోయి తవ్మణ్ని చావగొడతాడు. అప్పుడు గోపీ అంటాడు - ‘కూలివాళ్లు మనకంటె నయం. ఇంట్లో అందరూ పనిచేస్తారు. మనం అలా కాదు. ఒక్కడు సంపాదించాలి. తక్కినవాళ్ల్లందరూ తినాలి. ఆడది యిల్లు వదిలిపెట్టకూడదు.  ఆ డబ్బుగలవాళ్లచేత మనుష్యులనిపించుకోవాలి.’’

చివరికి ఆ గుమాస్తా లంచం పుచ్చుకుని పట్టుబడి జైలు కెళతాడు. ఈ తమ్ముడు ఓ పబ్లిక్‍ మీటింగులో ప్రభుత్వం ఏమీ చేయటం లేదని ఉపన్యాసమిస్తే పోలీసులొచ్చి కమ్యూనిస్టని చెప్పి జైల్లో పెడతారు. వాళ్లు కమ్యూనిస్టని ఎలా తేల్చారంటే గోపీ వేసిన పల్లెపడుచు బొమ్మలో ఆమె చేతిలో కొడవలి ఉందిట! చూడండి ఎంత వెటకారమో! ఎన్‍జీవో నాటకం హిందీలోకి కూడా తర్జుమా అయింది. దీన్ని ఆధారం చేసుకుని 1953లో ‘‘గుమాస్తా’’ అనే సినిమా తయారయింది.

దీని తర్వాతి నాటకం ‘విశ్వశాంతి’. ప్రతీకాత్మకంగా రాసిన నాటకం ఇది. భూదేవి అని తల్లి. ఆవిడకు పెద్దాడు, చిన్నాడు అని కొడుకులు. శాంతి అని మేనకోడలు. శాస్త్రి అని ఓ మేధావి. పెద్దాడు కొద్దిమందిగా వున్న నరరక్తభోక్తల ప్రతినిథి. శాస్త్రి అనే మేధావి ద్వారా బాంబు కనిపెట్టిస్తాడు.  చిన్నాడు పీడించబడుతున్న కోటానుకోట్ల మానవుల జీవన వాంఛకు ప్రతిబింబం. పెద్దాడి ఆగడాలు పెచ్చుమీరినపుడు భూదేవి తన కొడుకైనా సరేనని పెద్దాడిని చంపేస్తుంది. ఈ నాటకంలో శీశ్రీ రాసిన ‘ఏ దేశచరిత్ర చూసినా’ గేయం ఉపయోగించుకున్నారు ఆత్రేయ. ఆత్రేయ నాటకాల్లో రాజకీయ నినాదాలు ఉంటాయని అందువల్లనే ఆకర్షిస్తున్నాయనీ అన్నారట. మాములు సబ్జక్ట్స్ కూడా రాయగలనని నిరూపించుకోవడానికి ఆయన ‘కప్పలు’ అనే నాటకం 1953లో రాశారు.

సినిమాల్లో స్థిరపడ్డాక రాసిన నాటకం ఇది. ఎల్లకాలాలకూ పనికివచ్చే సూత్రమే నాటకరూపంలో రాశారు. చెరువు నిండివున్నప్పుడు కప్పలు నిండుగా ఉంటాయి. నీళ్లు తగ్గిపోతే పారిపోతాయి అని మంచి నాటకీయంగా చెప్పారు ఆత్రేయ. ఓ డబ్బున్నాయన. భార్య లేదు. ఒక్కత్తే కూతురు. బంధువులంతా వచ్చి మూగుతారు. కూతుర్ని చేసుకుందామని కొందరు. ఈయనకు రెండోపెళ్లి చేదామని కొందరు. ఈ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. వాడు ఈమె ఆస్తిని చూసి ప్రేమిస్తున్నాడేమోనని తండ్రి డౌటు. చివరికి ఓ రోజు ఓ నాటకం ఆడతాడు. తన డబ్బంతా దొంగనోట్లు గుద్ది సంపాదించినదనీ, ఆ విషయం పోలీసులుకు తెలిసిపోయిందనీ ఎనౌన్స్ చేస్తాడు. దొంగనోట్ల మిషన్ని ఎవరైనా ఓ రోజు దాచి తనను కాపాడమంటాడు. దాంతో హడిలిపోయి బంధుగణమంతా  పారిపోతారు. అమ్మాయిని ప్రేమించినవాడు మాత్రం కాస్త తర్జనభర్జన పడి ఆఖరికి తన తండ్రిని ఎదిరించి సిద్ధపడతాడు. చివరకు నిజానిజాలు తేల్చుకోవడానికి వేసిన నాటకం ఇది అని తెలుస్తుంది.

