cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఆకులు రెండైనా నాయకుడు ఒకడే!

ఎమ్బీయస్‍:  ఆకులు రెండైనా నాయకుడు ఒకడే!

పైన రాసిన స్లోగన్ ఎడిఎంకె పార్టీలో పళనిసామి వర్గం వారిది. అతనే మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నా, పార్టీకి మాత్రం పన్నీరుశెల్వంతో కలిసి ద్వంద్వ నాయకత్వం ఉండాలని గతంలో తీర్మానించుకున్నారు. ఇప్పుడు అధికారం పోయింది. పార్టీ ఒకటే మిగిలింది. దాన్ని పూర్తిగా తన చేతిలోకి తెచ్చుకోవాలని పళనిసామి శతథా ప్రయత్నించి యివాళ సఫలుడయ్యాడు. పన్నీరుశెల్వం వర్గం మాత్రం పార్టీకి ఎమ్జీయార్, జయలలిత వంటి కరిజ్మాటిక్ లీడరు లేరు కాబట్టి యిద్దరు నాయకుల సారథ్యంలోనే పార్టీ నడవాలి అని పట్టుబట్టింది. కులపరంగా చూసినా పశ్చిమ తమిళనాడులోని గౌండర్లు (జనాభాలో 5.5%) పళనిసామి ఆకట్టుకోగలుగుతూండగా, దక్షిణ తమిళనాడులోని దేవర్లను (జనాభాలో 3%)  పన్నీరుశెల్వం ఆకట్టుకోగలడు కాబట్టి, యిద్దరూ కలిసి ఉంటే లాభం.

కానీ పళనిసామి దానికి ఒప్పుకోవటం లేదు. జయలలిత స్థానంలో తను వచ్చేద్దామని అతని తాపత్రయం. దానికోసం బలప్రయోగం చేయడానికి కూడా వెనకాడటం లేదు. దాంతో జూన్ 23 నాటి పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాస అయింది. జూన్ మొదటివారంలోనే దీనికి నాంది పలకడం జరిగింది. ‘పళనిసామి ఏకైక నాయకత్వంలో పార్టీ వర్ధిల్లాలి’ అని పోస్టరు వేసి తేని ఊళ్లో పన్నీరుశెల్వం యింటి ముందు గోడమీద అంటించారు. ఆ తర్వాత జరిగిన ఒక సమావేశంలో పళనిసామి అనుచరుడు మాధవరం మూర్తి దీని విషయమై మాట్లాడబోగా పన్నీరుశెల్వం అనుచరులు యిప్పుడెందుకు యీ అనవసర ప్రస్తావన అని అడ్డుకోబోయారు. అక్కడ ఉన్న పళనిసామి ‘అతన్ని మాట్లాడనీయండి.’ అన్నాడు. అప్పుడే అర్థమై పోయింది, పళనిసామే యిదంతా చేయిస్తున్నాడని. ఇక ఆ తర్వాత 72 జిల్లా సెక్రటరీలలో 60 మంది పళనిసామికి మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేశారు.

ఇదంతా చూస్తే జనరల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరుగుతుందని భయపడి పన్నీరుశెల్వం ‘మీటింగుకి ముందే మనం మాట్లాడుకుందాం’ అని పళనిసామికి ప్రతిపాదించాడు. కానీ పళనిసామి తను వెళ్లకుండా ఓ యిద్దర్ని పంపించాడు. ఇక దానితో మీటింగులో ఏం జరగబోతోందో ఊహించిన పన్నీరుశెల్వం జూన్ 23 నాటి మీటింగును వాయిదా వేయాలంటూ హైకోర్టుకి వెళ్లాడు. రాజకీయ పార్టీ వ్యవహారాలు తమ పరిధిలోకి రావంటూ కోర్టు జూన్ 22న ఆ పిటిషన్ కొట్టివేసింది. వెంటనే పన్నీరుశెల్వం వర్గం ‘అంతకుముందు నాయకద్వయం అంగీకరించిన 23 తీర్మానాలు తప్ప కొత్త తీర్మానం ఏదీ జనరల్ బాడీ కౌన్సిల్‌ మీటింగులో ప్రవేశపెట్టకూడదు’ అంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. మీటింగు ప్రారంభం కావడానికి ఆరు గంటల ముందు కోర్టు ఆ పిటిషన్‌ను అంగీకరించింది.

కానీ సమావేశం మొదలు కాగానే పళనిసామి అనుయాయులు నానా అల్లరీ చేశారు. పన్నీరుశెల్వంకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అతని మీద వాటర్ బాటిళ్లు విసిరేశారు. పళనిసామిని ఏకైక నాయకుడిగా నిర్ణయిస్తూ తీర్మానం పాస్ చేసేదాకా వేరే ఏ తీర్మానమూ చేయడానికి వీల్లేదని గలభా చేశారు. పన్నీరుశెల్వం అనుచరుడు, మాజీ మంత్రి వైద్యలింగం మాట్లాడబోగా అతని మైకు కట్ చేశారు. అతని మీదకు నీళ్ల బాటిళ్లు విసిరేశారు. చివరకు జులై 11న మరో సమావేశం జరుగుతుందని దానిలో ఏకైక నాయకుడి తీర్మానం పాస్ చేస్తామని ప్రకటించారు. పళనిసామి అనుచరుడు షణ్ముగం మాట్లాడుతూ 2017 తర్వాత సృష్టించిన జాయింటు కోఆర్డినేటర్ పదవులు రద్దయ్యాయని ప్రకటించాడు. ఆ విధంగా పన్నీరుశెల్వంకు ఆ పదవి కూడా లేకుండా పోయింది.

జులై 11 సమావేశం లోపునే జిల్లా కమిటీలు సమావేశమై పళనిసామికి అనుకూలంగా తీర్మానాలు చేయసాగాయి. పళనిసామి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా కమిటీల్లోని సెక్రటరీలను, కౌన్సిల్ సభ్యులను కొనేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ మీటింగులలో పన్నీరుశెల్వం వర్గీయులు అడ్డుపడడం, వారూవీరు కొట్టుకోవడం సర్వసాధారణమై పోయింది. ఎమ్మెల్యేలలో కూడా చాలామంది పళనిసామి వెంటే నడిచారు. ఇలా అయితే యివాళ్టి జనరల్ బాడీ మీటింగు తమ ఓటమి తథ్యం అని తెలుసుకున్న పన్నీరుశెల్వం మీటింగు ఆపించడానికి కోర్టు కెళ్లాడు. కానీ కోర్టు మీటింగుకు అనుమతి నిచ్చింది. పన్నీరుశెల్వం వర్గీయులకు ఓటరు ఐడెంటిటీ కార్డులు యివ్వకుండా ఆపారని ఆరోపణలు వచ్చాయి.

ఏది ఏమైనా యివాళ మీటింగు జరిగింది. 4 నెలల్లో పార్టీకి జనరల్ సెక్రటరీ నియమితులవుతారని, యీ లోగా పళనిసామి మధ్యంతర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారని తీర్మానించారు. ఎడిఎంకె తరఫున ముఖ్యమంత్రిగా గతంలో పని చేసి, ప్రస్తుతం ట్రెజరర్‌గా ఉన్న పన్నీరుశెల్వంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగించారు. అతనితో పాటు అతని అనుచరులను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దీనితో ఎడిఎంకె పార్టీకి పళనిసామి ఏకైక నాయకుడు అయ్యారు. 4 నెలల్లో జయలలిత గతంలో నిర్వహించిన పదవిని చేపట్టబోతున్నారు. ఆ పార్టీకి 30% ఓటు బ్యాంకు ఉంది. డిఎంకెకు దీటుగా పార్టీని నిలబెట్టగల సామర్థ్యం పళనిసామికి ఉందా లేదా అన్నది భవిష్యత్తు చెపుతుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి