cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : కరోనా బ్లేమ్ గేమ్ – 2/2

ఎమ్బీయస్ : కరోనా బ్లేమ్ గేమ్ – 2/2

కరోనా సెకండ్ వేవ్‌లో మందులూ అవీ యివ్వడంతో బాటు కరోనా సెకండ్ వేవ్‌ను సరిగ్గా హేండిల్ చేయనందుకు ప్రపంచ దేశాలు దుమ్ము దులిపేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెడికల్ జర్నల్ ‘‘లాన్సెట్’’ తాజా సంచికలో ఎడిటోరియల్ రాస్తూ ‘మార్చి మొదటివారంలో కోవిడ్ పెరుగుతూండగానే కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ‘మహమ్మారిని ఖేల్ ఖతమ్ (ఎండ్‌గేమ్‌లో వుంది)’ అని ప్రకటించారు. కొత్త వేరియంట్లతో సెకండ్ వేవ్ విరుచు పడబోతోందన్న ప్రమాద సంకేతాలు కనబడుతున్నా, కేసులు తక్కువగా వున్నాయి కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి భారతదేశం కరోనాను జయించివేసిందనే భావాన్ని ప్రభుత్వం కలిగించింది. ఐసిఎమ్‌ఆర్ జనవరిలో నిర్వహించిన సెరోసర్వే ప్రకారం జనాభాలో 21శాతం మందికి మాత్రమే ఇమ్యూనిటీ వచ్చింది. మహమ్మారిని నియంత్రించడం కంటె విమర్శలు రాకుండా చూడడంపైనే మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని తోస్తోంది.

‘సూపర్‌స్ప్రెడర్’ వేడుకల వలన రిస్కు వుంటుందని హెచ్చరికలు వస్తున్నా లక్షలాది మంది హాజరయ్యే మతపరమైన ఉత్సవాలు జరపడానికి అనుమతి నిచ్చింది. జాగ్రత్తలు పాటించని రాజకీయపరమైన ఊరేగింపులకు కూడా..! కోవిడ్ భయం తొలిగిపోయిందన్న సంకేతం వెళ్లడంతో టీకా కార్యక్రమం మందగించి, జనాభాలో 2శాతం మంది మాత్రమే వాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్రాలతో సంప్రదించకుండా వాక్సినేషన్ విధానాన్ని మార్చడం జరిగింది. 18 సం.ల పైబడిన వారందరికీ యిస్తాననడంతో వాక్సిన్లకు కొరత ఏర్పడి గందరగోళం నెలకొంది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కేసులు హఠాత్తుగా పెరిగి, మెడికల్ ఆక్సిజన్, హాస్పటల్ బెడ్స్ దొరక్క శ్మశానాలలో కూడా రద్దీ ఏర్పడింది. ఆక్సిజన్ కోసం అడిగే పేషంట్లను కొన్ని రాష్ట్రాలు జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతాయని బెదిరిస్తున్నాయి. కేరళ, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాలు ముందుగానే సన్నిద్ధమై, ఆక్సిజన్ విషయంలో యితరులకు యిచ్చే పరిస్థితిలో వున్నాయి.

ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్స్ ఆగస్టు 1 నాటికి 10 లక్షల కోవిడ్ మరణాలు సంభవిస్తాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే కోవిడ్ తొలిదశలో ఒనగూడిన ప్రయోజనాలను వృథా చేసి, మలిదశలో స్వయంగా తెచ్చిపెట్టుకున్న యీ విపత్తుకు మోదీ ప్రభుత్వం బాధ్యత వహించారి. ఏప్రిల్ వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ నెలల తరబడి సమావేశమే కాలేదు. దాని ఫలితాలు యిప్పుడు చూస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితి గురించి చర్చిస్తున్నవారిపై, విమర్శిస్తున్నవారిపై మోదీ చర్యలు తీసుకోవడం క్షమార్హం కాదు. ..’ ఇలా రాసి, ఇండియా ఏమేం చేయాలో కూడా సూచనలిచ్చింది.

