Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: చౌకపెట్రోలంటూ ఫోర్డ్‌కే బురిడీ

ఎమ్బీయస్‍: చౌకపెట్రోలంటూ ఫోర్డ్‌కే బురిడీ

లీటరు పెట్రోలు రూ.35కి అమ్మే రోజుల్లో హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని రామర్ పిళ్లయ్ అనే అతను తన మూలికా పెట్రోలును లీటరు రూ.10-15 మధ్య అమ్ముతానని 1996లో తమిళనాడులో ప్రకటించి వార్తల్లోకి ఎక్కాడు. నా దగ్గర కొన్ని రహస్య మూలికలున్నాయి, వాటిని నీళ్లలో వేసి, కాస్త ఉప్పు, సిట్రిక్ యాసిడ్ కలిపి అరగంట ఉడికిస్తే చాలు పెట్రోలు తయారవుతుంది అని అతను చెప్పుకున్నాడు. మద్రాసు ఐఐటి వాళ్ల ఎదుట, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ముందు ధైర్యంగా ప్రదర్శించాడు కూడా. ఇదంతా ఫ్రాడ్ అని వాళ్లు కొట్టి పారేసినా జంకలేదు. రామర్ బయోఫ్యూయల్ పేర, తమిళదేవి మూలికై ఎరిపొరుళ్ పేర దాన్ని అమ్ముతూ పోయాడు. సిబిఐ వాళ్లు కేసు పెట్టి జైలుకి పంపినా జంకలేదు. 2010లో ఓ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి యీ సారి వేలార్ బయో హైడ్రోకార్పన్ ఫ్యూయల్ పేర యింకో రకమైన మూలికా పెట్రోలు కనిపెట్టానని నీళ్లలో ఆ మూలికామిశ్రమాన్ని కలిపి 78 డిగ్రీల దగ్గర ఉడికిస్తే చాలు, పెట్రోలు తయారవుతుందని ప్రకటించుకున్నాడు. అతనికి స్ఫూర్తిప్రదాత అయిన లూయీ ఎన్‌రిక్ట్ అనే అతని కథ యిది. అతను ఏకంగా ఫోర్డ్‌నే బోల్తా కొట్టించాడు.

అది 1916. మొదటి ప్రపంచయుద్ధం కారణంగా యూరోప్ నుంచి అమెరికాకు పెట్రోలు రావడం తగ్గిపోయింది. అప్పటికింకా అమెరికా యుద్ధంలోకి దిగలేదు. అయినా పెట్రోలు ధర పెరిగిపోయి గాలన్ (3.8 లీటర్లు) 30 పెన్నీ(డాలరులో వందో భాగం) లకు యిచ్చేవారు.  ఆ సమయంలో గాలన్ పెట్రోలును ఒక పెన్నీకే యిస్తానని ప్రకటించాడు యీ ప్రబుద్ధుడు. మరి జనం వెర్రెక్కిపోయారంటే వెర్రెక్కిపోరా? న్యూయార్క్ రాష్ట్రంలో తూర్పున వుండే లాంగ్ ఐలండ్‌లోని ఫార్మింగ్‌డేల్‌లోని తన నివాసంలో 72 ఏళ్ల లూయీ 1916 ఏప్రిల్ 11న విలేకరుల ఎదుట ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఒక కారు చూపించి, దాని పెట్రోలు ట్యాంకు ఖాళీగా వుందని నిరూపించి, దాన్ని మామూలు నీళ్లతో నింపి, ఒక సీసాలోని ఆకుపచ్చని ద్రావకాన్ని కలిపాడు. కారు స్టార్ట్ చేస్తే స్టార్టయింది. ‘ఒక సీక్రెట్ ఫార్ములాతో యీ కెమికల్‌ను తయారుచేశా. ఇది మన దేశానికి ఎంతో అవసరమైన సైంటిఫిక్ ఇన్నోవేషన్.’ అని లూయీ ప్రకటించాడు. ఈ వార్త బయటకు రాగానే జనాలు నమ్మలేకపోయారు.

‘‘చికాగో హెరాల్డ్’’ పబ్లిషర్ విలియం హస్కెల్ నేను స్వయంగా వచ్చి చూసి రిపోర్టు రాస్తానంటే సరే రమ్మన్నాడు లూయీ. విలియం ఆ ద్రావకాన్ని రుచి చూసి, ‘‘ఇదేమిటి యిది యింత చేదుగా వుంది?’’ అని అడిగాడు. ‘‘ముందు మీరు జర్నలిస్టు అవునా కాదా చెపితే అదేమిటో చెప్తాను. ఎందుకంటే పెద్దపెద్ద ఆయిల్ కంపెనీల ఏజంట్లు జర్నలిస్టులమని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. ఓ కంపెనీ వుంది, 25 ఏళ్ల క్రితం ‘మీకు ఏటా వేలాది డాలర్లు మిగిలే సీక్రెట్ చెప్తాను, 20 వేల డాలర్లివ్వండి’ అన్నాను. కాదు 1500 డాలర్లిస్తాం అన్నారు వాళ్లు. అప్పణ్నుంచి వాళ్లకూ నాకూ పడదు. మీరు వాళ్ల మనిషా?’’ అన్నాడు లూయీ. విలియం తను అచ్చమైన జర్నలిస్టునేనని నిరూపించుకున్నాక ఆ ద్రావణం గురించి చెప్పాడు. ‘‘దానిలో కలిపిన యితర రసాయనాల గుట్టు బయటపడకుండా దానిలో ప్రూసిక్ యాసిడ్ (హైడ్రోజన్ సైనైడ్) కలిపాను’’ అని. ‘‘నిజానికి దీనిలో వాడిన కెమికల్స్ అన్నీ చౌకవే. చాలా తక్కువ ఖరీదులో ద్రావకం తయారవుతుంది. ఒక పౌండు బరువున్న ద్రావకంతో 667 పౌండ్ల బరువున్న పెట్రోలును తయారుచేయవచ్చు. మూలపదార్థాలేమిటో తెలిస్తే ఎవరైనా యీజీగా తయారు చేసేయగలరు. కిటుకంతా ఫార్ములాలోనే వుంది. దాన్ని రహస్యంగా కాపాడుకోలేక ఛస్తున్నాను. ’’

విలియం చాలా యింప్రెసయ్యాడు. ‘‘మనదేశంలో పారిశ్రామిక విప్లవానికి యిది నాంది.’’ అని హెడింగ్ పెట్టి వ్యాసం రాశాడు. అంతే మర్నాటి నుంచి లూయీ ఫోన్ మోగుతూనే వుంది. రోజుకి 200 ఉత్తరాలు వచ్చిపడేవి. ‘మీరు ఉత్పాదన ప్రారంభించండి. మేం పెట్టుబడి పెడతాం.’ అంటూ అనేక కంపెనీలు ఆఫర్ చేశాయి. ఇది తెలిసి విలేకరులు మళ్లీ వచ్చి అసలిదెలా పనిచేస్తుందో చెప్పండని బతిమాలారు. ‘నా ఫార్ములాలో సీక్రెట్ ఏమిటంటే, నా ద్రావకం నీటిలోకి వదలగానే అది దానిలోని ఆక్సిజన్‌ను ఆకర్షిస్తుంది. అప్పుడది తనతో కలిసి వున్న హైడ్రోజన్‌నుంచి బలవంతంగా విడిపోతుంది. కానీ హైడ్రోజన్ అణువులు విడిగా వుండలేవు కదా, మళ్లీ ఆక్సిజన్‌తో కూడాలని దగ్గర్లో వున్న ఆక్సిజన్ అణువులను ఫోర్సుగా, ఘర్షణాత్మకంగా కలుస్తాయి. ఆ ఘర్షణలోంచి ఎనర్జీ ఉత్పత్తి అయి, ఇంజనును నడిపిస్తుంది.’’ అని చెప్పాడు లూయీ.

ఇది పేపర్లో రాగానే కొలంబియా యూనివర్శిటీలోని కెమిస్ట్రీ ప్రొఫెసరు థామస్ ఫ్రెయాస్ ‘‘నీటిని ఎలక్ట్రోలిసిస్ ద్వారా తప్ప కెమికల్స్ ద్వారా విడగొట్టలేము. ఎలక్ట్రోలిసిస్‌ ద్వారా విడగొట్టడానికి కావలసిన ఎనర్జీ, దానివలన ఉత్పత్తి అయ్యే ఎనర్జీకి సమానం. అందువలన నీటిని విడగొట్టడం వలన అదనపు ఎనర్జీ పుట్టదు, లాభం ఏమీ వుండదు.’’ అని ప్రకటించాడు. ‘‘కొత్త ఐడియా ఏదైనా పుట్టినపుడు పాతవాళ్లు యిలాగే కొట్టిపారేస్తారు.’’ అని లూయీ తీసిపారేశాడు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మైన్స్ స్థాపించిన సిఎఫ్ షాండ్లర్ ‘‘నీటిలోంచి హైడ్రోజన్‌ను విడగొట్టడానికి మెటాలియం సోడియంను ఉపయోగిస్తారు. ఆ ప్రాసెస్‌లో ఒక గాలన్ పెట్రోలు తయారుచేయడానికి 14.37 డాలర్ల సోడియం ఖర్చవుతుంది. ఈయన పెన్నీకే ఎలా యిస్తాడు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను మెటాలిక్ సోడియంను వాడుతున్నానని ఆయన కెవరు చెప్పారు?’’ అని ఎదురు ప్రశ్నించాడు లూయీ.

ఈ విధంగా సైంటిస్టులను ఎదిరించగలుగుతున్నాడంటే లూయీ ఎకడమిక్‌గా చాలా గట్టివాడై వుండాలని అనుకోవడం సహజం. అతని కథేమిటంటే, అతను జర్మనీనుంచి 20 సం.ల వయసులో అమెరికాకు తరలి వచ్చాడు. సేల్స్‌మన్‌గా పని చేశాడు తప్ప సరైన పద్ధతిలో సైన్సులో తర్ఫీదు పొందలేదు. కానీ పుస్తకాలు చదివి కొన్ని విషయాలు సేకరించాడు. తెలివైనవాడు. నేను తలచుకుంటే అద్భుతాలు చేయగలను అని భార్య అన్నాకు చెప్పేవాడు, ఆవిడ సరేలే అనేది. చివరకు తన 44వ ఏట ఆమెను యింప్రెస్ చేయడానికి 1890లో పెద్దయెత్తున ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కొలరాడో లోని కాన్యన్ సిటీ నుంచి క్రిపిల్ క్రీక్ వరకు రైలు-రోడ్డు లైను వేస్తానని నిధులు సేకరించడం మొదలుపెట్టాడు. మంచి మాటకారి కాబట్టి అతని మాటలు నమ్మి జనాలు పెట్టుబడులు పెట్టారు. 13 ఏళ్లు గడిచినా రైలూ లేదు, రోడ్డూ లేదు. పెట్టుబడి పెట్టినవారు డబ్బు వెనక్కి యిమ్మనమని ఒత్తిడి చేయడంతో దివాలా తీసి, ఆరెస్టయ్యాడు. కానీ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోకపోవడంతో కొన్నాళ్లకే బయటకు వచ్చేశాడు.

ఏడేళ్లు పోయిన తర్వాత కెంటుకీలో 45 వేల ఎకరాల భూమిని ప్లాట్లు చేసి అమ్ముతానంటూ అందరికీ ఉత్తరాలు రాసి కొంత డబ్బు సేకరించాడు. అంతా ఉత్తుత్తిదే అని తేలిన తర్వాత, కొన్నవాళ్లు కేసులు పెట్టే ఓపిక లేక ఊరుకున్నారు. ఉత్తరాల ద్వారా మోసగించడానికి పోస్టల్ డిపార్టుమెంటు సేవలను దుర్వినియోగపరిచావంటూ ఆ డిపార్టుమెంటు వాళ్లు 500 డాలర్ల జరిమానా వేసి అంతటితో సరిపెట్టారు. అప్పుడు న్యూయార్క్ వెళ్లి స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు జరిపాడు. 1912లో మళ్లీ దివాలా తీశాడు. అక్కడే కొందరు ఇంగ్లీషువాళ్లు తగిలారు. వాళ్లు మధ్యలో బురద వున్న రెండు ఊళ్ల మధ్య వంతెన కడదామని చూస్తున్నారు. ఇతను వెళ్లి ‘‘నా దగ్గర ఒక రహస్య ఫార్ములా వుంది. దాంతో కృత్రిమశిలను తయారుచేయగలను. మీరు యీ బురదలో స్తంభాలు ఎలా వేయాలా అని భయపడవద్దు. నేనిచ్చే మిశ్రమం కలిపితే ఆరు గంటల్లో ఆ బురదంతా రాయిలా గట్టిపడిపోతుంది. నేను గతంలో రంపపుపొట్టును గుట్టలుగా పోయించి, యీ మిశ్రమంతో కాంక్రీటుగా మార్చేస్తే దాని మీద రైలు-రోడ్డు లైను వేసుకున్నారు.’’ అని నమ్మించాడు. వాళ్లు యితని దగ్గర ఆ ఫార్ములాను కొనుక్కున్నారు. తర్వాత యితనిచ్చిన ఫైలు తెరిచి చూసి అదంతా బోగస్ అని గుర్తించి తన్నడానికి వచ్చారు. ఇతను ఆ వూరు వదిలి పారిపోయి, ఫార్మింగ్‌డేల్‌లో తేలాడు.

