వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో తయారైన సినిమా ఎఫ్ 3. ఈనెల 27న విడుదల. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ మాంచి పాత్ర పోషించిన కమెడియన్ సునీల్ మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన ఎఫ్ 3.. ఫన్ బ్లాస్ట్ ముచ్చట్లివి.
ఇది మీకు సిల్వర్ జూబ్లీ ఇయర్.. ఈ ప్రయాణం ఎలా సాగింది?
నా సినీ ప్రయాణం విలక్షణంగా సాగుతుంది. మొదట కమెడియన్ గా చేశాను. తర్వాత హీరో. నాలో వున్న హిడెన్ ట్యాలెంట్ డ్యాన్స్ ని బయటపెట్టాను. ఇంత లావు వున్న నేను సిక్స్ ప్యాక్ చేశాను. తర్వాత విలన్ గా మారాను. పుష్పలో నా వయసుకు మించిన పాత్ర చేశాను. నేను ఏది చేసినా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వారు ఆదరించడం వల్లనే నా ప్రయాణం ఇంత విలక్షణంగా సాగింది.
ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు?
'కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా'' అని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. ''తప్పకుండా చేద్దాం అన్నగారు.. మీ 'సొంతం' సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం'' అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు.
ఎఫ్ 3 మీ పాత్ర సినిమా అంతటా వుంటుందా?
సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. అందరం కలసిన తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో వుంటుంది.
ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి?
ఎఫ్ 3, పుష్ప .. ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త ఛాలెజింగ్ అనిపించింది.
కామెడీ దర్శకులు కావాలి కదా
నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను.
ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా?
తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్రకు సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశా. త్వరలోనే వివరాలు చెప్తాం.
ఒక పాత్ర చెప్పినపుడు మీ వెటకారం, బాడీ లాంగ్వెజ్ జోడిస్తారా? లేదా దర్శకుడు చెప్పినట్లు మౌల్ద్ అవుతారా ?
కొన్ని మనల్ని అనుకుని రాస్తారు. కొన్ని మనం ఏమైనా చేస్తామని రాసి తెస్తారు. నా వరకూ అవతలి నుండి ఏదైనా వస్తేనే రియాక్షన్ వస్తుంది. ఏదైనా స్పాంటినియస్ గా రావాల్సిందే. ప్లాన్ చేస్తే ఒక్క ముక్కరాదు (నవ్వుతూ).
మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్ లో కూడా పెట్టారు
దర్శకుడు అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
ఈ మధ్య నెట్ ప్రాక్టీస్ తప్పింది కదా .. చిన్న భయం వుంటుంది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తే ఆ భయం పోయింది. అనిల్ గ్రేట్ ఆల్ రౌండర్. తన కాలేజీ డేస్ లో స్టేజ్ షోలు చేసి వచ్చాడు. అనిల్ లో గ్రేట్ ఆర్టిస్ట్ వున్నాడు. అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.
ఎలాంటి పరిస్థితిలో కూడా నవ్వుతూ ఉంటాడు. అనిల్ ని చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ, స్మైల్ వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. ఆయన ఎంత ఎనర్జిటిక్, పాజిటివ్ గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే వుంటాయి.
కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?
మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న, మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను.