కేఏ పాల్‌ను బండ్ల గ‌ణేష్ ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్టు!

వారాంత‌పు ప‌లుకుల సార్ త‌న పేరుతో గుండెవిప్పి చేసే ఇంట‌ర్వ్యూ ఈ వారం భ‌లే త‌మాషాగా సాగింది. ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌ను క‌మెడియ‌న్‌, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్టుగా ఉంద‌నే…

వారాంత‌పు ప‌లుకుల సార్ త‌న పేరుతో గుండెవిప్పి చేసే ఇంట‌ర్వ్యూ ఈ వారం భ‌లే త‌మాషాగా సాగింది. ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌ను క‌మెడియ‌న్‌, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఒళ్లంతా విషం నింపుకుని, ఎదుటి వాళ్ల‌తో కూడా తిట్టించే కార్య‌క్ర‌మానికి ఓపెన్ హార్ట్ విత్ అంటూ చ‌క్క‌గా త‌న పేరును త‌గిలించుకోవ‌డం ఆ మీడియా సంస్థ అధినేత‌కే చెల్లిందే.

జ‌గ‌న్ ద్వేషి ప్ర‌శ్న‌లు సంధించ‌డం, వాటికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఇచ్చిన స‌మాధానాలు…. వారెవ్వా వంద మంది కేఏ పాల్‌లు, వంద మంది బండ్ల గ‌ణేష్‌లు ఒక్క చోట చేరితే క‌లిగే కామెడీని ఈ ఒక్క ఇంట‌ర్వ్యూ సృష్టించింది. వారాంత‌పు ప‌లుకుల సార్, సోము వీర్రాజు  ఒక్క‌సారి కామెడీ చేస్తే, వంద‌సార్లు చేసిన‌ట్టే అని నెటిజ‌న్లు ఊరికే అన‌లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే త‌న‌కు ఆరాధ‌న అని బండ్ల గ‌ణేష్ అనేక బ‌హిరంగ వేదిక‌ల్లో ప్ర‌క‌టించారు. కానీ వారాంత‌పు ప‌లుకుల సార్ మాత్రం ఎప్పుడూ అలా త‌న ఆరాధ్య దైవం చంద్ర‌బాబు గురించి ‘ఓపెన్‌’గా చెప్ప‌రు. ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తారు. ఎంతైనా తెలివైన వాడు క‌దా! ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. మ‌నుషుల‌ను చంపేవాళ్ల‌కు కూడా విమానాశ్ర‌యాలు క‌ట్టించామ‌ని, అలాగే తాము అధికారంలోకి వ‌స్తే చీఫ్‌గా మ‌ద్యాన్ని విక్ర‌యిస్తామ‌ని… ఇటీవ‌ల ఆయ‌న చేసిన కామెడీ త‌క్కువేం కాదు.

ఈ నేప‌థ్యంలో ఎల్లో చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వారాంతపు ప‌లుకుల సార్ సంధించిన చిలిపి ప్ర‌శ్న‌ల‌కు, అదే స్థాయిలో సోము వీర్రాజు చ‌క్క‌డి హాస్య స‌మాధానాలు ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు అడిగే స్థానంలో బండ్ల గ‌ణేష్‌ను, జ‌వాబిచ్చే స్థానంలో కేఏ పాల్‌ను ఊహించుకుంటూ, వీక్షిస్తే మ‌న‌సుకు ఎంతో రిలాక్ష్ క‌ల‌గ‌కుండా ఉండ‌దు. ఎంతో అదృష్టం చేసుకుంటే త‌ప్ప ఇంత హాస్య‌భ‌రిత‌మైన ఇంట‌ర్వ్యూను చూసే భాగ్యం క‌ల‌గ‌దు. న‌వ్వు తెప్పించే కొన్ని ప్ర‌శ్న‌లు, వాటి స‌మాధానాల గురించి తెలుసుకుందాం.

ఏపీని సర్వనాశనం చేసేశారని తెలంగాణలోని బీజేపీ ముఖ్య నేతలే అంటున్నారు కదా! అని వారాంత‌పు ప‌లుకుల సార్ ప్ర‌శ్నించారు. సోము వీర్రాజు స్పందిస్తూ…వాళ్లు అనడం కాదు.. నేనూ అంటున్నా. అతడిని (జగన్‌ను) ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రశ్నే లేదని అద్భుత స‌మాధానం.

ఈ మూడేళ్లలో చంద్రబాబు వేయలేని రోడ్లు జగన్‌ వేయాలి కదా! అది అడగాలి కదా? అని వీకెండ్ ప్ర‌శ్న‌. సోము వీర్రాజు స‌హ‌జ అమాయ‌క‌త్వ ధోర‌ణితో …జ‌గన్‌ మీద వ్యతిరేకత పెంచి చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనా మీ భావన! అని ఎదురు ప్ర‌శ్న‌. కేపిటలే లేదని అంటుంటే దాని చుట్టూ అభివృద్ధి ఏమిటి? కేపిటల్‌ లేదన్న కసి మీకుందా? అని ప్ర‌శ్న‌. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి.. రాష్ట్ర రాజధాని విషయంలో మాకున్న కసి మీకు కనిపించడం లేద‌ని కామెడీ ఆన్స‌ర్‌.

ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెబితే బడ్జెట్‌లో నిధులివ్వకపోవడం తీర్పును వెక్కిరించడమే కదా! అని ప్ర‌శ్నిస్తే, వీర్రాజు సార్ వీర్రావేశంతో… వెక్కిరించడమే కాదు.. అమరావతిని అభివృద్ధి చేయడం జగన్‌కు ఇష్టం లేదన్న స్పష్టమైన, స్థిరమైన అభిప్రాయం బీజేపీకి ఉంద‌ని జ‌వాబు. అభివృద్ధి చేయడం జగన్‌కు చేత కాద‌ని, కానీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంద‌న్నారు. ఇదే విషయాన్ని తాను ప్రెస్‌ మీట్‌ పెట్టి చెబితే మీరు అసలు వార్త రాయలేద‌ని, కొన్నిసార్లు త‌న‌ పేరే తీసేస్తున్నార‌ని, కొంచెం త‌మ‌కూ స్పేస్ ఇవ్వాల‌ని జాతీయ అధికార పార్టీ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి వేడుకోలు. దీనికి కామెడీ అని కాకుండా మ‌రే పేరు పెడితే బాగుంటుందో వాళ్లే చెప్పాలి.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్‌ అనడంలో అర్థం ఏమిటి? అని చంద్ర‌బాబు భ‌క్తుడు ప్ర‌శ్నికు వీర్రాజు స‌మాధానం అదుర్స్ అనిపించింది. ఆయ‌న ఏమ‌న్నారో తెలుసుకుని త‌రిద్దాం.  

‘సరైన రోడ్‌ మ్యాప్‌.. సరైన సమయంలో బీజేపీ అధిష్ఠానం ఇస్తుంది. ఆ రోడ్‌ మ్యాప్‌ ఏమిటన్నది ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాను. పొత్తుల విషయంలో మాకు స్పష్టత ఉంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాం. దాని గురించి ఇవాళే చెప్పండని మీరు అడగకూడదు.. అడిగినా నేను చెప్పను. జగన్‌ను టార్గెట్‌ చేయడానికి ఈ సంవత్సరం చివరి వరకూ సమయం తీసుకుంటాం. ఆ తర్వాత ఏం చేయాలన్నది మా పెద్దలు చెబుతారు’ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సోము వీర్రాజుతో స‌మాధానం చెప్పించారు. ఇంకా చాలా స‌మ‌యం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేచి చూడాల‌న్న మాట‌.

వచ్చే ఎన్నికల వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా? అని సార్ త‌న‌మార్క్ చిల్ల‌ర ప్ర‌శ్న సందించారు. విష్ణును శ్రీ‌నివాస‌రావు చెప్పుతో కొట్టిన‌ట్టుగా వీర్రాజు స‌మాధానం ఏంటంటే… ‘మూడు రోజుల్లో తీసేస్తారని మీరే రాశారు. ఇప్పటికి 8 నెలలైంది. ఇక నేనొచ్చిన తర్వాత బీజేపీ పాడైపోయిందా?’

‘ఎవరు సీఎం అయ్యారన్నది కాదు… ఆ రాష్ట్రం ఏడవకుండా ఉంటే నాకు చాలు’ అని వారాంత‌పు ప‌లుకుల సార్ నోట రావ‌డం న‌వ్వు తెప్పించ‌కుండా ఎలా వుంటుంది. దీనికి వీర్రాజు స్పందిస్తూ… ‘నవ్వించే.. సంతోషపెట్టే బాధ్యత మాది. ఇందుకు మీ వంతు సహకారం కావాలి’ అన‌డం ద్వారా హాస్యాన్ని పండించ‌డంలో ఇద్ద‌రూ ఇద్ద‌రే అనిపించుకున్నారు.  

‘పవన్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలని ప్రధాని మోదీ చెప్పారా.. అది నిజమేనా?’ అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం… దానికి ‘పవన్‌ మా అధిపతి అని నేను చెప్పా. అంతకు మించి దానిపై వివరణ ఇవ్వను. దానికి ఎలాంటి అర్థం ఉంటుందో మీరు ఊహించుకోండి’ అని స‌మాధానం ఇవ్వ‌డం వారెవ్వా హాస్య ర‌చ‌యిత జంద్యాల డైలాగ్‌ల‌ను మించిపోయేలా స్క్రిప్ట్‌.

ఇక ఈ ఇంట‌ర్వ్యూ ముగింపు సీన్ అద్భుతం. మ‌నిద్ద‌రం గ‌తంలో క‌లిసింది లేద‌ని, కానీ బ‌హిష్క‌రించాల‌ని మీరు ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించార‌ని వారాంత‌పు ప‌లుకుల సార్ అన్నారు. అంతేకాదు, ఆ న‌లుగురిని బ‌హిష్క‌రించాల‌ని తానే చెప్పాన‌ని, త‌న‌కు కూడా కొంచెం తిక్క వుంద‌ని, మొహ‌మాటం లేద‌ని సోము వీర్రాజుకు తెగేసి చెప్పారు.  

ఇందుకు సోము వీర్రాజు సార్ స‌మాధానం ఏంటంటే…

‘మీకు తిక్క ఉంది. దానికో లెక్క ఉందిలెండి. అవును మేమే బాయ్‌కాట్‌ చేశాం. మీ అభిప్రాయంతో నేను వంద శాతం ఏకీభవిస్తాను. మీకు పాదాభినమస్కారాలు’ అని చెప్పి ముగించారు. వారాంత‌పు ప‌లుకుల సార్ చాన‌ల్‌లో బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డిని చెప్పుతో కొట్టిన సంద‌ర్భంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ స‌ద‌రు ఎల్లో మీడియాధిప‌తికి సోము వీర్రాజు పాదాభి న‌మ‌స్కారాలు చేయ‌డం ….నాడు విష్ణును చెప్పుతో కొట్ట‌డ‌మే గౌర‌వ‌మ‌ని మ‌ధ‌న‌ప‌డే వాళ్ల‌కు ఎవ‌రు, ఏమ‌ని స‌మాధానం చెప్పాలో మ‌రి!