అక్కడ అతనికి అదృష్టవశాత్తూ బెంజమిన్ యోకుమ్‌తో పరిచయమైంది. యోకుమ్ ఒక ఫైనాన్షియర్. దేశంలో అనేక రైల్వే బోర్డులకు, రైల్‌రోడ్ ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాడు, వాటి బోర్డుల్లో మెంబరుగా వున్నాడు. సెయింట్ లూయీస్ రైల్‌రోడ్‌కు, శాన్ ఫ్రాన్సిస్కో రైల్‌రోడ్‌కు ప్రెసిడెంటుగా కొద్దికాలం పనిచేశాడు. అనేక ప్రతిష్ఠాత్మకమైన క్లబ్బుల్లో సభ్యుడు. సమాజంలో పేరున్నవాడు. అతను తన వేసవికాలం విడిది ఫార్మింగ్‌డేల్‌లో కట్టుకున్నాడు. అక్కడకు వచ్చినపుడు లూయీతో పిచ్చాపాటీ మాట్లాడుతూండేవాడు. ఇతను చెప్పే సైన్సు కబుర్లు వింటూండేవాడు. అతనికి ఫైనాన్సు గురించి తప్ప సైన్సు గురించి తెలియదు. లూయీపై ప్రజలకు సందేహాలు తలెత్తుతున్న సమయంలో అతను ‘‘నాకు లూయీ చాలాకాలంగా తెలుసు. అతను కనిపెట్టినదానిపై నాకు నమ్మకముంది. నా కారులో అది వాడి చూశాను.’’ అని ప్రకటించాడు.

దాంతో ప్రజలంతా ‘‘లూయీ మరొక్కసారి బహిరంగంగా ప్రదర్శన నిర్వహించి తనను తాను నిరూపించుకోవాలి.’’ అనసాగారు. లూయీ ‘‘నా దగ్గరున్న స్టాకు అయిపోయింది. కొత్తగా తయారుచేయాలంటే మెటీరియల్ కొనాలి. కొందామని ఆ మధ్య న్యూయార్కు వెళ్లాను కానీ కొనలేకపోయాను. పెద్ద ఆయిలు కంపెనీల వాళ్లు నామీద గూఢచారులను పెట్టారు. వాళ్ల నన్ను వెంబడిస్తూ ఎక్కడికి వెళుతున్నానో, ఏం కొంటున్నానో గమనిస్తున్నారు. పేటెంటు వచ్చేవరకూ యివి బయటకు తెలియడం శ్రేయస్కరం కాదని ఏమీ కొనకుండానే వెనక్కి వచ్చాను. అందువలన యిప్పుడేమీ ప్రదర్శనలు లేవు.’’ అన్నాడు.

ఆటోమొబైల్ కింగ్ అయిన హెన్రీ ఫోర్డ్ యీ వార్తలన్నీ గమనించాడు. అతను చాలాకాలంగా కారు నిర్వహణ ఖర్చు తగ్గించే మార్గాల కోసం అన్వేషిస్తున్నాడు. ఎవరెవరో ఏమోమో క్లెయిమ్ చేస్తున్నారు కానీ అవన్నీ బోగస్‌గా తేలాయి. సరే, దీనిలో ఎంత నిజం వుందో తెలుసుకుందా మనుకుని తన మనిషిని పంపి లూయీని డెట్రాయిట్ వచ్చి కలవమన్నాడు. ‘నేను రాను, కావాలంటే ఆయన్నే నా దగ్గరకు రమ్మనమండి. నేను యిల్లు వదిలి వెళితే, మా యింట్లో దొంగలు పడి ఫార్ములా కాగితాన్ని దోచుకుంటారు.’ అన్నాడు లూయీ. ఇక గత్యంతరం లేక ఫోర్డే స్వయంగా లూయీ ఊరికి వచ్చి ఒక హోటల్లో లూయీతో గంటసేపు సమావేశమయ్యాడు. ‘‘13 రోజుల కితం విలేకరుల ఎదుట చేసిన ప్రదర్శన మా టెక్నీషియన్ల ఎదుట మరోసారి చేయాలి. నీ ద్రావకాన్ని మా వాళ్లు పరీక్షిస్తారు. టెస్టులన్నీ పాసయితే నీ ఫార్ములాను నేను కొనేస్తాను.’’ అని చెప్పాడు. ఈ వార్త పేపర్లో రాగానే జర్నలిస్టులకు ఉబలాటం పెరిగి, లూయీ గతాన్ని తవ్వారు. అప్పుడు పాతకథంతా పేపర్లలో వచ్చేసింది.

ఫోర్డ్ వెంటనే లూయీ ఊరికి వచ్చి ఏమిటిదని అడిగాడు. లూయీ గతంలో తప్పులు జరిగినమాట నిజమే కానీ యిది మాత్రం నిజమైన శాస్త్రీయ ఆవిష్కరణే అని చెప్పుకొచ్చాడు. ఫోర్డ్ కన్విన్స్ అయ్యాడు. ‘సరే, నేను కొత్తకారు పంపిస్తాను. దానిమీద ప్రయోగాలు చేసి చూపించు. వెయ్యి డాలర్ల కాష్ యిస్తాను కూడా.’ అన్నాడు. ఇంతలో ఆయుధాలు తయారుచేసే న్యూ జెర్సీ కంపెనీ మాక్సిమ్ మ్యునిషియన్స్ కార్పోరేషన్ మేం లూయీ ఆవిష్కరణపై పేటెంటు హక్కులు కొనబోతున్నాం, ఆయన వూళ్లోనే భూమి కొని, లాబ్, ఫ్యాక్టరీ నెలకొల్పబోతున్నాం అని ప్రకటించింది. దాంతో కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది.  ‘పేటెంట్ న్యూస్’’ అనే పత్రిక ‘‘మాక్సిమ్ కంపెనీ లూయీకి పదిలక్షల డాలర్ల క్యాష్, కంపెనీలో లక్ష షేర్లు యిచ్చిందని భోగట్టా’ అని రాసింది. పనిలో పనిగా లూయీ పేరుకు ముందు ‘డాక్టర్’ తగిలించింది కూడా!

ఈ వార్త విని ఫోర్డ్‌కి ఆగ్రహం వచ్చింది. ‘నాతో బేరాలాడుతూనే మధ్యలో వాళ్లెవరికో అమ్మేస్తావా?’ అని. కారు వెనక్కి యిచ్చేయాలని కేసు పెట్టబోయాడు. ఇంతలో దేశాధ్యక్షుడి పదవిని ఆశిస్తూ సెనేట్‌కు నిలబడ్డాడు. ఈ కేసుల రంధిలో పడితే టైము వేస్టనుకుని లూయీని వదిలేశాడు. లూయీకి డబ్బు చేతిలో ఆడడంతో ఓ పెద్ద లాబరేటరీ కట్టనారంభించాడు. తనకంటూ కొత్త యిల్లు మొదలెట్టాడు. ఈ పెట్రోలుతో పాటు తను యింకా కొన్ని ఆవిష్కరణలు చేశానని, ఇప్పుడున్న మోటారు బేరింగులను 75శాతం తక్కువ ఖర్చుతో తయారు చేసే విధానాన్ని కనిపెట్టానని, గాలిలోంచి నైట్రోజన్‌ను వేరు చేసి, ఎరువుల్లో, బాంబుల్లో వినియోగించే విధానాన్ని కనిపెట్టానని చెప్పాడు. ఇంతలో అమెరికా ప్రపంచయుద్ధంలోకి దిగింది. దాంతో చౌక పెట్రోలు అవసరం మరింత పెరిగింది.

అప్పుడు బెంజమిన్ బయటకు వచ్చాడు. ‘‘లూయీ పెట్రోలు హక్కులు నా దగ్గరున్నాయి, మాక్సిమ్ దగ్గర కాదు. అమెరికా యుద్ధంలోకి దిగిన ఆరు రోజులకు అంటే 1917 ఏప్రిల్ 12న లూయీతో ఒప్పందం చేసుకున్నాను. ఫ్యాక్టరీ కట్టడానికి దానికీ ఇన్నాళ్లూ డబ్బిచ్చినది నేనే. మేమిద్దరం కలిసి నేషనల్ మోటార్ పవర్ కంపెనీ అనే కంపెనీ పెట్టాం.’’ అని ప్రకటించాడు. తొలి ప్రదర్శన యిచ్చిన ఏడాదికి లూయీ ఎంత ఎత్తుకి ఎదిగిపోయాడో చూడండి. అయితే కొన్ని రోజులకే లూయీ మరో వివాదంలో యిరుక్కున్నాడు. అతను జన్మతః జర్మన్ కాబట్టి, అమెరికా జర్మనీతో యుద్ధం చేస్తోంది కాబట్టి అతని దేశభక్తిపై అనుమానాలు కలిగాయి. అతను వాషింగ్టన్‌లోని జర్మన్ ఎంబసీలో మిలటరీ ఎటాచీగా వున్న కెప్టెన్ ఫ్రాంజ్ పాపెన్‌తో రహస్యంగా సమావేశమయ్యాడనే వార్తలు వచ్చాయి. దీన్ని బయటపెట్టినది బెంజమినే.

నాసావూ కౌంటీ సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్‌లో అతను విషయాలన్నీ చెప్పాడు. ‘బ్రిటిష్ ఆర్మీ టెక్నికల్ ఆఫీసరు వచ్చి లూయీ పెట్రోలుపై పరిశోధనలు చేసి, సంతృప్తి చెంది, బ్రిటన్ వెళ్లి ఆ ఫార్ములా కొనడానికి అనుమతి తెచ్చుకున్నానని చెప్పాడు. లూయీని ఆ ఫార్ములా యిమ్మనమని నేను చెప్తే, ‘యుద్ధం ముగిసేదాకా ఎవరికీ యివ్వను’ అని చెప్పాడు. దాంతో నాకు అనుమానం వచ్చి డిటెక్టివ్‌లను పెట్టి విషయం కనుక్కోమన్నాను. అప్పుడా రహస్య సమావేశం 1916 ఆగస్టులో జరిగిందని తెలియవచ్చింది. లూయీ 15 లక్షల డాలర్లకు జర్మన్లకు అమ్మేసినట్లు మాకున్న సమాచారం. లూయీ ఫార్ములా వుపయోగించి జర్మనీ యిప్పటికే పెట్రోలు తయారు చేసేస్తోంది కాబట్టి, యుద్ధంలో అజేయంగా వుంది. ఈ సంగతి అర్థం కాగానే లూయీ యింటిపై దాడి చేసి ఫార్ములాను స్వాధీనం చేసుకోమని నేను ఎటార్నీ జనరల్‌ను కోరాను. కానీ ఆయన దానికి కోర్టు అనుమతి కావాలన్నాడు. అందుకే మీ వద్దకు వచ్చాను.’

లూయీ కలిసిన కెప్టెన్ ఫ్రాంజ్ వివాదాస్పదమైన వ్యక్తి. అప్పటికే అమెరికన్ ప్రభుత్వం అతన్ని బహిష్కరించింది. అతను జర్మనీ వెళ్లిపోయాడు. బెంజమిన్ అభ్యర్థనపై కోర్టు వెంటనే చర్యలు తీసుకుంది. ‘నీ ఫార్ములా ఎవరికీ యివ్వడానికి వీల్లేదు’ అని లూయీని హెచ్చరించి, అతని లాబ్ చుట్టూ పోలీసులను ఏర్పాటు చేసింది. దేశద్రోహం ఆరోపణపై లూయీ ‘‘నేను ఫ్రాంజ్‌ను కలిసిన మాట నిజమే కానీ అతి కృత్రిమశిల గురించి. పదివేల డాలర్లిస్తా ఫార్ములా యిచ్చేయ్ అన్నాడు. నేను నవ్వేసి వచ్చేశాను. ఈ ఫార్ములా యివ్వలేదు. నేను దేశభక్తుణ్ని. దానికి రుజువుగా గాలిలోంచి నైట్రోజన్ తయారుచేసే విధానాన్ని ప్రభుత్వానికి ఉచితంగా యివ్వడానికి సిద్ధంగా వున్నాను.’’ అన్నాడు. అది చెప్తూనే యుద్ధం కారణంగా ధరలు పెరిగాయి కాబట్టి, నా పెట్రోలు ధర కూడా నాలుగు పెన్నీలైంది అన్నాడు.

ఈ విధంగా లూయీ ఫార్ములా దేశమంతా చర్చకు వచ్చింది. చివరకు బెంజమిన్ లూయీ బ్యాంకు లాకరును తెరవడానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని దాన్ని తెరిపించాడు. లోపల చూస్తే 20 బాండ్లు వున్నాయంతే. లూయీని అడిగితే యిలా చేస్తారనే ఫార్ములా కాల్చిపారేశాను అన్నాడు. బెంజమిన్ హతాశుడై పోయి, లూయీకి దణ్ణం పెట్టి ప్రాజెక్టులోంచి తప్పుకున్నాడు. జనాలంతా దాని గురించి మర్చిపోయారు. లూయీకి 20 వేల డాలర్ల యిల్లు మిగిలింది.

అయితే అతను ఊరుకోలేదు. 1920లో నాచులోంచి పెట్రోలు తయారుచేస్తానంటూ తయారయ్యాడు. ఒక టన్ను నాచులోంచి 460 గాలన్ల పెట్రోలు తీస్తా అన్నాడు. పేటెంటుకు అప్లయి చేస్తే వాళ్లు యివ్వం పొమ్మన్నారు. అయినా నేనో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పెట్టి డబ్బు సేకరిస్తాను అంటూ తన పేర ఎన్‌రిక్ట్ పీట్ గాసోలిన్ కార్పోరేషన్ అని పెట్టి పబ్లిక్ ఇస్యూకి వెళితే 40 వేల డాలర్ల షేర్లు అమ్ముడుపోయాయి. పీచు పెట్రోలు కోసం అంటూ మరో ఫ్యాక్టరీ కట్టనారంభించాడు. ఏడాది పోయినా చుక్క పెట్రోలు రాలలేదు. కంపెనీ డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు, జూదక్రీడకు ఖర్చు పెట్టేసాడు. ఏడాది చూసిచూసి కంపెనీ డైరక్టర్లు ఇదేమిటని అడిగితే 2 వేల డాలర్ల చెక్కు కంపెనీ పేర యిచ్చాడు. అది చెల్లలేదు. దాందేముంది? ఆ మేరకు కంపెనీలో నా షేర్లు తిరిగి యిచ్చేస్తా అన్నాడు. చివరకు పెట్టుబడిదారులు 1922 అక్టోబరులో కోర్టు మెట్లెక్కారు.

జజ్ గారు యీ మోసమేమిటని సూటిగా అడిగాడు. దీనిలో ఏ మోసమూ లేదు, కావాలంటే మీ సమ్ముఖంలో పెట్రోలు తయారు చేసి చూపిస్తా అన్నాడు లూయీ. కానిమ్మన్నాడు జజ్. గంటల తరబడి కుస్తీ పట్టినా పెట్రోలు రాలలేదు. ‘కంప్రెసరు లీకవుతోంది, సరి చేసి, రేపు మధ్యాహ్నం మళ్లీ చూపిస్తా’ అన్నాడు లూయీ. చూసింది చాల్లే, కంపెనీ డబ్బుతో జూదమాడినట్లు నా బ్యాంకు ఖాతా చూస్తే తెలుస్తోంది అంటూ నీ కంపెనీలో పెట్టుబడి పెట్టినవారందరికీ డబ్బు తిరిగి యిచ్చేయ్ అన్నాడు. అదెంత భాగ్యం? జార్జియాలో 20 వేల ఎకరాల భూమి వుందిగా, అది అమ్మి యిచ్చేస్తా అన్నాడు లూయీ ధీమాగా. నాలుగు నెలలు గడిచినా పెన్నీ కూడా తిరిగి చెల్లించలేదు. దాంతో 1923 ఫిబ్రవరిలో అతనికి 7 సంవత్సరాల శిక్ష పడింది. ఏడాది పోయిన తర్వాత 78 ఏళ్ల వృద్ధుడు కదాని జాలిపడి పెరోల్‌పై విడుదల చేశారు. బయటకు వచ్చిన కొన్ని రోజులకే అతను చచ్చిపోయాడు.

