Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్‌ది భ‌య‌మా? వ్యూహ‌మా?

జ‌గ‌న్‌ది భ‌య‌మా? వ్యూహ‌మా?

రాజ్య‌స‌భ సీటు ఆదానీ కుటుంబానికి ఇస్తున్నార‌ని వినిపిస్తోంది. ప్ర‌తిసారి ఒక సీటుని మోదీ కోసం ఇవ్వ‌డం వెనుక భ‌య‌మా? వ్యూహ‌మా? లేక రెండునా?

జ‌గ‌న్ మీద ఈడీ ద‌ర్యాప్తు న‌డుస్తోంది. కేసులున్నాయి. మోదీ అనుకుంటే జ‌గ‌న్‌ని జైల్లో పెట్టొచ్చు. అప్పుడు వైసీపీ అల్ల‌క‌ల్లోల‌మై తిరుగుబాట్లు వ‌చ్చినా రావ‌చ్చు. ఈ నేప‌థ్యంలో మోదీ చెప్పిన‌ట్టు విన‌డం శ్రేయ‌స్క‌రం. ఇది భ‌యం.

కేంద్రంతో గొడ‌వ ప‌డి ఇబ్బందులు ప‌డిన, ప‌డుతున్న రాష్ట్రాలు ఎన్నో వున్నాయి. కేంద్రం చేతిలో చాలా విష‌యాలుంటాయి. ఇది తెలియ‌క గ‌తంలో ఎన్టీఆర్ గొడ‌వ‌లు పెట్టుకుని త‌ల‌నొప్పి తెచ్చుకున్నాడు. రాష్ట్రాల‌పై నిరంత‌రం నిఘా వేసే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ కేంద్రం సొంతం. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదికే ఎన్టీఆర్ కేంద్రం దెబ్బ‌ని రుచి చూశాడు. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌లంగా వుంది కాబ‌ట్టి కేంద్రంతో క‌ల‌వ‌లేని స్థితి ఎన్టీఆర్‌ది. ఇప్పుడు కేసీఆర్ స్థితి కూడా అంతే.

అయితే జ‌గ‌న్ ప‌రిస్థితి వేరు. రాష్ట్రంలో బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. 10 మంది మోదీలు వ‌చ్చినా దాన్ని అధికారంలోకి తేలేరు. అందువ‌ల్ల బీజేపీతో నేరుగా ప్ర‌మాదం లేదు. వెనుక నుంచి జ‌న‌సేన‌ని దువ్వితే దువ్వొచ్చు. చంద్ర‌బాబుని బీజేపీ న‌మ్మ‌దు.

కేంద్రంతో స‌ఖ్య‌త‌గా వుంటే కొత్త అప్పులు పుడుతాయి. పెండింగ్ నిధులు వ‌స్తాయి. నిరంతర గండాల నుంచి గ‌ట్టెక్క‌చ్చు. అందుక‌ని గ‌తంలో ఒక గుజ‌రాతికి, ఇప్పుడు ఇంకొక‌రికి రాజ్య‌స‌భ సీటు స‌మ‌ర్పిస్తూ వుండొచ్చు.

ఆదానీకి ఇవ్వ‌డం వ‌ల్ల పెట్టుబ‌డులు వ‌స్తాయి. ఇంకేవో జ‌రుగుతాయ‌ని ఎవ‌రికీ భ్ర‌మ‌లు లేవు. అయితే పార్టీకి ప‌నిచేసిన ఆశాజీవులున్నారు. ఎవ‌రెవ‌రో త‌న్నుకుపోతుంటే ఉసూరుమంటున్నారు. ఇదంతా కాకుండా ప్ర‌తిసారి మ‌న రాష్ట్రంలో ఖాళీ అయ్యే రాజ్య‌స‌భ సీట్ల‌లో మోదీ కోటా వుంటుంద‌ని జ‌గ‌న్ డిక్లేర్ చేస్తే ఏ స‌మ‌స్యా వుండ‌దు.

క‌వులు, ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, మేధావులు రాజ్య‌స‌భ‌లో వుంటే చ‌ట్టాల‌పై మ‌రింత చ‌ర్చ జ‌రిగి దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. చివ‌రికి అది రాజ‌కీయ, వ్యాపార, ఆశ్రితుల‌తో నిండిపోతూ వుంది.

ఫైన‌ల్‌గా ఇదంతా భ‌యంగా జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కి, వ్యూహంగా జ‌గ‌న్ అనుకూలురికి క‌నిపిస్తుంది. రెండు ముఖాలు లేని నాణెం ప్ర‌పంచంలో వుండ‌దు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?