Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కోవాక్సిన్ – కోఆపరేషన్

ఎమ్బీయస్: కోవాక్సిన్ – కోఆపరేషన్

కోవాక్సిన్ గురించి ఉగాది నాడు ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. హిందూ బిజినెస్‌లైన్‌లో. ఎన్‌డిటివిలో కూడా. కానీ తెలుగు మీడియాలో ఎక్కడా నాకు కనబడలేదు. పేపర్లు కానీ, టీవీలు కానీ దాన్ని ప్రస్తావినట్టు ఆ తర్వాతైనా చర్చించినట్లు కనబడలేదు. 2-18 సం.ల వయసున్న పిల్లలందరికీ కోవాక్సిన్‌ను ఆమోదించారని జనవరిలో వచ్చిన న్యూస్‌నే పదేపదే వల్లిస్తున్నారు తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ వంటి ఐరాస సంస్థలను కోవాక్సిన్ కొనవద్దని చెప్పిందన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. ఎమర్జన్సీ యూజ్ కింద WHO కోవాక్సిన్‌ను అనుమతించిందన్న సంగతి విదితమే. యునిసెఫ్ వంటి సంస్థలు భారత్ బయోటెక్ నుండి కోవాక్సిన్ కొని, కొన్ని దేశాలకు సప్లయి చేస్తున్నాయి. ఇప్పుడు WHO వాటి ద్వారా ఆ సప్లయి ఆపేయమంది. ఇప్పటిదాకా సప్లయి చేసినవాటిపై సముచితమైన చర్యలు తీసుకోమని ఆ యా దేశాలకు నిర్ణయం వదిలేసింది.

ఇంతటి కఠినచర్య ఎందుకు తీసుకుందా అని అనుకుంటున్నారా? భారత్ బయో జిఎంపిలో లోపాలు కనబడ్డాయి కాబట్టి! జిఎంపి అంటే గుడ్ మాన్యుఫేక్చరింగ్ ప్రాక్టీస్. ఉత్పాదన సురక్షితమైనదిగా, ప్రభావవంతమైనదిగా ఉండేటందుకు ఫ్యాక్టరీవాళ్లు అవలంబించే నాణ్యతాపరమైన విధానం. వాళ్లు ప్రధానంగా చూసేది మూడు, ఉత్పాదక కేంద్రం బయటి, లోపలి పరిసరాలెలా ఉన్నాయి? ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి? తయారీలో పాలు పంచుకుంటున్న సిబ్బంది నైపుణ్యం, పరిజ్ఞానం ఎలా ఉన్నాయి? సిజిఎంపి (కరంట్ జిఎంపి) అంటే యీ విధానానికి అనుగుణంగా యీ మూడిటిలోనూ ఆధునీకరించుకుని అప్‌టుడేట్‌గా ఉంచుకోవడం. ఇప్పుడు కోవాక్సిన్ ఉత్పత్తిలో నాణ్యతా ప్రమాణాలు పాటించబడలేదని WHO కనుగొంది. ఇలాటి ఆరోపణ గతంలో కూడా విన్నట్టుగా తోస్తోందా? కరక్టే. గత ఏడాది బ్రెజిల్‌ డ్రగ్ కంట్రోలర్ ‘అన్విసా’ యిదే ఆరోపణ చేసి, తమ దేశపు ఆర్డరును కాన్సిల్ చేయించింది. అప్పుడు భారత్ బయో వాళ్లు సమాచారలోపం, అవగాహనలోపం వంటి కారణాలు చెప్పారు. కొన్ని రోజుల్లోనే అవి సరి చేసి, వాళ్లను మెప్పిస్తాం అన్నారు.