అనేక విదేశీ పత్రికలు యిదే ధోరణిలో రాయడంతో బిజెపి సమర్థకులు ‘విదేశీ శక్తులు మన ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి కంకణం కట్టుకున్నాయి, అందుకే అలా రాస్తున్నాయి’ అని అనడం సాగించారు. వాళ్లు రాసినది నిజమా, కాదా అన్నది వీళ్లకు అక్కరలేదు. ‘బిజెపి మైండ్‌గేమ్’ అనే ఆర్టికల్‌లో నేను బెంగాల్ ఎన్నికల ఫలితాల గురించి బిజెపి చెపుతున్న అబద్ధాలను ససాక్ష్యంగా నిరూపిస్తే, ‘అవి ఎత్తిచూపడానికి నువ్వేమైనా ప్రతిపక్ష నాయకుడివా?’ అంటూ అడిగినట్లుంది. ఎన్నికలు నెగ్గడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తూ వుంటారు. కానీ ఫలితాలు వచ్చాక కూడా అంకెలు మార్చేసి, వెయ్యి మార్జిన్‌తో పోగొట్టుకున్నవి మూడైతే 72 అని చెప్పుకుని, బుకాయిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తే ఎత్తి చూపాలంటే నేనిప్పుడు అర్జంటుగా ఏదో పార్టీలో చేరాలా? ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నదే వాళ్లు రాస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి వాళ్లు బావుకునేది ఏమీ లేదు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వాళ్లు ఆశించినా అది జరిగేది కాదు.

ఇండియన్ ఓటర్లు విదేశీ పత్రికలు చదివి ఓటేయరు. తమ అనుభవాల బట్టే వేస్తారు. ట్రంప్ గురించి మనం ఎన్ని రాసినా, అమెరికన్ ఓటరు చదివాడా? ఓటేద్దామనుకుంటే మానాడా? విదేశీ పత్రికలు పొగిడినపుడు మోదీ అంతర్జాతీయంగా కూడా వెలిగిపోతున్నాడు అని సంబరపడినప్పుడు, యిప్పుడీ విమర్శను కూడా స్వీకరించగలగాలి. అంతేకానీ మోదీని విమర్శిస్తే భారతీయులందరికీ అవమానం జరిగిపోయిందన్న బిల్డప్ యివ్వనక్కరలేదు. వాళ్లకు దురుద్దేశాలు ఆపాదించనక్కరలేదు. విశ్వమంతా కుగ్రామం అయిపోయిన యీ రోజుల్లో రాకపోకలు పెరిగిపోయాయి, కరోనా కొత్త స్ట్రెయిన్ల వ్యాప్తి అతి సులభమై పోయింది. అందుకే మన దేశంలో అనేక దేశాల స్ట్రెయిన్లు వున్నాయి. మన పాటికి మనం మరి కొన్ని ఉత్పత్తి చేస్తున్నాం. విదేశీయలందరికీ ఇండియాతో పని వుంది. ఇండియా జబ్బు పడితే వాళ్లూ పడతారు. అందుకే జాగ్రత్తగా వుండడి బాబూ అని హెచ్చరిస్తున్నారు. దాన్ని చూసి పారానోయియాతో బాధపడితే ఎలా?

పరిస్థితి యిక్కడిదాకా వచ్చాక అందరి నోళ్లూ లేస్తున్నాయి. ఎన్నికలన్నీ పూర్తయ్యాక, కోర్టులు ఎన్నికల కమిషన్‌ను తప్పు పడుతున్నాయి. ఏం ఎన్నికలు ప్రకటించగానే ఎందుకు అడ్డుకోలేదు? అనేక సందర్భాల్లో సుమోటోగా ఆదేశాలు యిస్తూ వుంటారే! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకోవడం శుద్ధ దండగ. పాటించడం లేదని టీవీల్లో చూడగానే, వాయిదా వేయాల్సింది. ఇప్పుడు ప్రజారోగ్యం గురించి తెగ బాధపడుతున్నారు. హాస్పటళ్ల నిర్మాణం గురించి, ఆక్సిజన్ సరఫరా గురించి, మందుల పంపిణీ గురించి, వాక్సినేషన్ కార్యక్రమం గురించి ఎప్పటికప్పుడు కార్యాచరణ గురించి, మైల్‌స్టోన్స్ గురించి అడిగారా? మానిటార్ చేశారా? లాక్‌డౌన్ పెట్టండని కానీ, పెట్టవద్దని కానీ చెప్పేస్తున్నారే, గత ఏడాది వలస కార్మికుల అభాగ్య పరిస్థితి గురించి పిల్ వేస్తే అది కేంద్రమే చూసుకుంటుందని దులిపేసుకున్నారే! ఇవాళ కెసియార్ రోజు గడువు కూడా యివ్వకుండా లాక్‌డౌన్ విధించి మళ్లీ వలస కార్మికులనే కాదు, అందర్నీ కష్టాల పాలు చేశారు. అప్పుడే కోర్టులు కఠినంగా వ్యవహరించి వుంటే, యిప్పుడిలాటివి జరిగేవి కావేమో! సుప్రీం కోర్టు చెప్పినా, కేంద్రం వినాలని లేదు. అయోధ్య రామాలయం విషయంలో కోర్టు తీర్పే శిరోధార్యం అంటుంది. ఇప్పుడు వాక్సిన్ పంపిణీ విధానంలో అవకతవకల గురించి అడిగితే అది ఎగ్జిక్యూటివ్ నిర్ణయం, మీరు ప్రశ్నలేయకూడదు అంటోంది.

ఎన్నికల కమిషనర్ విషయానికి వస్తే అది స్వతంత్ర సంస్థగానే పనిచేస్తోందా? బెంగాల్ విషయంలోనే అది బిజెపి చెప్పినట్లా ఆడింది. దాని ప్రయోజనాలకై సమర్థించుకోవడానికి వీలులేని పనులెన్నో చేసింది. ఇసి చెప్పింది కాబట్టి మేం ఎన్నికలు పెట్టవలసి వచ్చింది అని కేంద్రం తప్పించుకుంటుంది. ఇవ్వడానికి అంగీకరించిన ప్రత్యేక హోదా ఎందుకు యివ్వరు? అంటే ఫైనాన్స్ కమిషన్ యివ్వద్దంది, మరోటి ఎందుకు చేయలేదు? నీతి అయోగ్ వద్దంది, ఇలా అందరి మీదా తోసేయడం మోదీ సర్కారుకి అలవాటుగా మారింది. వాళ్లు ఎన్నికలు పెడదామనుకున్నారు, పెట్టారు. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో పదవి కోసం, ట్రంప్ వేడుక కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారని విమర్శలు వెల్లువెత్తినా వాళ్లకు చీమ కుట్టినట్లు లేదు. ఈ ఏడాది మళ్లీ అదే పని చేశారు.

అఖిలపక్షంతో కలిసి కూర్చుని, విపత్తు వచ్చిపడుతోంది, ఎన్నికలు వాయిదా వేద్దామా అని అడిగి వుంటే ఎలా వుండేదో! ఎందుకంటే అసాంలో తప్ప వేరెక్కడా బిజెపి ప్రభుత్వం లేదు. అందువలన దురుద్దేశాలు ఆపాదించలేరెవరూ! కరోనా పెచ్చు మీరదు అనుకుని ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారనుకున్నా, నా జీవితంలో యింత పెద్ద సభ చూడలేదని మోదీగారు మురిసిపోయే లెవెల్లో భారీ సభలు నిర్వహించడం సబబు కాదు కదా! బెంగాల్‌లో చివరి దశలో కేసులు పెరగగానే, యికపై సభలు పెట్టను, చివరి మూడు దశలు కలిపేయండి అని మమత అడిగినా, వినకుండా 500 మందికి మించిన సభలు జరపం తప్ప, మూడు దశలు కలపం, సభానిర్వహణ మానం అని బిజెపి ప్రకటించడమేమిటి? మీటింగైతే 50 మంది, పెళ్లయితే 200 మంది అంటూ నిబంధనలు పెట్టుకున్నపుడు వాటి కంటె ముఖ్యమా, రాజకీయ సభలు? 2014లోనే మోదీ లేజర్ షోల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు అలాటివి చిన్న చిన్న సభల్లో ఏర్పాటు చేసి ఎక్కువమంది గుమిగూడకుండా చేయలేక పోయారా?

2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఫుల్‌వామాలో సిఆర్‌పిఎఫ్ దళాలపై దాడి జరిగి, 40 మంది చనిపోతే ఆ క్రైసిస్‌ను ఆపర్చ్యూనిటీగా మార్చుకోవడానికి 12 రోజుల్లోగా బాలాకోట్ దాడులు జరిపించి, మోదీ గతంలో కంటె ఎక్కువ మెజారిటీతో నెగ్గారు. మరి కరోనా విషయంలో ఫస్ట్ వేవ్ తీవ్రంగా లేకపోవడమనే ఆపర్చ్యూనిటీని తన నిర్లక్ష్యంతో సెకండ్ వేవ్‌గా క్రైసిస్‌గా మార్చుకుని ప్రజల దృష్టిలో దోషిగా నిలబడ్డారు. తన వాక్చాతుర్యంతో, హావభావాలతో ప్రజలను ఆకట్టుకోవడంలో మోదీ దిట్ట. బిజెపి నాయకులలో చాలామంది మంచి వక్తలు. కానీ ప్రస్తుతం వాళ్లందరి స్వరాలు మూగబోతున్నాయి. మోదీ మూగనోము పట్టారు. తనపై వచ్చిపడుతున్న నిందలను అధికారికంగా కానీ, రాజకీయంగా కానీ తిప్పికొట్టలేక, మన్‌మోహన్‌ను మించిన మౌనముని అయిపోయారు.

ఇక బిజెపి నాయకులైతే టీవీ చర్చల్లో రాష్ట్రాలనే తప్పుపడుతున్నారు. వాళ్లు చేసిన తప్పులనే చెపుతున్నారు. చేతనైతే కేంద్రాన్ని అడిగి ఆక్సిజన్ యిప్పించండి, వాక్సిన్లు యిప్పించండి అని తెరాస వాళ్లు అడిగితే దానికి సమాధానం చెప్పరు. మీరు ఉత్తరం రాసి వుండరు అనేసి వూరుకుంటున్నారు. బిజెపి అంటే కేంద్రం ఒకటే కాదు కదా! 18 రాష్ట్రాలు ఎన్‌డిఏ పాలిత రాష్ట్రాలే కదా! వాటిలో జరుగుతున్న దారుణాలకు ఎవరు జవాబుదారీ వహిస్తారు? యుపిలో కరోనా రోగులను నదిలోకి తోసేస్తూ వుంటే, బిహార్‌లో తేలుతున్నాయి. రెండూ ఎన్‌డిఏ పాలిత రాష్ట్రాలే. మెడికల్ ఫెసిలిటీస్‌కు, వాక్సిన్ యివ్వడానికి డబ్బు లేదు కానీ సెంట్రల్ విస్టాకు డబ్బు ఎలా వస్తోంది? దానికి యిదే సమయమా? ఎన్నికలు కాగానే పెట్రోలు ధరలు పెంచినది దానికోసమేనా అని ప్రజలు, ప్రతిపక్షాలు అడుగుతూంటే బిజెపి నాయకుల నోళ్లు పెగలడం లేదు.

కరోనా సెకండ్ వేవ్ విషయంలో బిజెపి ప్రధాన దోషే కానీ, తక్కిన పార్టీలకు కూడా క్లీన్ చిట్ యివ్వలేం. వాళ్లయినా ఎన్నికలు వద్దని బహిరంగ విజ్ఞప్తి చేసి వుండాల్సింది. కాదూకూడదని ముందుకు వెళితే బహిష్కరిస్తామని హెచ్చరించి వుండాల్సింది. పిల్స్ వేసి వుండాల్సింది. కేంద్రానికి సరే అవగాహన లేదు, రాష్ట్రాలు మాత్రం ఏం చేశాయి? స్థానిక ఎన్నికలు నిర్వహించలేదా? కోర్టు బలవంతం వలన స్థానిక ఎన్నికలు నిర్వహించిన కేరళ వాటి కారణంగా కరోనా కేసులు పెరిగాయి, మీరూ జాగ్రత్త పడండి అని తక్కిన రాష్ట్రాలను హెచ్చరించింది కదా, ఒక్కటైనా విందా?

ఆంధ్రలో ప్రభుత్వం ఎన్నికలు జరపనంటే కమిషనర్ మొండికేసి జరిపించారు. హైకోర్టు ఆయనకు మద్దతుగా నిలబడి, ప్రభుత్వం చేత బలవంతంగా జరిపించింది. అక్కడితో ఆగి వుంటే జగన్ పరువు మిగిలేది. గత ఏడాది మొదట్లో కరోనాను సాధారణ జ్వరంగా తీసిపారేసినా, తర్వాత బుద్ధి తెచ్చుకుని టెస్టింగ్‌లు విస్తృతంగా చేయించి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బాధితులను ఆదుకుని, ఎన్నికలకు అడ్డుపడి కరోనా వ్యాప్తిని అడ్డుకట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు అని. కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టి, పాత కమిషనర్  పారిపోతే కొత్త కమిషనర్ చేత వెంటనే చేయించి, యితరులతో పాటు తనూ సమానమయ్యాడు. ఇక కెసియార్ అయితే కరోనా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత కూడా మునిసిపల్ ఎన్నికలు జరిపించాడు.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపయెన్నికల గురించి మా వరప్రసాద్ ఒక మంచి వ్యాఖ్యానం చేశాడు – ఎన్నో యూనివర్శిటీలకు వైస్ ఛాన్సలర్లు లేక చదువు, పరిశోధనా మూలపడి వున్నాయి. ఏళ్లతరబడి ఆ పోస్టులు ఖాళీగా వున్నా పాలకులకు పట్టదు కానీ, ఎమ్మెల్యే పోస్టో, ఎంపీ పోస్టో ఖాళీ అయితే మాత్రం ఆదరాబాదరాగా భర్తీ చేయడానికి ఎందుకంత హడావుడి? దానివలన ప్రభుత్వ యంత్రాంగం ఏమైనా కుంటుబడుతోందా? నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం అవుతోందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా యిదే అడిగారు. లక్షలాది ప్రభుత్వోద్యాగాలు ఖాళీగా వున్నాయి. విపత్సమయాల్లో సిబ్బంది లేక పనులు సరిగ్గా జరగవు. వాటిని నింపరు కానీ యీ కరోనా వ్యాపిస్తున్న సమయంలో కూడా లక్షలాది మంది పాల్గొనే ఎన్నికల ప్రచారం జరుపుతూన్నారు అని. ఈ విషయంలో అన్ని పార్టీలూ నింద పడవలసినదే. అమెరికాలో ట్రంప్ కరోనా విషయంలో తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ వుంటే, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ధిక్కరించలేదా? అలాటిది యిక్కడెందుకు జరగలేదు?

ఇక కుంభమేళా గురించి. ఇప్పుడందరూ అలాఎలా అనుమతిచ్చారని అడిగేవాళ్లే! ప్రకటించినప్పుడు ఎందుకు అడగలేదు? ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా కుంభమేళా జరపకూడదు అని అభ్యంతరం చెప్పిందా? దానికి వెళ్లకండి అని తన ప్రజలకు హితవు చెప్పిందా? వెళితే పరీక్షలు జరపనిదే రాష్ట్రంలోనికి రానీయం, వచ్చాక కూడా రెండు వారాల పాటు ట్రాక్ చేస్తాం అని హెచ్చరించిందా? ఇదేమైనా విదేశీ ప్రయాణమైతే, తక్కువమందే వుంటారు కాబట్టి, పాస్‌పోర్టు వివరాలు వుంటాయి కాబట్టి ట్రాక్ చేయడం సులభం. కుంభమేళా వంటి లక్షలాది మంది పాల్గొనే ఉత్సవానికి దూరూదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఎన్ని రాష్ట్రాలను దాటుకుని రావాలి? రైలు, బస్సు, టాక్సీ వంటి ఎన్ని సాధనాలను ఉపయోగించి వుంటారు? వాళ్ల చేతుల మీద కుంభమేళా పచ్చబొట్టు ఏమీ వుండదు కదా! ఎలా గుర్తించగలరు? కుంభమేళాకు వెళ్లి వచ్చినవారు దేశం మూలమూలలకు కూడా వెళ్లిపోయారు కాబట్టే యీరోజు దేశంలో 70శాతం ప్రాంతాలలో కరోనా విజృంభించింది అంటున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడాయే లేదు.

ఈ అంశంపై యింకా రాయాల్సింది వుంది. ముఖ్యంగా వాక్సిన్ కన్‌ఫ్యూజన్ గురించి! దీనికి ముగింపుగా రాయాల్సిందేమిటంటే – ఈ సెకండ్ వేవ్ ఉత్పాతానికి ప్రజల తప్పు చాలానే వుంది. 2020 సెప్టెంబరు నుంచి జనం రిలాక్స్ కావడం ప్రారంభించారు. ఇక డిసెంబరు వచ్చేసరికి విజృంభించేశారు. పెళ్లిళ్లూ, పార్టీలూ అవీ జోరుగా సాగాయి. పరిమితులు పేపరు మీదే తప్ప అమలు కావడం మానేశాయి. నా బోటి వాడు బయటకి వెళ్లడానికి భయపడసాగాడు. సామాజిక దూరం పాటించడం మానేసి, మీదమీద పడిపోసాగారు. మాస్కు వుంటుంది కానీ అది గడ్డానికి వుంటుంది. ఎన్నికలలో కోలాహలంగా పాల్గొన్నారు. ఇప్పుడు అలోలక్ష్మణా అని ఆక్రోశిస్తున్నారు.

ప్రజల యీ ప్రవర్తనకు కారణం ఏమిటంటే తప్పకుండా పాలకులు, నాయకులనే వేలెత్తి చూపించాలి. ప్రజలెప్పుడు వాళ్ల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి వాళ్లు పట్టించుకోరు. ప్రభుత్వమే ధాటీగా చెప్పాలి, హెచ్చరించాలి. బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకో, కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్టు పెట్టుకో, లేకపోతే జరిమానా వేస్తాం అని ప్రభుత్వం చెప్పాలా? అది నీ తలకాయ కాదా? హెల్మెట్ పెట్టుకుంటే గవర్నమెంటును ఉద్ధరిస్తున్నావా? హైవేల మీద కూడా హెల్మెట్ లేకుండా బైక్ మీద ముగ్గురేసి వెళ్లడం చూస్తాంగా! షేర్ ఆటోలో కిక్కిరిసి కూర్చుని, కింద పడిపోయేట్లా వెళ్లడం చూస్తాంగా! సిగరెట్టు, మద్యం హానికరం అని ప్రభుత్వం చెప్పాలా? పోయేవి నీ ఊపిరితిత్తులు, నీ కాలేయం కాదూ! రాంగ్‌సైడ్ వెళ్లి యాక్సిడెంటు చేసుకుంటే, గేటు వేసినప్పుడు రైలు పట్టాలు దాటితే పోయేది నీ ప్రాణం కాదూ! అయినా ప్రభుత్వం వచ్చి గట్టిగా చెప్పాలి, దండించాలి. ఇదీ ప్రజల తీరు.

ఇలాటి ప్రజలు కోవిడ్ విషయంలో మాత్రం వేరేలా ఎందుకు ప్రవర్తిస్తారు? తక్కిన విషయాల్లో చేసినట్లే దీని విషయంలోనూ పాలకులే హెచ్చరించాలి, దండించాలి. వాళ్లు అది చేయలేదు సరికదా, ప్రజల్ని జోకొట్టారు. పశ్చిమదేశాలను కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిస్తోంది కానీ, మన దగ్గర తోక ముడిచింది. మనం కరోనాను జయించేశాం, మన దగ్గర మరణాలు తక్కువ. మనల్ని చూసి అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకుంది. మన నాయకత్వాన్ని కొనియాడింది. అందుకే అన్నీ తెరిచేశాం, ధైర్యంగా ఎన్నికలు పెట్టాం, కుంభమేళా పెట్టాం. వేలాది జనాలతో పెద్దపెద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నాం – అని చెప్పారు.

ఈ సంకేతాలను సాధారణ ప్రజలు యిలా కాక వేరెలా అర్థం చేసుకుంటారు? మాస్కు పెట్టుకోండి అని మొక్కుబడిగా నాయకులు చెప్తున్నారు కానీ, వాళ్లు పెట్టుకోకుండానే టీవీల్లోనూ, బయటా కనబడసాగారు. ఇప్పుడు ప్రజలకు అసలు సంగతి తెలిసివచ్చింది. కరోనా మనల్ని వదలలేదని, ఏడాదిగా మన ప్రభుత్వాలన్నీ కావలసిన సరంజామా సన్నద్ధం చేసుకోలేదని అర్థమైంది. కానీ టూ లేట్! ఈ వ్యాసం మొదలుపెట్టి ముగించేలోగా ఎన్నో ప్రాణాలు పోయి వుంటాయి. మొదటి వేవ్‌లో వలసకార్మికుల విషాదం ఒక పెద్ద వైఫల్యమైతే ఈ సెకండ్ వేవ్ నిర్వాకం దాని కన్నా పెద్ద వైఫల్యం. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)

mbsprasad@gmail.com

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×