Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: రాజస్థాన్ ఎన్నికలు

ఎమ్బీయస్‍: రాజస్థాన్ ఎన్నికలు

నిన్నటి రాజస్థాన్‌లో ఎన్నికలలో మొత్తం 200 స్థానాల్లో 199 స్థానాలకు జరిగాయి. 5.25 కోట్ల ఓటర్లలో 75% మంది ఓట్లేశారు. 1998 నుంచి అక్కడ ఐదేళ్ల కోసారి ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈ ఆనవాయితీని మార్చి తమను మళ్లీ గెలిపించమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్‌లోత్ ఓటర్లను ప్రాధేయపడుతున్నాడు. ప్రస్తుతం ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాలలో ఎంపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెసు గెలిచే అవకాశాలున్నా, రాజస్థాన్‌లో మాత్రం టఫ్ ఫైట్ ఉందని రాహుల్ గాంధీయే స్వయంగా సెప్టెంబరు 24 మీడియా సమావేశంలో ఒప్పుకున్నాడు. అశోక్‌పై వ్యతిరేకత బలంగా లేకపోయినా, కొందరు స్థానిక ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి మాత్రం గట్టిగా ఉందని పరిశీలకులు అంటున్నారు. పథకాలను చూపించి గట్టెక్కుదామని కాంగ్రెసు ప్రయత్నం. పథకాలు బాగానే పెట్టినా, స్థానిక ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వలన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలు కావటం లేదని ఓటర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

కాంగ్రెసు పార్టీలో ఎప్పణ్నుంచో అశోక్‌కు, సచిన్‌ పైలట్‌కు పడటం లేదు. ఈ మధ్యే సచిన్ మా మధ్య గొడవలు లేవన్న బిల్డప్ యిస్తున్నాడు. ఎన్నికల అనంతరం కాంగ్రెసు గెలిస్తే, అశోక్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడో, లేక సచిన్‌కు ఛాన్సు వస్తుందో స్పష్టత లేదు. అశోక్‌పై బిజెపి అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. దానిలో వింత లేదు. జులైలో అశోక్ మంత్రివర్గ సహచరుడైన రాజేంద్ర సింగ్ గుఢాయే ముఖ్యమంత్రి కార్యాలయంపై అవినీతి ఆరోపణలు చేశాడు. అతను బియస్పీ ద్వారా నెగ్గి, కాంగ్రెసులో చేరి, మంత్రి పదవి దక్కించుకున్నాడు. అయితే అతను రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఆరోపణ చేశాడు. దాని అధ్యక్షుడు అశోక్ కొడుకు వైభవ్! వైభవ్‌పై ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ వ్యవహారాల్లో అక్రమాలు చేశాడంటూ ఇడి అక్టోబరు నెలాఖర్లో నోటీసులు యిచ్చింది. ‘అది 10-12 ఏళ్ల క్రిందటి వ్యవహారం. నాకు సంబంధం లేనిది. ఎన్నికల వేళ నోటీసులు యివ్వడం రాజకీయ దురుద్దేశంతోనే’ అంటాడతను.

ఇవి కాంగ్రెసు కష్టాలైతే బిజెపి కష్టాలు అంతఃకలహాలతో ముడిపడి ఉన్నాయి.  దానికి కేంద్ర బిందువు వసుంధరా రాజే! రాజస్థాన్ బిజెపి నాయకుల్లో ఆమెకున్నంత ప్రజాదరణ వేరెవరికీ లేదు. ఐదుసార్లు ఎంపీగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆమెకు అన్ని కులాల వారిలో ఆదరణ ఉంది. ముఖ్యమంత్రిగా ఆమె పరిపాలనా దక్షత చూపించింది కానీ అధికారులపై ఎక్కువగా ఆధారపడి, ఎమ్మెల్యేలకు దూరమైందనే ఆరోపణ ఉంది. పార్టీలో ఆమె కున్నంత మంది అనుయాయులూ లేరు, శత్రువులూ వేరెవరికీ లేరు. వాజపేయి హయాంలో వాళ్లు యీమె కళాకళలను సహించేవారు. కానీ మోదీ-అమిత్‌ల హయాం వచ్చాక అవేమీ సాగటం లేదు. వారితో ఆమెకు సత్సంబంధాలేమీ లేవు.

