Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: హృషీకేశ్ ముఖర్జీ శతజయంతి

ఎమ్బీయస్‍: హృషీకేశ్ ముఖర్జీ శతజయంతి

ప్రముఖ హిందీ చిత్రదర్శకుడు, ఎడిటరు హృషీకేశ్ ముఖర్జీ (1922-2006) శతజయంతి సంవత్సరం 2022లో ముగిసింది. ఆలస్యంగానైనా ఆయన్ని స్మరించుకోవడం అవసరం అనే భావనతో యీ వ్యాసం రాస్తున్నాను. 40కు పైగా అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. ఆయన చివరి సినిమా ‘‘ఝూఠ్ బోలే కౌవా కాటే’’ 1998 నాటిది కాబట్టి కొంతమంది పాఠకులకు ఆయన పేరు తెలిసి ఉండకపోవచ్చనే శంకతో ఒక వ్యాసంతోనే సరిపెడుతున్నాను. ఆయన జీవితం గురించి కాస్త చెప్పి, ఎంపిక చేసిన ఆయన సినిమాలను ప్రస్తావించి వదిలిపెడతాను. ఆయన నా అభిమాన దర్శకుడు. న్యూ వేవ్ పేరుతో అర్థంకాని సినిమాలు తీసేవాళ్ల కంటె, మరీ కమ్మర్షియల్‌గా కాకుండా మనసుకు హత్తుకునేట్లా సినిమాలు తీసే బిమల్ రాయ్ స్కూలు నుంచి వచ్చిన హృషీకేశ్‌ బిమల్ తీసినంత భారీ స్థాయిలో తీయలేదు. మధ్యతరగతి జీవితాలనే ఫోకస్ చేసి, ఎక్కువగా నాలుగు గోడల మధ్యే తీశాడు.

ఆయన సినిమాలలో కొన్నిటి పేర్లను చెప్పకపోతే యీ వ్యాసం కొనసాగించ బుద్ధి కాదు కొందరు పాఠకులకు. రాజేశ్ ఖన్నాకు విపరీతంగా పేరు తెచ్చిన ‘‘ఆనంద్’’ (1971), రాజేశ్, అమితాబ్‌లు పోటీపడి నటించిన ‘‘నమక్ హరామ్’’ (1973), రేఖను మరో కోణంలో చూపించిన ‘‘ఖూబ్‌సూరత్’’ (1980), జయా బాధురీని పరిచయం చేసిన ‘‘గుడ్డీ’’ (1971), జయా, అమితాబ్‌లు గాయకదంపతులుగా నటించిన సంగీతభరిత చిత్రం ‘‘అభిమాన్’’ (1973), ధర్మేంద్ర అభిమాన చిత్రం ‘‘సత్యకామ్’’ (1970), అశోక్‌ కుమార్ కెరియర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘‘ఆశీర్వాద్’’ (1968), ధర్మేంద్ర, శర్మిలా టాగోర్ నటించిన హాస్యచిత్రం ‘‘చుప్‌కే చుప్‌కే’’ (1975), అమోల్ పాలేకర్‌ నటించగా ఎప్పటికీ గుర్తుండిపోయే కామెడీలు ‘‘గోల్‌మాల్’’ (1979) ‘‘నరమ్ గరమ్’’ (1981), తెలుగులో కృష్ణతో ‘‘అమాయకుడు’’గా రీమేక్ అయిన ‘‘అనాడీ’’ (1959) ... యివన్నీ హృషి సినిమాలే!

