Advertisement

Advertisement

indiaclicks

Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సిబిఐ - అ-ఆల రగడ

ఎమ్బీయస్‌: సిబిఐ - అ-ఆల రగడ

సిబిఐ యిన్నాళ్లూ కడిగిన ముత్యంలా ఉంది, యిప్పుడే భ్రష్టుపట్టి పోయింది అని ఎవరైనా చెపితే నవ్వి వూరుకోండి తప్ప నమ్మకండి. సిబిఐ చాలా సామర్థ్యంతో అనేక కేసులు పరిష్కరించిన మాట వాస్తవమే అయినా, అది ప్రభుత్వం చెప్పుచేతల్లోనే పని చేస్తుందనేది మర్చిపోకూడదు.

రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే స్టేటు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని, తన ప్రత్యర్థులపై ఆరాలు తీయించి, కేసులు పెట్టించి అవస్థల పాలు చేస్తుందో కేంద్రం అదే విధంగా సిబిఐను ఉపయోగించుకుంటుంది. తమకు కావలసినప్పుడు పరుగులు పెట్టిస్తుంది, వద్దనుకున్నపుడు బ్రేకులు వేస్తుంది. జనరల్‌గా యిది రూలయినా, అన్ని ప్రభుత్వాలూ ఒకేలా ఉండవు. కాస్త ఎక్కువతక్కువలు ఉంటాయి.

1990ల నుంచి సిబిఐలో రాజకీయ జోక్యం పెరిగిందంటారు. ఎన్ని భీషణ ప్రతిజ్ఞలు చేసినా మోదీ పాలనలో కూడా సిబిఐను పంజరంలో చిలుక గానే ఉంచారు తప్ప, స్వేచ్ఛగా పని చేయనీయటం లేదని తాజా పరిణామాలు చాటి చెప్తున్నాయి.

ఇక సిబిఐలో అంతర్గతమైన పోరు గురించి చెప్పాలంటే అది ఏ వ్యవస్థలోనైనా ఉంటుంది. సిబిఐలో కూడా గతంలో ఉంది కాబట్టే దాని డైరక్టర్లు కొందరు పట్టుబడ్డారు. అయితే యీసారి చాలా అసహ్యకరంగా బయటపడ్డారు. దీనికి కారణం ప్రధాని కార్యాలయం ఆస్థానా పట్ల చూపిన వలపక్షం! అలోక్‌ కూడా అజిత్‌ దోవల్‌ తాలూకు వ్యక్తే అయినా ఆస్థానా పరమాప్తుడు కావడంతో, ఎలాగైనా అతన్ని డైరక్టరు చేయాలని చూడడంతో వచ్చింది గొడవ. అలోక్‌ వర్మ సర్దుకుని పోకుండా తిరగబడ్డాడు. ఈ రచ్చ కారణంగా సిబిఐ, ఈడీ, రా, సివిసి వంటి వ్యవస్థలన్నిటికీ మకిలి పట్టిందని చాటి చెప్పినట్లయింది.

సిబిఐలో నెం.1గా ఉన్నది డైరక్టరు అలోక్‌ వర్మ. నెం.2గా ఉన్నది స్పెషల్‌ డైరక్టరు రాకేశ్‌ ఆస్థానా. ఈ అ(లోక్‌), ఆ(స్థానా)ల మధ్య గొడవ యిప్పుడు బయటకు వచ్చింది కానీ అలోక్‌ డైరక్టరుగా చేరిన దగ్గర్నుంచే అగ్గి రాజుకుంది. దాని గురించి 'ఆస్థానా' వ్యాసంలో రాశాను.

