ఇటీవల మంత్రులు, ఇన్ చార్జ్ లతో జరిగిన మీటింగ్ లో ఇంటర్నల్ సర్వే వివరాలు బయటపెట్టారు సీఎం జగన్. ఆ సర్వేలో కొందరి పరిస్థితి దారుణంగా ఉందని హెచ్చరించారు. అయితే ఆ లిస్ట్ మాత్రం ఆయన బయటపెట్టలేదు. రెండేళ్లలో రేటింగ్ మెరుగుపరుచుకోకపోతే కష్టం అని, భవిష్యత్తులో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఆ లిస్ట్ లో ఉన్నదెవరనేదే ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఎవరికి వారు తామేనని భయపడే పరిస్థితి కూడా ఉంది. అందుకే గతంలో గడప గడపకు యాత్ర చేయండి అన్నా కూడా పెద్దగా పట్టించుకోనివారు, ఇప్పుడు సచివాలయాల బాట పడుతున్నారు. జగన్ వార్నింగ్ బాగా పనిచేసినట్టు తెలుస్తోంది.
సీఎంకి వంద మార్కులు.. మరి ఎమ్మెల్యేలకు..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అయినా, మూడేళ్ల తర్వాత అయినా ఎప్పుడు ఏ సర్వే చేపట్టినా సీఎం వందకు వంద మార్కులతో పాసవుతున్నారు. మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? ఎమ్మెల్యేలపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది.
సీఎం జగన్ వేసే ఆర్థిక సాయం ఎలాగూ అకౌంట్లలో పడుతోంది, సచివాలయాలు, వాలంటీర్లతో సేవలు ఇంటి దగ్గరకే వస్తున్నాయి, రేషన్ సరకులు కూడా ఇంటికే వస్తున్నాయి. ఈ దశలో ప్రజల నుంచి పెద్దగా కంప్లయింట్లు లేవు. కానీ అదే సమయంలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..? అసలు వారికి పని ఉందా లేదా అనే చర్చ నడుస్తోంది.
అందరూ అంతేనా..?
నేరుగా ప్రభుత్వమే ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తోంది, ఏదైనా సమస్యలుంటే సచివాలయంలో పరిష్కారం అవుతున్నాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కాస్త బద్ధకం వచ్చినమాట వాస్తవమే. కానీ అందరూ అలా లేరు. మంత్రులు కాకుండా మిగతా ఎమ్మెల్యేలలో దాదాపుగా 50మంది జనంలోనే ఉన్నారు, జనంతోనే ఉన్నారు.
ఎక్కడికక్కడ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కార్యక్రమాలని వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో బాగా కష్టపడ్డారు, ఏకగ్రీవాలతో పార్టీ పరపతి పెంచారు, మరికొన్ని చోట్ల వైరివర్గం లేకుండా మొత్తాన్ని చాపచుట్టేశారు.
కానీ మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ లు చూసుకుంటూ ఉండిపోయారు. ఎన్నికలు ఇప్పుడల్లా లేవు కదా అనే ధీమాతో ఉన్నారు. తమ అనుచరులతో పనులు జరిపిస్తున్నారు. అలాంటి వారికి జగన్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకపోతే, జనంలో ఉండకపోతే 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
2019లో జగన్ పాదయాత్ర, ఆయన హామీలు చూసి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టారు ప్రజలు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండకూడదని, వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎవరికి వారు సొంత ఇమేజ్ పెంచుకోవాలని, పార్టీ పరపతి పెంచాలనేది జగన్ సూచన. దీన్ని పాటిస్తున్నవారు ధీమాగా ఉన్నారు, అలసత్వంతో ఉన్నవారు ఇప్పుడిప్పుడే అలర్ట్ అవుతున్నారు.
మొత్తానికి రెండేళ్ల ముందుగానే జగన్ తన టీమ్ లో చురుకు పుట్టించారు. ఇప్పటివరకు పాస్ మార్కులు కూడా పొందని ఎమ్మెల్యేలు, ఎన్నికల నాటికి ప్రజల చేత మంచి మార్కులు వేయించుకుంటారేమో చూడాలి.