ఆమె అహంభావం కారణంగానే 2018లో పార్టీ ఓడిపోయిందనే సాకు చెప్పి, ఆమెను పక్కకు నెట్టేసింది మోదీ ద్వయం. రాష్ట్రంలో ఆరెస్సెస్ మద్దతున్న ఆమె తగ్గలేదు. అనుయాయుల ద్వారా పార్టీని అల్లరి పెట్టింది. 2020 డిసెంబరులో సమర్థక్ మంచ్ అనే ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, వారి ద్వారా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ ముందుకు తెచ్చింది. కానీ ఆ సమావేశానికి 71 మంది బిజెపి ఎమ్మెల్యేలలో ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అధిష్టానం ఆమె ఆట కట్టించాలని నేషనల్ వైస్ ప్రెసిడెంటు పదవి యిచ్చి, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ సరసన కూర్చోబెట్టింది. అప్పటికే ఆమె అనుయాయి ఐన అశోక్ పర్నామీని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసి, ఆమె అంటే పడని సతీశ్ పూనియాకు ఆ పదవి యిచ్చింది.

ఎన్నికల వేళ ఆమెను అంగీకరించనూ లేక, తిరస్కరించనూ లేక చివరి దాకా ఆగి చాలా ఆలస్యంగా ఆమెను కాంపెయిన్‌లోకి దింపింది. ఆమె అనుచరుల్లో చాలామందికి టిక్కెట్లు తిరస్కరించింది. వసుంధరను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓటర్లకు చూపటం లేదు. ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ అభ్యర్థులుగా నిలిపి, యింకా కొంతమందిని కలిపి సమిష్టి నాయకత్వం అంటోంది, కాంగ్రెసు తరహాలో! 2003 నుంచి రాజస్థాన్‌లో బిజెపి అంటే వసుంధరే అనుకునే పరిస్థితి నుంచి డజను మందిలో ఒకరు అనే స్థితికి ఆమెను దింపారు. గతంలో ఆమె పరివర్తన యాత్ర పేరుతో ఎన్నికల ర్యాలీలను ఎన్నో నెలల ముందుగానే ప్రారంభించేది. ఈసారి చాలాచాలా ఆలస్యంగా ప్రారంభించింది. మీడియాను అనుమతిస్తే, ‘మీరెందుకు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు?’ అని అడుగుతారనే జంకుతో ప్రెస్‌మీట్‌లు పెట్టటం లేదు.

మహిళా బిల్లు గురించి గొప్పగా చెప్పుకుంటున్న మోదీ, ఒక బలమైన మహిళా నాయకురాలిని యిలా నిరాదరించడం వింతగా ఉందనే విమర్శ రావడంతో, దానికి సమాధానంగా మోదీ దీపా అనే జయపూర్ రాజవంశీకురాలిని రంగంలోకి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం రాజసమంద్ ఎంపీగా ఉన్న ఆమె జయపూర్‌లోని విద్యాధర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. వసుంధరతో పాటు సమిష్టి నాయకత్వం అంటూ ముందుకు తీసుకుని వస్తున్నవారిలో వసుంధరకు ఆత్మీయుడైన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, వసుంధరంటే అస్సలు పడని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా, ప్రస్తుత అధ్యక్షుడైన సిపి జోషి, కేంద్ర మంత్రిగా ఉన్న గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారు. సతీశ్ జాట్ నాయకుడు. వసుంధర అనుయాయులను పార్టీలోంచి బయటకు పంపడమే కాకుండా, ఆమె వ్యతిరేకులకు ప్రాధాన్యత యిచ్చారు. మార్చిలోనే అతన్ని తప్పించి బ్రాహ్మణుడైన జోషికి ఆ పదవి యిచ్చారు. ఇది జాట్ కులస్తులకు నచ్చలేదని అంటున్నారు.

రాజస్థాన్‌లో బలాబలాలు తారుమారవడం చాలా సులభం. 2018 ఎన్నికలలో 3.56 కోట్ల మంది ఓటేయగా కాంగ్రెసు, బిజెపిల మధ్య ఓట్ల తేడా 1.78 లక్షలు (0.53%) మాత్రమే. అయినా సీట్ల సంఖ్యలో తేడా 27! కాంగ్రెసుకి 100 వస్తే బిజెపికి 73 వచ్చాయి. బియస్పీ 6 గెలిచింది. (వీళ్లు తర్వాత కాంగ్రెసులోకి ఫిరాయించారు) ఆర్ఎల్‌పి 3, సిపిఎం2, బిటిపి 2 ఆర్ఎల్‌డి 1 స్వతంత్రులు 13 గురు గెలిచారు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెసుకు 108, బిజెపికి 70, ఆర్ఎల్‌డికి 3, సిపిఎంకు 3, భారతీయ ట్రైబల్ పార్టీకి2, రాష్ట్రీయ లోకదళ్‌కు1, స్వతంత్రులకు 13 స్థానాలున్నాయి. ఫలితాల తర్వాత యీ అంకెలు ఎలా మారతాయో చూడాలి.