ఆత్రేయకు విపరీతంగా పేరు తెచ్చిపెట్టినది 1954లో రాసిన ‘భయం.’ ఆఫీసు వాతావరణంలో నడుస్తుంది. పొప్రటర్‍. అతనికి అమ్మాయిలు సప్లయి చేసి పక్కలు పరిచే గుంటనక్క పెర్శనల్‍ సెక్రటరీ. అతని కింద మేనేజర్‍. అతనే కష్టపడి పనిచేసి పొప్రటర్‍ను ఇంతవాణ్ని చేసింది. అతను చాకిరీ చేసి, చేసి సగం పిచ్చివాడయిపోతాడు. పిల్లల్ని కని కని అతని భార్య పూర్తి పిచ్చిదయిపోతుంది. అకౌంటెంటు ఒకడు. జాతకాలు చెప్పే కాషియర్‍ ఒకడు. టైపిస్టు అమ్మాయి ఒకత్తి. సంగతులన్నీ మౌనంగా చూస్తుండే  ప్యూన్‍ ఒకడు. ఆ ఆఫీసులో పనిచేసే అందరికీ భయమే. అభద్రతా భావమే. అకౌంటెంటుకు మేనేజర్‍ను చూస్తే భయం. మేనేజర్‍కు పొప్రటర్‍ అంటే భయం. పొప్రటర్‍కు ఇన్‍కమ్‍టాక్స్ వాళ్లన్నా, కూలీనాయకులన్నా భయం. నాటకం ముందులోఓ పాట రాశారు ఆత్రేయ. దానిలో రకరకాల భయాలు రాశారు.

ఆఫీసులో టైపిస్టు అమ్మాయికి ఒక ప్రియిడుంటాడు. అతను కూలీనాయకుడు. అతనివల్ల గర్భవతి అవుతుందీమె. అతనికి ఉద్యోగం ఉంటేనే తప్ప ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు. అందువల్ల పొప్రటర్‍కు తనపై మోజుండడం గమనించి అతన్ని ఉద్యోగానికి రికమెండ్‍ చేస్తుంది. కూలీనాయకుడు కదా అతన్ని కట్టిపడేసి ఉన్నట్టుంటుందనుకుని పొప్రయిటర్‍ సరేనంటాడు. అతను ఉద్యోగంలోకి చేరిన రోజునే ఇన్‍కమ్‍టాక్స్ గొడవలు వస్తాయి. వర్కర్లకు బోనస్‍ ఇచ్చినట్టు  దొంగలెక్కలు రాయమని ఆడిటర్‍ సలహా ఇస్తాడు. ఈ కుర్రాడు మ్యూతిరేకిస్తాడు. బయటకు వెళ్లి కూలీలను రెచ్చగొడతాడు. దాంతో ఒళ్లు మండిపోయిన పొప్రటర్‍ ఆ అమ్మాయి తండ్రిని పిలిచి బ్లాక్‍మెయిల్‍ చేయబోతాడు. కూతురు పెళ్లి కాకుండానే గర్భవతి అయిందన్న సంగతి తెలిసి ఆ ముసలాయన అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. ఆఫీసులో తిరుగుబాటు వస్తుంది. అప్పటిదాకా అణగి మణగి ఉన్న అకౌంటెంటు కూడా ఎదిరిస్తాడు. ఈలోగా కుర్రాడు పాత అకౌంటు బుక్సన్నీ పోలీసులకు అప్పగిస్తాడు. వాళ్లు అరెస్టు చేయడానికి వస్తారు. మేనేజర్‍ భార్య పిచ్చిపట్టి ఉంటుంది కదా, ఆమె ఆఫీసుకు నిప్పుపెట్టి తగలేస్తుంది. అదీ కథ. డైలాగులు చాలా అర్థవంతంగా ఉంటాయి.

ఆత్రేయ రాసిన ఓ సెంటిమెంటల్‍ డ్రామా గురించి చెప్తాను. సినిమాల్లో బాగా పేరు వచ్చాకనే 1968లో రాశారిది. సిడ్నీ హవర్డ్ అనే ఆయన రాసిన ‘దే న్యూ వాట్‍ దే వాంటెడ్‍’ అనే నాటకం ఆధారంగా రాశారిది. పేరు ‘మనసూ - వయసూ’. ప్రతిభ అనే ఓ వార పత్రికలో ఇది సీరియల్‍గా వెలువడింది. ఇందులో శివయ్య అనే ఓ ముసలాయన ఉంటాడు. చిన్నప్పుడు డబ్బు లేక పెళ్లి చేసుకోలేదు. తర్వాత డబ్బు సంపాదించి ఓ ఊళ్లో ఊరి చివర ఓ తోటబంగళా కట్టుకుని ఉంటాడు. అతని వద్దకు తిరుపతి అని ఓ కుర్రాడు వస్తాడు. అతను తెగిన గాలిపటంలా తిరిగే వ్యక్తి. శివయ్య అతణ్ని కొడుకులా ఆదరిస్తాడు. మూణ్నెళ్లపాటు అతనివద్దనే ఉండిపోతాడు తిరుపతి. ఇద్దరూ కలిసి ఓ సారి బొంబాయి వెళతారు. అక్కడ ఓ టైపిస్టు లిల్లీని చూస్తారు. తిరిగివచ్చాక శివయ్య ఆ టైపిస్టును ప్రేమించాననీ, పెళ్లి చేసుకుంటాననీ అంటాడు. తిరుపతి చేత ఉత్తరాలు రాయిస్తాడు. ఆ అమ్మాయికూడా స్పందిస్తుంది. ఫోటో పంపమంటుంది. శివయ్య  తన ఫోటో పంపడానికి జంకి, తిరుపతి ఫోటో పంపుతాడు.

లిల్లీ ఆ ఫోటో చూసి ప్రేమిస్తుంది. శివయ్యనుండి పెళ్లి ప్రపోజల్‍ వస్తే సరేనంటుంది. రిజిస్టర్‍ మేరేజికి ఒప్పుకుంటుంది. ఆమెకు వెనకా, ముందూ ఎవరూ లేరు. ఆస్తిపాస్తులున్న సంగతి ఆమెకు తెలియదు. అందచందాలు చూసి మురుస్తుంది. నాటకం ఇక్కడే ప్రారంభమవుతుంది. పంతులు అని మేరేజి రిజిస్ట్రార్‍ శివయ్య ఇంటికి వస్తాడు. శివయ్యకు తాను చేసిన పని తెలుసుకాబట్టి లిల్లీ వచ్చేలోగా తిరుపతిని పంపించేద్దామనుకుంటాడు. కానీ వెళ్లమని గట్టిగా అనలేకపోతాడు. స్టేషన్‍కు వెళ్లి లిల్లీని తీసుకురావడానికి కారులో ఫాస్ట్‌గా వెళ్లి యాక్సిడెంటు చేసుకుంటాడు. ఈలోగా లిల్లీ విడిగా శివయ్య ఇంటికి వచ్చేస్తుంది. తిరుపతిని చూసి శివయ్య అనుకుని పొరబడుతుంది. కాస్సేపటికి కాలిగాయంతో శివయ్య వస్తాడు. లిల్లీ జరిగినది గ్రహిస్తుంది. ఏదో ఒక ఆశ్రయం కావాలనుకుని శివయ్యను పెళ్లాడుతుంది. కానీ శివయ్య ఆరునెలలవరకు మంచం మీదనుండి లేచే పరిస్థితి కాదు. ఫస్ట్‌నైట్‍ జరగదు.

అక్కడుండడం భావ్యం కాదనుకుని తిరుపతి వెళ్లిపోతాడు. కానీ ట్రెన్‍ దొరకదు. స్టేషన్‍లో పడుకోనివ్వరు. తిరిగివస్తాడు. ఆ రాత్రే లిల్లీ, తిరుపతి వద్దనుకుంటూనే కలుస్తారు. తిరుపతి మర్నాటినుండి ఇంటికి దూరంగా తోటలో ఉంటూంటాడు. లిల్లీ శివయ్యకు సేవలు చేసి మూణ్నెళ్లలో అతను కాస్త కోలుకునేట్టు చేస్తుంది. కానీ ఆ రాత్రి ఫలితంగా లిల్లీ గర్భవతి అవుతుంది. అది తెలిసి శివయ్య ఉగ్రుడవుతాడు. లిల్లీ ఇల్లు విడిచి వెళ్లిపోతానంటుంది. చివరకు శివయ్య ఆత్మత్యాగంతో నాటకం ముగుస్తుంది. తిరుపతి, లిల్లీలకు పుట్టబోయే బిడ్డకు తన యావదాస్తి వీలునామా రాసేస్తాడు శివయ్య. బొత్తిగా సినిమాటిక్‍ గా ఉందనిపిస్తోందా? అయినా దీన్ని ఎవరూ సినిమా తీసినట్టు లేదు.

ఆత్రేయ ఈ నాటకాలతో బాటు 15 నాటికలు కూడా రాశారు. వాటి అన్నిటి కథా చెప్పడం కష్టం కాబట్టి కొన్నిటి గురించి కాస్త ఐడియా ఇస్తాను. ముందుగా అనువాద నాటకాలు. అనువాదాలంటే అచ్చంగా అనువాదాలు కావు. స్ఫూర్తి పొందినవన్నమాట. ‘అశ్వఘోషుడు’ అనే నాటిక రాహుల్‍ సాంకృత్యాయన్‍ రాసిన ‘ఓల్గా టు గంగా’ అనే పుస్తకంలోని ‘ప్రభా’ అనే కథను ఆధారం చేసుకుని రాసింది.అలాగే హరీంద్రనాథ్‍ చటోపాధ్యాయ రాసిన నాటికను అనుసరించి ‘కాపలావాని దీపం’ అనే నాటిక రాశారు. జె.బి.ప్రీస్ట్లీ రాసిన ‘యాన్‍ ఇన్‍స్పెక్టర్‍ కాల్స్’ అనే నాటిక ఇప్పటికీ ఇంగ్లీష్‍ స్టేజ్‍ మీద చాలా పాప్యులర్‍. దాని ఆధారంగా ఆత్రేయ రాసినది ‘చావకూడదు’. ఒక ధనిక కుటుంబంలోని అందరు సభ్యులూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒక అమ్మాయి జీవితాన్ని వివిధ దశల్లో ఎలా ధ్వంసం చేశారో చెప్తుంది. జాన్‍.జి.ఇర్విన్‍ రాసిన ‘పోగ్రెస్‍’ అనే నాటిక. వినాశకారమైన పరిశోధనలు చేసే సైంటిస్టును పెంచిన అక్కగారే చంపేయడం కథాంశం. ఆత్రేయ పెట్టిన పేరు ‘ప్రగతి’.

డబ్ల్యు డబ్ల్యు జాకబ్‍ రాసిన కథ ‘ది మంకీస్‍ పా’! దాన్ని ‘వరప్రసాదం’ అనే పేర ఆత్రేయ అనుసరించారు. ములకథలో కోతిపంజాను ఆత్రేయ కాకిముక్కు చేశారు. మిస్టీరియస్‍ కథ. ఆత్రేయ రాసిన తతిమ్మా నాటికల్లో ‘చస్తే ఏం?’, ‘మాయ’ ‘ఓటు నీకే’ ‘అంతర్యుద్ధం’ ‘ఆత్మార్పణ’ ఇలాటి నాటికలు ఉన్నాయి. ‘ఎవరు దొంగ?’ చాలా పాప్యులర్‍ నాటిక. కొత్త తరహాలో ప్రారంభమవుతుంది. స్టేజ్‍ మీద పోలీసు విజిల్స్ వినబడతాయి. ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి స్టేజిమీదనుండి దిగిపోయి వచ్చి ప్రేక్షకులలో కూచుంటాడు. హాస్టల్లో దొంగ పడతాడు. బియ్యం కోసం. అతని భార్య ముగ్గురి పిల్లల్ని తీసుకుని నూతిలో పడి చచ్చిపోతుంది. బియ్యం బ్లాక్‍ మార్కెట్‍ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. అన్యాయాన్ని ఎదిరించబోయిన సబ్‍ఇన్‍స్పెక్టరును బదిలీ చేయిస్తారు, బ్లాక్‍ మార్కెటీర్లు.

ఇన్ని నాటకాలు రాసిన ఆత్రేయకు నాటకాల గురించి ఏమనుకుంటారు? ఆయన 1967లో ఓ వ్యాసం రాశారు. దానిలో అంటారు - ‘‘నాటకాల క్వాలిటీ తగ్గిపోవడానికి కారణం - నాటకాల్లో సినిమా అనుకరణ ఎక్కువ కావడం. ఇంకో కారణం - నాటకంలో పాత్రలు సమాజంలోని సజీవ వ్యక్తులు కాకుండా, రచయిత సృష్టించి, అతని విసురులకు, చెణుకులకు సాధనాలుగా పనిచేసేవి కావడం!’’ ఆయన నాటకరంగాన్ని విడిచి వచ్చినా ఆ బాధ ఉండిపోయింది. ఎర్రమల్లెలు అనే ఓ నాటకాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయలేక గణేష్‍ పాత్రోను పూర్తి చెయ్యమన్నారట. ఆయనవల్లా కాలేదు. అప్పుడు ఆత్రేయ అన్నారుట - మనం నాటకాన్ని ప్రేమించాం. సినిమాని పెళ్లాడాం. మన బ్రతుకులు ఇంతే. నాటకాన్ని మరవలేము, సినిమాని విడవలేము.’ అని.

నా ధ్యేయం అని ఆయన ఒక చోట రాసుకున్నారు - ‘‘నేను సత్సంప్రదాయ వంశంలోనే పుట్టి పెరిగాను. కాని కొంతకాలానికి నాలో ఏ మూలనో దాగివున్న విప్లవకారుడు తలెత్తాడు. ధనికుల, రాజకీయనాయకుల అత్యాచారాలను, అన్యాయాలను దైవానికీ, కర్మకూ అంటగట్టడానికి నా మనసు అంగీకరించలేదు. ‘ఈ కుళ్లును కడగలేకపోయినా, బయటపెట్టాలి’ అనుకుని నాటకాలు రాశాను. కానీ నేనింకా కృతకృత్యుణ్ని కాలేదు. నా ఆఖరినాటకం వ్రాయాలి. నేనే స్వయంగా ప్రజలలో - దేశం నాలుగు ములలా - ప్రదర్శించాలి. ప్రజల మధ్యనో, రంగస్థలం మీదనో నా ఆఖరి వూపిరి వదలాలి. లేదా ప్రభుత్వ కారాగారంలో మ్రగ్గి మరణించాలి. అప్పుడే నా జన్మ ధన్యం!

కానీ ఇదేమీ జరగలేదు. ఆత్రేయకు ఉన్న టేలెంటు పూర్తిగా వినియోగంలోకి రాలేదు. క్రమశిక్షణ లేని జీవితం, అలవాట్లు దానికి కారణం. ఆయన డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెట్టాడు. చివరిరోజుల్లో ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎవరైనా ‘ఆరోగ్యం ఎలా వుంది?’ అని అడిగితే ‘ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కానీ, మహాభాగ్యమే ఆరోగ్యం. డబ్బు లేకపోతే జబ్బులే!’ అనేవారు. శ్రీనాథుడి జీవితం గుర్తుకువస్తుంది ఆత్రేయను తలచుకుంటే! మహాభోగిగా బతికి అంత్యదశలో కష్టాలు పడ్డారు. శ్రీనాథుడి స్టయిల్లో చాటువులు రాశారు. ఆత్రేయ ఆత్మకథ అని పద్యకావ్యం రాసుకున్నారు. అందులో తన గురించి నిష్కర్షగా చెప్పుకున్నారు. కవిగా, రచయితగా, నాటకకర్తగా ఆత్రేయది అద్వితీయస్థానం. (ఫోటో – సాటి నాటకరచయితలు గొల్లపూడి, పినిశెట్టిలతో ఆత్రేయ)

- ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (జూన్‍ 2021)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?