మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు (72) అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్రీకాకుళం జిల్లా నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 మధ్య కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పని చేశారు. ఈయన సోదరుడు శత్రుచర్ల విజయరామరాజు అదే నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985, 1999లో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగూరు (ఎస్టీ) నియోజకవర్గాన్ని పేరుమార్చి కురుపాం (ఎస్టీ) నియోజక వర్గాన్ని ఏర్పరిచారు. అయితే విజయరామరాజు గిరిజనుడు కాదని, క్షత్రియుడని ప్రత్యర్థుల ఫిర్యాదు మేరకు న్యాయస్థానం విచారణ చేపట్టింది. గిరిజనుడు కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో శత్రుచర్ల కుటుంబం కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పుష్పశ్రీవాణిని చంద్రశేఖర్‌రాజు కుమారుడు పరీక్షిత్ రాజు పెళ్లి చేసుకోవడం, ఎన్నికల బరిలో నిలవడం తదితర రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే.
తుదిశ్వాస విడిచే సమయానికి ఆయన టీడీపీ నేత. పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు తండ్రి చంద్రశేఖర్‌రాజు. పరీక్షిత్‌రాజు ప్రస్తుతం అరకు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు. ఈయన చెల్లి పల్లవి ఇటీవల టీడీపీలో చేరారు. కురుపాంలో శత్రుచర్ల రాజకీయ వారసత్వాన్ని పుష్పశ్రీవాణి కొనసాగిస్తున్నారు. మామతో విభేదాలపై పుష్పశ్రీవాణి పలు సందర్భాల్లో చెప్పారు.
అందరి కుటుంబాల్లో మాదిరిగానే తమ ఇంట్లో కూడా చిన్నచిన్న విభేదాలున్నాయని, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్‌రాజు మృతిపై వైసీపీ, టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు.