అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వేరే నియోజకవర్గాల్లో కూడా.. తరచూ వినిపించే పేరు ఇది. ప్రతిపక్ష పార్టీల మీద విరుచుకుపడటం ద్వారానో, మాటల తూటాలను సంధించడం ద్వారానో, సీఎం జగన్ పై విపరీతమైన గౌరవాలనూ, భక్తిని కనబరచడం ద్వారానో .. లేక మరో కారణం చేతో.. తన సీనియారిటీతోనో..ఈ ఎమ్మెల్యే పేరు వేరే నియోజకవర్గాల్లో వినిపించడం లేదు.
తన నియోజకవర్గంలో చేపడుతున్న ఆ కార్యక్రమం ద్వారా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు ఇంటా, బయట గట్టిగా వినిపిస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన కార్యక్రమం ఆయన అంటే ఎవరో బయటి నియోజకవర్గం ప్రజలకు బాగా తెలిసేలా చేసింది. ప్రత్యేకించి ఆ కార్యక్రమాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా లైవ్ లో ప్రసారం చేయడం, పలు సార్లు కేతిరెడ్డి వీడియోలు వైరల్ గా మారడంతో.. ఆయన పేరు మార్మోగేలా చేసింది.
ధర్మవరం నియోజకవర్గం పరిధిలో ప్రతి రోజూ ఉదయాన్నే ఏదో ఒక వార్డు , లేదా ఏదో ఒక పంచాయతీలో పర్యటించడం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఉద్దేశ్యం. 2019లో రెండోసారి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన.. ఈ మూడేళ్ల వ్యవధిలో నియోజకవర్గంలోని మెజారిటీ ప్రాంతాన్ని కవర్ చేశారు.
కరోనా కారణంగా లాక్ డౌన్లు గనుక పడకపోయి ఉంటే.. దాదాపు నియోజకవర్గంలోని ప్రతి వీధీ లోనూ కేతిరెడ్డి పర్యటించినట్టుగా అయ్యేది! ఒకవైపు ధర్మవరం పట్టణంలో వార్డుల వారీగా, మరోవైపు మిగిలిన రూరల్ ఏరియాలో పంచాయతీల వారీగా కేతిరెడ్డి పర్యటనలు సాగుతూ ఉన్నాయి.
ఈ కార్యక్రమమే కేతిరెడ్డికి నియోకవర్గం అవతల కూడా ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. తమ ఎమ్మెల్యేలు కూడా ఇలా తమ ముందుకు వస్తే మంచిదనే అభిప్రాయాల్లో ఉన్నారు అనేక నియోజకవర్గాల్లోని ప్రజలు. ఎమ్మెల్యేలుగా నెగ్గగానే.. బెంగళూరుకో, హైదరాబాద్ కు చేరుకుని ఐదేళ్లూ సేదతీరే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఇలాంటి నేపథ్యంలో కూడా.. కనీసం నెలలో సగం రోజులు నియోజకవర్గంలో ఉండి, ఇలా ఉదయాన్నే ఏదో ఒక వార్డు, ఏదో ఒక పంచాయతీకి వెళ్లే వాళ్లు ఉండటం విడ్డూరమైనదిగా నిలిచే వాస్తవం అవుతోంది.
ప్రత్యేకించి కేతిరెడ్డి తన ఫీల్డ్ విజిట్ ను సోషల్ మీడియాలో లైవ్ పెట్టిస్తున్నారు. దీని వల్ల.. ఆయనకు అనూహ్య నిలదీతలు ఎదురైనా అవి డైరెక్టుగా ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. సమస్యల విషయంలో ప్రజలు నిలదీసే అవకాశం ఉందనే విషయాన్ని తెలిసి కూడా ధైర్యంగా వారి ముందుకు వెళ్లడం, దాన్నంతా లైవ్ గా ప్రసారం చేయడం గమనార్హం. ప్రజలతో ఈయన డైరెక్టుగా ఇంటరాక్ట్ అయ్యే విధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది కూడా. అందుకే కేతిరెడ్డి వీడియోలు యూట్యూబ్, ఫేస్ బుక్ లలో వైరల్ గా మారుతున్నాయి.
మరి ఈ మార్నింగ్ వాకర్ కు ఇప్పుడు మంత్రి పదవి దక్కుతుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అనుభవం, రెండోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నేపథ్యం.. కేతిరెడ్డి మంత్రి పదవి ఆశలకు మూలం. మరి ప్రజల మధ్యకు బాగా వెళ్తున్న ఈయనకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా.. అనేది సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. అయితే సామాజికవర్గ సమీకరణాలు.. జిల్లాలో ఇతర సీనియర్ నేతలు.. ఇవి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మంత్రి పదవికి సహజమైన ఆటంకాలే!