2016 అక్టోబరులో సిబిఐలోకి ఆస్థానా అడుగు పెట్టేనాటికే, అక్కడ ఎకె శర్మ ఉన్నాడు. ఇద్దరూ గుజరాత్‌ కేడర్‌కు చెందినవారే, మోదీకి, అమిత్‌ షాకు యిష్టులే. అయినా ఇద్దరికీ పడదు. శర్మ గుజరాత్‌ పోలీసు శాఖలో యింటెలిజెన్సు విభాగానికి అధిపతిగా పని చేశాడు. ఇష్రత్‌ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కున్నాడు. మోదీ ప్రధాని అయ్యాక శర్మను 2015 ఏప్రిల్‌లో సిబిఐకు రప్పించాడు. అయితే ఆస్థానా రావడం రావడమే పెద్ద పోస్టులో వచ్చాడు. మోదీ కృపతో తాత్కాలిక డైరక్టరు కూడా అయిపోయాడు. ఆ నెలన్నర సమయంలోనే శర్మకు జెల్ల కొట్టాడు. సిబిఐలో జాయింటు డైరక్టరు (పాలసీ) పోస్టు ఉంది. సిబిఐ విదేశాల్లో జరిగే విజిలెన్సు కూడా దాని పరిధిలోకి వస్తుంది కాబట్టి శర్మ ఆ పోస్టుకి ఆశపడ్డాడు. కానీ ఆస్థానా అతని అభ్యర్థన తిరస్కరించాడు. శర్మ ప్రార్థనలు ఫలించి ఆస్థానా గద్దె దిగి, అలోక్‌ నెం.1గా వచ్చాడు. 

దిల్లీ పోలీసు కమిషనరుగా ఉన్న అలోక్‌ డైరక్టరుగా వచ్చాక సిబిఐలో ఆస్థానా పెత్తనం చూసి, తన బలగం పెంచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడు. 2017 జూన్‌లో తన కిష్టులైన నలుగుర్ని జాయింటు డైరక్టర్లను వేసుకోబోయాడు. వాళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీి) లో జాయింటు డైరక్టరుగా పని చేస్తున్న రాజేశ్వర్‌ సింగ్‌ సోదరి, తోడల్లుడు ఉన్నారు. కానీ ఆస్థానా పిఎంఓలో తన కున్న పలుకుబడితో దాన్ని ఆపించాడు. వాళ్ల నిజాయితీని శంకిస్తున్నానన్నాడు. రాజేశ్వర్‌ సింగ్‌ చిదంబరం యిరుక్కున్న ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ స్కాముపై విచారణ జరుపుతున్నాడు. అతను అలోక్‌వైపు మొగ్గు చూపుతున్నాడని ఆస్థానాకు సందేహం కలిగింది.  జులై కల్లా 'రా' రిపోర్టు ఒకటి బయటకు వచ్చింది - రాజేశ్వర్‌ సింగ్‌ ఒక ఐఎస్‌ఐ ఏజంటుతో టచ్‌లో ఉన్నాడని! 

2 జి స్కాములో డబ్బు ఎలా చేతులు మారిందో ఆచూకీ పట్టుకున్నవాడు రాజేశ్వర్‌. దానికి గాను అతనికి చాలా పేరు వచ్చింది. అతన్ని ఆ డిపార్టుమెంటులోంచి తప్పిద్దామని చాలా మంది లాబీయుస్టులు ప్రయత్నించారు కానీ అతని ఈడీ చీఫ్‌ ఆశీస్సులున్నాయి. అతని మీద యీ నివేదిక రావడానికి సహకరించినవాడు 'రా' లో నెంబరు 4 పదవిలో ఉండి, తదుపరి చీఫ్‌ అయ్యే అవకాశాలున్న సామంత్‌ గోయెల్‌ కావచ్చు. ఎందుకంటే అతను ఆస్థానాకు ఆత్మీయుడు. మాజీ 'రా' ఆఫీసరు బంధువు ద్వారా అతను ఆస్థానాకు లంచం యిప్పించాడని ప్రస్తుతం అభియోగం ఎదుర్కుంటున్నాడు. తను ప్రతిపాదించిన వాళ్లు జాయింటు డైరక్టర్లు కాలేకపోవడంతో ఒళ్లు మండిన అలోక్‌, నెం.4గా ఉన్న శర్మను పట్టుకుని వచ్చి జాయింటు డైరక్టరు (పాలసీ)గా వేసేశాడు. ఇక అప్పణ్నుంచి శర్మ అలోక్‌కు వీరభక్త హనుమాన్‌ అయిపోయి, ఆస్థానాకు వ్యతిరేకంగా వ్యవహరించసాగాడు. 

