cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బెంగాల్‌లో విభీషణపర్వం

ఎమ్బీయస్: బెంగాల్‌లో విభీషణపర్వం

‘మతమార్పిడులు వద్దు-పార్టీ మార్పిడులు ముద్దు’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బిజెపి బెంగాల్‌లో మమతా బెనర్జీకి చెమటలు పట్టిస్తోంది. ఫిరాయింపుదారులను విభీషణులతో పోల్చడం వలన బిజెపి రాముడనే అర్థం వస్తోందని తెలిసినా వాడుతున్నాను. ఎందుకంటే తన గుట్టుమట్లు తెలిసిన విభీషణుడు పార్టీ ఫిరాయించడంతో రావణుడు హతాశుడైనట్లు, తన సేనాపతి శుభేందు అధికారి కూడా గోడ దూకేయడంతో మమతకు మండిపోయింది. గతంలో ముకుల్ రాయ్ వెళ్లిపోయినప్పుడూ యిలాగే కంగు తింది. ఆ తర్వాత వరుసగా అందరూ వెళ్లిపోతూన్నా, జీర్ణించుకుని, ఏదోలా బండి లాక్కుని వస్తూండగా యిప్పుడు శుభేందు కూడా ముకుల్ దారి పట్టడంతో మమత ఆగ్రహం పట్టలేక పోయింది. శుభేందు నియోజకవర్గమైన నందిగ్రామ్‌లో స్వయంగా పోటీ చేస్తానని ప్రకటించింది. ఏమిటీ శుభేందు ప్రత్యేకత?

ముందుగా అతని పేరు గురించి రాయాలి. ఇంగ్లీషులో స్పెల్లింగు చూసి మన తెలుగు పత్రికలలో కొందరు సువేందు అని రాస్తున్నారు. బెంగాలీ వర్ణమాలలో ‘వ’ అక్షరం లేదు. ల తర్వాత ‘శ’యే. వ, బలకు అభేదం పాటిస్తారు. అంటే వ వాడేచోట బ వాడతారు. బెంగాలీ వరకు యిది ఫర్వాలేదు కానీ యితర భాషా పదాలు వాడేటప్పుడు వాళ్లకు యిబ్బంది ఏర్పడుతుంది. వాళ్లు ‘మీ యింట్లో టీవీ వుందా?’ అని అడిగే బదులు ‘టీబీ (క్షయ) వుందా?’ అని అడుగుతారు, అని కొందరు జోక్ చేస్తారు. అది తప్పు. వాళ్లు అలాటి సందర్భాల్లో టీభీ వుందా అని అడుగుతారు. వ తప్పనిసరిగా వాడవలసిన చోట భ అని బెంగాలీలో రాస్తారు. ‘‘సోవియట్ భూమి’’ అనే పత్రిక వచ్చేది. దానిని బెంగాలీ లిపిలో ‘సోభియట్ భూమి’ అని రాసేవారు. మాట్లాడడంలో కూడా అంతే.

అయితే తమాషా ఏమిటంటే ‘భ’ అని ఎలాగూ పలుకుతాం కదాని కొందరు ఇంగ్లీషులో ‘వి’ అని రాసేస్తారు. కలకత్తాలో గోడలమీద Sova అనే బ్రాండ్‌ క్లీనింగ్ పౌడర్ ప్రకటనలు రాసేవారు. ఇదేం పేరు అనుకున్నా. తర్వాత యీ ఫార్ములా అర్థమయ్యాక ఓహో, ఇది ‘శోభా’నా? అని అర్థం చేసుకున్నాను. ప్రభాకర్ అని బెంగాలీలో రాసి, ఇంగ్లీషుకి వచ్చేసరికి, పలకడాన్ని ఆధారం చేసుకుని Provakar అని రాసేవారు కొందరు. అలాగే ఈ శుభేందు కూడా తన పేరులో భ బదులు ‘వి’ రాసుకుంటాడు. అతని పేరు శుభేందుయే. విభీషణాయంలో యీ పిడకలవేట ఎందుకని అడక్కండి. ఇంతకీ యితను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి ఎంపీ. మన్‌మోహన్ ప్రభుత్వంలో మంత్రి కూడా. సోదరులూ నాయకులే. ఇతను నందిగ్రామ్ పోరాటయోధుడిగా పేరు తెచ్చుకుని మమతకు ఆత్మీయుడయ్యాడు.

బెంగాల్ ఒకప్పుడు పరిశ్రమలకు ఆటపట్టుగా వుండేది. ఈస్టిండియా హయాంలో కలకత్తా దేశరాజధాని. రాజస్థాన్ మార్వాడీలు కలకత్తా కేంద్రంగానే వ్యాపారులుగా ఎదిగారు. స్వాతంత్ర్యం వచ్చాక కమ్యూనిస్టులు తన ప్రాబల్యం కోసం శ్రుతి మించిన కార్మిక పోరాటాలు చేసి, పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను శత్రువులుగా చూసి, వేధించి, అవమానించారు. వాళ్లు అధికారంలోకి వచ్చాక కార్మికులను అదుపులోకి తెద్దామని చూశారు కానీ అలవి కాలేదు. వాళ్లకు ప్రతిగా కాంగ్రెసు కూడా తమ అధీనంలో వున్న కార్మిక సంఘాలతో కమ్యూనిస్టు పాలన సరిగ్గా సాగకుండా చేసింది. ఈ గొడవల మధ్య క్రమేపీ పరిశ్రమలు బెంగాల్ విడిచి వెళ్లిపోయాయి. నిరుద్యోగం, సామాజిక అశాంతి ప్రబలాయి. కలకత్తా కళ తప్పింది. కానీ కమ్యూనిస్టులు తమ మొండివైఖరితో పాత విధానాలనే అంటిపెట్టుకుని వున్నారు.

చాలా దశాబ్దాల తర్వాత, జ్యోతి బసు మరణానంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన బుద్ధదేవ భట్టాచార్య తమ పారిశ్రామిక విధానం మార్చుకుని, పరిశ్రమలను ఆహ్వానించాలని చూశాడు. నిజానికి పరిశ్రమలు నెలకొనడానికి బెంగాల్‌కు ఎన్నో అవకాశాలున్నాయి. పోర్టు వుంది. పనిలో కౌశలం వుండి చౌకగా దొరికే కార్మికులున్నారు. కానీ వర్క్ కల్చర్ లేదు. సిపిఎం తన ధోరణి మార్చుకుని బెంగాల్‌కు వెలుగు తెస్తుందేమోనన్న తరుణంలో మమతా బెనర్జీ విజృంభించింది. కాంగ్రెసు నాయకుడు ఘనీఖాన్ చౌధురి రౌడీయిజానికి సరైన వారసురాలామె. కాంగ్రెసులో ఎదిగి, నాయకత్వంతో విభేదించి, వైదొలగి, తనే అధ్యక్షురాలిగా తృణమూల్ పార్టీ పెట్టుకుని, గూండాగిరీతో సిపిఎంను ఎదుర్కోసాగింది. బెంగాల్ అంతా కమ్యూనిస్టులు కాదు. ప్రజల్లో కమ్యూనిస్టు వ్యతిరేకులు చాలామంది వున్నారు. వారు గతంలో కాంగ్రెసుకు ఓటేసేవారు. తర్వాత తృణమూల్‌కు వేయసాగారు. మమత తారాబలం నందిగ్రామ్ ఆందోళనతో ఒక్కసారిగా మారింది.

అనేక రాష్ట్రాలలో సెజ్‌లు ఏర్పడుతూండగా చాలా ఆలస్యంగా 2007లో బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం తూర్పు మేదినీపూర్ (మిడ్నపూర్ అని ఇంగ్లీషులో రాస్తారు) జిల్లాలోని నందిగ్రామ్‌లో 10 వేల ఎకరాలు సేకరించి ఇండోనేసియాకు చెందిన కంపెనీ సహాయంతో కెమికల్ హబ్ పెడదామనుకుంది. మావోయిస్టులు భూసేకరణను అడ్డుకున్నారు. హింస జరిగింది. పోలీసు కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇక మమత ‘మా, మాటీ, మానుష్’ నినాదంతో నందిగ్రామ్‌ను రణరంగంగా మార్చేసింది. అక్కణ్నుంచి వరసపెట్టి ఉద్యమాలు చేసింది. సింగూర్ నుంచి టాటా ఇండికా ప్రాజెక్టును తరిమివేసింది. 34 ఏళ్లగా అవిచ్ఛిన్నంగా పాలిస్తూ వచ్చిన లెఫ్ట్ కూటమి ప్రభుత్వాన్ని 2011 ఎన్నికలలో కూలదోసి, ముఖ్యమంత్రి అయింది. ఆ నందిగ్రామ్‌లో ఆమె కుడిభుజంగా పనిచేసిన పోరాటవీరుడే అప్పటికి 36 ఏళ్ల శుభేందు. అప్పణ్నుంచి ఆమెనే అంటిపెట్టుకుని, ఆంతరంగికుడిగా వుంటూ, పార్టీని తృణమూలాల నుంచి నిర్మిస్తూ, పార్టీలో ప్రధాన స్థానాన్ని పొందాడు.

