Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: అమితాబ్‌ (బచ్చన్‌) పేరుకి అర్థమేమిటి?

ఎమ్బీయస్‌: అమితాబ్‌ (బచ్చన్‌) పేరుకి అర్థమేమిటి?

అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌ కవి, సంస్కరణవాది. ఆయన తన కొడుక్కి బౌద్ధ దేవుళ్లలో ఒకరి పేరు పెట్టాడు. అదేమిటి గౌతమ బుద్ధుడు ఒకడే కదా అనుకోకండి. ఆగ్నేయాసియా దేశాల్లో, చైనాలో, జపాన్‌లో, టిబెట్‌లో, అజంతా, ఎల్లోరా గుహల్లో చాలా చోట్ల బౌద్ధాలయాల్లో విగ్రహాలు కనబడతాయి. అవి ఎవరివో తెలియవు. కింద ఏదో పేరుంటుంది, మైత్రేయ, పద్మపాణి.. అని. బౌద్ధంలో గౌతమబుద్ధుడు ఒకడే దేవుడు లేదా జ్ఞానోదయం పొందిన సిద్ధపురుషుడు కాబట్టి యివన్నీ రకరకాల పోజుల్లో బుద్ధుడు అనుకునేవాణ్ని. కానీ వీళ్లకు కిరీటాలు ఉన్నాయే అని ఆశ్చర్యపడేవాణ్ని.

బౌద్ధులు కాకపోయినా అభ్యుదయ వాదులు, హేతువాదులు తమ పిల్లలకు బౌద్ధానికి సంబంధించిన పేర్లు పెడుతూంటారు. తథాగతుడు, అమితాభుడు, మంజుశ్రీ యిలా..! అవన్నీ బుద్ధుడి పేర్లే అనుకునేవాణ్ని. ఏదో ఉత్పత్యర్థం ఉంటుంది అనుకుని వూరుకునేవాణ్ని. కానీ వాళ్లంతా వేర్వేరు దేవుళ్లని 1969లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్యగారి సంపాదకత్వంలో ప్రచురించిన ఆంధ్ర విజ్ఞాన కోశం ఆరవ సంపుటంలో ఆదిరాజు వీరభద్రరావు గారు రాసిన ‘బౌద్ధ దేవతలు’ వ్యాసం చదివినప్పుడు నాకు తెలిసింది. మీకు ముందే తెలిస్తే సరేసరి, లేకపోతే దీన్ని చదవండి.

బౌద్ధంలో మైనర్‌ వర్గమైన హీనయాన శాఖ వాళ్లు బుద్ధుణ్ని దైవస్వరూపుడిగా కాక, జ్ఞానిగా చూస్తారని, మేజర్‌ వర్గమైన మహాయాన వాళ్లు హిందూమత ప్రభావం చేత అనాత్మవాది (ఆత్మ లేదనేవారు) ఐన బుద్ధుడికి పూర్వజన్మలు కల్పించి, అవతారాలు కల్పించారని, తాంత్రిక పద్ధతులను అవంబించారని, ఆ శాఖే విదేశాలలో ప్రాచుర్యం పొందిందని ముందే తెలుసు. కానీ హిందూమతం ఫక్కీలో చాలా మంది దేవుళ్లను కల్పించి, ఒక్కోళ్లకు ఒక్కో శాఖను అప్పగించారని, వాళ్లను బోధిసత్త్వులంటారనీ ఆ వ్యాసం చదివాకనే తెలిసింది.  బోధిసత్త్వులో ప్రధానమైనవారు అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ. అవలోకితుడు అంటే కిందకు చూసేవాడు అని అర్థం. స్వర్గం నుంచి భూమిని చూస్తాడన్నమాట. మంజుశ్రీకి మంజునాథుడు, మంజుఘోషుడు అనే పేర్లు కూడా ఉన్నాయి.

అవలోకితేశ్వరుడి బొమ్మ మనం చాలా చోట్ల చూస్తాం. ఇతను విష్ణువు లాటి వాడు. విశ్వాన్ని నడుపుతూంటాడు. ఇతని గర్భంలో సమస్త లోకాలు పర్వతాలు, యోగులు, దేవతలు ఉంటారు. పలు రూపాల్లో వచ్చి తన భక్తులకు సాయపడుతూంటాడు. తనను ధ్యానించేవారిని ఆపదల నుంచి, దొంగల నుంచి, దుఃఖం నుంచి, అనేక బాధల నుంచి కాపాడతాడు. ఇతని ఎడమ చేతిలో ఎఱ్ఱ కలువ వుంటుంది. కుడి చేయి అభయముద్ర దాల్చి వుంటుంది. ఇతనికి పద్మపాణి, లోకనాథుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో యితనికి అనేక చేతులు, కళ్లు కూడా ఉంటాయి. ఇతని పక్కనే ‘‘తార’’ అనే స్త్రీ విగ్రహముంటుంది. 7వ శతాబ్దం తర్వాత యీమెను శక్తిస్వరూపిణిగా చూడసాగారు. ప్రాణులను సంసార సాగరం తరింపచేసేది (దాటించేది) కాబట్టి ‘తార’ అనే పేరు వచ్చింది. ఈమె పేర అష్టోత్తరం కూడా ఉంది.

రెండో స్థానంలో ఉన్న మంజుశ్రీని టిబెట్టు, నేపాల్‌, చైనా, జపాన్‌, జావాలలో కూడా పూజిస్తారు. ఇతను విజ్ఞానానికి అధిష్టాన దేవత. ఒక చేతిలో విజ్ఞాన ఖడ్గం, మరో దానిలో పుస్తకం ఉంటాయి. సింహవాహనుడు. ఇతని శిష్యుడు మైత్రేయుడు ఉపదేవత మాత్రమే. మొదటి యిద్దరికీ మానవాతీత శక్తులున్నాయి. కానీ మైత్రేయుడు గౌతముడిలాగ అనేక జన్మలెత్తి చివరకు బుద్ధత్వం ప్రాప్తింప చేసుకున్నవాడు. గౌతమబుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్లు యితనికి చంపక వృక్షం కింద అయింది. ఇతను ధర్మచక్ర ప్రవర్తన కార్యకలాపాలను పరిరక్షిస్తూ ఉంటాడు. తన తర్వాతి అవతారం మైత్రేయుడే అని గౌతమబుద్ధుడు (శాక్యముని అంటారు) చెప్పాడట. బంగారుఛాయ శరీరుడైన ఇతను పద్మంలో కూర్చోడు. నిల్చోడమో, కూర్చోడమో చేస్తాడు.  

ఇంకో బోధిసత్వుడు సమంతభద్రుడు. టిబెట్టులో అత్యంత ప్రియమైన దేవత. ఆకుపచ్చ రంగులో ఏనుగుమీద సవారీ చేస్తూంటాడు.  బౌద్ధధర్మాలను చక్కగా పాటించేవారిని రక్షించడం యితని పని. శాంతికి ప్రతిరూపం. మహాస్థాన ప్రాప్తుడు అనే బోధిసత్త్వుడికి యిలాటి క్షణాలే ఉన్నాయి. క్షితిగర్భుడు అనే అనే బోధిసత్త్వుడికి స్త్రీలక్షణాలున్నాయి. స్త్రీలకు ప్రసవ సమయంలో సాయపడతాడు. పాతాళ లోకాధిపతి. శిరోముండనం చేయించుకుని, దండం చేత పట్టుకుని బౌద్ధభిక్షువు రూపంలో కనబడతాడు. వీళ్లు కాక హిందువులు ఇంద్రుడికి బౌద్ధరూపం కల్పించి, వజ్రపాణి అనే అతన్ని బోధిసత్త్వులలో చేర్చారని అంటారు.

లోకానికి చెందని బుద్ధదేవుళ్లలో అయిదుగుర్ని ధ్యానబుద్ధులు అంటారు. వైరోచనుడు, అక్షోభ్యుడు, రత్నసంభవుడు, అమితాభుడు, అమోఘసిద్ధి అని వాళ్ల పేర్లు. ఈ ఐదుగురు ఆదిబుద్ధదేవుని ధ్యానసాధనకు ఫలంగా ఉత్పన్నమైనవారు. వీళ్లు తమకు ప్రతిబింబాలుగా బోధిసత్త్వులను, యితర దేవతలను సృష్టిస్తారు. వీళ్లల్లో వైరోచనుడు, అమితాభుడు ప్రధానులు. వైరోచనుడివన్నీ సూర్యలక్షణాలే. కొందరి గురించి వింటే హిందూ దేవతలకు బౌద్ధ కలరింగ్‌ యిచ్చినట్లు తోస్తాయి.

అమితాభుడు అంటే అమితమైన కాంతి కలవాడు. ఇతనికి యింకో పేరు కూడా ఉంది. అమితాయువు అని. అంటే మితం లేని ఆయుర్దాయం కలవాడు, చిరంజీవి అని. పశ్చిమ దిక్కుకు అధిపతి. మరణించినవాళ్లు అక్కడికే చేరతారు. ఇతని అధీనంలో వున్న స్వర్గాన్ని ‘సుఖవతి’ అంటారు. పూజాతత్పరులైన వారికి అమితాభుడు యీ స్వర్గంలో చోటిస్తాడు. మన అమితాబ్‌ బచ్చన్‌కు వాళ్ల నాన్న యీ దేవుడి పేరే పెట్టారు. ధ్యానబుద్ధుల్లో మూడోవాడైన అక్షోభ్యుడు తూర్పుదిక్కుకు అధిపతి.

మహాయానం ప్రకారం గౌతమబుద్ధుడి తర్వాత చాలామంది బుద్ధదేవులు అవతరిస్తారు. వీళ్లను తథాగతులంటారు. మనిషిగా పుట్టి దేవుడి స్థాయికి ఎదిగినవాడు పద్మసంభవుడు. 8వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను భారతదేశంలో పుట్టి మహాయాన శాఖను బాగా ప్రచారం చేశాడు. టిబెట్టులో కొంతకాలం ఉండి తర్వాత రాజుతో పేచీ వచ్చి వెళ్లిపోయాడు. అక్కడ యితన్ని బాగా ఆరాధిస్తారు. ఇతను అవలోకితేశ్వరుని అవతారమనే నమ్మకం ప్రబలాక పద్మంలో పుట్టాడనే కథ తర్వాత ప్రచారంలోకి వచ్చింది, విగ్రహాలు వెలిశాయి. ఇతని చేతిలో ఒక దండం ఉంటుంది. ఇది పైన మూడుగా చీలి వుంటుంది. వాటిలో ఒక కపాలం, ఒక శిరస్సు, ఒక వజ్రాయుధం ఉంటాయి. గుఱ్ఱమెక్కి వుంటాడు. ఈ గుఱ్ఱం పేరు బలాహ.

ఇలా అనేకమంది దేవతలున్నారు. బెంగుళూరు నుంచి మడికెరికి వెళ్లే దారిలో కూర్గులోనే బయిల్‌కుప్పె అనే చోట నామ్‌డ్రోలింగ్‌ టిబెటన్‌ బుద్ధిస్ట్‌ మొనాస్ట్రీ ఉంది. చైనా ఆక్రమణ తర్వాత టిబెట్టు నుంచి పారిపోయి వచ్చిన బౌద్ధులకు అక్కడ విశాలమైన స్థలం యిస్తే అక్కడ ఆలయం కట్టుకున్నారు. వాడుకలో గోల్డెన్‌ టెంపుల్‌ అంటారు. ఒక పెద్ద హాల్లో బంగారు పూత పూసిన మూడు రకాల దేవుళ్లు కనబడతారు. (ఫోటో అదే) ఎడమవైపు పద్మసంభవుడు, మధ్యలో శాక్యముని (మనందరికీ తెలిసిన గౌతమబుద్ధుడు), కుడివైపు అమితాయువు అనే పేరుతో వీళ్లు కొలిచే అమితాభుడు. వీళ్లు పద్మసంభవుణ్ని గురు రిన్‌పోచే అంటారు. వీళ్లు అతను స్థాపించిన నైయింగ్‌మాపా అనే శాఖకు అనుయాయు.

టిబెట్టులో కూడా అనేక బౌద్ధశాఖలున్నాయి. వాళ్ల కథనం ప్రకారం గౌతమబుద్ధుడు మరణించిన 12 ఏళ్ల తర్వాత పద్మసంభవుడు ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉన్న ఒడ్డియానాలో సింధు సరస్సులో పద్మంలో పుట్టాడు. అతన్ని వాళ్లు రెండో బుద్ధుడుగా పరిగణిస్తారు. ఇక మధ్యలో ఉన్న శాక్యముని కథ మనందరికీ తెలిసినదే. శుద్ధోధనుడికి, మాయాదేవికి పుట్టి, యశోధరని పెళ్లాడి, రాహులుడనే కొడుకుని కని, ఒక్కసారిగా ప్రపంచమంటే విరక్తి కలిగి, సన్యాసి అయిపోయి, తపస్సు చేసి బోధివృక్షం కింద జ్ఞానోదయం కలిగి, తన బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసినవాడు. మహాయానం ప్రకారం మొత్తం 1002 బుద్ధులలో యితను 4వ వాడు.

ఇక కుడివైపు ఉన్న అమితాయుస్‌ (అమితాభుడు)ని ప్రార్థిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని వాళ్ల నమ్మకం. పాపాలు చేస్తే ఆయుష్షు తరిగిపోతుందని, పాపాలు మాని, అమితాయుస్‌ను కొలిస్తే పెరుగుతుందని వాళ్ల నమ్మకం. కొన్ని చోట్ల అతని చేతిలో మన ధన్వంతరి టైపులో ఒక పాత్ర కూడా ఉంటుంది. ధన్వంతరి ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ప్రతీక కదా. ఈ సారి కూర్గు వైపు వెళితే యీ బౌద్ధాలయం చూడండి. అలాగే గూగుల్‌లో పైన చెప్పిన ఒక్కొక్క దేవుడి పేరు కొట్టి ఇమేజిలు చూడండి. మీరు గతంలో చూసిన చిత్రాలు, విగ్రహాలు గుర్తుకు వస్తాయి.

చివరగా యింకో మాట - నేను యిస్తున్న పుస్తకాలు పేర్లు అవీ చూసి, అవి ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. నేను నా దగ్గరున్న పుస్తకాల్లోంచే సమాచారం యిస్తున్నాను. ఆన్‌లైన్‌ లింకు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఆన్‌లైన్‌లో దొరికే సమాచారమంతా నమ్మలేం- ఆథెంటిక్‌ వెబ్‌సైట్‌ అయితే తప్ప! ఏదైనా సరే, నేను పుస్తకరూపంలో- అచ్చులో కావచ్చు, ఈ బుక్‌ కావచ్చు, పిడిఎఫ్‌ కావచ్చు- కొని చదవమని చెపుతాను. ఇక భాష గురించి.. ఆ పుస్తకాల్లో భాష మీరు రాసినట్లు ఉంటుందా అని అడుగుతారు. ఎందుకుంటుంది? 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం పుస్తకాల్లో గ్రాంథికం ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా యిలాటి ఆధ్యాత్మిక పుస్తకాల్లో! ఇప్పుడు కూడా వ్యాసాల్లో భాష గంభీరంగానే ఉంటుంది. నేను ‘‘కబుర్లు‘‘ అని పేరు పెట్టి మాట్లాడే ధోరణిలో రాస్తున్నాను కాబట్టి చాలా కాజువల్‌గా, ఇంగ్లీషు పదాలను కూడా ఉపయోగిస్తూ రాస్తాను.

ఉపనిషత్తుల గురించి వున్న పుస్తకాల్లో ఎవరిది మంచిది అనే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. పుస్తకాల షాపుకి స్వయంగా వెళ్లి నాలుగూ చూసి, దేనిలో వ్యాఖ్యానం విపులంగా వుందో, భాష సరళంగా ఉందో, చదివించేట్లు ఉందో చూసి కొనుక్కోవడం మంచిది. శ్లోకాల అర్థం తెలుసుకుని ఊరుకుంటే సరిపోదు. వాటిని విశదీకరించి, లోతైన భావాలను తర్కించిన పుస్తకాలే చదవాలి. ఇంకో మాట కూడా యిక్కడ రాయాలి. ఏదైనా విషయం గురించి నేను రాసినంతే, నేను రాసిన వరుసలోనే ఆ పుస్తకాల్లో ఉంటుందని అనుకోకండి. చాలా పేజీలుంటుంది. నేను వాటి సారాంశం మాత్రమే రాస్తాను. పెద్దగా ఆసక్తి లేనివారిని కూడా చదివించే తపనతో ఆర్డర్‌ కూడా ముందూవెనకా చేస్తాను. నేను చూపించేది ఝలక్‌ మాత్రమే. పూర్తిగా ఆస్వాదించే కోరిక, తీరిక వున్నవాళ్లు వాటిని చదవండి.  ఇంకో విషయం గమనించారా – జాతీయస్థాయి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,  మన మెగాస్టార్ చిరంజీవి పేర్లకు అర్థం ఒకటే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?