2017 అక్టోబరులో ఆస్థానాను సిబిఐ స్పెషల్‌ డైరక్టరుగా వేద్దామనుకున్నపుడు అలోక్‌ ఎంత అడ్డుపడాలో అంతా అడ్డుపడ్డాడు. సెలక్షన్‌ కమిటీలో సివిసి, యిద్దరు విజిలెన్సు కమిషనర్లు, హోం సెక్రటరీ, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పెర్శనెల్‌ అండ్‌ ట్రైనింగ్‌లో సెక్రటరీ ఉన్నారు. ఆస్థానా నిజాయితీపై సందేహాలున్నాయంటూ అలోక్‌ ఒక రహస్య నోట్‌ తయారుచేసి అక్టోబరు 21న కమిటీకి అందించాడు. దానిలో స్టెర్లింగ్‌ బయోటెక్‌ వారి డైరీలో ఆర్‌ఏ పేర ఉన్న ఎంట్రీలు అవీ ఆధారంగా చూపించాడు. అయితే సివిసి 'ఆర్‌ఏ అంటే రాకేశ్‌ ఆస్థానా అనే అనుకున్నా, ఆ రాకేశ్‌ ఆస్థానా, యితనూ ఒకడే అని గ్యారంటీ ఏముంది? దానికేమైనా ఆధారముందా?' అని వాదించి యీ నోట్‌ను తిరస్కరించి, ఆస్థానాకు ప్రమోషన్‌ యిచ్చేసింది. 

ఈ వ్యవహారంపై 'కామన్‌ కాజ్‌' అనే ఎన్‌జిఓ సుప్రీం కోర్టుకి వెళ్లింది. వాళ్లూ 'ఇద్దరు రాకేశ్‌ ఆస్థానాలున్నారేమో' అంటూ అతని నియామకాన్ని సమర్థించారు. రెండోవాడు ఎవరై ఉంటారో కనుక్కోండి అని ఆదేశమూ యివ్వలేదు, అది  తేలేదాకా యితన్ని ఆపండి అని అననూ లేదు. అందుచేత ఆస్థానా స్పెషల్‌ డైరక్టరు అయి కూర్చున్నాడు. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి అబద్ధం చెప్పింది. 2017 నవంబరు 24 నాటి తన ఓరల్‌ సబ్మిషన్‌ (మౌఖిక నివేదన)లో అలోక్‌ వర్మ తనే స్వయంగా అస్థానా పేరును ప్రతిపాదించాడని చెప్పింది. అప్పుడు మౌనంగా ఉండిపోయిన అలోక్‌ యిప్పుడు 10 నెలల తర్వాత ముందుకు వచ్చి 'నేనతని పేరు ప్రతిపాదించక పోగా అతనికి వ్యతిరేకంగా రహస్య నోటు సివిసికి పంపాను' అని కోర్టుకి చెప్పాడు. 

ప్రభుత్వం తనకు సంపూర్ణ మద్దతిస్తోందని రూఢి చేసుకున్న ఆస్థానా అంతటితో ఆగలేదు. తనకు అడ్డుపడినందుకు అలోక్‌పై పగ బట్టాడు. దానికి సివిసి సహకరించింది. తను చిత్తుకాగితంగా తీసిపారేసిన సీక్రెట్‌ నోట్‌ అసలెలా తయారైంది, అది ఎవరు రాశారు. దానికి మూలం ఏమిటి? అంటూ అలోక్‌ను నిలదీయడం మొదలుపెట్టింది. 2017 నవంబరు 9న యివి ఆరా తీస్తూ ఉత్తరం రాసింది. దీని మీద సిబిఐలో అంతర్గతంగా విచారణ జరిపిస్తున్నారా, మీ దగ్గరున్న డాక్యుమెంట్లు మాకు పంపండి అంటూ  రాసింది.  అలోక్‌ సమాధాన మివ్వలేదు. 'ఆస్థానా నెంబరు 2 స్థానంలో ఉండగా అతనిపై నిష్పక్షపాత విచారణ జరగడం అసాధ్యం, పైగా తన నోట్‌కు విలువ నివ్వని సివిసి, దరిమిలా డాక్యుమెంట్లు తనకు యివ్వమనడం అర్థరహితం' అనుకున్న అలోక్‌ సివిసిని పట్టించుకోలేదు. ఇప్పుడు సివిసి పూర్తిగా ఆస్థానా పక్షమే వహిస్తోంది. 

2018 జులైలో సిబిఐలో ప్రమోషన్ల గురించి సివిసి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. దానికి సిబిఐ డైరక్టరు హాజరు కావలసి వుంది. కానీ అలోక్‌ ఉరుగ్వే పర్యటనలో ఉన్నాడు. అందువలన ఆస్థానాను పిలుస్తామని సివిసి ప్రతిపాదించింది. తన వర్గీయులకు పదోన్నతి యివ్వకుండా తొక్కేయడానికి జరుగుతున్న ప్రయత్నమిది అని భావించడం చేతనో ఏమో 'నా తరఫున అతను ప్రాతినిథ్యం వహించడానికి వీలు లేదు ఎందుకంటే స్టెర్లింగ్‌ బయోటెక్‌ కేసులో అతనిపై విచారణ సాగుతూనే ఉంది. నేను లేకుండా సిబిఐలో బదిలీలు, ప్రమోషన్లు ఎలా చేస్తారు?' అని అలోక్‌ సివిసికి లేఖ పంపించాడు. ఇది మీడియాకు లీకైంది. ఆస్థానా తల కొట్టేనట్లయింది. సమావేశం వాయిదా పడింది. మళ్లీ జరిగిందో లేదో తెలియదు. ఇక ఆస్థానా అలోక్‌ను ఏదైనా కేసులో యిరికించాలని గట్టిగా తలపెట్టాడు. దానికి ప్రతిస్పందనగా అలోక్‌ కూడా అలాగే ఆలోచించాడు. ఇద్దరికీ దొరికినది ఒకే కేసు - సానా సతీశ్‌ బాబు! దాన్ని తాము వాడుకోకపోతే ఎదుటివాళ్లు వాడేసుకుంటారేమోనని యిద్దరూ అడావుడి పడిపోయారు. సానా సతీశ్‌ కేసు గురించి తెలియాలంటే ఖురేషీ గురించి, అతనికి సిబిఐకు ఉన్న లింకుల గురించి తెలియాలి. 

మొయిన్‌ ఖురేషీ యుపికి చెందినవాడు. మాంసం ఎగుమతులు చేసే వ్యాపారి. తర్వాత అనేక వ్యాపారాలు చేశాడు. సిబిఐలోని ఉన్నతాధికారులతో సంబంధాలు మేన్‌టేన్‌ చేస్తూ దళారీగా పని చేశాడు. ఎవరిపైనైనా సిబిఐ ఎంక్వయిరీ చేస్తోందంటే వాళ్లు ఖురేషీని కలిస్తే వాళ్లిచ్చిన లంచాలను సిబిఐకు అప్పగించి కేసు కొట్టేయించడమో, తాపీగా నడిచేట్లు చేయడమో చేసేవాడు. ఈ లంచాలను అందించడానికి విలువైన బహుమతులతో బాటు విదేశాల రూటు కూడా వాడేవాడు. దానికి తన వ్యాపారసంబంధమైన ఖాతాలు, పరిచయాలు ఉపయోగపడ్డాయి. దానికి తోడు వ్యాపారసంబంధంగా చేసే మనీ లాండరింగ్‌, పన్నుల ఎగవేత యిత్యాదివి ఎలాగూ ఉన్నాయి. అతనికి 45 బినామీ విదేశీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, మూడు బోగస్‌ కంపెనీల ద్వారా డబ్బు తరలించేవాడనీ తేలింది. 

రకరకాల కేసుల పరిష్కారంలో భాగంగా 2013 మే నుంచి 2014 వరకు ఖురేషీ అప్పటి (2012-14) సిబిఐ డైరక్టరు రంజిత్‌ సిన్హా యింటికి 90 సార్లు వెళ్లాడని, కొన్ని సార్లు అతనితో పాటు మాజీ డైరక్టరు ఎపి సింగ్‌ (2010-12) కూడా ఉన్నారనీ సిన్హా విజిటర్స్‌ డైరీలో తేలింది. ఎపి సింగ్‌కు ఖురేషీ బ్లాక్‌బెర్రీ ద్వారా సందేశాలు పంపాడని, వాటిల్లో మన రాష్ట్రానికి చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటడ్డాయని అంటున్నారు. 2014 ఫిబ్రవరిలో ఖురేషీపై ఆదాయపు పన్ను శాఖ వాళ్లు దాడి చేస్తే దొరికిన సమాచారం ఎపి సింగ్‌ మెడకు ఉచ్చులా బిగిసింది. దాంతో అప్పుడు యుపిఎస్‌సి సభ్యుడిగా చేస్తున్న  ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, ఖురేషీ పేరు ప్రస్తావించి, అతనికి కాంగ్రెసు పెద్దలతో సంబంధం ఉందని విమర్శించాడు. దేశం నుంచి రూ. 200 కోట్లను అక్రమంగా తరలించాడని 2016లో ఈడీ పెట్టిన కేసులో అతనికి, సిన్హా, సింగ్‌లకు ఉన్న లింకులను చార్జిషీటులో ఉదహరించారు. 

సిబిఐ చేతిలో చిక్కినవాళ్లు తమను కేసులోంచి బయటపడేమయని ఖురేషీకి డబ్బులిస్తూ ఉంటారు. అతను వీళ్ల డబ్బులను సిబిఐ అధికారులకు అప్పగించి పని చేసి పెడుతూ ఉంటాడు. అతనికి దేశమంతటా ఏజంట్లు ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో అలాటి దళారీ సానా సతీశ్‌ బాబు అనుకోవచ్చు. కాకినాడకు చెందినవాడు. ఎలక్ట్రికల్‌ యింజనీరింగులో పాలిటెక్నిక్‌ చేసి, విద్యుత్‌ సంస్థలో ఉద్యోగిగా చేరి, మానేసి, వ్యాపారిగా మారి అనేక రియల్‌ ఎస్టేటు, బ్రెవరీస్‌ సంస్థల్లో డైరక్టరు అయిపోయాడు. సిబిఐ కేసుల్లో యిరుక్కున్నవారిని ఖురేషీ ద్వారా గట్టున పడేసే పైరవీలు చేసి కాబోలు, బాగా ఆర్జించాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు. ఖురేషీ పట్టుబడినపుడు ఆ కేసులో అనుమానితుడిగా చిక్కాడు. సిబిఐ నుంచి అతనికి నోటీసులు రాసాగాయి. అవి తప్పించుకుని కేసు ఎత్తివేయించుకోవాలని వేరే ఏజంట్ల ద్వారా సిబిఐ అధికారులకు లంచం యివ్వాలనుకున్నాడు. 

అతని పేర రెండు వాంగ్మూలాలున్నాయి. ఒకటి సెప్టెంబరు 26న దిల్లీలోని సిబిఐ ఆఫీసులో దేవేంద్ర కుమార్‌కు యిచ్చాడంటున్నది. దాని ప్రకారం అతను అలోక్‌కు రూ. 2 కోట్లు లంచం యిచ్చాడు. రెండోది అక్టోబరు 4న మేజిస్ట్రేటు ఎదుట యిచ్చిన వాంగ్మూలం. దాని ప్రకారం ఆస్థానాకు రూ. 3 కోట్లు యిచ్చాడు. మొదటిది బోగస్‌ అని అలోక్‌కు చెందిన సిబిఐ అధికారులు దేవేంద్రపై కేసు పెట్టారు. ఎందుకంటే ఆ సెప్టెంబరు 26న సతీశ్‌ హైదరాబాదులో ఉన్నాడట. ఇక రెండో వాంగ్మూలంలో అతను చెప్పిన విషయాల గురించి మరో వ్యాసంలో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?