లూయీ తనతో పాటు తన ఫార్ములా రహస్యాన్ని తీసుకుని పోయాడు. ఇంతకీ ఎనిమిదేళ్ల క్రితం అతను రిపోర్టర్ల ఎదుట చేసిన మాజిక్ ఏమిటి అనేదానిపై ఎవరి థియరీలు వాళ్లకున్నాయి. థామస్ ఆల్వా ఎడిసన్ వద్ద చీఫ్ ఇంజనియర్‌గా పనిచేసిన డా. మిల్లర్ అన్నదేమిటంటే – అతను ఎసిటోన్ కలిపివుంటాడు. మేమూ దానితో ప్రయోగాలు చేశాం. చేశాక చూస్తే ఇంజన్ ధ్వంసమై పోయింది. సిలిండర్‌లోకి ఎసిటోన్‌ను పంపడానికి నీళ్లు ఒక వాహకంగా పనిచేస్తుంది తప్ప నీటిని విడగొట్టడమంటూ జరగలేదు. ఎవరైనా ఒక ఫర్నేస్‌లోంచి బూడిదను తీసి దాన్ని ఆయిల్‌లో నానబెట్టి బయటకు తీసుకుని వచ్చి ‘చూడండి, నేను బూడిదలోంచి మంట పుట్టిస్తాను’ అంటూ కాస్సేపు చూపించవచ్చు. ఆయిల్ అయిపోయేటంత వరకు ఆ బూడిదలోంచి మంట వస్తుంది. ఇదీ అంతే.’ అన్నాడు.

ఈ కథను రామర్ పెట్రోలుతో మొదలుపెట్టాను కాబట్టి అతనితోనే ముగించడం సబబు. రామర్ పెట్రోలు ఎలా తయారుచేస్తున్నాడో చెప్పలేకపోయాడు. కానీ కొన్ని ఊళ్లలో హైవే పక్కన రామర్ పెట్రోలు పేరుతో సీసాల్లో  పోసి అమ్మేశారు. పెట్రోలు రిఫైనరీల్లోంచి కొట్టేసిన పెట్రోలు దొంగచాటుగా అమ్మడానికే యీ రామర్‌ను ముందుకు నెట్టారని కథనాలు వచ్చాయి. సిబిఐ కేసు పెట్టి, ఎరెస్టు చేసి, కేసు నాన్చింది. దాంతో యితను బయటకు వచ్చి 2010 నీళ్లలో ఉడికించే పెట్రోలంటూ మరోటి మొదలెట్టాడు. చివరకు 2016లో అతనికి శిక్ష పడింది. పెట్రోలియం ఉత్పాదనలైన టొల్యూన్, నేఫ్తాలు కలిపి రామర్ పెట్రోలు పేరుతో 1999-2000 లలో అమ్మాడని, ప్రజలను మోసం చేసి రూ. 2.27 కోట్లు సంపాదించాడని సిబిఐ వాదించింది. 2016లో మూడేళ్ల శిక్ష పడింది. అతని అసిస్టెంట్లుగా వున్న ముగ్గురికీ కూడా శిక్ష పడింది. సైన్సు పేర జరిగే మోసాలు ఆలస్యంగానైనా బయటపడతాయి. ఈలోగా ప్రజలంతా గుడ్డిగా నమ్మేయడం చూస్తే తర్వాతి రోజుల్లో ఆశ్చర్యంగా వుంటుంది. (మొదటి బొమ్మలో లూయీ, రెండోదానిలో రామర్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా