కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందిట. టికెట్ల రేట్లు పెంచి ఫస్ట్ వీక్ పిండేద్దామనుకుంటే, ధరలకి భయపడి ప్రేక్షకులు రావడం లేదు. వాళ్లు రాకపోవడానికి సినిమాలు ఆశించినట్టుగా లేకపోవడం కూడా ఒక కారణం.
ఫస్ట్ డే 12.30 ఆటకి ఇనార్బిట్ మాల్‌కి సర్కార్ వారి పాటకు వెళితే అటుఇటు రెండు వరుసలు ఖాళీ. పెద్ద హీరోల సినిమాలకి గతంలో ఈ అవస్థ లేదు. ఆచార్యకి కూడా ఇంతే. నాకు మొత్తం 700 ఖర్చు అయ్యింది. 350 టికెట్, ఒక బాటిల్ వాటర్, ఆకలేస్తే కాసింత తిండి. అదే ఫ్యామిలీతో వెళితే 2వేలు.
మాల్ సంగతి పక్కన పెట్టి సింగిల్ థియేటర్‌కి వెళ్లినా పెద్ద తేడా వుండదు. ఓ వంద తగ్గుతుంది. వీళ్లు విదేశాలకి వెళ్లి నానా తుక్కు సినిమాలు తీసి, బడ్జెట్ పెరిగింది. ఆ డబ్బులు మనం ఇవ్వాలంటే ఎందుకివ్వాలి? అందుకే జనం OTTలో చూద్దామని అనుకుంటున్నారు.
బాహుబలి కథ జానపదం కాబట్టి, సెట్టింగ్‌లు, గ్రాఫిక్స్‌కి ఖర్చు పెట్టారంటే సరే అనుకోవచ్చు. మామూలు కథలకి కూడా వందల కోట్లు ఎందుకు అవుతున్నట్టు? రాధేశ్యామ్‌లో ఇటలీలో రైళ్లలో తిరిగినందుకు క్లైమాక్స్ నాసిరకం షిప్ సీన్ తీసినందుకు కోట్లు ఖర్చు పెడితే దాన్ని చూడడానికి జనం ఎందుకొస్తారు? అందుకే రావడం మానేశారు.
జనరేషన్లు మారుతున్నాయి. సినిమా వాళ్లలాగే ప్రేక్షకులు కూడా తెలివిమీరి పోయారు. చిరంజీవి లాంటి అగ్రనటుడు చరణ్‌తో కలిసి నటించినా డిజాస్టర్ చూపించారు. బీచ్ దగ్గర షూట్ చేసే ఓపిక కూడా లేక దాన్ని గ్రాఫిక్స్‌లో చూపించి బడ్జెట్ అంటే కష్టం.
ఫైనల్‌గా హీరోలకి వచ్చిన నష్టమేం లేదు. వాళ్ల కోట్ల వాళ్లకి అందుతాయి. నష్టపోతున్నది చిన్నచిన్న కొనుగోలుదారులు.
ఈ గోలలో చిన్న సినిమాలు బాగున్నవి కూడా నలిగిపోతున్నాయి. అశోకవనంలో అర్జునకళ్యాణం దీనికి ఉదాహరణ.
జీఆర్ మహర్షి