సచిన్ పైలట్ ఫ్యాక్టర్ ఒకటి ముఖ్యమైనది. 2018 ఎన్నికల నాటికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సచిన్ చాలా కష్టపడి, కాంగ్రెసు విజయానికి దోహదపడ్డాడు. అతనే కాబోయే ముఖ్యమంత్రి అనుకున్నారు. గెలుపు తర్వాత రాహుల్ పైలట్‌వైపు మొగ్గుచూపినా సోనియా ఎంపీలో లాగానే యిక్కడా 67 ఏళ్ల సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఐన అశోక్ గెహ్‌లోత్‌ను ఎంచుకుంది. అతనికి ఎమ్మెల్యేలలో ఉన్న పట్టు కారణంగా అది సాధ్యపడింది. రెండున్నరేళ్లు పోయాక సచిన్‌కు కుర్చీ అప్పగిస్తానంటూ అశోక్ ఒప్పుకున్నా, తర్వాత మొండికేశాడు. సోనియా అతన్ని కాంగ్రెసు పార్టీ జాతీయ అధ్యక్షుణ్ని చేసి, ముఖ్యమంత్రి పదవి వదిలేయ్ అన్నా ధిక్కరించాడు. సోనియా ఏమీ చేయలేక ఊరుకుంది.

ఈసారి కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తే అశోక్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడో లేదో చూడాలి. ఈలోగా 2020లో తిరుగుబాటు చేసిన సచిన్‌కు అధ్యక్ష పదవీ పోయింది, కాబినెట్‌లో ఉపముఖ్యమంత్రి పదవీ పోయింది. బిజెపిలోకి మారదామనుకున్నాడు కానీ ఎంపీలో పార్టీ మారిన సింధియాకు ఏమీ దక్కలేదని గ్రహించి, ఆగిపోయాడు. కాంగ్రెసు అతనికి జాతీయ వర్కింగ్ కమిటీలోకి తీసుకుంది. అయితే అతను అశోక్‌పై తన ఆగ్రహాన్ని దాచుకోలేదు. ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశాడు. అయితే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి చల్లారాడు. అశోక్‌కు, తనకూ మధ్య గొడవలేమీ లేనట్లుగా బిల్డప్ యిస్తున్నాడు.

ఇది బిజెపికి నచ్చలేదు. అతని పేరు వాడుకుని గుజ్జర్లను రెచ్చగొడదామని చూస్తోంది. ‘మీ కులస్తుడికి జరిగిన అన్యాయం చూడండి. పాలల్లో యీగను తీసిపారేసినట్లు పారేశారు. గతంలో వాళ్ల నాన్న రాజేశ్ పైలట్‌ను కూడా కాంగ్రెసు అవమానపరచింది.’ అంటూ మోదీ ప్రసంగించాడు.  జనాభాలో గుజ్జర్లు 8% మంది ఉంటారు. 24 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు. అశోక్ దీన్ని తిప్పి కొడుతూ ‘‘బిజెపి హయాంలో గుజ్జర్ ప్రదర్శనకారులపై కాల్పులు జరిగి 72 మంది చచ్చిపోయారు. కాంగ్రెసు హయాంలో వారిపై లాఠీచార్జి కూడా జరగలేదు.’’ అన్నాడు. సచిన్ ‘బయటి పార్టీ వాళ్లకు నా గురించి చింతించవలసిన అవసరం లేదు’ అన్నాడు.

ఇతర కులాల గురించి చెప్పుకోవాలంటే వివిధ పార్టీల నుంచి జాట్ ఎమ్మెల్యేలు 39 మంది ఉన్నారు. ఉత్తర రాజస్థాన్‌లో 50 నియోజకవర్గాల్లో జాట్, ముస్లిం, యాదవ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర బిజెపి తెచ్చిన సాగు బిల్లులకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. వారంతా బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తారని కాంగ్రెసు ఆశ. ఆ ప్రాంతంలోని 13 జిల్లాలకు మేలు చేసే ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు అనే ప్రాజెక్టుకు వసుంధర రూపలకల్పన చేసి 2017లో డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను కేంద్రానికి పంపించింది. 2018లో కాంగ్రెసు ప్రభుత్వం రావడంతో అది మూలపడింది. దాన్ని చూపించి కాంగ్రెసు బిజెపిపై అక్కడి ప్రజల ఆగ్రహాన్ని పెంచుతోంది.

అయితే ఉత్తర రాజస్థాన్‌లో కాంగ్రెసుకు పోటీగా గతంలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జాట్ నాయకుడు హనుమాన్ బెనీవాల్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌పి (రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ) యీసారి విడిగా 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. యుపిలో దళిత పార్టీ ఐన భీం ఆర్మీ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) పేరుతో రాజస్థాన్ బరిలో దిగి, యీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ జాట్-దళిత కూటమి బిజెపికి ఎసరు పెడుతుందనే భయం ఉంది. గత నాలుగేళ్లలో రాష్ట్రం అసెంబ్లీకి జరిగిన ఉపయెన్నికల్లో ఆర్ఎల్‌పి జాట్ ఓట్లను చీల్చి బిజెపికి నష్టం కలిగించింది.

దళితుల విషయానికి వస్తే జనాభాలో 18% మంది ఎస్సీలున్నారు. వారికి 34 రిజర్వ్‌డ్ స్థానాలున్నాయి. 2018లో వాటిల్లో 19 చోట్ల కాంగ్రెసు, 12 స్థానాల్లో బిజెపి నెగ్గాయి. 55 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరు. ఎస్సీ పార్టీ ఐన బియస్పీ  2018 ఎన్నికలలో 4% ఓట్లతో 6 స్థానాలు గెలిచింది. 30 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగింది. వాటిలో 17టిలో బిజెపి కొద్ది మార్జిన్‌తో కాంగ్రెసుకు సీట్లు పోగొట్టుకుంది. మరో మూడిటిలో స్వతంత్రులు గెలిచారు. ఇది బిజెపిని అధికారానికి దూరం చేసింది. ఈసారి బియస్పీ పోటీ చేయకుండా బాగుండునని బిజెపి అనుకుంది. యుపి ఎన్నికలలో మాయావతి చప్పబడింది కూడా. అయినా యిక్కడ మాత్రం 183 సీట్లలో పోటీకి దిగింది. మాయావతి స్వయంగా వచ్చి ప్రచారం చేస్తోంది. జనాభాలో ఎస్టీలు 13.5% మంది ఉన్నారు. వాళ్లకు రిజర్వ్ చేసిన 25 స్థానాల్లో వారి జనాభా 50% కు మించి ఉంటుంది. మొత్తం 59 ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో 2018లో బిజెపి 21టిలో మాత్రమే గెలిచింది.

రెండు పార్టీలకు తిరుగుబాటు దారుల బెడద ఉంది. 2018 ఎన్నికలలో టిక్కెట్లు దక్కని కాంగ్రెసు రెబెల్స్ 13 మంది గెలిచారు. ఫలితాలు వచ్చాక 12 మంది కాంగ్రెసులో చేరారు. వారిలో 10 మందికి యీసారి టిక్కెట్లు దక్కాయి. బిజెపి రెబెల్స్ 12 మందిలో ఒక్కరూ గెలవలేదు కానీ తమ స్థానాల్లో బిజెపి అభ్యర్థులను ఓటమికి కారకులయ్యారు. ఈసారి ఎన్నికల్లో 25 మంది బిజెపి రెబెల్స్, 14 మంది కాంగ్రెసు రెబెల్స్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో 5వేల ఓట్ల తేడాతో కాంగ్రెసు గెలిచిన స్థానాలు 34. మార్జిన్లు అతి తక్కువ కాబట్టి, తిరుగుబాటు దారులు కొద్దిపాటి ఓట్లు చీల్చినా ఫలితాలు తారుమారవుతాయి. 2008లో కాంగ్రెసుకు 96 (ఓట్లు 36.8%) వస్తే బిజెపికి 78 (ఓట్లు 34.3%) వచ్చాయి. 2013లో కాంగ్రెసుకు 21 (ఓట్లు 33.1%) వస్తే బిజెపికి 163 (ఓట్లు 45.2%) వచ్చాయి. 2018లో కాంగ్రెసుకు 100  (ఓట్లు 39.3%) వస్తే బిజెపికి 73 (ఓట్లు 38.8%) వచ్చాయి.

దీనికి కారణం 166 స్వింగ్ నియోజకవర్గాలు! అవి అటూయిటూ ఓటు మార్చి ప్రభుత్వాలను పడగొడుతూ ఉంటాయి. ఈ 166లో 2008లో కాంగ్రెసుకి 91, బిజెపికి 50, ఇతరులకు 25 వచ్చాయి. 2013లో అవి 16, 135, 15 అయ్యాయి. 2018కి వచ్చేసరికి అవి 95, 45, 26 అయ్యాయి. ఇక్కడ వచ్చిన మెజారిటీని బట్టే కాంగ్రెసు లేదా బిజెపి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

రైతుల ఋణమాఫీ హామీ యిచ్చి అమలు చేయని కాంగ్రెసు యిప్పుడు ‘కామ్ కియా దిల్‌సే, కాంగ్రెస్ ఫిర్‌సే’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. కొద్ది నెలల క్రితమే ప్రారంభించిన కాంగ్రెసు ప్రభుత్వ పథకాలు – ఇళ్లకు 100 యూనిట్ల దాకా ఉచిత కరంటు, రైతులకు నెలకు 2వేల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు, రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలండరు, ఇందిరా గాంధీ అర్బన్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీము కింద 100 రోజుల పని గ్యారంటీ, గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పని గ్యారంటీ, బస్సు టిక్కెట్లల్లో మహిళలకు 50శాతం రాయితీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు, ఒంటరి మహిళలకు రూ.1000 పెన్షను, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం. కులగణన చేయిస్తామన్న హామీ, చిరంజీవి ఆరోగ్య బీమా పథకం కింద 1.40 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, పాడి పశువులలకు రూ.40 వేల బీమా పథకం, రూ. 10 లక్షల వరకు యాక్సిడెంటు ఇన్సూరెన్సు, అన్నపూర్ణ ఫుడ్ కిట్స్ పేర ఉచితంగా నెలవారీ సరుకులు, ‘ఇందిరా గాంధీ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజనా’ కింద 1.33 కోట్ల స్మార్ట్ ఫోన్లను కొన్ని కేటగిరీల మహిళలకు ఆగస్టు నుంచి ఉచితంగా యివ్వడం. ‘ఇందిరా రసోయీ స్కీము’ దాదాపు వెయ్యి కాంటీన్లు పెట్టి, అక్కడ  రూ.8కి భోజనం పెట్టడం.

ఇవి చాలనట్లు పాతవాటికి తోడు ఏడు గ్యారంటీలు ప్రకటించింది. ఉద్యోగులకు పాత పెన్షన్, గోదాన్ స్కీము కింద ఆవు పేడను కిలో రూ.2 చొప్పున కొనడం, స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, యిలాటివి వాటిలో ఉన్నాయి.

యువత విషయానికి వస్తే,  ప్రథమ ఓటర్లు 23 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువతది మూడు వంతుల మంది ఉన్నారు. 100 స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుంది. నిరుద్యోగం ఎక్కువగా ఉండడం చేత, ప్రభుత్వంపై ఆగ్రహం ఉంది. పేపర్లు లీక్ కావడం కాంగ్రెసును వారికి మరింత దూరం చేసింది. ఆ లీక్‌ల విషయంలో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు గోవింద సింగ్ డోతసారా యింటిపై ఈడీ దాడి చేయడం (దీనిలో ఈడీకి సంబంధం ఏమిటని అడక్కండి. అది సర్వాంతర్యామి, సర్వశక్తిశాలిని. తక్కిన కేంద్ర సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఈడీ కేసు పెడితే ఎందుకు పెట్టిందో తెలుసుకునే హక్కు కూడా ఉండదు నిందితులకు) కాంగ్రెసును మరింత అప్రతిష్ఠపాలు చేసింది.

యువతను ఆకట్టుకోవడానికి తాము అధికారంలోకి వస్తే 2.5 లక్షల మందికి ప్రభుత్వోద్యోగా లిస్తామని బిజెపి హామీ యిచ్చింది. ప్రయివేటు రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడి పెడతామంటోంది. కాంగ్రెసు కాలేజీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు యిస్తామని, పిల్లలందరికీ ఇంగ్లీషు మీడియంలో బోధన ఏర్పాటు చేస్తామని అంటోంది. రాజస్థాన్ ఓటర్లు యీ హామీల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. వీటికి నిధులెక్కణ్నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. తలసరి ఎన్‌ఎస్‌డిపి విషయంలో 2021-22లో 27 రాష్ట్రాల్లో దాని స్థానం 18. ఎచ్‌డిఐ (హ్యూమన్ డెవలప్‌మెంట్ యిండికేటర్)లో 2021లో దాని స్థానం 30లో 20. ఆర్థిక స్తోమత ప్రకారం జనాభాను 5 తరగతులుగా విభజిస్తే, 2021లో దిగువ రెండు తరగతుల్లో రాజస్థాన్ ప్రజల్లో 42శాతం మంది ఉన్నారు. 2020లో మాన్యుఫేక్చరింగ్ రంగంలో దాని స్థానం 30లో 19. చూడబోతే అన్ని పార్టీలూ సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. ప్రజలు ఎవరి హామీలు నమ్మారో ఫలితాలు వచ్చాక తెలుస్తుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?