Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: చీకట్లో సూర్యుడు 01

ఎమ్బీయస్: చీకట్లో సూర్యుడు 01

గత నెలలో ‘‘80 రోజుల్లో భూప్రదక్షిణం’’ నవలను పరిచయం చేసినపుడు యిలాటి సాహసనవల మరొకటి పరిచయం చేయమని కొందరు పాఠకులు కోరారు. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘‘చీకట్లో సూర్యుడు’’ అనే సైంటిఫిక్ సాహస నవలను పరిచయం చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆస్ట్రోఫిజిక్స్ గురించిన నవల. గ్రహాంతరవాసుల గురించి మనం వింటూనే వుంటాం. వాళ్లనే యీయన మాయాస్ అన్నారు. మాయాస్ వున్నారా? లేదా? అన్న ప్రశ్న ఎప్పటి నుండో వేధిస్తోంది మనను. ఫ్లయింగ్ సాసర్స్ అంటే గ్రహాంతర వాసుల నౌకను చూశామని కొందరు, అంతా ఉత్తిదే అని మరికొందరు వాదిస్తూ వుంటారు. ఇప్పటివరకూ ఇతమిత్థమని ఏమీ తేలలేదు. అయితే లాజిక్ ఉపయోగిస్తే యీ విశాల విశ్వంలో ఎక్కడో అక్కడ జీవరాసులుండే ఛాన్సు వుందని పెద్దలంటారు. జీవులంటూ వుంటే వాళ్లు మనకంటె తెలివైనవాళ్లా? తెలివితక్కువ్వాళ్లా? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలివైనవాళ్లు అనుకుని యండమూరి ఈ కథ రాశారు.

నవల ప్రకారం ఇంకో సోలార్ సిస్టమ్ లో ఆల్ఫా గ్రహం అని ఓ గ్రహం ఒకటి వుంది. అదే కాదు, ఇంకో నాలుగు గ్రహాలు కూడా నున్నాయి. వాళ్లకి ఇంటర్ ప్లానెటరీ సొసైటీ కూడా వుంది, మన ఐక్యరాజ్య సమితిలా పనిచేస్తుందన్నమాట. ఆ గ్రహవాసులందరూ ఎనర్జీ విషయంలో మనకంటే చాలా చాలా ముందుకు వెళ్లారని ఊహ. మనం పదార్థంలోంచి శక్తిని బయటకు లాగడం నేర్చుకున్నాం. అటామిక్ పవర్ అంటే అదేగా! పరమాణువులో దాగి వున్న శక్తిని బయటకు లాగి దాన్ని విద్యుత్తుకో, విధ్వంసానికో వుపయోగిస్తున్నాం. అయితే ఆ ప్రాసెస్‌ను రివర్స్ చేసే శక్తి మనకింకా రాలేదు. అంటే శక్తిని పదార్థంగా మార్చి దాచుకునే పద్ధతి మనకు తెలియదు. అది తెలిసిన మాయాస్ కథ యిది. వాళ్లు కోట్లాది ఎర్గ్‌ల శక్తి నుపయోగించి గోళీకాయంత పదార్థాన్ని తయారుచేయగలరు, తిరిగి ఆ గోళీకాయను శక్తిగా మార్చుకోగలరు.

కథాకాలం యిప్పటికి వందేళ్ల తర్వాత! ఆల్ఫా గ్రహం వుంది కదా వాళ్లు శక్తిని పదార్థంగా మార్చేసి దానితోనే వాళ్ల పనులన్నీ జరిపేసుకుంటున్నారు. ఉదాహరణకి ఓ అంతరిక్షనౌక నడపాలనుకోండి, మనలాగ ఏవేవో తగిలించాల్సిన పని లేదు, ఇంధనాలు ఖర్చు పెట్టనక్కరలేదు. మనం వాచీల్లో పెట్టుకునే క్వార్ట్‌జ్ లేదూ అలాటి దాంటో శక్తిని కుక్కేసి పెట్టేస్తారు. అంతే ఆ స్పేస్‌షిప్ నడవడం, కాంతి రావడం, అన్నీ దానితోనే! అలాగే వాళ్ల యంత్రాలు, వాహనాలు.. అన్నీ. ఇలా వాడేస్తే ఎంత యింధనం మాత్రం సరిపోతుంది? అయిపోవడం మొదలెట్టింది. అప్పుడు వాళ్లేం చేశారంటే మన సూర్యుడి వద్దకు కాస్త శక్తిని తీసుకుని పీచుమిఠాయిని వత్తేసి పట్టుకుపోయినట్టు పట్టుకుపోయారు. దాంతో కొంతకాలం గడిచింది. మళ్లీ అవసరం పడింది. మళ్లీ వచ్చారు, మళ్లీ కాస్త పట్టుకుపోయారు. అదీ అయిపోయింది. ఈ సారి యిలాగ కాదు, మొత్తానికి లాక్కుపోతాం అన్నారు. దానిమీదే ఎందుకు పడ్డారంటే సూర్యుడిలో శక్తిని యిలా చిన్న ఘనపదార్థంగా తీసుకుపోవడానికి అనువుగా వుంది కనుక.

మన దగ్గర ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే దాని వల్ల యిళ్లు కోల్పోయే నిర్వాసితుల సమస్య తేల్చాలి కదా, అలాగే యిలా విశ్వంలో యిలాటి చేష్టలేమైనా చేయాలంటే అంతర్జాతీయ ప్లానెటరీ సొసైటీ అనుమతి తీసుకోవాలి. అందువలన వాళ్లు అనుమతికోసం వాళ్లని అభ్యర్థించారు. మన కోర్టువాళ్లు ఓ బహిరంగ ప్రకటన పేపర్లో వేయించినట్టు వాళ్లు అన్ని గ్రహాలకూ ఓ మెసేజి పంపారు. 'ఫలానా ఆల్ఫా గ్రహం వాళ్లు సూర్యుణ్ని వాళ్లవైపు లాక్కుపోతారట, ఏవైనా అభ్యంతరాలుంటే తెలుపవలసినది' అని. నిజానికి మన భూమి బతుకు సూర్యుడి మీద ఎంత ఆధారపడివుందో మనం చిన్నప్పటినుంచీ చదువుకున్నాం. సూర్యుడు కాస్త యివతలగా వుంటే కాలి బూడిదై పోదుమని, కాస్త అవతలగా వుంటే చలితో గడ్డకట్టుకుపోదుమనీ.. యిలా సౌరకుటుంబంలో అన్ని గ్రహాలు గురత్వాకర్షణ శక్తి వల్లనే బాలన్స్ అయివున్నాయి. ఇలా శక్తి లాగేసి, దాని ఆకర్షణను అప్‌సెట్ చేస్తే గ్రహాల కక్ష్యలు మారిపోయి, ఒకదాన్ని మరొకటి గుద్దుకుని ప్రళయం సంభవిస్తుంది.

ఇలాటి పరిస్థితిలో వాళ్లు సూర్యుణ్ని పట్టుకుపోతే మనం ఏమవాలని? మన భూమికి నాశనం తప్పదు. మరి భూమిని రక్షించుకోవడం ఎలా? అదీ ఈ నవల కథాంశం. ఈ ఆల్ఫాగాళ్లు వున్నారు కదా, వాళ్లు 208 ఏళ్ల క్రితం సూర్యుడినుంచి శక్తి పట్టుకుపోయినప్పుడు భూమికి కాస్త ఉలికిపాటు కలిగింది. తర్వాత 104 ఏళ్లకు మళ్లీ కాస్త ఎక్కువ పట్టుకుపోయినపుడు పెద్ద షాకే కొట్టింది. 52 ఏళ్ల క్రితం అప్పటికే కాస్త శాస్త్రవిజ్ఞానం పెరిగింది కాబట్టి, సూర్యుడిలో సంచలనం కలిగినట్టు రికార్డు చేసుకున్నారు కానీ ఎందువల్లనో తెలియలేదు. కథాకాలం నాటికి మళ్లీ పట్టుకుపోయినప్పుడు ఓ ప్రమాదం జరిగింది. అప్పటికి స్పేస్ సిటీ అని అంతరిక్షంలో సౌరశక్తితో పనిచేసే ఓ లాబ్ వుంది. సూర్యశక్తిలో కలిగిన అంతరాయం వల్ల ఆ స్పేస్ సిటీ పనిచేయడం మానేసింది. దాంతో లోపలున్న సైంటిస్టులందరూ చనిపోయారు.

ఆల్ఫాగ్రహవాసులు ఓ స్పేస్‌షిప్ లో వచ్చి సూర్యుణ్నించి శక్తి పట్టుకుపోయారు కదా, వాళ్ల వాహనం ఓ తెలుగువాడి కంట బడింది. అతను ఓ యాస్ట్రోఫిజిసిస్ట్. పేరు యశ్వంత్. గొప్ప మేధావి. అంతరిక్ష పరిశోధనలకోసం ఆర్కిటిక్ ధృవంలో నెలకొల్పిన పరిశోధనాలయంలో అతను వుంటాడు. ధృవప్రాంతాల్లో మారుతున్న నక్షత్రమండలాల రూపురేఖల రహస్యాల్ని కనిపెట్టడానికి ఐదేళ్లగా అక్కడ శ్రమిస్తున్నాడు. అతనికి తోడుగా నిఖిల్ అనే కాస్మోనాట్ ఒకతను వుంటాడు. వాళ్లిద్దరూ అవేళ ఆల్ఫా వాళ్ల స్పేస్‌షిప్ గొప్ప వెలుగుతో, కాంతివేగం కన్నా ఎక్కువ స్పీడుతో వెళుతూండడం చూశారు. అదేమిటో తెలియదుగా, ఫ్లయింగ్ సాసర్ అనుకున్నారు. తమ పై అధికారులకు విన్నవించగానే 'మీరిద్దరూ వెంటనే ఇండియాకు రండి' అని కబురు పెట్టారు.

ఈ యశ్వంత్‌కి చిన్నప్పుడే, అంటే చదువుకుంటున్నప్పుడే పెళ్లయింది. బాల్యవివాహాలు చేస్తే మంచి సంతానం కలుగుతారని మధ్యలో కొంతకాలం పాటు శాస్త్రజ్ఞులు కూడా చెప్పడం చేత ఈ స్థాయి సైంటిస్టుకి కూడా బాల్యవివాహం జరిగింది. దానివలన జరిగిన నష్టం ఏమిటంటే, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు కలగకపోవడం! యశ్వంత్ భార్య, ఆమె పేరు అనూహ్య, పెళ్లయేనాటికి మరీ చిన్నపిల్ల కావడంతో యితనంటే భయం, గౌరవం వున్నాయి కానీ, ప్రేమ పుట్టలేదు. ఇలా కొంతకాలం జరిగేసరికి యింకెందుకని విడాకులు తీసేసుకుంది కూడా. ఇతనిలా యీ ఆర్కిటిక్ సర్కిల్‌కి వచ్చేశాడు. ఆమె చదువులో పడి, పేరున్న బయోకెమిస్టు అయింది. సైన్సు సిటీలో పనిచేస్తోంది.

ఈ సైన్సు సిటీ, అంతరిక్షంలో వుండే స్పేస్ సిటీకి అనుసంధానంగా పనిచేస్తుంది. ఇక్కణ్నుంచే స్పేస్ సిటీకి శాస్త్రజ్ఞులను పంపుతారు. ఈ సారి బ్యాచ్‌లో శూన్యసాంద్రతలో బాక్టీరియా ప్రభావం పై రిసెర్చి చేస్తున్న అనూహ్యను, వాయుపుత్ర అనే కంప్యూటర్ యింజనీర్‌ను తోడిచ్చి పంపుదామనుకున్నారు. ఈ వాయుపుత్ర మరో జీనియస్. కంప్యూటర్ విద్యలో మొనగాడు. పైకి మాత్రం జోకులేస్తూ హుషారుగా కనబడతాడు. అతను అనూహ్య అంటే మనసు పారేసుకున్నాడు. ఈమె నాకు పెళ్లయింది, విడాకులు తీసుకున్నాను అంటే ఆ విషయం నాకనవసరం అన్నాడు. ఈమె నెలాగైనా పెళ్లాడాలని అతని పట్టుదల. ఈ పదిహేను రోజులు అంతరిక్షంలో కలిసి గడిపితే ఆమె ఔనంటుందని అతని ఆశ.

అయితే అనూహ్యతో వచ్చిన యిబ్బందేమిటంటే విడాకులు పుచ్చుకున్నాక యశ్వంత్ మరింత గుర్తుకు వస్తున్నాడామెకు. అతన్ని మరువలేకుండా వుంది. ఆ టైములో ఈ స్పేస్ సిటీకి వాయుపుత్రతో వెళ్లే ఛాన్సు వచ్చింది. అతనితో మనస్ఫూర్తిగా కలవాలంటే యశ్వంత్‌ను మనసులోంచి తుడిచేయాలి. అతనిలోని గాంభీర్యం, మేధస్సు యిష్టం. వాయుపుత్రలో చురుకూ, హుషారు యిష్టం. ఎవరినీ మరువలేకపోతోంది. దానికోసం సైకియాట్రిస్టును కలిసింది. ఆయన కథంతా విని, యశ్వంత్ నీకు జీవితంలో కలిసే ఛాన్సు లేదు. అందువల్ల ప్రేమిస్తున్నానని వాయుపుత్రకు చెప్పేసేయి. అప్పుడు నీ మనసుకి ఏం కావాలో నీకే స్పష్టంగా తెలుస్తుంది అని సలహా యిచ్చాడు. రెండు రోజుల్లో స్పేస్ సిటీకి బయలుదేరబోతున్నారు కాబట్టి తన మనసు చెప్పేసి అంతరిక్షంలో రొమాన్సు చేయవచ్చన్న ఊహల్లో తేలిపోతూంది అనూహ్య.

అమె పనిచేస్తున్న సైన్సు సిటీ వాళ్లే యశ్వంత్‌ను ఆర్కిటిక్ నుండి వెనక్కి రప్పించారు. ఎందుకంటే యిందాకా చెప్పాను చూశారా, సూర్యుణ్ని యిలా ఆల్ఫావాళ్లు పట్టుకుపోతే యిబ్బందేమైనా వుంటే చెప్పుకోండొహో అని అంతర్జాతీయ ప్లానెటరీ కమిటీ వాళ్లు పంపిన మెసేజ్ వాళ్లకు చేరింది. అదేమిటో వాళ్లకు తెలియటం లేదు, దాన్ని ఎలా డీకోడ్ చేయాలో తెలియడం లేదు. ఆ పని వాయుపుత్రకు అప్పగించారు. అతను అవస్థపడుతున్నాడు. ఇంతలో యశ్వంత్ అక్కడకు చేరాడు. ఐసోటోప్-5 ద్వారా ట్రై చేయమన్నాడు. అలా కూడా కోడ్ బ్రేక్ కాలేదు.

ఇంతలోనే స్పేస్ సిటీలో వున్న వాళ్లందరూ చచ్చిపోయారన్న వార్త చేరింది. దానిపై తర్జనభర్జనలు జరిగాక ఒక ఐదు నిమిషాల పాటు సోలార్ ఎనర్జీ అనూహ్యంగా తగ్గిపోయిన కారణంగా పరికరాలు పాడయిపోయి స్పేస్ సిటీ సర్వనాశనమైందని తెలిసింది. అది వినగానే 52 యేళ్ల క్రితం కూడా సూర్యకిరణ ప్రసారంలో ఒక్క క్షణంపాటు అంతరాయం కలిగిందని రికార్డు చేసిన విషయం గుర్తుకు వచ్చింది యశ్వంత్‌కి. అప్పుడు వాయుపుత్రకు 'డీకోడ్ చేయాల్సిన భాషలో సోలార్ ఎనర్జీ, విస్ఫోటనం, ఎలీన్స్ అనే పదాలున్నాయేమో చూడండి' అని హింట్ యిచ్చాడు. ఇక అక్కణ్నుంచి వన్నెండు గంటలపాటు శ్రమించి ఆ మెసేజ్ కనుగొన్నాడు వాయుపుత్ర.

ఇది యిలా జరుగుతుండగానే నిఖిల్, తోచీ తోచనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్లినట్టు ఓ స్పేస్‌షిప్ లో రాయ్ అనే ఒకతను వెళుతుంటే తనూ వాళ్లతో అలా సరదాగా రోదసిలో విహరించబోయాడు. వాళ్లకు మధ్య దారిలో ఓ ఫ్లయింగ్ సాసర్ కనబడింది. అది ఆల్ఫా వాళ్లదే. శక్తి తరంగాలు పంపి, వీళ్లకు భూమిమీద వున్న సైన్సు సిటీకి కనక్షన్ అందకుండా చేశారు. వీళ్ల మెషిన్లు తప్పుడు సమాచారం యిచ్చేట్టు చేశారు. పైగా టెలిపతీతో వీళ్ల మెదడును కన్‌ఫ్యూజ్ చేసి వాహనాన్ని వాళ్లవైపు ఆకర్షించుకున్నారు. పైలట్, రాయ్ యిద్దరూ భూమికీ, సూర్యుడికీ కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఫ్లయింగ్ సాసర్ వైపు దూసుకు వెళ్లిపోతున్నారు. అయితే అదృష్టవశాత్తూ నిఖిల్ అప్పుడు చెవులకు ఇయర్ ఫోన్సు పెట్టుకుని మ్యూజిక్ వింటున్నాడు. అందువల్ల అతను హిప్నాటిజంకు గురి కాలేదు. అతను భూమివైపు వాహనాన్ని తిప్పుదామని చూస్తే పైలట్ అడ్డుపడ్డాడు. అతన్నో దెబ్బకొట్టి నిఖిల్ వాహనం నడపబోయాడు. రాయ్ యితనితో విభేదించి, స్పేస్ సూట్ వేసుకుని అంతరిక్షంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. నిఖిల్ ఒక్కడూ భూమికి క్షేమంగా వచ్చాడు.

ఇక వెంటనే అత్యవసర సమావేశం జరిగింది. జరిగినదానికి కారణాలు విశ్లేషించి, ఫ్లయింగ్ సాసర్ చేసిన పనే యిదని కనుక్కున్నారు. ఆ సమావేశం జరుగుతూండగానే వాయుపుత్ర తను డీకోడ్ చేసిన మెసేజ్ పట్టుకొచ్చాడు. 'ప్లానెట్ ఆల్ఫావాసులు తమకు కావల్సిన శక్తిని సూర్యుడినుంచి పొందదల్చుకుని ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి నివేదిక పంపారు. సూర్యుడి మీద ఆధారపడిన జీవరాశులు ఏమీ లేవని ఈ నివేదిక సారాంశం. ఈ చర్య ఎవరికైనా ఏ విధమైన నష్టమైనా కల్గిస్తుందని భావించే పక్షాన ఆ విషయాన్ని ఇంటర్ ప్లానెటరీ సొసయిటీకి తెలియపర్చగలరు' అని నోటీసు.

ఈ నోటీసు చదవగానే అందరిలో అలజడి బయలుదేరింది. ఓ టీము అంతరిక్షనౌకలో బయలుదేరి, భూమి కేసూ సొసైటీ ముందు పెట్టాలి. ఆల్ఫా ప్లానెట్ వాళ్లకు భూమి వుందని తెలిసినా, సూర్యుడిమీద ఆధారపడి ఏ జీవరాశీ లేదని దబాయిస్తున్నారంటే ఉద్దండపిండాలే అయుంటారు, స్వార్థపరులయివుంటారు. వాళ్లకు తమ భాష, ఆలోచనలు అన్నీ తెలుసు. వాళ్లు తమ ప్రయాణాన్ని అడ్డుకోవచ్చు, తమ నౌకను నాశనం చేయవచ్చు. ఇలాటి స్థితిలో మనం భూమిని ఎలా రక్షించుకోగలం? వాళ్లు పంపిన సందేశం మనకు అర్ధం కావాలి. మన వద్దనుంచి అక్కడికో టీము వెళ్లి మన వాదన వినిపించాలి. వాళ్లెక్కడున్నారో తెలియదు, వెళితే ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. వెళ్లినా వాళ్లకు మన ఘోష అర్ధమవ్వాలి. అర్థమయినా బోడి భూమి వుంటేనేం, ఊడితేనేం అంటే మనం చేయగలిగేదేమీ లేదు. వాళ్లు తమ స్పేస్ సిటీని ఎలా నాశనం చేశారో తెలుసుకుంటే, నిఖిల్ స్పేస్‌షిప్‌ను హిప్నటైజ్ చేసిన వాళ్ల ఫ్లయింగ్ సాసర్ ఎలా వుందో తెలిస్తే కొంత దారి తోస్తుంది. ఇలా అనుకుని యశ్వంత్, ఓ స్పేస్‌షిప్ లో మర్నాడే బయలుదేరాడు.

అది వెళుతూండగానే ఏదో కుట్రకు బలయ్యింది. ‘రాకెట్ పేలిపోతోంది, ఈ నౌకను ఖాళీ చేసి వెళ్లిపో’ అని కంప్యూటర్ హెచ్చరించ నారంభించింది. అతని చావుకి ఐదు నిమిషాలు మాత్రం గడువుంది. అప్పుడు భూమి మీదనుండి నీకేమైనా ఆఖరి కోరిక వుంటే చెప్పండి అన్నారు. అప్పుడు యశ్వంత్‌కి అనూహ్య గుర్తుకు వచ్చింది. “అనూహ్య అని బయో కెమిస్టు వుండాలి. వీలైతే ఆమెతో మాట్లాడించండి.” అన్నాడు. “ఆమె సైన్సు సిటీలో వుంటే తప్పకుండా ప్రయత్నిస్తాం" అన్నారు గ్రౌండ్ కంట్రోలు వాళ్లు. అనూహ్యకు మెసేజ్ చేరింది. అప్పుడు యశ్వంత్ "అనూహ్యా, ఎలా వున్నావ్? నేనంటే భయం పోయిందా?" అని పలకరించాడు. జీవితపు ఆఖరిక్షణాల్లో యశ్వంత్ తనను తలచుకున్నాడనే ఉద్వేగంతో ఈమెకు ఏం చెప్పాలో తెలియలేదు. “నువ్వు బతుకుతావ్, యశ్వంత్” అంది. “వచ్చే జన్మలో మనిద్దరి మధ్యా వయసు వ్యత్యాసం తగ్గించమని దేవుణ్ని కోరతాను. దేవుడు ఒప్పుకుంటే! అనూహ్యా, కెన్ యూ లవ్ మీ?” అని అడిగాడు. "ఐ లవ్యూ యశ్వంత్. నువ్వు గుర్తుకురాని రోజు లేదు.” అంది అనూహ్య.

అంతలోనే వాయుపుత్ర లైనులోకి వచ్చాడు "యశ్వంత్, ఇంకా 50 సెకన్ల టైము మాత్రం వుంది. మీరు స్పేస్‌సూట్ వేసుకుని అంతరిక్షంలోకి వెళ్లిపోండి. మీ డ్రస్‌కు రేడియో అమర్చుకోండి. రాడార్ మీద మిమ్మల్ని ట్రాక్ చేసి పట్టుకుంటాం” అన్నాడు. ఇది కొంచెం పిచ్చి ఆలోచన. ఎందుకంటే అంతరిక్ష నౌకలో నుండి బయటకు వచ్చాక చంద్రుడి ఆకర్షణలోకి పడతాడు. చంద్రుడి చుట్టూ రౌండ్లు కొట్టి కొట్టి కొంత సేపు భారరహిత స్థితిలో తిరిగాక చంద్రుడి మీదకు వెళ్లి పడతాడు. ఇప్పుడు ఓ మాగ్నెట్‌కు తాడు కట్టి తాడు చివర మేకు కట్టామనుకోండి. మాగ్నెట్‌ను గిర్రున తిప్పితే విష్ణుచక్రం తిరిగినట్టు ఆ మేకు కొన్ని రౌండ్లు కొడుతుంది. బాగా ఫోర్సుగా తిప్పితే యింకాస్త ఎక్కువ రౌండ్లు కొడుతుంది కానీ కాస్సేపటికైనా స్పీడు తగ్గి ఆ మాగ్నెట్ వైపుకి వెళ్లి అతుక్కుంటుంది కదా! అదే థియరీ యిక్కడ. యశ్వంత్ రెండు గంటల్లో చంద్రుడిమీద దబ్బున పడడం ఖాయం. వాయుపుత్ర అప్పటికప్పుడు స్పేస్‌షిప్ లో బయలుదేరినా వచ్చేందుకు నాలుగు రోజులు పడుతుంది.

అయినా వాయుపుత్ర చెప్పాడు కదాని యశ్వంత్ అతని మాట విన్నాడు. అతని అదృష్టం ఏమిటంటే పేలిపోయిన అతని అంతరిక్ష నౌక తాలూకు కెనెటిక్ ఎనర్జీ అతని కంటె వేగంగా పయనించి చంద్రుణ్ని గుద్దుకుంది. దాంతో చంద్రుడి మీద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వల్ల పుట్టిన శక్తి అతన్ని మళ్లీ అంతరిక్షంలోకి నెట్టేసింది. దాంతో అతను ఎప్పటిలాగా రౌండ్లు కొడుతున్నాడు. ఇంతలో వాయుపుత్ర వాహనం అక్కడకు చేరింది. అతనివద్ద రాడార్ వుందిగా, యశ్వంత్ డ్రెస్‌లో వున్న రేడియో యిచ్చే తరంగాలను పట్టుకుని అతన్ని కనిపెట్టి తన నౌకలోకి లాక్కున్నాడు. వాయుపుత్ర సాహసం వల్ల, అనుకోని విస్ఫోటనం వలన యశ్వంత్ బతికి బట్టకట్టాడు. వాళ్లిద్దరూ భూమికి తిరిగి వస్తూంటే దారిలో ఫ్లయింగ్ సాసర్ తగిలింది. యశ్వంత్ లోపలికి వెళ్లి చూస్తానని పట్టుబట్టాడు. వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఖాళీ చేసిన వాహనంలా వుంది అనుకుంటూ అక్కడ వెలుగులు విరజిమ్మే క్వార్ట్‌జ్‌ను ముట్టుకోబోయాడు. ఛటేల్మని షాక్ కొట్టింది. అతను మూర్ఛపోయాడు. అప్పుడు వాయుపుత్ర దానిలోకి వెళ్లి యశ్వంత్‌ను రక్షించాడు.

ఆ ఫ్లయింగ్ సాసర్‌ను పరీక్షిస్తే ఆల్ఫా గ్రహవాసుల గురించి వివరాలు తెలుస్తాయి కదాని దాన్ని వీళ్లు వెంటబెట్టుకుని తెచ్చేశారు. సైన్సు సిటీకి వచ్చి దాన్ని పరీక్షించారు. వాళ్ల సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ క్వార్ట్‌జ్‌ అని తెలిసింది. పదిహేను వందల కిలోల శక్తిని గోళీకాయ ఆకారంలో వున్న రాయిలో యిమడ్చగలిగారు వాళ్లు. దానిలోనే సౌరకుటుంబం మ్యాప్ కూడా దొరికింది. అన్నిటికంటె చిత్రం హిప్నాటిజంకు గురయి అంతరిక్షంలోకి నడుచుకుంటూ పోయిన రాయ్ బట్టలు కనబడ్డాయి. ఇక భూలోకవాసుల్లో అలజడి ప్రారంభమైంది. ఇంటర్ ప్లానెటరీ సొసైటీకి ఓ బృందాన్ని పంపవలసినదే అనుకున్నారు. అదెక్కడుందో తెలియదు, ఈ బృందం ఎప్పటికి చేరతారో తెలియదు. వాళ్లు వీళ్ల మాటలు వింటారో లేదో తెలియదు అయినా భూమిని కాపాడాలంటే యీ పాటి ప్రయత్నం చేయకతప్పదు అనుకున్నారు. వాళ్లు తిరిగివస్తారో లేదో తెలియదు. వీళ్లు విశాలవిశ్వంలోకి అలా సంకేతాలు పంపుతూనే వుండాలి. అవి ఎవరైనా గ్రహించి, వీళ్లకు దారి చూపిస్తే సరేసరి. లేకపోతే అలా తిరుగుతూనే వుండాలి. మరి దానికి ఎనర్జీ ఎలా వస్తుంది? అన్నాళ్లూ ఆహారం ఎలాగ? సోలార్ ఎనర్జీతో నడిచేట్టు, కండెన్సెడ్ ఫుడ్ వాడేటట్టు నిర్ణయించుకున్నారు. ఒక అంగుళం ముక్క వేడిచేస్తే ఆ అయిదుగురికి ఓ రోజుకి సరిపడే అన్నం తయారవుతుంది.

ఆ టీము లీడరు ఆస్ట్రో ఫిజిసిస్ట్ యశ్వంత్. ఆస్ట్రోనాట్‌గా నిఖిల్ వున్నాడు. టీము సభ్యుల ఆరోగ్యం చూడడానికి డాక్టర్ ఫిలిప్స్. వందల యేళ్లు సాగే యీ ప్రయాణంలో తరాలు మారవచ్చు. అందువల్ల తర్వాతి తరం వాళ్లు పుట్టాలంటే ఓ స్త్రీ కూడా అవసరం. అనూహ్యను ఎంపిక చేశారు. ఇక ఐదో సభ్యుడు నికోలవస్కీ అనే ఓ రష్యన్ కంప్యూటర్ స్పెషలిస్టు. టీము తను లేకుండా తయారవడం విని వాయుపుత్రకు చాలా బాధ వేసింది. ముఖ్యంగా అనూహ్యను ఎందుకు యిన్‌క్లూడ్ చేశారో అర్థం చేసుకున్నాక మరీ బాధ వేసింది. అదేదో తన ద్వారానే జరగాలని ఆశ అతనికి. అందువల్ల ఓ చిట్కా వేశాడు. ఆ రష్యన్‌కి జాతకాల పిచ్చి వుందని తెలిసింది. దీనిలో వెళితే చావు తథ్యం అని అతను నమ్మేట్టు చేశాడు. దాంతో అతను ఆరోగ్యం బాగాలేదంటూ తప్పుకున్నాడు. అతని స్థానంలో వాయుపుత్ర ప్రవేశించాడు. దీని తర్వాతి భాగం చీకట్లో సూర్యుడు 02లో చదవండి. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?