ఏడాది దాటినా అది జరగలేదని యిప్పుడు WHO తేల్చేసింది. 2022 మార్చి 14-22లో తనిఖీ చేసి, యీ నిర్ణయానికి వచ్చింది. ఈ జిఎంపి రిపోర్టు పేజీలు వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నచిన్న లోపాలుంటే వాళ్లు యిలాటి నిర్ణయాలు తీసుకోరు. ఎల్లో ట్యాగ్ పెట్టి కంపెనీ దృష్టికి తెచ్చి, మార్పులు సూచించి, వీటిని సరి చేసుకుంటే మంచిది అనే సూచనలు చేసి ఊరుకుంటారు. అంత కంటె ఎక్కువ స్థాయిలో లోపాలు కనబడితే గ్రీన్ ట్యాగ్ అని యిస్తారు. ‘ఈ లోపాలు త్వరలోనే సరి చేసుకోకపోతే మేం అనుమతి రద్దు చేస్తాం. అప్పటిదాకా ఉత్పత్తి ఆపుకోవలసిన పని లేదు.’ అని అర్థం. భారీ స్థాయిలో లోపాలు కనబడితేనే రెడ్ ట్యాగ్ యిస్తారు. ‘మీ నాణ్యత మా ప్రమాణాలకు తగినట్లుగా లేదు కాబట్టి మీ దగ్గర కొనేందుకు అనుమతించము’ అని చెప్పేస్తారు. అవి సరిదిద్దుకుని, మళ్లీ అప్లయి చేసుకుంటే, అప్పుడు వచ్చి పరీక్షించి, తృప్తి పడ్డాకనే గ్రీన్ స్టేటస్‌కు మారుతుంది.

భారత్ బయోకి WHO తో తకరారు ఎప్పణ్నుంచో ఉంది. వాళ్ల హెపటైటిస్-బి వ్యాక్సిన్ రీవాక్-బి 1998లో తయారైతే దానికి WHO ప్రి-క్వాలిఫికేషన్ పదేళ్ల తర్వాత దక్కింది. ఈ లోపున 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ రూ. 50 కోట్ల విరాళం యిచ్చి రాష్ట్రమంతటా హెపటైటిస్-బి వాక్సిన్ క్యాంపులు నిర్వహించమంది. ప్రభుత్వం టెండర్లు పిలుస్తూ టీకాలకు ప్రి-క్వాలిఫికేషన్ ఉండాలంది. భారత్‌ బయో కంటె 14 నెలలు ముందుగానే వచ్చిన శాంతా బయోటెక్ వారి హైపటైటిస్-బి వ్యాక్సిన్ శాన్‌వాక్ బి నాలుగున్నరేళ్లకే WHO ప్రి-క్వాలిఫికేషన్ తెచ్చుకుని సిద్ధంగా ఉండి టెండరు వేసింది.

డిసిజిఐ అనుమతి ఉండగా WHO ప్రి-క్వాలిఫికేషన్‌తో పని లేదని భారత్ బయో వాదించింది. దానికి ప్రత్యేకత ఏమీ లేకపోతే మరీ దానికై ఒకసారి కాదు, రెండుసార్లు ఎందుకు ప్రయత్నించి విఫలమయ్యారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఫైనల్‌గా శాన్‌వాక్ బికే టెండరు దక్కింది. రీవాక్‌-బికి ప్రి-క్వాలిఫికేషన్ 2008 డిసెంబరులో దక్కింది. అది కూడా 2011లో ప్రమాదంలో పడింది. WHO టీము 2011 సెప్టెంబరులో భారత్ బయో పర్యటనకై వచ్చి, జిఎంపి లేదని నాణ్యతా ప్రమాణాలు చాలలేదని గమనించి, యునిసెఫ్‌ వగైరాలకు సప్లయి చేయడానికి వీల్లేదని ఆంక్ష పెట్టింది.

వాటితో బాటు మరో రెండు వ్యాక్సిన్‌ల ప్రి-క్వాలిఫికేషన్‌కై భారత్ పెట్టుకున్న అప్లికేషన్లను కూడా పెండింగులో పెట్టేసింది. తర్వాత కంపెనీ ఆ లోపాలను సవరించుకున్న తర్వాత మళ్లీ ప్రి-క్వాలిఫికేషన్‌ను పునరుద్ధరించింది.

ఎగుమతులు చేద్దామని చూసే ఫార్మా కంపెనీలకు ఇలాటిది తప్పనిసరి వ్యవహారం. దానిలో పెద్ద వింతేమీ లేదు. యుఎస్‌ఎఫ్‌డిఏ (యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్) దశాబ్దాలుగా తమ టీములను మన ఇండియన్ ఫార్మా కంపెనీలకు పంపి, వాటి నివేదికల ఆధారంగా యీ సిజిఎంపిపై వార్నింగు లెటర్స్ పంపుతూనే ఉంటుంది. కరోనా కారణంగా యిటీవల పర్యటనలు ఆగిపోయి, యిప్పుడే మళ్లీ మొదలయ్యాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సి, గతంలో డిసిజిఐ అనేవారు) యిలాటి చెకింగు ముందే చేసేసి భారతీయ కంపెనీలకు మచ్చ పడకుండా చూడాలి. ఫార్మా కంపెనీలు ఎప్పణ్నుంచో పడుతూ వస్తున్న యిలాటి యిబ్బందుల గురించి పత్రికల్లో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్‌లో కోవాక్సిన్ విషయంలో WHO ఆంక్ష విధించినప్పుడు దీన్ని తెలుగు మీడియా కవర్ చేయకపోవడం, జాతీయ మీడియా పెద్దగా ప్రాధాన్యత యివ్వకపోవడం, కోవాక్సిన్ భాగస్వాములుగా వ్యవహరించిన ప్రభుత్వసంస్థలైన ఐసిఎమ్మార్, ఎన్ఐవి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) స్పందించకపోవడం.. యివన్నీ గమనించవలసిన వ్యవహారాలు.

ఎందుకిలా జరిగింది అంటే యిన్నాళ్లూ భారత్ బయో ఒక ప్రయివేటు సంస్థగా తన తంటాలేవో తను పడుతూ వస్తోంది. కానీ కోవిడ్ విజృంభణతో భారత ప్రభుత్వం భారత్ బయోను చంక నేసుకుంది. ఎన్ఐవి ద్వారా ఒక దశ వరకు తీసుకుని వచ్చిన వ్యాక్సిన్‌ కాండిడేట్‌ను ఐసిఎమ్మార్, భారత్ బయోకి యిప్పించి కోవాక్సిన్‌ అభివృద్ధి అయ్యేట్లు చేసింది. దీన్ని భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆత్మనిర్భర్ ప్రాజెక్టు’గా తీసుకుంది. అందుకనే అడుగడుగునా కోవాక్సిన్‌ను వెనకేసుకుంటూ వచ్చింది. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే ఎమర్జన్సీ అనుమతి యివ్వడం, దానిపై ఆభ్యంతరాలు రావడంతో ఆ టైము లిమిటు పూర్తయ్యేదాకా ఆగి, అప్పణ్నుంచి టీకాలు వేసేయమనడం, ప్రధానమంత్రి స్వయంగా ఆ వాక్సిన్ వేసుకున్నారని కంపెనీ ఫోటో విడుదల చేయడం, పలు రాష్ట్రాలలో ఫెసిలిటీలు తెరిచేందుకు కంపెనీకి సహకరించడం, తన ఉత్పాదకశక్తి గురించి అది ఉత్ప్రేక్షలు చెపుతూంటే ఖండించకపోవడం.. యిలా చాలా రకాలుగా దాన్ని నిలబెట్టాలని చూశారు.

కోవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించాలని నేషనల్ టెక్నాలజీ ఎడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ మాజీ సభ్యుడు డా. జేకబ్ పులియేల్ పిల్ వేస్తే యీ మార్చిలో భారత్ బయో, సీరమ్‌తో పాటు ఆ వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. అప్పుడైనా ప్రభుత్వం ఆ అనుమానాలు నివృత్తి చేయండి అని ఆ కంపెనీలను ఆదేశించలేదు.

కోవాక్సిన్‌ను 2-18 సం.ల పిల్లలకు వేయవచ్చని ప్రకటించి పిల్లల కివ్వడం ప్రారంభించిన యీ తరుణంలో ఆ టీకా నాణ్యత బాగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పుడు, ప్రభుత్వ ఆరోగ్య శాఖతో పాటు, సిడిఎస్‌సిఓ వంటి సంబంధింత సంస్థలన్నీ దానిపై వివరణ యివ్వాల్సి ఉంది. కానీ అవి అలాటిదేమీ చేయకపోగా, ఆ ఆంక్షను పట్టించుకోనక్కర లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. భారత్ బయో సైతం దీనిపై ఏ వివరణా యివ్వడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫలానా ఫలానా లోపాలున్నాయని బహిరంగంగా చెప్పలేదు, చెప్పే అలవాటూ దానికి లేదు. కానీ ప్రభుత్వం అంతర్గతంగా ఆ రిపోర్టు తెప్పించుకుని చూసి, అవి నిజంగా సీరియస్‌వే అయితే ఆ లోపాలు సవరించేదాకా ఉత్పత్తి ఆపండి అని కంపెనీకి ఆదేశాలివ్వవలసిన అవసరమైతే ఉంది.

కరోనా టీకాలపై ప్రజల స్పందన ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొంతకాలం ఉత్సాహం చూపలేదు, ఆ తర్వాత ఎగబడ్డారు. టీకాలు పుష్కలంగా లభ్యమయ్యాక వేయించుకోవడం మానేశారు. వేయించుకున్నా కరోనా వస్తున్నపుడు టీకా దేనికి అనుకుంటున్నారేమో! ప్రభుత్వం ఉచితంగా యిచ్చేటప్పుడు వేయించుకోవడానికేం పోయింది? పైగా సీరం, భారత్ తమ కరోనా టీకా ధరలు బాగా తగ్గించేశాయి. మరి యిన్నాళ్లూ దండిగా లాభం చేసుకున్నారని అనుకోవాలా? ఏది కిట్టుబాటు ధరో నాకైతే అర్థం కావటం లేదు. కరోనా వస్తే ఆసుపత్రికి, మందులకు అయ్యే ఖర్చుతో పోలిస్తే టీకా ధర లెక్కలోకి రాదు. పైగా టీకా వలన రోగనిరోధం జరగకపోయినా, రోగ ఉపశమనం జరుగుతోందంటున్నారు. అందువలన టీకా వేయించుకుంటే నష్టమేముంది అనే ధోరణిలో ప్రజలుంటే మంచిది.

ఈ ఆలోచనను ప్రజల్లో వ్యాప్తి చేయవలసిన సమయంలో టీకా నాణ్యతపై అనుమానాస్పదం అనే మచ్చ ఎంత ప్రమాదకరం! ప్రభుత్వం స్పందించకుండా కూర్చుంటే మేలేమైనా జరుగుతుందా? వాస్తవాలు తెలియచెప్పడం ఎప్పుడూ మంచిది. దాచిన కొద్దీ సందేహాలు పెరిగిపోయి, పుకార్లు షికార్లు చేసి, అతిశయోక్తులు చేరి, నెగటివ్ ప్రచారం జరిగి అంతిమంగా హాని చేస్తుంది. భారత్ బయో సంస్థ పరంగా యిలాటి పొరపాటు ‘‘ద వైర్’’ విషయంలో చేసిందని నేను ఫీలయ్యాను. కోవాక్సిన్‌ నాణ్యత గురించిన సందేహాలు తీర్చకుండా దానికి అనుమతి యివ్వడంలో డ్రగ్ రెగ్యులేటర్ ప్రదర్శించిన అత్యుత్సాహం గురించి ప్రశ్నిస్తూ వ్యాసాలు ప్రచురించిన వెబ్ పేపర్లలో అదొకటి. కోవాక్సిన్ సైంటిస్టుల కృషి ఫలితం. పరిశోధన అనేది అనేక పరీక్షలకు గురి కావలసిన విషయం. గోప్యత పాటించడం సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌కు విఘాతం కలిగిస్తుంది. భారత్ బయో యిన్నాళ్లూ యిబ్బందులు పడుతూనే పరిశోధనామార్గంలోనే నడిచి అనేక వాక్సిన్లు తయారుచేసింది.

కానీ ఎప్పుడైతే వాళ్ల కోవాక్సిన్‌ను ప్రభుత్వం భుజాన వేసుకుందో, దానికి దేశభక్తిని పులిమిందో యిక దాని మాట ఎత్తేసరికి ప్రభుత్వమూ, కొన్ని పార్టీలు శివాలెత్తి పోతున్నాయి. మామూలు సైంటిఫిక్ డౌట్స్ లేవనెత్తినా సరే, వాళ్లను దేశద్రోహులుగా, విదేశీ శక్తులకు తొత్తులుగా చిత్రీకరించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో ట్రోలింగు చేసే సాధారణ పౌరులే కాదు, చీఫ్ జస్టిస్ రమణగారు కూడా 2021 డిసెంబరులో మాట్లాడుతూ కోవాక్సిన్‌కి WHO ప్రి-క్వాలిఫికేషన్ రాకుండా విదేశీ ఫార్మా కంపెనీలు కుట్ర చేస్తున్నాయనేశారు. భారత్ బయో వారి యితర ఉత్పాదనలకు ప్రి-క్వాలిఫికేషన్లు వచ్చాయి, వస్తున్నాయి కదా! మన దేశం నుంచి వెలువడే అనేక ఔషధాలకు, టీకాలకు వస్తున్నాయి కదా. పైగా కోవాక్సిన్ ఇండియాలో కోవిషీల్డ్‌తోనే పోటీ పడలేకపోతోంది. ఇక ఫైజర్, మోడెర్నా వంటి అంతర్జాతీయ టీకాలతో ఏం పోటీ పడుతుంది? అలాటప్పుడు కుట్ర చేయవలసిన అవసరం వారికుందా? ఏమో రమణగారికే తెలియాలి.

ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తే అలా అనడంతో భారత్ బయోకి ధైర్యం వచ్చేసింది. ఫిబ్రవరిలో ‘‘ద వైర్’’పై హైదరాబాదు జిల్లా కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఆ కోర్టు వెంటనే ‘‘వైర్’’ వాళ్ల సంజాయిషీ వినకుండానే ప్రిలిమినరీ ఇంజంక్షన్ యిచ్చి 14 వ్యాసాలూ తీయించేసింది. నిజానికి ఆ వ్యాసాలు నెలల తరబడి ఆ సైట్‌లో ఉన్నాయి. వాళ్ల వాదన వినకుండానే, ఏదో ఎమర్జన్సీ ఉన్నట్లు కోర్టు తీయించేసింది. పోనీ వాళ్లని పిలిపించి వివరణ అడిగిందా? రెండు నెలలైనా ఆ పని జరగలేదు. గొప్ప ట్విస్టు ఏమిటంటే, ఈ కేసు వేసిన కొన్ని వారాలకే WHO టీము వచ్చి కోవాక్సిన్‌కు నాణ్యతా ప్రమాణాలు లేవని యునిసెఫ్‌కు ఎగుమతి ఆపేసింది.

ఎక్కడికక్కడ విమర్శను అణిచేస్తూండడంతో, పెద్ద తలకాయలందరూ కోవాక్సిన్‌పై యీగ వాలకుండా కాపాడేస్తూండడంతో మన దేశపు మీడియా WHO ఆంక్ష గురించి రాయడానికి, టీవీ చర్చలు పెట్టడానికి జంకుతోందని అనుకోవాలి. ఇదేమీ మంచి పని కాదు. కంపెనీ మన భారతీయుడిది కాబట్టి వెనకేసుకుని వద్దాం అనుకుంటే, మరి నాణ్యతాలోపం ఉన్న టీకా తీసుకునేవాళ్లు కూడా మన భారతీయులే కదా! యూనియన్ కార్బయిడ్ ఫారిన్‌ది కాబట్టి భోపాల్ దుర్ఘటనపై విమర్శిస్తాం, అదే ఇండియన్ కంపెనీ ఐతే పన్నెత్తి మాట అనేవాళ్లం కాదు అంటే ఒప్పుతుందా? అసలే మన ఇండియాలో నాణ్యత పాటించడం అంతంత మాత్రం. కోవాక్సిన్ తరహా చూసి కంపెనీలకు ఐడియాలు వస్తాయి- ‘ఉత్పాదన నాణ్యత పాటించడం కంటె పైరవీలు చేసుకుంటే మేలు, అంతకంటె ప్రభుత్వాన్ని భాగస్వామిని చేసుకుంటే సరిపోతుంది, ఏ ఆరోపణ వచ్చినా వాళ్లే నెత్తిన పడేసుకుని మోస్తూ ఉంటారు, మనం వేడుక చూస్తే సరిపోతుంది’ అనుకోగలరు. ఎంత మనవాడిదైనా నాణ్యత విషయంలో రాజీ పడడం ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు క్షేమదాయకం కాదు. అన్నిటికన్న ముఖ్యం, ప్రపంచంలో భారత్ యిమేజికి విఘాతం కలుగుతుంది. అది మన ఉత్పాదక రంగానికి, మన నిపుణులకు, మన ఎగుమతులకు పెద్ద దెబ్బ పడుతుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?