2009 పార్లమెంటు ఎన్నికలలో అతను తామ్‌లుక్ నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు లక్ష్మణ్ సేఠ్‌ను ఓడించాడు. మరో రెండేళ్లకు అసెంబ్లీ ఎన్నికలలో అతని పార్టీ నెగ్గి, అతని ప్రాధాన్యత పెరిగింది. క్రమేపీ అతను తన జిల్లాలోనే కాక మరో ఆరు జిల్లాలలో కూడా ప్రధాన నాయకుడిగా ఎదిగాడు. క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో అతను దిట్ట. ముర్షీదాబాద్‌లో కాంగ్రెసు నాయకుడు అధీర్ రంజన్ చౌధురి ప్రభావాన్ని తగ్గించగలిగాడు. ఘనీఖాన్ చౌధురి అనుయాయులందరినీ తృణమూల్‌లో చేర్పించాడు. 2019 ఎన్నికలలో మేదినీపూర్‌లో బిజెపి తడాఖా చూపించిన తర్వాత జరిగిన మూడు ఉపయెన్నికలలో తృణమూల్ నెగ్గేట్లు చేశాడు. అతని తండ్రి శిశిర్ తృణమూల్ ఎంపీ. తమ్ముడు దివ్యేందు తృణమూల్ ఎమ్మెల్యే. మరో తమ్ముడు సౌమేందు ఒక మునిసిపల్ కార్పోరేషన్‌కి చైర్మన్. ఇతను ట్రాన్స్‌పోర్ట్, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్ శాఖలకు మంత్రి. పైగా 5 జిల్లాలలో పార్టీ అబ్జర్వర్.

ఇప్పుడు బిజెపికి ఫిరాయించాడు. ఫిరాయిస్తాడన్న సంగతి రెండు నెలలుగా ఊహిస్తున్నదే. 2019 పార్లమెంటు ఎన్నికలలో కంగు తినడంతో మమత తన మేనల్లుడు, పార్టీ యూత్‌వింగ్ అధినేత, అభిషేక్ బెనర్జీ సలహాపై రాజకీయ సలహాదారుగా ప్రశాంత కిశోర్‌ను నియమించింది. అతను చెప్పే సలహాలను అభిషేక్ తుచ తప్పకుండా అమలు చేస్తున్నాడు. అవినీతి మచ్చ వున్న నాయకులను పదవుల నుంచి తప్పిస్తున్నాడు. ప్రశాంత్ సలహాలు పార్టీలో పాతకాపులకు నచ్చటం లేదు. అభిషేక్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడని, తమ ప్రాధాన్యత తగ్గిస్తున్నాడని, మమతకు చెప్పినా చూసీచూడనట్లు వుంటోందని వీరి అభియోగం. మమతకు పలుకుబడి తగ్గుతోందని అనిపిస్తున్న వాతావరణంలో బిజెపి సామదానభేద దండోపాయాలను ఉపయోగించి, ఆమె నాయకులందరినీ లాక్కుంటోంది. వీళ్లు పార్టీ విడిచి వెళుతూ తలో రాయీ వేస్తున్నారు. ఇప్పుడు శుభేందు వంతు.

నవంబరు నెలలోనే శుభేందు తూర్పు మేదినీపూర్‌లోనే కాక, కలకత్తాతో సహా దక్షిణ బెంగాలంతటా మమత బొమ్మ కానీ, తన పార్టీ జండా కానీ పెట్టకుండా సభలు నిర్వహించసాగాడు. తను కష్టపడి పార్టీలో పైకి వస్తే మరి కొందరు రక్తసంబంధం పేరు చెప్పి అడ్డదారిలో లీడర్లయిపోయారని తన ప్రసంగాల్లో విమర్శించ సాగాడు. ఇదేమిటి అనుకుంటూండగానే నవంబరు 27 న మంత్రిపదవికి రాజీనామా చేశాడు. కొత్త పార్టీ పెడతాడేమోనన్న పుకార్లు పుట్టించాడు. పార్టీ మేల్కొని అతనికి సన్నిహితంగా వుండే జిల్లా నాయకులను పదవుల్లోంచి తప్పించసాగింది. డిసెంబరు 6 న పురూలియాలో ‘దాదార్ అనుగామీ’ (అన్నగారి అనుచరులు) అనే పేరుతో ఓ కార్యాలయం వెలిసింది. ఇక లాభం లేదని మమత తూర్పు మేదినీపూర్‌లో పెద్ద ర్యాలీ నిర్వహించి ‘తృణమూల్‌ను బ్లాక్‌మెయిల్ చేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే నిప్పుతో చెలగాడమాడినట్లే’ అని తన ఉపన్యాసంలో హెచ్చరించింది. ఆ సభకు శుభేందు కుటుంబసభ్యులెవరూ రాలేదు.

డిసెంబరు 16న శుభేందు తన లెజిస్లేటర్ పదవికి రాజీనామా చేశాడు. మూడు రోజుల తర్వాత పశ్చిమ మేదినీపూర్‌లో పెద్ద సభ పెట్టి బిజెపిలో చేరాడు. దానికి అమిత్ షా హాజరయ్యాడు. మొన్నటిదాకా బిజెపిని నానా తిట్లూ తిట్టిన శుభేందు ఆ రోజు అమిత్‌కు పాదాభివందనం చేసి, అన్నగారిగా సంబోధించాడు. బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ‘నేను పెత్తనం చలాయించడానికి రాలేదు. కార్యకర్తగా వచ్చాను. పార్టీ నన్ను పోస్టర్లు అంటించమంటే అంటిస్తాను.’ అని చెప్పుకున్నాడు. అవేళ శుభేందుతో బాటు ఆరుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెసుల నుంచి తలా ఒక ఎమ్మెల్యే కూడా బిజెపిలోకి మారారు. పార్టీనిర్మాణంలో దిట్ట అయిన శుభేందు దొరకడం తమ వలలో పెద్ద తిమింగలం పడినట్లే అని బిజెపి నాయకత్వం అనుకుంటోంది.

2014 నాటి నారదా స్కామ్‌లో శుభేందు కూడా నిందితుడే. అతను లంచం తీసుకుంటూన్నట్లు కెమెరాలో రికార్డయింది. బిజెపిలోకి ఫిరాయించడంలో సీనియరైన ముకుల్ రాయ్ కూడా ఆ కేసులో నిందితుడే. ఎటొచ్చీ అతను స్వయంగా తీసుకోకుండా ఎవరెవరికి యివ్వాలో చెప్తూండగా రికార్డయింది. సిబిఐ ఆ విషయమై వాళ్లిద్దరినీ చాలా ఏళ్లగా ప్రశ్నిస్తోంది కూడా. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి యీ విషయమై చాలా యాగీ చేసింది. తమాషా ఏమిటంటే ఆరేళ్లయినా సిబిఐ యిప్పటికి కూడా చార్జి షీట్లు ఫైల్ చేయలేదు. నారదా కేసుతో పాటు శుభేందుపై హల్దియా డెవలప్‌మెంట్ అథారిటీకి అధినేతగా వుండగా భూమి కబ్జా చేసిన కేసు కూడా వుంది.

ఇప్పుడు బిజెపి అనే గంగలో మునగడం చేత మన సుజనా చౌదరి, సిఎం రమేశ్‌ల వలె అతను కూడా పునీతుడై పోయాడు. బిజెపి నాయకుల నడిగితే చట్టం తన పని తను చేసుకుని పోతుంది అని జవాబిస్తారు. కానీ ఆ పనేదో ఎప్పుడు చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ పార్టీలో వున్నంతకాలం ‘శ్రీరామ’రక్ష వుంటుంది. తృణమూల్ నుంచి బిజెపికి చాలామంది ఫిరాయిస్తున్నారు. తక్కిన వారి సంగతి, వారి రాకపై బిజెపి కార్యకర్తలలో చెలరేగుతున్న కలవరం గురించి, మమతను కేసుల్లో బిగించి, ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎన్నికలకు ముందే రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి రాబోయే వ్యాసాలలో..

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×