Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఐసిసియు 01

ఎమ్బీయస్: ఐసిసియు 01

‘‘చీకట్లో సూర్యుడు’’లాగానే యిది కూడా ఒక సైఫై నవల. సైఫైతో బాటు క్రైమ్ కూడా కలిసిన నవల. అందునా మెడికల్ క్రైమ్. రాసినది వృత్తిరీత్యా డాక్టరైన డా. చిత్తర్వు మధు. ఆయన మెడికల్ సైఫైయే కాదు, రకరకాల సైఫై నవలలు రాశారు. ప్రస్తుతం నేను పరిచయం చేస్తున్నది 1992లో ఆంధ్రప్రభ వీక్లీలో సీరియల్‌గా వచ్చి దరిమిలా పుస్తకంగా వచ్చింది. వాస్తవ పరిస్థితిని కాస్త ఎక్స్‌టెండ్‍ చేసి, ఓ చిన్న వూహ చేసి నవల రాశారు. అంతా గుండెజబ్బుల గురించి వుంటుంది. ఓ గుండెజబ్బుల హాస్పటల్లో చేరిన ఓ మంచి డాక్టరు, అతని పేరు రవికాంత్‍, హాస్పటల్లో జరుగుతున్న ఓ క్రైమ్‍ను కనుగొంటాడు. దానిపై పరిశోధన చేస్తూ పోతాడు. క్రమక్రమంగా పొరలు విడిపోతూ వస్తాయి. విలన్‍ చేస్తున్నదేమిటో మనకు అర్థమవుతుంది. ఒక్కో పొరా విడిపోతున్న కొద్దీ మనకు ఎక్సయిటింగ్‍గా అనిపిస్తుంది. అదీ రచయిత రచనాకౌశలం. అయితే నేను నవల నడిచే తీరులో కాకుండా సస్పెన్సును ముందే చెప్పేస్తాను. అది మంచి డాక్టర్‍ ఎలా బయటపెట్టగలిగాడో తర్వాత చెప్తాను. సైంటిఫిక్‍ నవలలు మనకు అలవాటు లేదు కాబట్టి యి పద్ధతి అవలంబించకపోతే గుర్తు పెట్టుకోవడం కష్టం.

నవల పేరు ఐసిసియు. అంటే ఇంటెన్సివ్‍ కార్డియాక్‍ కేర్‍ యునిట్‍ అని అర్థం. ప్రత్యేక శ్రద్ధ అవసరమైన కేసుల్ని ఐసియు, ఇంటెన్సివ్‍ కేర్‍ యూనిట్‍లో పెడతారని మనకు తెలుసు. మనల్ని అక్కడికి వెళ్లనియ్యరు. ఎమర్జన్సీ తగ్గాకనే వార్డుకి మారుస్తారు. అదే గుండెజబ్బు కేసులయితే ఐసిసియు, అంటే కార్డియాక్‍ కేర్‍ అన్నమాట, అక్కడ పెడతారు. నవల అంతా గుండె జబ్బుల చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, ఐసిసియును అడ్డు పెట్టుకునే విలన్‍ ఘోరాలు చేస్తాడు కాబట్టి నవలకు ఆ పేరు పెట్టారు రచయిత.

ఈ నవలలో విలన్‍ డాక్టర్‍ నారాయణరావు అనే అతను నిరుపేద. కానీ చాలా తెలివైనవాడు. కష్టపడి వారాలు చేసుకుని పైకి వచ్చాడు. స్కాలర్‍షిప్పుల మీద చదువుకుని డాక్టరయ్యాడు. కానీ ప్రాక్టీసు లేదు. పైసా గడించలేదు. తలిదండ్రులను సుఖపెట్టలేకపోయాడు. వాళ్లు పోయారు. ఇతను పెళ్లి చేసుకోలేదు. రిసెర్చి చేయాలన్న కోరిక. దానికి నిధులు కావాలి. పట్టుదలతో గల్ఫ్ వెళ్లి అక్కడ ప్రాక్టీసు చేసి పదిలక్షలు సంపాదించాడు. హైదరాబాదు వచ్చి వివేకానంద ట్రస్టు హాస్పటల్లో చేరాడు. బుద్ధి వక్రించింది. హాస్పటల్లో పనిచేస్తూ, ప్రెవేటు ప్రాక్టీసు చేసుకున్నా పెద్దగా గడించడం కష్టం. అందువల్ల నేరాలు చేసి డబ్బు సంపాదించి దానితో అత్యాధునికమైన హాస్పటల్‍ను, రిసెర్చి విభాగాన్ని తన యింట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప డాక్టరుగా, గొప్ప పరిశోధకుడిగా కావాలని అతని తాపత్రయం. అంతవరకు బాగానే వుంది కానీ దానికి అతను ఎంచుకున్న మార్గం క్రైమ్‍.                

