Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: తమిళనాడులో బిజెపి సందడి

ఎమ్బీయస్: తమిళనాడులో బిజెపి సందడి

తమిళనాడులో 2021 మేలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో మోదీ హవా ఉధృతంగా వీచినా తమిళనాడులో పూర్తిగా చతికిలపడింది. 

ఎన్‌డిఏ పతాకాన బిజెపి, ఎడిఎంకె, రాందాస్ పార్టీ, విజయకాంత్ పార్టీ, మరో మూడు పార్టీలు కలిసి పోటీ చేయగా 39 స్థానాల్లో ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఎడిఎంకెకు గెలుపు లభించింది, అది కూడా ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కొడుకుకి! తక్కిన 38 స్థానాలలో డిఎంకె పార్టీ ఆధ్వర్యంలోని యుపిఏ విజయకేతనం ఎగరేసింది. 

సాధారణంగా పార్లమెంటు ఎన్నికలలో మోదీని చూసి బిజెపికి, రాష్ట్ర ఎన్నికలలో ప్రాంతీయ పార్టీకి, లేదా స్థానికంగా బలమైన నాయకుడికి ఓటేయడం రివాజుగా వుంది. తమిళనాడు విషయంలో పార్లమెంటు ఎన్నికలలో కూడా మోదీ హవా పనికి రాలేదు.

ఇక అసెంబ్లీకి వచ్చేసరికి ప్రాంతీయాభిమానంతో డిఎంకెకు ఓటేస్తారేమోనన్న శంక బిజెపిని సతాయిస్తోంది. ఎడిఎంకె కూడా ప్రాంతీయ పార్టీయే అయినా, అది బిజెపితో అంటకాగుతోందని అందరికీ తెలుసు. అందువలన డిఎంకె కూటమికి ప్రతిగా దాన్ని నిలబెట్టాలని బిజెపి సకలయత్నాలు చేస్తోంది.

జయలలిత మరణానంతరం రాష్ట్రంలో తనకంటూ స్థానం సంపాదించవచ్చని బిజెపిలో ఆశలు చిగురించాయి. కానీ చాలా యిబ్బందులు వచ్చాయి. జయలలిత వారసురాలిగా శశికళ ఎదగబోయింది. అంతలో కోర్టు ఆమెను జైలుకి పంపించింది. దాంతో ఆమె ముఖ్యమంత్రిగా నియమించిన పళనిస్వామి బిజెపివైపు మొగ్గాడు. అతనికి ప్రత్యర్థిగా వున్న పన్నీరుసెల్వం పార్టీని చీలుస్తాడని భయపడ్డారు. 

కానీ బిజెపి మధ్యవర్తిత్వం నెరపి, పన్నీరుసెల్వాన్ని ఉపముఖ్యమంత్రి పదవికి ఒప్పించింది. దీంతో తమ ప్రాముఖ్యత బొత్తిగా పోతుందని భయపడిన శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీని చీల్చబోయి, సాధ్యపడక విడిగా ‘అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం’ (ఎఎమ్ఎమ్‌కె) అనే పేర పార్టీ పెట్టుకుని పార్టీ వదిలి ఎవరైనా రాకపోతారా అని చూస్తున్నాడు.

పళనిస్వామి పాలన మరీ అంత అద్భుతంగా లేకపోయినా, ఫర్వాలేదన్న స్థాయిలో నడుస్తూ వస్తోంది. ఫైళ్లు త్వరగా కదులుతున్నాయి. రోడ్లు వేయించడాలు, కాలువల్లో పూడికలు తీయించడాలు, కరోనా సమయంలో పరీక్షలు పెద్ద ఎత్తున చేయించడాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ వగైరాలలో పనితీరు బాగానే వుందిట. అట్టహాసాలేమీ లేకుండా ప్రజల్లోకి బాగా వెళుతూ, బాగానే పేరు తెచ్చుకుంటున్నాడు. అవినీతి జరుగుతోందని అంటున్నారు కానీ భారీ కుంభకోణాలేవీ యిప్పటిదాకా బయటపడలేదు. 

