cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: బాలుకి నివాళి

ఎమ్బీయస్: బాలుకి నివాళి

బాలు వెళ్లిపోయారు. మధ్యలో కాస్త ఆశలు రేకెత్తించారు కానీ చివరకు దుఃఖంలో ముంచారు. 74 ఏళ్ల వయసంటే మరీ తక్కువా కాదు, మరీ ఎక్కువా కాదు. ఈ కరోనా గొడవ లేకపోతే 80 దాకా కనీసం వుండేవారేమో. కరోనా ఒక్కదాన్నీ నిందించడం భావ్యం కాదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాక, తిండి బాగా తగ్గిపోయి ఆయన యిమ్యూనిటీ తగ్గిపోయిందట. ఆ సర్జరీ వలన ఆయన బావుకున్నదీ లేదు. 50, 60 ఏళ్లు వచ్చాక ఆ సర్జరీ చేయించుకోవడంలో రిస్కు చాలా వుందని అంటున్నారు. దాసరి నారాయణరావు గారికి కూడా అది ముప్పు తెచ్చిపెట్టింది.

ఈయన అందరికీ జాగ్రత్తలు చెప్తూ వుంటాడు, హితబోధలు చేస్తూ వుంటాడు. అలాటిది ఆయనే ఈటీవీ వాళ్ల ‘‘సామజవరగమన’’ కార్యక్రమం షూటింగులో పాల్గొనడానికి హైదరాబాదు వచ్చి 5 రోజుల షూటింగులో పాల్గొన్నాట్ట. అంటే ఖాళీగా, తీరిగ్గా కూర్చోలేని వీక్‌నెస్. అదే ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ టీములో ఓ గాయనికి, ఆర్కెస్ట్రాలో 5గురికి కరోనా వుందిట. ఈయనకు సోకింది. వాళ్లు వయసులో వున్నారు, యిమ్యూనిటీ వుంది. ఈయనకు వయసు మీద పడింది. దాంతో కరోనా కాటేయగలిగింది. చెన్నయ్ తిరిగి వెళుతూనే జబ్బు పడ్డాడు. లైట్‌గానే సోకిందని ఆయనా అనుకున్నాడు కానీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ విపరీతంగా పట్టేసిందని చివరకు తేలింది.

అపోలో వాళ్లు ఎక్మో మెషిన్ అరువివ్వడంతో హమ్మయ్య అనుకున్నాం కానీ దాన్ని ఎక్కువ రోజులు వాడకూడదట. అందుకని రెండు వారాల క్రితం విత్‌డ్రా చేశారు. కానీ ఊపిరితిత్తులు కొలాప్స్ కావడంతో మళ్లీ పెట్టాల్సి వచ్చింది. అప్పుడే శంక పట్టుకుంది. లేచారు, కూర్చుంటున్నారు, రాసి చూపిస్తున్నారు అంటున్నారు కానీ యంత్రాలపై నెలన్నర పాటు ఆధారపడడం వలన దేహంలో తక్కిన అవయవాలు దెబ్బ తింటాయి కదా. చివరకు గుండె, ఊపిరితిత్తులు ఆగిపోయాయట. మాట దక్కలేదు. కోట్లాది సామాన్య, అసామాన్య ప్రజల ప్రార్థనలు ఫలించలేదు.

ఈ సత్యం జీర్ణించుకోవడానికి చాలా బాధగా వుంది. నా బోటి వాళ్లకు బాలు తర్వాత తెలుగు సినీగాయకులెవరూ మనసులో నాటుకోలేదు. ఏదైనా పాట బాగుందని తోస్తే ఎవరు పాడారని అడిగి తెలుసుకుంటున్నాం కానీ గాయకుడి పేరు గుర్తు పెట్టుకోవడం లేదు. నా కంటె పిన్నవయస్కులకు గాయకులు గుర్తుంటారు కానీ వాళ్లెవరూ అర్ధశతాబ్ది పాటు మనగలుగుతారని అనుకోవడం అత్యాశే అవుతుంది.

మహా అయితే గాయకుడిగా మనవచ్చు, కానీ బాలు లాగ బహుముఖాలుగా తన ప్రజ్ఞను ప్రదర్శించడం మరో నరమానవుడి వలన అవుతుందా? ఊహించడానికే కష్టంగా వుంది. ఒక్క నిమిషం తీరిగ్గా వుండలేడాయన. శ్రమజీవి. చివరిదాకా ఏదో చేయాలన్న తపన. మరొకరు 174 ఏళ్లు బతికినా చేయలేనన్ని పనులు ఆయన 74 ఏళ్లలో చేసి చూపించాడు.

బాలు ఆసుపత్రిలో పడిన 15 రోజులకు ఆంధ్రజ్యోతిలో ఫీచర్స్ చూసే మిత్రుడు ‘బాలు గారు త్వరగా కోలుకోవాలని కోరుతూ మాకేమైనా రాయండి’ అని కోరారు. నేను నివ్వెరపోయాను. ‘‘ఇప్పటికే ఆయన బాగా క్రిటికల్‌గా వున్నాడు. ఈ సమయంలో ఆయనపై ఏదైనా ఆర్టికల్ కంటపడగానే ‘అయితే పోయాడన్నమాట’ అనుకుంటారు. ఇలాటి సందర్భాలకు ఎవరూ రాయగా చూడలేదు.’’ అన్నాను. ‘‘ఆ మాట నిజమే కానీ అలాటి భావం కలగకుండా, ఆయన తిరిగి రావాలని ప్రార్థిస్తూ రాయండి.’’ అన్నాడాయన. ప్రార్థిస్తూ రాయడమంటే ఏ మృత్యుంజయ స్తోత్రమో, విష్ణుసహస్ర నామాలో రాయాలి. ఇన్ని పాటలు పాడారు, యిన్ని భాషల్లో పాడారు అని రాస్తే నివాళి అర్పించేసినట్లే అవుతుంది.

చివరకు నాకు తట్టిన ఆలోచన ఏమిటంటే అసలు ఎందుకు యింతమంది బాలు గురించి ఆరాటపడుతున్నారు? వాళ్లకి ఆయనంటే ఎందుకింత అభిమానం? అనే సంగతిపై రాయవచ్చు అని. బాలు గురించి సమస్త దక్షిణాది జనం, శ్రీలంకతో సహా, ప్రార్థనలు చేశారు. అమితాబ్ బచ్చన్ విషయంలో మనకు యింత వేదనెందుకు కలగలేదు? అప్పుడెప్పుడో ‘‘కూలీ’’ సినిమా షూటింగు సందర్భంగా ఆయన సమస్త రోగాల జాబితా బయటకు వచ్చేసింది. బతికి బట్టకట్టడమే కష్టమన్నారు. అలాటిది వైద్యుల చికిత్సతో, అభిమానుల ప్రార్థనలతో బయట కొచ్చాడు. 

అప్పణ్నుంచి తక్కిన లైఫంతా ఆయనకు బోనస్సే అనే ఫీలింగు కలిగేసింది. ఘంటసాల గారి మరణం విషయం నాకు బాగా గుర్తుంది. అప్పుడిలాటి ప్రార్థనలు జరగలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన పోవడం తథ్యం అనేదానికి జనం సిద్ధపడి పోయారు. అప్పట్లో మీడియా యింత విస్తృతంగా లేదు కాబట్టి ఆయన పోవడానికి ముందే ‘పోయారట’ అనే పుకార్లు కూడా వచ్చేసేవి.

ఘంటసాల గారి విషయంలో ‘ఫలానా పాట ఆయన పాడాల్సింది, కానీ అనారోగ్యం చేత పాడలేక పోయారు’ వంటి ఉదంతాలు చాలా వినేవాళ్లం. పైగా 50 ఏళ్లకు చేరుతూండగా పాడిన చివరి పాటల్లో  ఆయాసపడుతున్నట్లు తెలిసేది. అందువలన ఆయన శకం ముగిసిపోయిందనే ఫీలింగు అప్పటికే వచ్చేసింది. చివరకు 51 ఏళ్లకు గంధర్వలోకానికి వెళ్లిపోయారు. మరి బాలూ? 70 ఏళ్లు దాటినా ఆరోగ్యానికి కొండగుర్తుగా కనబడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ కనబడతాడు. దేశవిదేశాల్లో స్టేజి ప్రదర్శనలు యిచ్చేస్తూంటాడు. ప్రతీ వారం టీవీ ద్వారా మన యింట్లోకి వచ్చేసి ఎంత హుషారుగా వున్నాడో చూపిస్తూనే వుంటాడు. అలాటాయన ఆసుపత్రిలో వెంటిలేటరుపై వున్నాడనగానే మనసు చివుక్కుమంది.

సరే, ఒక ఆరోగ్యవంతుడు జబ్బు పడ్డాడంటే మనం బాధపడతాం, కానీ బాలు విషయంలో ఎందుకు ఆత్మీయత ఫీలవుతున్నాం? మనసెందుకు విలవిల లాడుతోంది?  మన యింట్లో మనిషే మంచం మీద పడివున్నట్లు ఎందుకనిపిస్తోంది? ఆ సబ్జక్టు మీద వ్యాసం రాస్తే బాగుండుననిపించింది. అప్పుడు ఆయన వ్యక్తిత్వం, శ్రోతలతో ఆయన పెంచుకున్న అనుబంధం హైలైట్ అవుతాయి. అవన్నీ గుర్తుకు రాగానే పాఠకుడు మనమెవరూ చెప్పకుండానే ఆయన కోసం ప్రార్థిస్తాడు అనిపించింది. 

‘‘బాలు అంటే ఎందుకింత అభిమానం?’’ అనే పేరుతో  రాసి పంపించాను. దానిలో బాలుతో శ్రోతలకు ఎందుకింత గాఢానుబంధం ఏర్పడింది అనేది చర్చించాను. ఉదాహరణకి మనం ఘంటసాలను ‘మేస్టారు’ అంటాం. బాలును మన సీనియర్ క్లాస్‌మేట్‌గా చూస్తాం. ఘంటసాలను దైవాంశసంభూతుడిగా భావించి దూరం నుంచి ఆరాధిస్తాం. అదే బాలు అయితే ఏదో మన ఫ్రెండన్నట్లు ఫీలవుతాం.

ఘంటసాలతో పోల్చినపుడు యింకో తేడా కూడా చెప్పాలి. ఘంటసాలకు అనారోగ్యం వచ్చి పాడలేక పోయినపుడు, ఆయన పోయాక రామకృష్ణకే అవకాశాలు వచ్చాయి. కృష్ణ తప్ప హీరోలెవరూ బాలుకి ఛాన్సివ్వలేదు. తమిళంలో ఎమ్జీయార్‌కు పాడి పేరు తెచ్చుకున్న సమయంలో యేసుదాసు దూసుకు వచ్చి, అక్కడి ఛాన్సులు తన్నుకుపోయారు. దాంతో బాలు భుక్తి కోసం ఆర్కెస్ట్రా పెట్టుకుని ప్రోగ్రాంలు యిస్తూ ఊరూరూ తిరిగాడు. దీని కారణంగా జనాలకు దగ్గరయ్యాడు. మాలో చాలామంది పట్టణాల్లో వుంటూ కూడా బాలుని దగ్గర్నుంచి చూశాం. అదే ఘంటసాల అయితే ఎక్కడో మద్రాసులో వుండేవారు. జనాల్లోకి అరుదుగా వచ్చేవారు. అందువలన బాలుతో మానసికంగా క్లోజ్‌నెస్ పెరిగింది.

ఇంకో విషయం కూడా వుంది. ఘంటసాల వక్త కాదు, సభల్లో పాల్గొనడం తక్కువ. బాలు అయితే అనేక ఊళ్లలో సభలకు వచ్చేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. సమయోచితంగా, చమత్కారంగా, ఎంతో సమాచారంతో మాట్లాడడం ఆయనకు బాగా వచ్చిన విద్య. నిజానికి ఆయన పాట ఎంత బాగుంటుందో, మాట కూడా అంత బాగా వుంటుంది.

మొహం మీద చిరునవ్వు చెదరకుండా, ప్రతి అక్షరం ఆచితూచి, సరైన టైమింగుతో మాట్లాడతాడు. పొల్లుమాట వుండదు. వేదిక మీదనే కాదు, విడిగా పార్టీలలో కూడా ఆయనతో నేను చాలాసార్లు గడిపాను. వివిధ వ్యక్తుల గురించి ఎనెక్డోట్స్ చెప్పడంలో దిట్ట. ఆయన జ్ఞాపకశక్తి, చెప్పే నేర్పు అమోఘం. ముఖ్యంగా ఆయన వాళ్లను అనుకరిస్తూ చెప్తాడు కాబట్టి ఎన్ని గంటలైనా వినబుద్ధవుతుంది.

ఘంటసాల కంటె బాలు ఎక్కువ ఆత్మీయుడై పోవడానికి మరో ప్రధాన కారణం – టీవీ కార్యక్రమాలు. ఆయన నట్టింట్లోకి దూసుకుని వచ్చేసినట్లే కదా. పైగా ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ అసామాన్యం. వచ్చిన అతిథిని పరిచయం చేయడం దగ్గర్నుంచి, ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడం, తప్పులు సరిదిద్దడం, సందర్భం కల్పించుకుని నాలుగు మంచిమాటలు చెప్పడం – యివన్నీ చూస్తే మనకు ముచ్చట వేస్తుంది. ఆయన పరాయివాడనిపించదు. ఘంటసాల టైములో టీవీలు లేవు. ఉన్నా ఆయన యింత లాఘవంగా, చమత్కార సంభాషణతో నిర్వహించ గలిగేవారో కాదో మనకు తెలియదు.

ఈ పాయింట్లతో నేను వ్యాసం రాసుకుంటూ పోయాను. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి రెండు విషయాలపై క్లారిఫికేషన్ కూడా జోడించాను. ఘంటసాల వుండగా యితర గాయకులను ప్రోత్సహించేవారని, యీ ‘బాలసుబ్బిగాడు’ (ఘంటసాల వీరాభిమానులు కొందరికి బాలును అలా తిట్టకపోతే తృప్తిగా వుండదు) వచ్చిన తర్వాత అందరి ఛాన్సులూ గుంజేసుకున్నాడనీ సాధారణంగా వచ్చే ఆరోపణ గురించి రాశాను. ఒక నేపథ్యగాయకుడికి తక్కిన గాయనీగాయకులను నిర్ణయించేటంత శక్తి వుండదని వాదించాను. బాలుకి వున్న గొప్ప కళ మిమిక్రీ కళ. ప్రతి ఆర్టిస్టుకీ వారు పాడినట్లే పాడేవాడు. అది నచ్చి ఆర్టిస్టులు నిర్మాతకు చెప్పి ఈయనతో పాడించుకునేవారేమో కానీ, వేరే ఎవరి చేతా పాడించకండి అని చెప్పేటంత సీను యీయనకి వుండదని చెప్పాను.

అంతెందుకు, బాలు ప్రభ తగ్గిన తర్వాత ఎంతమంది గాయకులు రాలేదు? బాలు దగ్గర పనిచేసిన వాళ్లు సంగీతదర్శకులై ఆయన చేత కాకుండా వేరేవాళ్ల చేత పాడించలేదా? తామే పాడలేదా? బాలు ఏమైనా ఆపగలిగాడా? వాళ్లను అదిలించగలిగాడా? బెదిరించ గలిగాడా? ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్. ప్రజాదరణ బట్టి డిమాండ్ పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కంటె థమస్‌కు డిమాండ్ ఎక్కువుందంటున్నారు.

ఆయన యీయన్ని తొక్కేశాడనో, ఈయన ఆయన్ని గుంజేశాడనో అనుకుంటే ఎలా? రెండు సినిమాల రిజల్ట్స్ అటూయిటూ అయితే ఓడలు బళ్లవుతాయి. బాలుకైనా అది తప్పదు. ‘బాలు గారేమిటండి, పాడిన ప్రతీ మాటా అర్థమయ్యేట్లు పాడేస్తాడు, ఎవర్నయినా బొంబాయినుంచి తెప్పించండి, అర్థమయ్యీ కాకుండా పాడితే మిస్టీరియస్‌గా, అందంగా వుంటుంది’ అని హీరో అంటే నిర్మాత కాదనగలడా? కొన్నాళ్లు బాలు రాజ్యమేలాడు. కొండ ఎక్కినవాడు అక్కడే కాపురం వుండలేడుగా, కొంతకాలానికి దిగవలసి వచ్చింది.

ఇంకో పాయింటేమిటంటే – బాలు కనబరిచే వినయం కొంతమందికి చికాగ్గా అనిపిస్తుందన్న విషయం. అంతా నటన అని కొట్టి పారేస్తారు. నాకు బాగా పరిచయం వుంది కాబట్టి ఆ కనబడే వినయమంతా నిజమేనని నా వ్యాసంలో చెప్పాను. మద్రాసులో వుండగా వివిధ సభల్లో నేను చూసిన విషయాలు, వ్యక్తిగతంగా కలిసినపుడు, వరప్రసాద్ యింట్లో పార్టీలలో, కార్యక్రమాల్లో కలిసి కూర్చునపుడు గమనించిన సంగతుల కారణంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాను.

ఆయన నిజంగా మర్యాదస్తుడు, స్నేహశీలి. ఉపకారబుద్ధి వున్నవాడు. మా వరప్రసాద్‌కు అత్మీయుడు. ముఖ్యంగా మా ‘‘హాసం’’ పత్రికకు ఆయన ఉచితంగా బ్రాండ్ ఎంబాసిడర్‌గా పనిచేశాడని, మా పత్రికలో ఓ శీర్షిక నిర్వహించాడని రాశాను. వ్యాసం చివర్లో ‘ఆయనకు ఊతపదమైన ‘గాడ్ బ్లెస్ యూ’ అని మనమే ఆయనకు చెపుదాం’ అని రాశాను.

వ్యాసం ఆంధ్రజ్యోతి వాళ్లకు నచ్చింది. అచ్చు వేద్దామంటే వాళ్లకు స్పేస్ సమస్య. కోవిడ్ కారణంగా పేజీలు తగ్గిపోయాయి కదా. ఆలస్యమైన కొద్దీ నాకు బెంగ పట్టుకుంది. ‘‘దురదృష్టం కొద్దీ ఆయన కేమైనా అయిందనుకోండి. అప్పుడు దీని రిలవెన్స్ పోతుంది. రాష్ట్రపతి నుంచి నేటి తరం సినిమా హీరోల దాకా అందరి సంతాప సందేశాలు ముంచెత్తుతాయి. మూడు పేజీలు కేటాయించినా ఆయన ఎన్ని పాటలు పాడాడు, ఎన్ని భాషల్లో పాడాడు, ఎన్ని ఎవార్డులు వచ్చాయి యిలాటి వాటితో యీ వ్యాసానికి చోటుండదు. పైగా అసందర్భంగా వుంటుంది. వ్యాసం వేస్టవుతుంది.’’ అని తొందరపెట్టాను. 

వినాయక చవితి పొద్దున్న వేద్దామనుకున్నారు కానీ యాడ్స్ రావడంతో కుదరలేదు. ‘ఆయనకు ఎలా వుందిట?’ అని అడిగాను. ‘మాకు వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆయన బయటకు వస్తే మిరకిలే అంటున్నారండి. రేపు ఆదివారం మధ్యాహ్నాని కల్లా ఏదో ఒక డెసిషన్ తీసుకుని, అవసరమైతే ఆంధ్రజ్యోతి నెట్‌లో వాడేస్తాం’ అన్నారు వారు.

అలా అన్నారు కానీ ఏం సంకేతాలందాయో ఏమో, శనివారం రాత్రి 9.30 కల్లా నెట్‌లో ఆర్టికల్ పెట్టేశారు. పెడుతూ నా సెల్ నెంబరు, ఈ మెయిల్ ఐడీ కింద యిచ్చేశారు. ఇక చూసుకోండి, 10 గంటల నుంచి నా ఫోన్‌కు వాట్సాప్‌లు రావడం మొదలయ్యాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా అనేక దేశాల నుంచి మెసేజిలు, ఈమెయిల్స్. నేను గమనించలేదు. ఆదివారం ఉదయమే ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘‘ఆర్టికల్ బాగుంది. వ్యక్తిగా ఆయనెలాటివాడో బాగా చెప్పారు.’’ అంటే నేను కన్‌ఫ్యూజై ‘‘మీరెలా చదివారు? ఇవాళ మధ్యాహ్నం కదా అప్‌లోడ్ చేస్తానన్నారు.’’ అన్నాను. ‘నాకెవరో పంపారే’ అన్నాడాయన. 

మాట్లాడేశాక ఫోన్ తీసి చూస్తే దాన్నిండా మెసేజిలే. ఆ తర్వాత మూడు రోజుల పాటు నా ఫోన్‌కు, ఈమెయిల్‌కు తీరిక లేకపోయింది. ముఖ్యంగా ఆదివారమైతే రోజంతా ఫోన్‌లో మాట్లాడుతూనే వున్నాను. ఎవరెవరో కాల్ చేసి మాట్లాడారు. వారిలో బాలుగారి మిత్రులు, ఆత్మీయులు కూడా వున్నారు.

ఆ వ్యాసం గొప్పగా వుందని చెప్పలేను. నా మామూలు ధోరణిలోనే రాశాను. ఎక్కడా కవిత్వం, అద్భుత పదవిన్యాసం, ప్రత్యేక సమాచారం ఏమీ లేదు.  బాలు గారి పట్ల వాళ్లకున్న అభిమానం, ఆవేదన నాతో పంచుకుని వాళ్లు ఊరడిల్లారు. అందువలన ఆ ఘనత బాలుగారిదే. రోజులు గడిచేకొద్దీ ఆ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ లింకు వాట్సాప్‌ల ద్వారా వీరవిహారం చేసేసి, ఎవరెవరికో వెళ్లిపోవడం, ఒక బ్యాంకు మేనేజరు ఆడియోగా మార్చి పంపిణీ చేయడం జరిగాయి. 

అవి చూసిన లేదా విన్నవాళ్లు నాకు ఫోన్ చేసి ‘బాలుగారికి ఎలా వుందండిప్పుడు?’ అని అడగడం మొదలెట్టారు. ‘మీ కెంత తెలుసో నాకే అంతే తెలుసండి. టీవీలో వాళ్లబ్బాయి చెప్పినదాన్ని బట్టే నేనూ తెలుసుకుంటున్నాను.’ అని చెప్తే ‘మీకు ప్రత్యేకంగా ఏమైనా తెలుస్తుందేమోనని అడుగుతున్నామండి. ఏమనుకోకండి.’ అనేవారు. ఎందరో వృద్ధులు, గృహిణులు. ఇదంతా నాకు కొత్త అనుభవం. ఈ రోజు బాలుగారి శవం చూడడానికి వచ్చినవారిలో చూడండి, ఎంతమంది సామాన్యులున్నారో!

ఆసుపత్రి నుంచి బయటకు వస్తే మిరకిలే అని మా మిత్రుడు చెప్పినది నిజమైంది. ఆ మిరకిల్ జరుగుతుందేమోనని మధ్యలో అనిపించింది కానీ భ్రమగానే మిగిలింది. బాలుగారు అసాధారణ ప్రజ్ఞావంతుడే కాదు, అందరినీ అక్కున చేర్చుకుని ఆత్మీయతను పంచే ఉన్నతమైన వ్యక్తి. వివాదరహితుడు.

ఓర్పు, సంయమనం వున్న మనీషి. తాజాగా ఇళయరాజా విషయంలోనే చూశాంగా. ఇళయరాజా తొందరపడి అనేశాడు, నాలిక కరుచుకున్నాడు కానీ బాలు ఒక్క మాట అనలేదు. ‘నా దగ్గర హార్మోనిస్టుగా పనిచేసి, నేను అవకాశాలు యిస్తే పైకి వచ్చి, యీరోజు యిలా అంటావా?’ అని మాట తూలలేదు. అదీ ఆయన హుందాతనం. అలాటి వ్యక్తిని మళ్లీ చూస్తామన్న ఆశ లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢంగా ఆశిస్తూ, ప్రార్థిస్తున్నాను.

ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
mbsprasad@gmail.com

 


×