క్రైమ్‍ అనగానే బ్యాంకు దోపిడీలు, కిడ్నాప్‍లు చేశాడనుకోవద్దు. అలా చేస్తే ఈ నవలకు ప్రత్యేకతే లేదు. ఇది సైంటిఫిక్‍ క్రైమ్‍. కరక్టుగా చెప్పాలంటే మెడికల్‍ క్రైమ్‍. అది జరిగే తీరు ఎలా వుంటుందో కాస్త విశదంగా చెప్పాలి. బిపి అంటే మనందరికీ తెలుసు. బ్లడ్‍ ప్రెషర్‍. బ్లడ్‍ ప్రెషర్‍ సాధారణంగా చాలామందికి వుంటుంది కాబట్టి, దానికి మందులు వాడతాం. ఈ డాక్టర్‍ నారాయణరావు బ్లడ్‍ ప్రెషర్ కోసం అంటూ ఆర్‍-4 అనే మందు యిస్తూంటాడు. ‘ఇది ఆయుర్వేదిక్‍ డ్రగ్‍. నేను దీనిపై రిసెర్చి చేసి పేపరు సబ్మిట్‍ చేస్తున్నాను. అందువల్ల ప్రయోగాత్మకంగా కొందరు పేషంట్స్‌కి యిచ్చి దాని ఫలితాలను పరీక్షిస్తాను’ అని హాస్పటల్‍ నిర్వాహకులకు చెప్పాడు. వాళ్లు సరేనన్నారు. ఈ ఆర్‍-4 మందు నిజానికి బిపి తగ్గించదు. దీని వలన ఆరు నెలల్లో హృదయనాళాలు సంకోచించి, గుండె కండరాల్లో ప్రవహించే విద్యుత్‍ ప్రవాహానికి అంతరాయం కలిగి, కొన్నాళ్లకు హార్ట్ బ్లాక్‍ కలగజేస్తుంది. గుండెకు రక్తం అందక గుండె నొప్పి వస్తుంది.

గుండెనొప్పి రాగానే వాళ్లు మళ్లీ యిదే హాస్పటల్‍కి వస్తారు. అప్పుడు ‘మీకు హార్ట్ ఎటాక్‍ వచ్చిందండి. పేస్‍మేకర్‍ పెడతాం’ అంటాడు ఈ డాక్టరుగారు. పేస్‍మేకర్‍ అనేది ఈ నవలలో ముఖ్యమైన అంశం కాబట్టి దాని గురించి బాగా గుర్తుపెట్టుకోండి. పేస్‍ అంటే స్పీడు, వేగం. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి కదా. గుండె నాళాలు పూడుకుపోవడం వల్లనో, గోడలు మందం కావడం వల్లనో, రక్తపు సరఫరాలో లోపం వస్తే అప్పుడు గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చేస్తుంది. ఏ 40 సార్లో కొట్టుకుంటే హార్ట్ బ్లాక్‍ అంటారు. అప్పుడు మందులు యిస్తారు. మందులు పనిచేయనప్పుడు దాని స్పీడును కంట్రోలు చేయడానికి ఈ పేస్‍మేకర్‍ను వాడతారు. ఇది చిన్న బ్యాటరీలాటి పరికరం. వైర్లతో గుండెకు అమరుస్తారు. మెడ దగ్గర కట్‍ చేసి దీన్ని శరీరంలో పెడతారు. గుండె స్పీడును నియంత్రిస్తూ పనిచేస్తుంది. ప్రాణాపాయం తప్పిస్తుంది.

అయితే ఈ డాక్టరు నారాయణరావు పేస్‍మేకర్‍ పెడుతున్నానని చెపుతూ మరో పరికరాన్ని పెడతాడు. అది పేస్‌మేకర్‍లాగానే వుంటుంది కానీ అదొక రేడియో రిసీవర్‍. అది శరీరంలో ఫిక్స్ చేశాక, ఈ డాక్టర్‍ తన యింటి వద్దనుండే ఆ రిసీవర్‍కి సిగ్నల్స్ పంపుతాడు. అది వాటిని రిసీవ్‍ చేసుకుంటుంది. మొదట ఏవేవో ధ్వనులు పంపుతాడు. అవి చెవిలో రొద పెడతాయి. దాంతో వాళ్లు ఈయన వద్దకు వచ్చి ‘సార్‍, మీరు పేస్‍మేకర్‍ పెట్టిన దగ్గర్నుంచీ చెవిలో ఒకటే ధ్వనులు, ఏవేవో మాటలు వినబడుతున్నాయి’ అని ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఈయన ‘అవి హెల్యూసినేషన్స్. ఇది గుండె సమస్య కాదు, మీరు సైకియాట్రిస్టు వద్దకు వెళ్లండి. మా హాస్పటల్లోనే చంద్రశేఖర్‍ అని వున్నారు. ఆయన మీకు తగ్గిస్తాడు’ అని పంపుతాడు. అక్కడ జరిగేది మరో తంతు. సైకియాట్రీ పేరుతో వాళ్ల దగ్గర్నుంచి కీలకమైన సమాచారం సేకరించి, వాళ్లను బ్రెయిన్‍వాష్‍ చేస్తూంటాడు ఆ డాక్టర్‍.

అసలు ఈ రకమైన ‘చికిత్స’కు ఈ డాక్టర్‍ నారాయణరావు అందర్నీ ఎంచుకోడు. వచ్చినవాళ్లలో నేరప్రవృత్తి వున్నవాళ్లు, కీలకమైన పొజిషన్‍లలో వున్నవాళ్లు.. యిలాటివాళ్లను వెతుక్కుంటాడు. యూనివర్శల్‍ డిటెక్టివ్‍ ఏజన్సీ అన్న ఓ సంస్థ సహాయంతో వచ్చినవాళ్ల గురించి వాకబు చేయించి అప్పుడు యివన్నీ చేస్తాడన్నమాట. కీలకమైన సమాచారం వచ్చాక అప్పుడు వాళ్ల బ్రెయిన్‍కు సిగ్నల్స్ పంపుతాడు. ‘ఇలా చెయ్, అలా చెయ్‌’ అని ఆదేశాలిస్తాడు. వాళ్లు యితని ఆజ్ఞలకు లోబడి యితను చెప్పినట్టుగా ఆడతారు. అవసరం తీరాక యితను ఓ సిగ్నల్‍ యిచ్చి అతని గుండె ఆగిపోయేట్టు చేస్తాడు. దాంతో వాళ్లు చచ్చిపోతారు. ఇతనికి డబ్బు సమకూరుతుంది.  ఇదీ మాస్టర్‍ ప్లాన్‍!

ఇది అమలు కావాలంటే ఓ టీముండాలి. దానిలో ఓ ఎలక్ట్రానిక్స్ నిపుణుడు, ఓ సైకియాట్రిస్టు, ఓ న్యూరాలజిస్టు ఉండాలి. డాక్టరు నారాయణరావు ఈ ముగ్గురినీ సమకూర్చుకున్నాడు. ఎవళ్ల వాటా వాళ్ల కిచ్చి లోబరుచుకున్నాడు. ఈ కార్యకలాపాలకు కేంద్రంగా తాను పనిచేసే వివేకానంద ట్రస్టు హాస్పటల్‍ను పెట్టుకున్నాడు. దానికి చైర్మన్‍ హయగ్రీవరావు అనే సీనియర్‍ డాక్టర్‍. ఆయన చిన్న నర్సింగ్‍హోంలా ప్రారంభించి, ఎంతో వృద్ధి పరచి ఊళ్లో కెల్లా బెస్ట్ హార్ట్ హాస్పటల్‍గా తయారుచేశాడు. గుండె వ్యాధులు చూసే విభాగాన్ని కార్డియాలజీ అంటారు. ఆ కార్డియాలజీ విభాగానికి అధిపతిగా డాక్టర్‍ కరుణాకర్‍ అనే ప్రసిద్ధుడైన, సమర్థుడైన కార్డియాలజిస్టును పెట్టుకున్నాడు. ఆయన వలన హాస్పటల్‍కి మంచి పేరు వచ్చింది. మంచి టీము ఏర్పడింది. ఈ నారాయణరావు ఆయనకు అసిస్టెంటుగా చేరాడు. ఇతను కాక తక్కిన డాక్టర్లున్నారు.

ఈ నారాయణరావు యిన్ని ఘోరాలు చేసేస్తుంటే ఎవరి దృష్టికీ రాకుండా ఎందుకు పోయింది అన్న సందేహం వస్తుంది కదా, హాస్పటల్‍ వ్యవస్థ ఎలా వుందో సూచిస్తారు రచయిత. కార్డియాలిజీ చీఫ్‍ కరుణాకర్‍కి ప్రైవేటు క్లినిక్‍ వుంది. బయటవూళ్లలో కాన్ఫరెన్సులు, సెమినార్లు వున్నాయి. విఐపిలను చూస్తుంటాడు. అంత బిజీ కాబట్టి తన అసిస్టెంటుమీద పనులు వదిలేస్తూంటాడు. మురళీధర్‍ అనే అతని ఫ్రెండు వచ్చి ‘మేం ఆర్‍-4 అనే మందు తయారుచేస్తున్నాం. మీ హాస్పటల్లో వాడండి’ అంటే సరే అనేస్తాడు కానీ దాని కంపోజిషన్‍ ఏమిటి, దాని సైడ్‍ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అని చూసే తీరికా, రివ్యూ చేసే ఓపికా లేవు. నిజానికి ఈ ఆర్‍-4 మందును పంపించినది డాక్టర్‍ నారాయణరావే! దానిమీద నేను పేపర్‍ సబ్మిట్‍ చేస్తున్నాను అంటే సరే, సరే వాడి చూడు అనేస్తాడు. 

ఇక పేస్‍ మేకర్ విషయానికి వస్తే విదేశాలనుండి వాటిని తెప్పిస్తారు. పేషంటుకి అమర్చేటప్పుడు ఎక్కువ ధర వసూలు చేస్తారు. నారాయణరావు పేస్‍మేకర్‍ పెడుతున్నానని అంటే ‘సరే హాస్పటల్‍కి లాభమే కదా’ అనుకుంటాడు తప్ప పేషంటుకి దాని అవసరం వుందా లేదాని తరచి అడగడు. నిజానికి నారాయణరావు యితని పేస్‍మేకర్‍ వాడకుండా యింట్లోంచి రేడియో సిగ్నల్‍ రిసీవరు పట్టుకొచ్చి పెట్టేస్తూంటాడు. ఆ విషయం నర్సులకు తెలిసినా వాళ్లు మాట్లాడరు. ఎందుకంటే యితని క్రైమ్‍ సమగ్రరూపం ఎవరికీ తెలియదు. రిసెర్చి చేస్తున్నాడుగా అనుకుని వూరుకుంటారు. ఇతను పేస్‍మేకర్‍ పెట్టినవాళ్లు చచ్చిపోతున్నారు అన్న విషయంపై కూడా ఎవరూ ధ్యాస పెట్టరు. హాస్పటల్‍కి పది లక్షల విరాళం యిచ్చేసి నారాయణరావు బోర్డు దృష్టిలో, చైర్మన్‍ హయగ్రీవరావు దృష్టిలో మంచివాడయిపోయాడు. ఇక తక్కిన డాక్టర్లున్నారు కానీ వాళ్లకు చచ్చేటంత పని. రోజువారీ పని చేయడమే సరిపోతుంది తప్ప యిలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగలేదు అని తర్కించే యింట్రస్టూ లేదు, టైము లేదు.

ఇలాటి పరిస్థితులు నవలలోని ఆసుపత్రిలోనే కాదు, బయట ఆసుపత్రులలో కూడా చూస్తూంటాం కాబట్టే ఈ నవల నిజం కావచ్చేమోనన్న భ్రమ కలుగుతుంది మనకు. మొదట్లో చెప్పినట్టు ఈ రచయిత పరిమితంగా ఇమాజినేషన్‍ ఉపయోగించారు. గుండె నాళాలు మూసేసే ఆర్‍-4 అనే మందు, పేస్‍మేకర్‍ను రేడియో రిసీవర్‍గా వుపయోగించడం, దాని ద్వారా గుండెనే కాక, బ్రెయిన్‍ను కూడా నియంత్రించడం అనేవే ఈయన తీసుకున్న పొయటిక్‍ లేదా సైంటిఫిక్ లిబర్టీస్‍. తక్కినదంతా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో నారాయణరావు నాలుగేళ్లపాటు కథ నడిపించాడు. బోల్డంత సంపాదించాడు. అతను ఆశలు బాగా పెరిగాయి. తన టార్గెట్‍ పెంచబోయేంతలో హీరో కథాప్రవేశం చేశాడు.

ఈ హీరో పేరు డాక్టర్‍ రవికాంత్‍.  ఎం.డీ. చేసి ట్యునీసియాలో 70 పడకల ఆసుపత్రిలో చీఫ్‍ కార్డియాలజిస్టుగా పనిచేసి ఇండియాకు  తిరిగి వచ్చాడు. తెలుగువాడు కాబట్టి హైదరాబాదులో ఉద్యోగానికి వచ్చాడు. వివేకానంద హాస్పటల్‍ పేరు, డాక్టర్‍ కరుణాకర్‍ పేరు విని యిక్కడైతే బాగా నేర్చుకోవచ్చని చేరాడు. అయితే యిక్కడ అతని చదువుకి, అనుభవానికి తగ్గ ఉద్యోగం యివ్వలేదు వీళ్లు. డ్యూటీ డాక్టరుగా వేశారు. అతని భార్య, పిల్లవాడు విజయవాడ వెళ్లారు. అతను వరుసగా చూసిన కొన్ని కేసుల వల్ల అతనికి ఈ ఆసుపత్రిలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని అనుమానం వచ్చింది. ఆ కేసులేమిటో కాస్త కాస్త చెబుతాను. కథాకాలం నాటికి ఒక్కో కేసు ఒక్కో స్టేజిలో వుంది. అంటే పేస్‍మేకర్‍ పెట్టడానికి ముందు 2,3 స్టేజిలు, తర్వాత 2,3 స్టేజిలు వున్నాయి కదా.

రవికాంత్‍ ఓపీ, అంటే ఔట్‍ పేషంట్‍, వార్డులో కూచున్న మొదటిరోజే షౌకత్‍ అలీ అనే ఒక మ్యూజియం ఉద్యోగి వచ్చాడు. అతనికి బిపి వుంది. మందులేసుకుంటున్నాడు. అయినా నడుము దగ్గరా, ఎడమ భుజంలోనూ నొప్పి వస్తోంది. అతని ప్రిస్క్రిప్షన్‍ చూస్తే ఆర్‍-4 మందు కనబడింది. అలాగే ఆ రోజు వచ్చిన చివరి పేషంటు యాదగిరి అని జ్యూయలరీ షాపులో పనిచేసే అతను. అతనికి చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టుంది అని కంప్లయింటు. అతని ప్రిస్కిప్షన్‍లోనూ ఆర్‍-4 కనబడింది.  ఈ ఆర్‍-4 ఇండియాలో వాడే మందేమో! దీని కాంపోజిషన్‍ కనుక్కుందాం అనుకుని రవికాంత్‍ స్టోర్స్‌కి వెళ్లి అక్కడున్న స్టాఫ్‍ని అడిగాడు. ‘మా దగ్గర లేదండి. కార్డియాలజీ డిపార్టుమెంటులోనే వుందేమో’ అందామె. మర్నాడు అతను అతను ఐసిసియులో వుండగా ఆ ఆర్‍-4 మందు స్ట్రిప్‍ కనబడింది. కాంపోజిషన్‍ చూస్తే ఏవేవో చెట్ల పేర్లు వున్నాయి. తయారుచేసినది కార్డియాక్‍ ఫార్మా, రామాంతపూర్‍, హైదరాబాద్‍ అని వుంది.

నారాయణరావు పేస్‍ మేకర్‍ ఫిక్స్ చేసినవాళ్లలో ఇటుకల రంగయ్య అనే ఒకతను వున్నాడు.  అతను ఒక పాత యిల్లు పడగొడుతూంటే పాతర దొరికింది. దాంతో కోటీశ్వరుడు అయిపోయాడు.  ఆరునెలల క్రితం హార్ట్ ఎటాక్‍ వచ్చి వివేకానంద హాస్పటల్‍లో చేరాడు. అప్పుడు తన పేస్‍మేకర్‍ పెట్టేశాడు నారాయణరావు. ఇక అప్పణ్నుంచి ఒక బాబా తనతో మాట్లాడుతున్నట్టు రంగయ్యకు ఫీలింగ్‍. ‘నీకింత డబ్బుందిగా, నా ఆశ్రమాని కియ్యి ’ అని నిరంతరం చెవిలో వినబడేది. చెవిలో చూపించుకుంటే ఏమీ లేదు. డాక్టర్లకు చూపిస్తే మానసిక భ్రమ అన్నారు. చివరకు బాబా బోధనలు భరించలేక అతను అడిగిన లక్షా యిచ్చేస్తే మంచిది కదా అనుకున్నాడు. లాకర్‍లోంచి లక్షా తీసి బొంబాయి రోడ్డులో వాళ్లు చెప్పినచోట పెట్టేశాడు. పని అయిపోయిందిగా, నారాయణరావు అతనికి గుండెపోటు తెప్పించాడు. ఆ రాత్రే వివేకానంద ఆస్పత్రిలో ఎడ్మిటయి రంగయ్య కన్నుమూశాడు. అప్పుడు నారాయణరావు వచ్చి శవంనుండి పేస్‍మేకర్‍ బయటకు తీసేశాడు. ‘ఇది బాగానే పనిచేస్తోంది, ఎవరికైనా అమర్చవచ్చు’ అంటూ! అంటే ఆధారం నాశనం చేసేశాడన్నమాట.