తను ఎదగడంతో బాటు, పన్నీరుసెల్వం ప్రాముఖ్యతను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చాడు. వాళ్లిద్దరి మధ్య ఏవైనా పేచీలు వస్తే 11 మంది సభ్యుల కమిటీ తీర్చాలని ఒప్పందం కుదిరింది. ఇప్పటిదాకా ఆ కమిటీని కూర్చనేలేదు. ఇలా నడుస్తూవుండగా 2019 ఎన్నికలలో తిరుగులేని దెబ్బ తగిలింది. ప్రతిపక్ష డిఎంకె విజయదుందుభి మోగించడంతో, యీసారి మళ్లీ గెలుస్తామా లేదాని ఎడిఎంకె కార్యకర్తల్లో భయం పట్టుకుంది.

ఎందుకంటే యిప్పటికే పదేళ్లగా ఎడిఎంకె అధికారంలో వుండి ఎంతోకొంత ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుని వుంది. వరుసగా మూడోసారి గెలవడమంటే ఎంజీఆర్‌కు తప్ప వేరెవరికీ సాధ్యపడలేదు. పైగా ఇప్పుడు జయలలిత వంటి కరిజ్మా వున్న నేత ఎవరూ లేరు. అటు స్టాలిన్ డిఎంకెలో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నాడు. కరుణానిధి మరణానంతరం అళగిరి, స్టాలిన్ కలహించుకుని పార్టీ చీలిపోతుం దనుకున్నారు కానీ అలా జరగలేదు. 

పరిపాలనాదక్షుడిగా పేరుబడిన స్టాలిన్‌కు కొడుకు ఉదయనిధి, అల్లుడు శబరీశన్ అండగా నిలబడి పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. 2016 ఎన్నికలలో అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చి వుంటే డిఎంకె నెగ్గేదని, అప్పటికే 92 ఏళ్ల వృద్ధుడై, కదలడానికి కూడా కష్టంగా వున్న కరుణానిధిని ముందు పెట్టడంతో డిఎంకె ఓడిపోయిందని అనుకున్నారు. 

అన్నిటికంటె ముఖ్యంగా ప్రాంతీయవాదమంటే తమిళులు పడిచస్తారు. దాన్ని డిఎంకె వినిపించినంత దృఢంగా ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బిజెపితో చేతులు కలిపిన ఎడిఎంకె వినిపించలేదు. తమిళనాడులో మైనారిటీ ఓటు 7 శాతం వుంది. వారిలో ధనికులూ ఉన్నారు. బిజెపితో మమేకమైతే, ఆ ఓటు మొత్తం డిఎంకెకు పోవచ్చని భయముంది.

ఎడిఎంకె రాజ్యసభలో బిజెపికి సకల విధాలా సహకరిస్తోంది. వివాదాస్పదమైన సిఏఏ, వ్యవసాయ బిల్లులు, నూతన విద్యావిధానంతో సహా దేనినీ ప్రతిఘటించటం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. బిజెపి హిందీకి యిస్తున్న ప్రాముఖ్యత కూడా తమిళులకు రుచించే విషయం కాదు. 

ఇటీవల పళనిస్వామి తల్లి చనిపోతే అమిత్ షా సంతాపసందేశాన్ని దేవనాగరిలో పంపించారు. డిఎంకె దాన్ని ఎత్తి చూపింది. ఈ విమర్శలు తట్టుకోలేక తమిళనాడు ప్రభుత్వంలో కాబినెట్‌లో త్రిభాషా సూత్రానికి, నీట్‌కు అభ్యంతరం తెలుపుతూ తీర్మానం చేసింది. ఏం చేసినా, బిజెపిని దాటి ఎడిఎంకె వెళ్లలేదన్నది లోకవిదితం. బిజెపికి కూడా అది తప్ప దిక్కు లేదు. రజనీకాంత్‌ను కొన్నాళ్లు దువ్వి చూశారు కానీ అతను ఎటూ తేల్చడు. పైగా అనారోగ్యం.

ఇలాటి పరిస్థితుల్లో ఎడిఎంకె బలంగా వుండడమే బిజెపికి కావాలి. ముఖ్యనాయకులిద్దరి మధ్య తగాదా రావడంతో అది యిబ్బంది పడింది. గతంలో అయితే జయలలిత వుండేది కాబట్టి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న వచ్చేదే కాదు. 

