Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: గౌరీ లంకేశ్‌ హత్య

సెప్టెంబరు 5 న బెంగుళూరులో గౌరీ లంకేశ్‌ అనే పాత్రికేయురాలు హత్యకు గురయ్యారు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వరుస హత్యలలో తాజాదానిగా దీన్ని చూస్తున్నారు. 2013 ఆగస్టులో నరేంద్ర దభోల్కర్‌, 2015 ఫిబ్రవరిలో గోవింద్‌ పన్సారే, 2015 ఆగస్టులో కలబురిగి.. యిప్పుడు యీమె. వీళ్లందరూ హిందూత్వవాదులకు ఎదురొడ్డి పోరాడుతున్నవారు. గౌరి విషయంలో అయితే ఆమె నక్సలైటు సానుభూతిపరురాలు కూడా. ఈ హత్యలు జరిగినప్పుడల్లా మేధావి వర్గాల వారు, పాత్రికేయులు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాక యీ ధోరణి పెరిగిందని అంటున్నారు. 

హిందూత్వవాదులు బలంగా వున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో యీ హత్యలు జరిగిన మాట వాస్తవమే కానీ పన్సారే హత్య జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వుంది. దభోల్కర్‌ హత్య జరిగినపుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు వుంది. కలబురిగి, గౌరి హత్యలు జరిగినపుడు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెసు వుంది. దభోల్కర్‌ హత్య విషయంలో హత్య జరిగిన రెండున్నరేళ్లకు  సిబిఐ హిందూ జనజాగృతి సంస్థతో సంబంధం వుందంటున్న డా. వీరేంద్ర తావడేను అరెస్టు చేసింది.  సారంగ్‌ అకోల్కర్‌, వినయ్‌ పవార్‌ అనే యిద్దరు అనుమానితులను సిబిఐ యిప్పటిదాకా పట్టుకోలేక పోయింది.

ఇక పన్సారే కేసులో సమీర్‌ గాయక్వాద్‌ను అరెస్టు చేసింది కానీ అతనికి వెంటనే బెయిలు లభించింది. ఇకపై కథ ముందుకు కదలలేదు. ఈ రెండు మహారాష్ట్రలో జరిగిన హత్యలు. కర్ణాటకలో జరిగిన కలబురిగి హత్య కేసులో రెండేళ్లయినా యిప్పటిదాకా సిఐడి ఒక్కరినీ అరెస్టు చేయలేదు. ఆధారాలు దొరికేస్తున్నాయి, పట్టేసుకుంటాం అంటూండగానే గౌరి హత్య జరిగింది. ఒకవేళ హిందూత్వవాదులే చంపి వుంటే అధికారంలో వున్న కాంగ్రెసు ఎందుకు కఠినంగా వ్యవహరించటం లేదు? హిందూత్వ ఓట్లు పోతాయన్న భయమా? ఇలాటి యిబ్బందికరమైన ప్రశ్నలు వేస్తున్న గౌరి నోరు కూడా మూసేశారు.

గౌరి తండ్రి లంకేశ్‌ కవి, జర్నలిస్టు ''లంకేశ్‌ పత్రికె'' అనే కన్నడ వారపత్రికకు సంస్థాపక సంపాదకుడు. అతని పెద్ద కూతురైన గౌరి ఇంగ్లీషు జర్నలిజంలోకి వెళ్లింది. ''టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'', బెంగుళూరులో పనిచేసేది. చిదానంద రాజఘట్ట అనే జర్నలిస్టును పెళ్లాడాక దిల్లీకి బదిలీ అయింది. ''సండే'' వీక్లీకి, దిల్లీలోని ''ఈటీవీ'' (తెలుగు)కు పని చేసింది. 2000 సం.లో తండ్రి పోయాక పత్రికకు ఎడిటరు అయింది. ఆమె తమ్ముడు ఇంద్రజిత్‌ పత్రికకు పబ్లిషరుగా, ప్రొప్రయిటరుగా వున్నాడు. 2005లో నక్సలైట్లు పోలీసువాళ్లపై దాడి చేసినప్పుడు ఒకతను నక్సలైట్ల పక్షాన వ్యాసం రాసి పంపితే ఆమె ప్రచురణకు ఆమోదించింది. ఆమె తమ్ముడు పత్రిక సిద్ధాంతాలకు విరుద్ధంగా వుందంటూ దాని ప్రచురణను అడ్డుకున్నాడు. ఈమెకు కోపం వచ్చింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. విడిపోయారు. ఆమె ''గౌరీ లంకేశ్‌ పత్రికె'' అని తన పేర ప్రారంభించింది. 

ఆమె బిజెపికే కాదు, కాంగ్రెసుకు కూడా వ్యతిరేకే. సరిగ్గా చెప్పాలంటే వ్యవస్థకు వ్యతిరేకంగా వుండడమే ఆమె బ్రాండ్‌. ఫెమినిజం, దళితవాదం, నాస్తికవాదం, ప్రభుత్వ నక్సలైట్‌ విధానం పట్ల వ్యతిరేకత... యిలా ఆమె తన పత్రికను యీ వాదాలకు ప్రతినిథిగా తయారుచేసుకుంది. మానవహక్కుల పరిరక్షణకు నిలబడింది. వామపక్ష మేధావులుగా ముద్రపడిన వారందరికీ వుండే తిక్కలూ, వైరుధ్యాలూ ఆమెకూ వున్నాయి. ఆమెకు అభిమానులూ, వ్యతిరేకులూ సమానసంఖ్యలో వున్నారు. ముఖ్యంగా ఆమె హిందూత్వవాదానికి, ఛాందసవాదానికి బద్ధవిరోధిగా తయారు కావడంతో హిందూత్వశక్తులు గణనీయమైన సంఖ్యలో వున్న కర్ణాటకలో ఆమెకు చాలా యిబ్బందులే వచ్చిపడ్డాయి. ఆమె బిజెపి నాయకులపై ఆరోపణలు చేసి నిరూపించలేకపోవడంతో కోర్టు శిక్ష వేసింది. బెయిలు తీసుకుని, పై కోర్టుకి అప్పీలు చేసుకుంది. అది విచారణలో వుండగానే ఆమె శత్రువులు ఆమెకు మరణశిక్ష అమలు చేశారు.  

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు వుంటుంది. అది అందరూ గుర్తించాలి. మనకు నచ్చని అభిప్రాయాన్ని వ్యక్తపరచేవారిని పొట్టన పెట్టుకోవడం అనాగరికం, అమానుషం. చాలాకాలంగా మీడియా పెట్టుబడిదారుల చేతుల్లో యిరుక్కుపోయింది. మీడియా యజమానులకు యితరత్రా వ్యాపారప్రయోజనాలు కూడా వుండడంతో వాటిని కాపాడుకోవడానికి భయంతోనో, ప్రలోభంతోనో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు. పత్రికలు, టీవీ ఛానెళ్లు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి వచ్చింది. స్వతంత్ర అభిప్రాయాలు వెలిబుచ్చాలంటే చిన్న పత్రికలు మాత్రమే శరణ్యమైన అవస్థ వచ్చింది. చిన్న పత్రికలు ఒక వ్యక్తిపైనే ఆధారపడతాయి. ఆ వ్యక్తిని చంపేస్తే ఆ మేరకు ఆ వేదికను నాశనం చేసినట్లే.

ఇప్పుడు గౌరి మరణంతో ఆ పత్రిక మూతపడినట్లే. ఆ భావజాలానికి పట్టుకొమ్మ విరిగిపోయినట్లే. ఆమె ఒంటరి. భర్తతో విడాకులు తీసుకుంది. పిల్లలు లేరు. ఆమె చెల్లెలు కవిత సినిమాలు తీస్తుంది. ఇప్పుడు గౌరి చనిపోగానే నిరసనలు, కొవ్వొత్తి ప్రదర్శనలు, ఖండనమండనలు, యిదిగో యిలాటి వ్యాసాలు వారం, పదిరోజులు హడావుడి చేస్తాయి. తర్వాత అంతా మామూలే. కలబురిగి హత్యకేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదని గౌరి ప్రభుత్వాన్ని తప్పుపడుతూండగానే ఈమెను కూడా ఆయన దగ్గరకి పంపించివేశారు. ఇప్పుడు సిద్ధరామయ్య ఆమె తండ్రి కూడా తనకు ఆప్తుడు అంటూ ప్రభుత్వం తరఫున 21 మంది సభ్యుల సిట్‌ వేశాడు. దాని అతీ, గతీ ఏమవుతుందో మళ్లీ యింకో వామపక్ష లేదా లౌకికవాద సామాజిక కార్యకర్తను చంపినప్పుడే గుర్తుకు వస్తుంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్
-mbsprasad@gmail.com