1960 నుంచి రెండు దశాబ్దాల పాటు హృషి హవా నడిచింది. టాప్ స్టార్లందరూ ఆయనతో పని చేయడానికి ఉవ్విళ్లూరారు. ఆయన చెప్పిన సమయానికి షూటింగుకి వచ్చి, అతి తక్కువ పారితోషికాలు తీసుకుని నటించేవారు. శంకర్ జైకిషన్, ఎస్ డి బర్మన్, సలిల్ చౌధురీ, పండిట్ రవిశంకర్, హేమంత్ కుమార్, వసంత్ దేశాయ్, ఆర్డీ బర్మన్ యిత్యాది సంగీతదర్శకులు తమ బెస్ట్ ట్యూన్స్‌ను ఆయన సినిమాలకు అందించేవారు. ఉత్తమాభిరుచికి, ఆహ్లాదానికి చిరునామాగా మారిన హృషి సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి, కమ్మర్షియల్‌గా కూడా హిట్ చేసేవారు. ఆయన సినిమాల్లో విఫలమైనవాటిని చేతి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందుకే ఎందరో నిర్మాతలు హృషితో సినిమాలు తీయించుకోవడానికి ఉబలాట పడ్డారు. దిలీప్ కుమార్ (‘‘ముసాఫిర్’’), దేవ్ ఆనంద్ (‘‘ఆస్లీ నక్లీ’’) రాజ్ కపూర్ (‘‘అనాడీ’’,‘‘ఆషిక్’’), రాజేశ్ ఖన్నా (‘‘బావర్చీ’’), ధర్మేంద్ర (‘‘అనుపమా’’) సంజీవ్ కుమార్ (‘‘అర్జున్ పండిట్’’), శతృఘ్న సిన్హా (‘‘కొత్వాల్ సాబ్’’).. యిలా ఎందరో ప్రతిభావంతులతో పని చేసినా, ఆయన ఎవరితోనూ పేచీ పడలేదు. అహంకారాన్ని ప్రదర్శించలేదు. అందరి చేత ‘హృషీదా’ అని పిలిపించుకోబడ్డారు.

కలకత్తాలో పుట్టిన హృషి అక్కడే బియస్సీ చదివారు. టీచరుగా పని చేస్తూ, చిన్నప్పటి నుంచి ఉన్న సంగీత, సాహిత్యాభిరుచితో ఆలిండియా రేడియోలో ఫ్రీలాన్సర్‌గా కవితలు చదవడం, నాటకాలు వేయడం చేస్తూండేవారు. స్నేహితులు సినిమాల్లో చేరమని ప్రోత్సహించడంతో 1945లో తన 23వ ఏట న్యూ థియేటర్స్ స్టూడియోకి వెళ్లి అసిస్టెంటు డైరక్టరుగా ప్రయత్నించబోయారు. ఖాళీ లేదు, లేబొరేటరీ అసిస్టెంటుగా కావాలంటే చేరు అన్నారు వాళ్లు. రాత్రుళ్లు ఆ పని చేసుకుంటూ పగలు స్టూడియోలో జరిగే షూటింగులను గమనించేవాడు. ఇతని దీక్ష దర్శకుడు బిమల్ రాయ్‌ను మెప్పించింది. తన యూనిట్‌లో అసిస్టెంటు కెమెరామన్‌గా అవకాశం యిచ్చాడు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ఎదిగాడు. బిమల్ సామాజిక సమస్యలను కథాంశాలుగా తీసుకుని కళాత్మకంగా చిత్రీకరించి, వ్యాపారవంతంగా విజయం చేసేవాడు. ఆయన శిష్యుడు కావడం హృషి అదృష్టం.

బిమల్ రాయ్ (1909-65) సినిమాలేమిటో తెలుసుకుంటే ఆయన ప్రతిభ అర్థమౌతుంది. ‘‘పరిణీత’’ (1953), ‘‘దో బిఘా జమీన్’’ (1953), ‘‘బిరాజ్ బహు’’ (1954), ‘‘దేవదాసు’’ (1955), ‘‘మధుమతి’’ (1958), ‘‘యహూది’’ (1958), ‘‘సుజాతా’’ (1959), ‘‘పరఖ్’’ (1960), ‘‘బందిని’’ (1963) .. ఆయన సినిమాల్లో కొన్ని. ఆయన వద్ద తర్ఫీదైన నటీనటులు, సాంకేతిక నిపుణులు బెంగాలీ, హిందీ రంగాలను ఏలారు. హృషి బిమల్ వద్ద ఉండగానే ఎడిటింగు కూడా నేర్చుకుని ‘‘తథాపి’’ (1950) అనే బెంగాలీ సినిమాను మొదటిసారి ఎడిట్ చేశారు. హృషి ఎడిటింగులో దిట్ట కాబట్టి, సినిమాను చాలా పొదుపుగా తీస్తారు, కథ వేగంగా నడిపిస్తారు. ప్రముఖ దర్శకుడిగా మారాక కూడా యితర దర్శకుల కోరిక మేరకు వారి సినిమాలను (మలయాళ సినిమా ‘‘ఛెమ్మీన్’’, కన్నడ సినిమా ‘‘సంస్కార’’లతో పాటు ‘‘గంగా జమునా’’ (1961) వంటి హిందీ సినిమాలు) ఎడిట్ చేసి పెట్టారు.

బొంబాయిలోని బాంబే టాకీసు వారు తమ సంస్థ తీస్తున్న సినిమాలు పరాజయం పొందుతూండడంతో 1951లో బిమల్‌ను కలకత్తా నుంచి బొంబాయి రప్పించి ‘‘మా’’ (1952) అనే సినిమా తీయించారు. బిమల్ తనతో పాటు హృషిని కూడా బొంబాయి తీసుకుని వచ్చేశారు. అప్పణ్నుంచి బొంబాయే హృషీ కార్యక్షేత్రమై పోయింది. బిమల్ నిర్మాతగా మారి తీసిన హిందీ సినిమా ‘‘దో బిఘా జమీన్’’కు హృషి స్క్రిప్టు రాయడంతో బాటు అసిస్టెంటు డైరక్టరుగా, ఎడిటరుగా పని చేశారు. దానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. బిమల్‌కు హృషి కుడిభుజంగా మారిపోయారు. కలకత్తాలోనే రాజ్ కపూర్‌తో స్నేహం కుదరగా, బొంబాయి వచ్చాక దిలీప్ కుమార్, అశోక్ కుమార్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర తర్వాతి రోజుల్లో రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ యిత్యాది అనేకమంది హీరోలతో గాఢమైత్రి ఏర్పడింది.

‘‘దర్శకుడిగా నీ తొలిచిత్రంలో నేను హీరోగా నటిస్తాను.’’ అని దిలీప్ కుమార్ హృషిని ప్రోత్సహించాడు. అది ‘‘ముసాఫిర్’’ (1957) అనే ఓ ప్రయోగాత్మక చిత్రం. మూడు భాగాలుగా సాగే ఆ సినిమాలో ఒక యింటి వాటాదే ముఖ్యపాత్ర. సినిమా ప్రారంభంలో యింట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ఓ జంట (సుచిత్రా సేన్, శేఖర్) ఆ వాటాలో దిగుతుంది. రాత్రి పూట వయొలిన్ వాద్యం వినబడితే ఎవరిదని వాకబు చేస్తే పక్కింటి ఆంటీ అది వాయించేది ఒక పిచ్చివాడని, ఎవర్నీ కలవడనీ చెప్తుంది. చివరకు పెద్దవాళ్లు పెళ్లిని ఆమోదించి యింటికి రమ్మనమని పిలవడంతో ఆ జంట వాటా ఖాళీ చేస్తుంది. తర్వాత ఆ వాటాలో ఓ కుటుంబం చేరుతుంది. ఓ ముసలాయనకు విధవరాలు, గర్భవతి ఐన పెద్ద కోడలు, నిరుద్యోగి అయిన రెండో కొడుకు (కిశోర్ కుమార్) ఉంటారు. నిరుద్యోగికి ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో తండ్రి తిట్లు భరించలేక అతను విషం తాగుతాడు. కానీ అది కల్తీది కావడంతో అందరూ ఏడ్చేవేళ లేచి కూర్చుంటాడు. ఉద్యోగం వస్తుంది కూడా. కోడలు పిల్లాణ్ని కంటుంది. పెద్ద యిల్లు కావాలంటూ దీన్ని ఖాళీ చేస్తారు.

తర్వాత ఒక ఒక లాయరు, విధవరాలైన అతని చెల్లెలు, అవిటివాడైన మేనల్లుడు వచ్చి చేరతారు. రాత్రిపూట వయొలిన్ వాయించే పిచ్చివాణ్ని కలిసి తీరతానని పిల్లవాడు పట్టుబట్టి కలుస్తాడు. అతను (దిలీప్ కుమార్), పిల్లవాడి తల్లికి మాజీ ప్రియుడు. ప్రస్తుతం కేన్సర్ పీడితుడు. తను మరణిస్తూ కూడా ‘నువ్వు నడుస్తావు’ అంటూ పిల్లవాడిలో ఆశాభావం నింపుతాడు. చివరకు అతను పోయిన రోజున పిల్లవాడు నడుస్తాడు కూడా. బిమల్ యూనిట్ నుంచి వచ్చిన సలిల్ చౌధురికి సినిమా సంగీతదర్శకత్వం అప్పచెప్పాడు హృషి. సినిమాకు ఎవార్డు వచ్చింది కానీ కాసులు పెద్దగా రాలలేదు. దాంతో రాజ్ కపూర్ నాకు తగిన కథతో ‘‘అనాడీ’’ సినిమా తీయమని అడిగాడు.

చార్లీ చాప్లిన్ తరహా లోకంపోకడ తెలియని ఒక అమాయకుడి కథ అది. హీరో నిజాయితీ చూసి ముచ్చటపడి ఒక మందుల కంపెనీ యజమాని అతనికి ఉద్యోగం యిస్తాడు. కానీ కంపెనీలో నకిలీ మందులు తయారవుతున్నాయని తెలిసి హీరో కృతజ్ఞతాభారాన్ని పక్కన పెట్టి, యజమానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు. చివరకు యజమాని తన తప్పును ఒప్పుకుని హీరోని అభినందిస్తాడు. రాజ్ కపూర్ ప్రవేశించడంతో అతనితో పాటు శంకర్ జైకిషన్, ముకేశ్, శైలేంద్ర-హస్రత్ టీము వచ్చి చేరి సినిమాను మ్యూజికల్ హిట్ చేశారు. అంతేకాదు, సినిమా సూపర్‌డూపర్ హిట్ అయి, హృషి సిల్వర్ జూబ్లీ డైరక్టరు కావడానికి రాచబాట వేసింది. శంకర్-జైకిషన్‌లతో హృషి తీసిన సినిమాలన్నీ కమ్మర్షియల్ హిట్సే. దేవ్ ఆనంద్‌తో ‘‘అస్లీ-నక్లీ’’, రాజ్ కపూర్‌తో ‘‘ఆషిక్’’ (1962), గురుదత్‌తో ‘‘సాంఝ్ ఔర్ సవేరా’’ (1964). సునీల్ దత్‌తో ‘‘గబన్’’ (1966).  

అలా అని హృషి సలిల్ చౌధురిని వదిలి పెట్టలేదు. సునీల్ దత్‌తో ‘‘ఛాయా’’ (1961), రాజేశ్ ఖన్నాతో ‘‘ఆనంద్’’, (1971) లకు సంగీతం సలిలే! ‘‘అనూరాధా’’ (1960)కు పండిట్ రవిశంకర్ సంగీతమిచ్చారు. సినిమా పెద్దగా హిట్ కాలేదు కానీ పాటలన్నీ చాలా బాగుంటాయి. వీలుంటే వినండి. ధర్మేంద్ర, నటించిన ‘‘అనుపమా’’ (1966)కు హేమంత్ కుమార్ సంగీతం యివ్వగా, అమితాబ్, జయా నటించిన ‘‘అభిమాన్’’ (1973), ‘‘మిలీ’’ (1975), ధర్మేంద్ర, అమితాబ్‌ల ‘‘చుప్‌కే చుప్‌కే’’ (1975)కు ఎస్‌డి బర్మన్ యిచ్చారు. వసంత్ దేశాయ్ ‘జయా బాధురీ ‘గుడ్డీ’’ (1971), అశోక్‌ కుమార్ నటించిన, ‘‘ఆశీర్వాద్’’ (1973)ల కిచ్చారు. ఇక ఆర్‌డి బర్మనైతే ఏకంగా 12 సినిమాలకిచ్చాడు. వాటిలో నవీన్ నిశ్చల్ ‘‘బుడ్ఢా మిల్ గయా’’ (1971), రాజేశ్ ఖన్నా, అమితాబ్‌ల ‘‘నమక్ హరామ్’’ (1973), రేఖా ‘‘ఖూబ్‌సూరత్’’ (1980), అమోల్ పాలేకర్ ‘‘గోల్‌మాల్’’ (1979), ‘‘నరమ్ గరమ్’’ (1981) ఉన్నాయి. ఇవన్నీ మచ్చుకి చెప్తున్నవే. సంగీత దర్శకులెవరైనా సరే, హృషి సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించారని చెప్పాలి. ఆయన సినిమాల్లో పాటలు పాడిన నటుల్లో దిలీప్ కుమార్ (‘‘ముసాఫిర్’’), అశోక్ కుమార్ (‘‘ఆశీర్వాద్’’), హరీశ్‌నాథ్ చట్టోపాధ్యాయ (‘‘బావర్చీ’’) ఉన్నారు.

ఎమోషన్, మెలోడ్రామా ఉన్న సినిమాలు తీస్తూనే హృషి హంగులు లేకుండా, సాధారణ కథాంశాలతో ఉన్న పారలల్ సినిమాలు కూడా తీసి ప్రేక్షకులను మెప్పించారు. స్టార్లతో తీస్తూనే అశోక్ కుమార్ వంటి వృద్ధులను ప్రధానపాత్రగా పెట్టి ‘‘ఆశీర్వాద్’’ వంటి సినిమాలు తీశారు. స్టార్లను పెట్టుకున్నా వారితో స్టార్‌డమ్ చూపించని సినిమాలు తీశారు. ‘‘ఫూల్ ఔర్ పత్థర్’’ (1966)లో గూండాగా వేసిన ధర్మేంద్ర చేత అదే ఏడాది ‘‘అనుపమా’’లో పరమ సాత్త్వికమైన పాత్ర వేయించారు. గూఢచారిగా వేసిన ‘‘యకీన్’’ (1969) సినిమా రిలీజైన ఏడాదే అతని చేత ‘‘సత్యకామ్’’లో నీతికి, నిజాయితీకి అంకితమై సమాజం చేత చేతకానివాడిగా ముద్ర కొట్టించుకున్న పాత్ర వేయించారు. ‘‘చుప్‌కే చుప్‌కే’’లో హాస్యపాత్ర వేయించారు. రాజేశ్ ఖన్నా ‘‘హాథీ మేరే సాథీ’’ (1971)లో వేసిన సంవత్సరమే రోగగ్రస్తుడై మృత్యువు నెదుర్కొనే పాత్రను ‘‘ఆనంద్’’లో ధరింపచేశారు. ‘‘బావర్చీ’’(1972) లో బొత్తిగా వంటవాడి పాత్ర.  దీనిలోనూ పక్కన హీరోయిన్ లేదు. ఈ సినిమాకు ఒరిజినల్ అయిన బెంగాలీ సినిమాలో ఆ పాత్రను రవి ఘోష్ అనే హాస్యనటుడు పోషించాడు.

సంజీవ్ కుమార్ చేత ‘‘అర్జున్ పండిట్’’ (1976)లో ముసలి వేషం వేయించారు. అమితాబ్‌ను అసూయాపరుడైన భర్తగా ‘‘అభిమాన్’’లో, నిరాశలో మునిగిపోయిన తాగుబోతుగా ‘‘మిలీ’’లో, కోరి దారిద్ర్యాన్ని వరించి, పరాజితుడైన వాడిగా ‘‘ఆలాప్’’ (1977)లోనూ చూపించారు. ఎంత పెద్ద హీరోలైనా సరే, హృషి అడిగితే అతిథి పాత్రల్లో వేయడానికి సంకోచించేవారు కారు. ఎంత పెద్ద పాత్ర ఐనా సరే, మార్కెట్ రేటు అడిగేవారు కాదు. ఆయన యిచ్చినదే పుచ్చుకునేవారు. సమయానికి ఠంచన్‌గా వచ్చేవారు. ‘‘చుప్‌కే చుప్‌కే’’లో ఓ పాట చిత్రీకరణకు ధర్మేంద్ర ఆలస్యంగా వస్తే యీయన ఆ చరణాన్ని అమితాబ్‌కు బదిలీ చేసేశారు. ఇది అన్యాయం అని ధర్మేంద్ర ఫిర్యాదు చేస్తే ‘నువ్వు సమయానికి వచ్చి ఉండాల్సింది.’ అన్నారు హృషి.

ఆయన స్టార్ల వెంట పడలేదు. స్టార్లే ఆయన వెంట పడ్డారు. ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన సినిమాల ద్వారా రాణించారు, జాతీయ ఎవార్డులు పొందారు. అనేక సినిమాలకూ ఎవార్డులు వచ్చాయి. వాణీ జయరామ్‌ను ‘‘గుడ్డీ’’ ద్వారా తెరకు పరిచయం చేసినది ఆయనే. తన వద్ద పదేళ్లపాటు అసిస్టెంటు డైరక్టరుగా పని చేసిన ముకేశ్ తనయుడు నితిన్ ముకేశ్‌ చేత ‘‘సబ్‌సే బడా సుఖ్’’ అనే సెక్స్-కామెడీ సినిమాలో తొలిసారి డ్యూయట్ పాడించారు. హృషి తీసిన సినిమాల కథాంశాల గురించి కాస్త చెప్తాను. ఆయన సాంఘికాలు తప్ప యితర జానర్ల జోలికి వెళ్లలేదు. అదీ మధ్యతరగతి జీవితాల గురించే ఎక్కువ చూపించారు.

‘‘అనూరాధా’’ సినిమాలో డాక్టరు వృత్తిలో తలమునకలై తన యిష్టాయిష్టాలను పట్టించుకోని భర్తను భార్య విడిచి పెట్టేయాలనుకుంటుంది. ‘‘అనుపమా’’లో కూతుర్ని ప్రసవిస్తూ మరణించిన భార్య మీదున్న అమితమైన ప్రేమతో ఓ ధనికుడు తాగుబోతుగా మారడంతో బాటు కూతుర్ని ఆదరించడు, పట్టించుకోడు. ఆమెపై ప్రేమ ఉన్నా అది లోలోపలే అణుచుకుంటాడు. మౌనంగా, అంతర్ముఖురాలిగా తయారైన ఆమెలో ప్రేమను రగులుస్తాడు ఒక కవి. ‘‘ఆశీర్వాద్’’ సినిమాలో సంగీతప్రియుడైన తన భర్త పేదజనంతో తిరగడం యిష్టం లేని జమీందారిణి వాళ్ల గుడిసెలు కాల్పించేస్తుంది. ఆ సందడిలో అత్యాచారానికి ఒడిగట్టిన తన గుమాస్తాను చంపివేసి జమీందారు జైలుపాలవుతాడు. జైలు నుంచి విడుదలయ్యాక తనకు ప్రాణప్రదమైన కూతురికి పెళ్లవుతోందని తెలిసి పెళ్లివేళ ఆశీర్వాదం యివ్వడానికి వెళ్లి ఆమె చేతుల్లో కనుమూస్తాడు.

‘‘అభిమాన్’’లో ఒక పాప్యులర్ గాయకుడు, పల్లెలో ఉన్న ఒక గాయనిని చూసి యిష్టపడి పెళ్లి చేసుకుని నగరానికి తెస్తాడు. అతనికంటె ప్రతిభావంతురాలైన ఆమెకు కచ్చేరీలు చేసే అవకాశాలు ఎడాపెడా వచ్చిపడి, యితనికి బేరాలు తగ్గుతాయి. అసూయతో అతను వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ‘‘ఆనంద్’’లో తను కొద్దికాలంలో చనిపోబోతున్నానని తెలిసిన ఒక రోగి మిగిలిన కాలమైనా సరదాగా, నవ్వులు పంచుతూ బతికేద్దామని ఒక డాక్టరు వద్దకు వచ్చి అతనింట్లో ఉంటాడు. జీవితంలో ప్రతీదీ సీరియస్‌గా తీసుకునే ఆ డాక్టరుకి యితని తరహా మింగుడు పడదు. ‘‘నమక్ హరామ్’’లో ఒక ఫ్యాక్టరీ యజమాని తనకు వ్యతిరేకంగా సంఘటితమైన కార్మికులను చీల్చడానికి తన ఆప్తమిత్రుణ్ని కోవర్టుగా పంపిస్తాడు. అయితే ఆ మిత్రుడు ఆ కార్మికుల కష్టాన్ని గమనించి వారిలో ఒకడిగా మారి మిత్రుడికి ఎదురు తిరుగుతాడు. రాచరికానికి, చర్చికి మధ్య జరిగిన ఘర్షణ కథాంశంగా వచ్చిన ‘‘బెకెట్’’ (1964) అనే ఇంగ్లీషు సినిమాను యజమాని-కార్మికుల మధ్య ఘర్షణగా మార్చి ముళ్లపూడి వెంకటరమణ గారు ‘‘ప్రాణమిత్రులు’’ (1967) సినిమాకు కథ అందించారు. అది ఫెయిలయినా దాని స్ఫూర్తితో తీసిన ‘‘నమక్ హరామ్’’ హిట్టయింది.

‘‘సత్యకామ్’’ సినిమాలో ఒక ఛాందస బ్రాహ్మణుడి మనుమడైన హీరో ఇంజనియరుగా పని చేస్తూ తాతగారు నేర్పిన సత్యానికి, నిజాయితీగా కట్టుబడి జీవితంలో నానా కష్టాలపాలు అవుతాడు. బలాత్కారానికి గురైన ఒకమ్మాయిని పెళ్లాడి, తాతగారి ఆగ్రహానికి గురవుతాడు. లంచాలు తీసుకోవడానికి ఒప్పుకోకపోవడం చేత అతని ఉద్యోగాలు పోతూ ఉంటాయి. రోగం వస్తే చికిత్స చేయించుకోవడానికి డబ్బుండదు. చివరకు మరణశయ్యపై ఉండగా భార్యాబిడ్డల యోగక్షేమం కోసం అవినీతికి పాల్పడబోతే భార్య వద్దంటుంది. అతను తృప్తిగా కనుమూస్తాడు. విషయం తెలిసి వచ్చిన తాతగారు సత్యపాలన గురించి సూక్తులు వల్లించి, పిల్లవాడి వయసు చిన్నది కదా, మా మనవడి అంత్యక్రియలు నేనే చేస్తాను అంటాడు.

అప్పుడు ఆ పిల్లవాడు ‘‘మీరు అబద్ధం చెప్తున్నారు, నేను ఆయనకు పుట్టలేదన్న కారణంగా నా చేత తల కొరివి పెట్టనివ్వటం లేదు.’’ అంటాడు. తన జన్మ గురించి తల్లి తనకు ముందే చెప్పిందంటాడు. తాతగారు నిర్ఘాంతపోతాడు. ‘సత్యం గురించి ప్రవచించడమే తప్ప ఆచరించ లేకపోయాను. కటువైన సత్యాన్ని కూడా నువ్వు పిల్లవాడికి చెప్పావు. నువ్వే నాకంటె ఉన్నతురాలివి’ అంటూ హీరో భార్యకు నమస్కరిస్తాడు. సత్యకామ జాబాలి అనే పురాణపురుషుడి ఉదంతాన్ని గుర్తు చేసే యీ సినిమాకు ‘‘సత్యకామ్’’ అని పేరు పెట్టారు. కుటుంబ జీవితంలో డిసిప్లిన్ ఏ మేరకు ఉండాలి అనే విషయాన్ని సరదాగా చెప్పిన సినిమా ‘‘ఖూబ్‌సూరత్’’. అక్క అత్తవారింట్లో అందరూ అత్తగారికి భయపడుతున్నట్లు గమనించి, ఆమెపై తిరుగుబాటు లేవదీస్తుంది హీరోయిన్. కానీ ఎందుకంత స్ట్రిక్ట్‌గా ఉండాల్సి వస్తోందో తర్వాత అత్తగారే చెప్తుంది.

హృషి సినిమాల్లో కామెడీ ఎప్పుడూ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఆయన ఓ సెక్స్ కామెడీతో సహా పూర్తి స్థాయి కామెడీలు కూడా తీశారు. ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఒకే వ్యక్తి కవలలుగా నటిస్తూ బాస్‌ను బోల్తా కొట్టించిన సినిమా ‘‘గోల్‌మాల్’’. ‘‘సత్యకామ్’’ను ‘‘పున్నగై’’గా తమిళంలో రీమేక్ చేసిన బాలచందర్ దీన్ని కూడా ‘‘తిల్లు-ముల్లు’’గా రీమేక్ చేశారు. ఆ థీమ్ ఎంత పాప్యులర్ అంటే దాన్ని ‘‘బోల్ బచ్చన్’’ (2012)‌లో ఉపయోగించు కున్నారు. దాని తెలుగులో ‘‘మసాలా’’ (2013)గా రీమేక్ చేశారు. సినిమా హీరో ఆరాధనలో వెర్రెక్కిపోయే టీనేజ్ అమ్మాయి కథ ‘‘గుడ్డీ’’ని ముక్తా శ్రీనివాసన్ తమిళంలో ‘‘సినిమా పైత్యం’’గా రీమేక్ చేశారు. ‘‘ఖూబ్‌సూరత్’’ను తమిళంలో రేవతి ప్రధానపాత్రలో ‘‘లక్ష్మీ వందాచ్చు’’గా, తెలుగులో ‘‘స్వర్గం’’గా తీశారు. ‘‘అనాడీ’’ని తెలుగులో ‘‘అమాయకుడు’’గా తీశారు.

ఆయన తీసిన 42 సినిమాల్లో నేను కొన్నిటి గురించే రాశాను. చాలావాటిని వదిలేశాను. ‘‘ఖూబ్‌సూరత్’’ (1980) తర్వాత కీళ్లనొప్పుల బాధ భరించలేక హృషి తాను రిటైరవుతానని ప్రకటించారు. కానీ 1988 వరకు 7 సినిమాలు తీశారు. పదేళ్ల తర్వాత  మిత్రుల కోరిక మేరకు ‘‘ఝూఠ్ బోలే కౌవా కాటే’’ (1998) సినిమా తీశారు కానీ అది ఫెయిలయింది. అంతకు ముందే టీవీ సీరియల్స్ తీశారు. 1955-75 మధ్య బెస్ట్ ఎడిటరుగా 7 ఎవార్డులు పొందిన ఆయన అనేక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎడిటింగు గురించి, డైరక్షన్ గురించి పాఠాలు బోధించారు. ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కి ఆరేళ్లపాటు డైరక్టరుగా ఉన్నారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు 4 సంవత్సరాలు చైర్మన్‌గా ఉన్నారు.  ఫిల్మ్ సెన్సార్ బోర్డుకి చైర్మన్‌గా ఉన్నారు.