ఇప్పుడు ఎవరు అనేది ప్రజలకూ అనుమానం వస్తుంది కాబట్టి, ముందుగానే పళనిస్వామియే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నికలకు వెళదాం అని అతని అనుచర మంత్రులు ఆగస్టులో ప్రతిపాదించారు. అదేమీ అక్కరలేదు, ఎన్నికల ఫలితాలు వచ్చాక నెగ్గిన ఎమ్మెల్యేల అభీష్టం బట్టి చేద్దాం అని పన్నీరుసెల్వం అనుచరులు అడ్డుకొట్టారు. దీని వెనుక కుట్ర కనబడింది, పళనిస్వామికి.

ఎందుకంటే శశికళ జనవరి నెలాఖరు కల్లా జైలు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆమెకు ఎడిఎంకె పార్టీలో ప్రతి నాయకుడి జాతకం కంఠస్తం. ఎవరి లోపాలేమిటో తెలుసు కాబట్టి బ్లాక్‌మెయిల్ చేసి, తన వ్యతిరేకులను ఎలాగోలా ఓడించగలదు. పైగా ఆమె వద్ద పుష్కలంగా డబ్బుంది. ఇన్‌కమ్‌టాక్స్ శాఖ, ఇడి ఎన్ని ఆస్తులు ఎటాచ్ చేసినా, బినామీల పేర పెట్టిన ఆస్తులింకా వున్నాయి. 

అందువలన తనకు అనుకూలంగా వుండే అభ్యర్థులకు ఆమె నిధులు సమకూర్చగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో పళనిస్వామి కానీ పన్నీరుసెల్వం కానీ ఆ స్థితిలో లేరు. అందువలన శశికళ మద్దతున్న అభ్యర్థికే ప్రాధాన్యత వుంటుందని సులభంగా వూహించవచ్చు. పళనిస్వామి శశికళతో వేరు పడ్డాక, పన్నీరుసెల్వం ‘మీదీమాదీ దేవర్ కులమే’ అంటూ శశికళకు సన్నిహితమయ్యాడు. ఆ ధైర్యంతో పశనిస్వామితో జట్టీకి దిగాడు. పళనిస్వామిది, అతని ముఖ్య అనుచరులదీ గౌండర్ కులం.

ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో పార్టీ ప్రముఖులు పూనుకుని అక్టోబరులో సయోధ్య సమావేశం ఏర్పరచారు. కానీ అక్కడ యిద్దరూ బహిరంగంగా కాట్లాడుకున్నారు. ‘నిన్ను శశికళ నియమించగా, నన్ను సాక్షాత్తూ అమ్మే (జయలలిత) నియమించింది.’ అన్నాడు పన్నీరుసెల్వం. 

జయలలిత కేసుల్లో యిరుక్కుని జైలుకి వెళ్లినప్పుడల్లా అతన్ని కీలుబొమ్మగా పెట్టి వెళ్లేది. ‘నిన్నూ, నన్నూ ఎంపిక చేసింది శశికళే లేవోయ్’ అన్నాడు పళనిస్వామి. ఇద్దర్నీ విడిగా ఓ గదిలో కూర్చుని మాట్లాడుకోమన్నా వినకుండా బహిరంగంగా పోట్లాడుకున్నారు. ఈ తగాదా ముదిరితే కష్టమని పార్టీ ముఖ్యులే కాక, బిజెపి కూడా అనుకుంది.

ఎందుకంటే నాయకత్వ సమస్యపై వీరిలో ఎవరు పార్టీ వదిలి విడిగా వెళ్లినా ఎన్నికల కమిషన్ పార్టీ ఎన్నికల చిహ్నమైన రెండాకులను స్తంభింప చేస్తుంది. ఎంజీఆర్ మరణానంతరం అదే జరిగింది. అప్పుడు ఓటర్లు తమకు చిరపరిచితమైన గుర్తు కనబడక డిఎంకెకు ఓటేశారు. డిఎంకె అధికారంలోకి వచ్చింది. మళ్లీ అలాటిది జరగకుండా రాజీ పడమని బిజెపి యిద్దరికీ చెప్పింది. 

చివరకు స్టీరింగు కమిటీ ఏర్పాటు చేసి పశనిసామి తాలూకు ఆరుగుర్ని, పన్నీరుసెల్వం తాలూకు 5గుర్ని సభ్యులుగా వేశారు. పన్నీరుసెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని ఒప్పుకుని ప్రకటన చేశాడు. కానీ టిక్కెట్ల పంపిణీ వద్ద మళ్లీ గొడవ రావచ్చు.

ఇప్పుడు ఏం ఒప్పుకున్నా తన వర్గీయులు ఎక్కువమంది గెలిస్తే అప్పుడు తిరగతోడవచ్చనే ఆలోచనతో యిరు వర్గాలూ తమ తరఫు వాళ్లకి టిక్కెట్లు ఎక్కువ కావాలంటారు. టిక్కెట్లు  దక్కనివారికి పిలిచి, పీట వేయడానికి అవతల దినకరన్ రెడీగా వున్నాడు. వాళ్లకు నిధులు సమకూర్చడానికి శశికళ సిద్ధంగా వుంది.

ఈ పరిస్థితిలో ఎడిఎంకె ఓటు బ్యాంకు మూడు ముక్కలైతే అప్పుడూ డిఎంకె లాభపడుతుంది. అది నివారించే ప్రయత్నంలో బిజెపి శశికళను మళ్లీ యింకో కేసులో జైలుకి పంపవచ్చు. ఆ ప్రమాదం వుందని భయపడి, దినకరన్ బిజెపితో బేరసారాలు మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. సెప్టెంబరు 20న ఒక చార్టర్‌డ్ ఫ్లయిట్‌లో దిల్లీ వెళ్లి అక్కడ ఒక ప్రముఖ ఆరెస్సెస్ నాయకుణ్ని కలిసి ప్రతిపాదనలు చేశాడని, తద్వారా బిజెపిని అనుకూలం చేసుకున్నాడనీ అంటున్నారు. 

ఇదే కనుక నిజమైతే డిఎంకె వ్యతిరేక కూటమిలో పళనిస్వామి వర్గం, పన్నీరుసెల్వం వర్గం, శశికళ వర్గం, బిజెపిలతో పాటు మూడో, నాలుగో చిన్న పార్టీలు కూడా వుంటాయి. ఇన్నిటి మధ్య తమ ప్రాధాన్యత నిలుపుకుని, ఎక్కువ (కనీసం 50 అంటున్నారు) సీట్లు అడగాలంటే బిజెపికి తాము కూడా తమిళనాడులో పెద్ద పార్టీ అని చూపుకోవాలి. అందువలన ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ కాస్త సందడి చేస్తోంది.

మొన్న వినాయకచవితికి తమిళనాడులో నిమజ్జన కార్యక్రమాలు చేపడతామని తలపెట్టింది. నిజానికి గతంలో దక్షిణాదిన, మహారాష్ట్రలో కూడా గణపతి నవరాత్రులు జరిపేవారు కానీ సామూహిక నిమజ్జనాలు వుండేవి కావు. స్వాతంత్ర్యపోరాట సమయంలో బాలగంగాధర టిళక్ (మనం తిలక్ అంటాం) మతం పేర జనాలను సమీకరించడానికి సామూహిక నిమజ్జనం, తత్సందర్భంగా పెద్ద ఊరేగింపు డిజైన్ చేశారు. అప్పణ్నుంచి ఆ సంప్రదాయం మహారాష్ట్రలో ప్రారంభమైంది. 

1970లలో హైదరాబాదులో ఆరెస్సెస్ వారు ప్రారంభించారు. పోనుపోను అది పెద్ద ఈవెంట్‌గా మారిపోయి, మతకల్లోలాలకు దారి తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అల్లర్లు జరగకపోయినా, కొన్ని చోట్ల టెన్షన్‌లు తప్పటం లేదు. ప్రతి వినాయక చవితికి జలాశయాలను కలుషితం చేయకూడదంటూ కోర్టు ఆదేశాలివ్వడం, ఎవ్వరూ వాటిని ఖాతరు చేయకపోవడం, హుస్సేన్ సాగర్‌ పేరును వినాయకసాగర్‌గా మార్చాలని డిమాండ్ చేయడం రివాజైంది. తక్కిన రోజుల్లో హిందూ సెంటిమెంటు ఎలా వున్నా ఈ నిమజ్జనం జరిగే మూడు రోజులూ మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడుంది.

ఈ ఫార్ములాను ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు (అక్కడ హిందూ మున్నణి) తమిళనాడులో అమలు చేయదలచాయి. అక్కడ యీసారి వీధివీధినా మండపాలు పెట్టి, దగ్గరున్న జలాశయాల్లో నిమజ్జనం చేస్తామని పట్టుబట్టాయి. అసలే తమిళనాడులో నీటి కొరత ఎక్కువ. పైగా యిది కరోనా సమయం. 

మండపాల్లో జనాలు గుమిగూడవచ్చు. వద్దంది ప్రభుత్వం. ఆగస్టు 17న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్, మున్నణి అధ్యక్షుడు సుబ్రమణియన్ ముఖ్యమంత్రిని కలిసి ఊరేగింపులో సామాజిక దూరం పాటిస్తామని, నిషేధం ఎత్తివేయాలనీ కోరారు. అతను ఒప్పుకోలేదు. 

మేం లక్షన్నర ప్రతిమలు పెడతాం అని వీళ్లు ప్రతిజ్ఞ చేసి, కోయంబత్తూరులో కొన్ని పెట్టారు కూడా. కానీ కోవిడ్ భయంతో జనాలు రాలేదు. కొందరు ఛోటా నాయకులు ప్రదర్శనలు చేయబోయారు. బిజెపితో ఎంత సఖ్యత వున్నా, అరెస్టులు చేయించింది ప్రభుత్వం కానీ దానికి విశేష ప్రచారాన్ని కల్పించలేదు.

కొంతకాలం ఓపిక పట్టి యిప్పుడు మళ్లీ ‘వెట్రివేల్ యాత్ర’ (విజయశూల యాత్ర) ఉద్యమం మొదలుపెట్టింది బిజెపి. తమిళుల ప్రధానదైవమైన కుమారస్వామి (మురుగన్) శూలాయుధపాణి. ఆయన ముఖ్యదేవాలయాలు రాష్ట్రంలో ఆరున్నాయి. యాత్రగా బయలుదేరి ఆ ఆరింటిని నెల్లాళ్లలో చుట్టబెడతాం అని బిజెపి ప్రతిపాదించింది. 

ఓ పక్క కోవిడ్ విపరీతంగా వ్యాపిస్తూండగా, తమిళనాడు తీవ్రప్రభావిత రాష్ట్రాలలో వుండగా యిదేమిటి అన్నాడు ముఖ్యమంత్రి. బార్లు, స్కూళ్లు తెరవగా లేనిది, దీనికి వచ్చిందా? మేం తమిళులం, ఆయన తమిళదేవుడు, యిది తమిళ సంప్రదాయం, కాబట్టి చేసి తీరతాం అంటున్నాయి సంఘాలు.

గత ఏడాది యిలాటి యాత్ర చేపట్టిన దాఖలాలు లేవు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ యిలాటి ఐడియాలు వస్తూంటాయి. ప్రభుత్వం యీ యాత్రలు నిషేధించింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించలేము’ అని కోర్టుకు నివేదించింది కూడా. ‘నీ అనుమతి ఎవడికి కావాలి? మురుగనే అనుమతించాడు’ అన్నాడు బిజెపి తమిళనాడు అధ్యక్షుడు ఎల్. మురుగన్, రజనీకాంత్ స్టయిల్లో.  మేం ఆందోళన చేపట్టాం, 

ఇదిగో ఉత్తర తమిళనాడులోని తిరుత్తణికి ప్రయాణమయ్యాం. దక్షిణ తమిళనాడులోని తిరుచెందూరు చేరేదాకా ఆగం.’ అన్నాడు మరో నాయకుడు ఎచ్ రాజా. కొందరు మొదలుపెట్టి అరెస్టయ్యారు. పోనుపోను యిలాటివి ఎన్ని వస్తాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?