షౌకత్‍ అలీ గురించి చెప్పాలంటే ఓ నవాబుగారు తనింట్లో పాత వస్తువులను ఏం చెయ్యాలాని ఆలోచిస్తూంటే ఆర్కియాలజీలో డిప్లొమా వున్న షౌకత్‍ అతనికి ఆ వస్తువులన్నీ మ్యూజియంగా ఏర్పాటు చేయమని సలహా యిచ్చాడు. తనే క్యూరేటర్‍గా వున్నాడు. ప్రాచీన వస్తువుల కోసం ఎవరైనా వస్తే వాళ్లకు దీన్ని చూపించి బేరం కుదుర్చుకుంటాడు. తర్వాత అలాటిదే ఓ డూప్లికేట్‍ తయారుచేయించి మ్యూజియంలో పెట్టి అసలుది వాళ్లకు అమ్మేస్తాడు. ఇలా దొంగ వ్యాపారంలో బాగానే సంపాదించాడు. తిండి, తాగుడు ఎక్కువ కాబట్టి బిపి వచ్చింది. వివేకానంద ఆసుపత్రికి వచ్చాడు. నారాయణరావు కంటబడ్డాడు. అంతే పేస్‍మేకర్‍ పెట్టించాడు. ఆ తర్వాత అల్లా నుండి అతనికి ఆజ్ఞలు వచ్చేవి. ‘నేను అల్లాని. ఆ 17వ శతాబ్దం తాలూకు నటరాజ విగ్రహం మీ యింటికి ఫలానా తేదీన వచ్చే వాళ్లకు యిచ్చేయి’ అని చెవిలో నిరంతరం రొద. అలాగే యిచ్చేశాడు. ఆ తర్వాత గుండె పోటు వచ్చి ఢామ్మని పోయాడు.

హిందూ, ముస్లిమ్‍ అయ్యారుగా, ఓ క్రిస్టియన్‍ కథ కూడా వుంది. జాన్‍ ఏడమ్స్ అని డిఫెన్సు డిపార్ట్‌మెంట్‌లో మిసైల్‍ డిజైన్‍ టెస్టింగ్‍లో వుంటాడు. కీలకమైన సైంటిస్టు. అతనికి గుండెనొప్పి వచ్చి వివేకానంద ఆసుపత్రిలో చేరాడు. ఇంకేముంది? పేస్‍మేకర్‍. రెండు నెలలు తిరక్కుండా ఆల్‍మైటీ గాడ్‍నుండి సందేశాలు - ‘ప్రపంచ శాంతి ముఖ్యం. మారణాయుధాలకు సహాయపడకు. ఇప్పటిదాకా చేసిన రిసెర్చి వివరాలన్నీ కవరులో రాసి నాగార్జునసాగర్‍ రోడ్డులో ఓ చెట్టుకింద పాతిపెట్టు అని.’ ఈ బోధలు భరించలేక బ్రెయిన్‍వాష్‍కు లొంగిపోయి అతను అలాగే పెట్టేశాడు. అంతే, ఆ సాయంత్రమే మాసివ్‍ హార్ట్ ఎటాక్‍. ఈ ఆసుపత్రిలోనే చేర్చారు. నారాయణరావుకి కబురు వచ్చింది. అతను కాపాడడానికి వెళ్లినట్టే వెళ్లి కార్డిలాల్ ఏంప్యూల్స్ బదులు తను తెచ్చినవి ఎక్కించేసి అతను ఖచ్చితంగా చచ్చేట్టు చూశాడు. దీని తర్వాతి భాగం ఐసిసియు-02లో చదవండి. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?