ఆయన స్వతహాగా మితభాషి. స్నేహశీలి. ఎవరితోనూ వివాదం లేదు. 1972లో పద్మశ్రీ ఎవార్డు, 2001లో పద్మవిభూషణ్ ఎవార్డు వచ్చాయి. 1999లో దాదాసాహెబ్ ఫాల్కే ఎవార్డుతో పాటు రూ. 2 లక్షలు బహుమతి వస్తే దాన్ని ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌కు విరాళంగా యిచ్చారు. వ్యక్తిగతంగా నాకు కమ్మర్షియల్ సినిమాలలో కొన్నే నాకు నచ్చుతాయి. పారలల్ సినిమాల్లో చాలా భాగం ఆర్భాటం ఎక్కువ, సరుకు తక్కువ, పైగా అన్నీ ఒకే ధోరణి అని నా అభిప్రాయం. యువకుడిగా ఉండగా బాగా చూసేవాణ్ని కానీ తర్వాతి రోజుల్లో ఆ స్లో నెరేషన్ పట్ల విముఖత వచ్చేసింది. సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్ సినిమాల కంటె తపన్ సిన్హా సినిమాలు నచ్చుతాయి. సినిమాల్లో అన్నిటి కన్న బెస్ట్ జానర్ బిమల్ రాయ్‌ది అని నా ఉద్దేశం. ఆ పరంపరను కొనసాగించిన హృషీదా అంటే ఎంతో అభిమానం.

జీవితం పట్ల ఆయన ఏర్పరచే అవగాహన నన్ను అబ్బురపరుస్తుంది. ఆయన సినిమాల్లో నచ్చిన పాటలు ఏరడమంటే కుదిరే పని కాదు. అన్నీ బాగుంటాయి. అందుకని మూడు పాటల లింకులు మాత్రం యిచ్చి ఊరుకుంటాను. రెండు జీవితం గురించి చెప్పేవి. ఒకటి ‘‘అనాడీ’’లోని ‘జీనా యిసీకా నామ్ హై’’ అనే పాట. ‘ఎవరి ముఖం పైనైనా చిరునవ్వు తెప్పించడానికి నిన్ను నీవు అర్పించుకో, వీలైతే ఎవరి కష్టాన్నయినా నీ సొంతం చేసుకో, ఇదే జీవితమంటే..’ అని సాగుతుంది ఆ పాట. ఇంకోటి ‘‘ఆనంద్’’లోని ‘జిందగీ కైసీ హై పహేలీ’’ అనే పాట. ‘జీవితం ఒక పజిల్. ఒకప్పుడు నవ్విస్తుంది, మరో అప్పుడు ఏడిపిస్తుంది. అయినా మనసు మేలుకోదు. కలల వెంట పరుగెడుతుంది, ఓ రోజు ఈ స్వాప్నికుడు కలలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్లిపోతాడు. ఎక్కడికి అనే ఆ చిక్కుముడి మాత్రం ఎప్పటికీ వీడదు’ అని సాగుతుంది. 

‘‘ఆశీర్వాద్’’లోని ‘జీవన్ సే లంబే హై, బంధూ, యే జీవన్‌కే రస్తే’ కూడా యిలాటి నీతే చెప్తుంది. ఇక ‘‘అనుపమా’’లోని ‘ఐసీ భీ బాతేఁ హోతీ హై’ పాట నా ఆల్‌టైమ్ ఫేవరేట్. యౌవనారంభంలో ఉన్న  ఒక ముగ్ధ డోలాయమాన అనుభూతి గురించి, వ్యక్తావ్యక్తంగా ఉండే ఆమె భావాల గురించి, బాల్యం వీడి కలలు కనే స్థితిలోకి వస్తూన్న ఆమె మానసికావస్థ గురించి చెప్పే ఆ పాట సాహిత్యపరంగా, సంగీతపరంగా, గానపరంగా, చిత్రీకరణపరంగా ఆణిముత్యం. దాని లింకు కూడా యిస్తున్నాను. వీలైతే చూడండి. హృషీదా స్మృతికి అంజలి ఘటిస్తూ, యీ హ్రస్వనివాళిని ముగిస్తున్నాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా