cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఫిరోజ్ గాంధీ పార్శీ కాదా?

ఎమ్బీయస్: ఫిరోజ్ గాంధీ పార్శీ కాదా?

ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ముస్లిమని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. దానిపై 2012 క్యూ3లోనే వ్యాసం రాశాను. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ తండ్రి కూడా ముస్లిమని ప్రచారం మొదలుపెట్టారు. దానిపై నేను 2016 క్యూ1లో రాశాను. అయినా ప్రచారం జోరుగా సాగిపోతోంది. ముస్లిములని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉన్నారు. సత్యాన్వేషకుల కోసం ఫిరోజ్ బంధువు ఒకావిడ రాసిన వ్యాసం ఆధారంగా యీ వ్యాసం రాస్తున్నాను. నువ్వేం రాసినా మేం నమ్మదలుచుకున్నదే నమ్ముతాం అన్నవాళ్లకు ఓ దణ్ణం.

ఫిరోజ్ అసలింటి పేరు దారూవాలా అని, వాళ్ల నాన్న సారాయి అమ్మేవాడని, మద్యనిషేధం కోసం ప్రచారం చేసే మహాత్మా గాంధీకి ఆ పేరు గిట్టక, వివాహవేళ తన యింటిపేరును అతనికి దానం యిచ్చాడని నేను చిన్నపుడే విన్నాను. అప్పట్లో వాట్సాప్‌లు లేకపోయినా వాగేందుకు నోళ్లు, దోర చేసుకుని వినేందుకు చెవులూ ఉండేవి. క్రాస్‌చెక్ చేసుకునేందుకు పుస్తకాలు విరివిగా అందుబాటులో ఉండేవి కావు. చిన్న టౌన్లో పెరిగిన నా బోటి వాడికి ఎవరు పంజాబీయో, ఎవరు బెంగాలీయో కూడా తెలిసేది కాదు. అందుకే మా స్కూల్లో దేవ్ ఆనంద్‌కు ఎస్‌డి బర్మన్ మేనమామ అనీ, అందుకే అతని సినిమాకు మంచి ట్యూనులు యిస్తాడని చెప్తే నమ్మేవాళ్లం. అసలు ఆనంద్ అనేది యింటిపేరని కూడా మాకు తెలియదు. దేవానంద్, దేవానంద్ అనే పలికేవాళ్లం, రాసేవాళ్లం.

మా నాన్న గాంధీ, నెహ్రూలకు వ్యతిరేకి కాబట్టి ఆయన స్నేహితులందరూ మా ప్రెస్ అరుగు మీద పోగడి ఇలాటి దారూవాలా కబుర్లే కాక, నెహ్రూ అల్లుణ్ని చంపించేశాడని కూడా చెప్పేసుకునేవారు. విషయసేకరణకు, నిజనిర్ధారణకు అప్పట్లో వాళ్ల దగ్గర సాధనాలు ఉండేవి కావు. ఆ తరం అలా గడిచిపోయింది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ ఉపకరణాలను ఉపయోగించే ఉద్దేశం లేకుండా కొంతమంది మాట్లాడుతూంటారు, ప్రచారం చేస్తూంటారు. ఓ సారి టీవీలో త్రిపురనేని చిట్టి అనే బిజెపి లీడరు మాట్లాడుతూ ‘ఈ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అంతా దొంగ గాంధీలండీ, ఫిరోజ్ పార్శీ!’ అన్నాడు. గాంధీ అంటే మహాత్మా గాంధీ కుటుంబం మాత్రమే అని ఆయన ఉద్దేశమేమో. మహా అయితే గుజరాతీల్లో ఆ యింటిపేరు ఉంటుంది కానీ, తక్కినవాళ్లలో ఉండడం అసంభవం అని ఆయన భావమేమో! యాంకర్ అడగలేదు, ఈయన విపులంగా చెప్పలేదు.

ఇంటిపేరులో –నేని అని ఉన్నవాళ్లందరూ కమ్మలు కారని త్రిపురనేని గారికి తెలిసే ఉంటుంది. అలాగే గాంధీ పేరున్నవాళ్లందరూ గుజరాతీలు కారని తెలుసుకోవాలి. నాకు తెలిసి పంజాబీల్లో ఉంది, పార్శీల్లో ఉంది. పలకడం గాంధీయే అంటారు కానీ పార్శీల్లో కొందరు స్పెల్లింగు వేరేలా రాస్తారు. జి పక్కన ఎచ్ పెడతారు. చివర్లో కొందరు ఐ రాస్తారు, కొందరు వై రాస్తారు. గాంధార దేశంతో లింకేమైనా ఉందేమో పరిశోధకులు చెప్పాలి. ఫిరోజ్ కుటుంబ చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా, ఆయన అవతలివాళ్లను ‘దొంగ గాంధీ’ అనడం అన్యాయం. రాజకీయ విమర్శలు ఎంతైనా చేయవచ్చు. ఇంటిపేరు బట్టి యిలాటి నిందలు వేయడం భావ్యం కాదు. ఇక నేను ప్రస్తావించబోతున్న వ్యాసం ‘‘పీపుల్’’ అనే ఆంగ్ల మాసపత్రిక 14082009 సంచిక లోది. మోదీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఐదేళ్ల క్రితందే కాబట్టి, యిటీవలి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆ పత్రిక పని కట్టుకుని యీ వ్యాసం వేసిందని అనుకోవడానికి లేదు.

ఫిరోజ్ గాంధీ అక్క ఆలూ కూతురైన రతూ దస్తూర్ అనే ఆవిడతో ముచ్చటించి, వాళ్ల కుటుంబం గురించి సేకరించిన వివరాలతో ఆ వ్యాసాన్ని ప్రచురించారు. ఆవిడకు అప్పటికి 80 ఏళ్ల వయసు. ఫిరోజ్ కుటుంబ విషయాలు ఆవిడ చెప్పినవి యథాతథంగా యిస్తున్నాను. ఫిరోజ్ తండ్రి పేరు జహంగీర్ ఫర్దూన్ గాంధీ. వాళ్లది అసలు గుజరాత్‌లోని భరూచ్. ఆయన కిల్లిక్ నిక్సన్ కంపెనీ వారి షిప్‌లో మెరైన్ ఇంజనియర్‌గా చేరి, వారంటు ఇంజియనర్‌గా ప్రమోట్ అయ్యాడు. ఫిరోజ్ తల్లి రతీమాయి సూరత్‌లోని ఒక మిషినరీ స్కూల్లో చదివింది. మంచి ఇంగ్లీషు మాట్లాడేది. 85వ ఏట మరణించింది. ఫిరోజ్ కంటె ముందుగా వాళ్లకు పుట్టినవారు దోరాబ్, ఫర్దూన్ అనే కొడుకులు.  తెమ్హినా, ఆలూ అనే కూతుళ్లు. అందరి కంటె చిన్నవాడైన ఫిరోజ్ 1912లో ముంబయిలోని ఖేత్‌వాడీలో పుట్టాడు. 1930లలో జహంగీర్ చనిపోతే కుటుంబం అలహాబాద్‌లో సర్జన్‌గా పని చేస్తున్న ఫిరోజ్ పిన్ని శిరీన్ కమిస్సారియత్ వద్దకు వెళ్లిపోయారు. ఫిరోజ్ అక్కడే చదివి పెద్దవాడయ్యాడు. ‘‘నేషనల్ హెరాల్డ్’’లో ఉద్యోగం ద్వారా నెహ్రూ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అదంతా వేరే కథ. 2012 నాటి వ్యాసంలోనే చెప్పాను.

ఇంతకీ యీ రతూ దస్తూర్ బాధేమిటంటే రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, వారి వారసులను ఇందిరా గాంధీ వారసులుగానే చూస్తున్నారు కానీ ఫిరోజ్ వారసులుగా చూడటం లేదని వాపోయింది. ఫిరోజ్ తన పిల్లలకు ‘నవజోత్’ ఫంక్షన్ (పార్సీల ఒడుగు) చేయించలేదు కాబట్టి, రాజీవ్, సంజయ్‌ను పార్శీలని అనలేము అంది. రాజీవ్ అమెరికా వెళ్లినపుడు తను పార్శీనని చెప్పుకున్నాడని ఎక్కడో చదివాను. కానీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలోనే జరిగాయి. ఆ మాటకొస్తే ఫిరోజ్‌వి కూడా హిందూ సంప్రదాయంలోనే జరిగాయి. పార్శీలు మరణించినపుడు భూమి కలుషితం కాకుండా శవాన్ని ప్రకృతిక నిశ్శబ్దగోపురం (టవర్ ఆఫ్ సైలెన్స్) పైన వదిలేస్తారు. ఎండకు ఎండి కొంత శిథిలం కాగా, రాబందులు, యితర పక్షులు వచ్చి శవాన్ని తినేస్తాయి. ఆ రకమైన అంత్యసంస్కారం తనకు యిష్టం ఉండదని, దహనం చేయమని ఫిరోజ్ కోరాడట.

ఫిరోజ్ పక్కా కాంగ్రెసువాదే కానీ, కుటుంబంలోని యితర సభ్యులు రాజకీయాల్లోకి వెళ్లలేదు. ఫిరోజ్ అనంతరం ఇందిరా గాంధీ అతని కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించిందని యీవిడ చెప్పింది. రాజీవ్ లాగానే రతూ భర్త దారా దస్తూర్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పని చేశాడు. ఆయన గ్రౌండ్ ఇంజనియర్. రాజీవ్‌తో స్నేహబంధం కూడా ఉంది. రాజీవ్ పోయాక కూడా సోనియా టచ్‌లోనే ఉందట. వీళ్లిళ్లల్లో ఫంక్షన్లకు తన పిల్లల్ని పంపిస్తుందట.

ఫిరోజ్ ముస్లిమన్న ప్రచారం 2000లోనే మొదలైందట. ముంబయిలో ఒక టాబ్లాయిడ్ తన ఆగస్టు సంచికలో అతను ముస్లిమని రాసిందట. దాంతో రతూ దస్తూర్, ఆమె సోదరి చందన్ కలిసి పత్రికాఫీసు కెళ్లి రిజాయిండర్ యిస్తాం వేయండి అన్నారట. పత్రిక వాళ్లు మీ మాట నిజమని నిరూపించడానికి ఫిరోజ్ బర్త్ సర్టిఫికెట్టు చూపించండి అన్నారట. ‘మీ దగ్గర ఏ బర్త్ సర్టిఫికెట్టుందని అతని తలిదండ్రులు ముస్లిములని రాశారు?’ అని అడిగినా లాభం లేకపోయింది. అప్పుడు సోనియాకు రాస్తే సోనియా పాత రికార్డులు వెతికి రెండు రోజుల్లో పంపించిందట. అది చూపిస్తే అప్పుడు పత్రిక వాళ్లు క్షమాపణ చెప్తూ రిజాయిండర్ ప్రచురించారట.

ఆర్టికల్ చివర్లో రాసిన ఒక పేరా చదివితే గుండె కలుక్కుమంటుంది. రాజీవ్ హత్య జరిగిందని తెలిసి యీవిడా, చెల్లి దిల్లీ వెళ్లారట. రాజీవ్ శవపేటిక బయటకు వస్తూంటే చూసి ‘అతను పొడుగరి కదా, శవపేటిక యింత చిన్నగా ఉందేమిటి?’ అనుకున్నారట. తెరిచి చూస్తే, ఒక ప్లాస్టిక్ మూటలో కొన్ని శరీరభాగా లున్నాయంతే! చుట్టూ ఐసు పెట్టారు. మానవబాంబు పేలితే బాడీలో ఏం మిగులుతుంది అని మనం యిప్పుడనుకోవచ్చు. కానీ అప్పుడు అలా చూడడం షాక్ కలిగించి ఉంటుంది కదా! హత్య జరగగానే మూపనార్ తదితరులు రాజీవ్ శవం ఎక్కడుందాని వెతికితే, నైకీ బూట్లు వేసుకున్న అతని తెల్లటి కాళ్లు కనబడ్డాయట. శరీరం రంగు బట్టి గుర్తుపట్టారట. ఊహిస్తే కడుపులో దేవినట్లుంటుంది. ఇంతకీ యీ రతూ దస్తూర్ 2015లో మరణించారు. (ఫోటోలు – రతూ దస్తూర్, పైన ఫిరోజ్, అతని ఫిరోజ్ అక్క, రతూ తల్లి ఆలూ, కింద ఫిరోజ్ తల్లి, 1983లో పార్శీ దుస్తుల్లో ఇందిరా, దారా దస్తూర్, రతూ, రాజీవ్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

mbsprasad@gmail.com

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?