Advertisement

Advertisement


Home > Movies - Reviews

Acharya Review: మూవీ రివ్యూ: ఆచార్య

Acharya Review: మూవీ రివ్యూ: ఆచార్య

టైటిల్: ఆచార్య
రేటింగ్: 2/5
తారాగణం: చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోను సూద్, జుష్ణు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల, అజయ్ తదితరులు
కెమెరా: తిర్రు
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: మణిశర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: 29 ఏప్రిల్ 2022

2019 అక్టోబర్ లో శ్రీకారం చుట్టుకున్న 'ఆచార్య" కరోనా మహమ్మారి కారణంగా తారీకులు మార్చుకుంటూ ఎట్టకేలకు నేడు విడుదలయింది. చిరంజీవి టైటిల్ రోల్ పోషించినా ఇందులో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర చేయడం వల్ల ఆసక్తి, అంచనాలు డబలయ్యాయి. 

పైగా 'లాహే లాహే..' పాట విడుదలకి ఎన్నో నెలల ముందే సూపర్ హిట్ కావడం వల్ల మ్యూజికల్ గా కూడా కలిసొచ్చింది. 

అన్నిటికీ మించి కథేమిటో తెలియకుండా కట్ చేసిన ట్రైలర్ కూడా సినిమాలో ఏముందోనన్న ఉత్సుకతని పెంచింది. 

వెరసి ఈ చిత్రం సినీ అభిమానుల్ని థియేటర్స్ కి రప్పించింది. 

ఇక విషయంలోకి వెళ్దాం.

తల తిప్పనీయకుండా చేసి కథాప్రపంచంలోకి లాక్కుపోయేది ఉత్తమ కథనం అవుతుంది. లేకపోతే ఉత్త కథనమవుతుంది. 

భారీ సెట్టింగ్, ఆకట్టుకునే కెమెరా వర్క్, గ్రాఫిక్స్, నటీనటులు కుదిరినంతమాత్రాన కథా కథనాల విషయంలో కాంప్రమైజైతే మొత్తం కష్టం వృథా అవుతుంది. 

కథలో కొత్త పాయింట్, ఆసక్తికరమైన ఓపెనింగ్, పాత్రల పరిచయం, సమస్య, పరిష్కారం, ఊహించని మలుపు...ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త తీసుకుని తూకం తప్పకుండా రాసుకోవాల్సి ఉంటుంది సినిమా కథనం. 

ఇందులో మొదటి పాయింట్ దగ్గరే దెబ్బ పడింది. కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. కథనంలో మెరుపుల్లేవు. అన్నీ ఊహించినట్టే జరుగుతూ నీరసం తెప్పిస్తుంది. 

చిరంజీవి సినిమా అనగానే ప్రేక్షకులు ముఖ్యంగా కోరుకునేది మాస్ ఎలిమెంట్స్, ఎనెర్జీ. అవి ఉండబట్టే "ఖైది 150" ఆడింది. అవి లేకే "సైరా" ఫెయిలయ్యింది. కానీ చారిత్రక సినిమా కావడం వల్ల కాస్తైనా గౌరవాన్ని దక్కించుకుంది. 

ఈ "ఆచార్య" పరిస్థితి మాత్రం అలా కాదు. ఇది కల్పిత కథ. ఊహాశక్తితో కథని ఏ స్థాయికైనా తీసుకెళ్లి రక్తి కట్టించొచ్చు. కానీ ఆ కసరత్తు ఏ మాత్రం జరగలేదు. ఆద్యంతం నీరసానికి నిలువెత్తు రూపంలా నడుస్తుందీ చిత్రం. 

అసహజమైన నేపథ్యం, మూసకొట్టుడు విలన్లు, నేచురల్ గా లేని సంభాషణలు, ఏ కాలం కథో తెలియని అయోమయం, రెండు దశాబ్దాల క్రితం నాటి స్టైల్లో వినిపించే మ్యూజిక్...వెరసి ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చిన చిత్రమిది. 

చెప్పుకోదగ్గ గొప్ప విషయమేదైనా ఉందా అంటే 67 ఏళ్ల వయసులో చిరంజీవి అలా కనిపించడం, డ్యాన్స్ చేయడం. నిజంగా ఇది ఆశ్చర్యమే అని చెప్పాలి. చిరంజీవి డ్యాన్సుల్లో ప్రత్యేకంగా కనిపించేది గ్రేస్. అది వేరే ఏ హీరో డ్యాన్సులోనూ కనపడదు. ఎన్ని దశాబ్దాలైనా ఆ గ్రేస్ ఏ మాత్రం చెక్కుచెదరకుండా కాపాడుకోవడం నిజంగా ఆయన కృషికి, సాధనకి నిదర్శనం. 

తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఆర్ట్ డైరెక్షన్. దర్శకుడి కోరిక మేరకు చాలా ఘనమైన విలేజ్ సెట్టైతే వేసారు. 

అవి తప్ప మిగతావన్నీ డల్లే. 

తాను స్వయంగా మాటల రచయిత అయ్యుండి కొరటాల ఒక్క డయలాగ్ కూడా పవర్ఫుల్ రాసుకోలేకపోవడం ఆశ్చర్యం. రాసుకున్న డైలాగ్స్ కూడా చెప్పించిన తీరులో కృతకత్వం ఉంది తప్ప సహజత్వం లేదు. 

గ్రాఫిక్స్ వాడకం ఎంతున్నా చిరంజీవి కష్టం మాత్రం కనపడింది. అయితే సెకండాఫులో ఒక ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ మరీ ఎక్కువ వాడి యంగ్ చిరంజీవిని చూపించే ప్రయత్నం చేసారు. సీరియస్ సీన్లో అది హాస్యాస్పదంగా మారింది తప్ప ఫ్లో కి ఉపయోగపడలేదు. 

రామ్ చరణ్ పాత్రకి కూడా పెద్ద వేరియేషన్ లేదు. ప్రధమార్థంలో చిరంజీవేం చేస్తాడో, ద్వితీయార్థంలో రామ్ చరణ్ అదే చేస్తాడు. అద్భుతమనిపించే అంశాలేవీ పాత్రలో కానీ, నటనలో కానీ, డైలాగ్స్ లో కానీ లేవు. 

పూజా హెగ్డే పాత్ర ఎందుకుందో కూడా అర్థం కాదు. ఏ మాత్రం బరువు లేని, కథకు ఉపయోగపడని పాత్ర ఆమెది. 

సోను సూద్, కిషోర్, జిషు సేన్ గుప్తా, సౌరవ్ లోకేష్...ఇలా విలన్లంతా అడివిని కొట్టేసి ఇండస్ట్రీ పెట్టాలనుకోవడం లాంటి ఏజ్ ఓల్డ్ విలనీని ప్రదర్శించారు. ఇంకెన్నాళ్లు చూడాలి ఇదే మూస?! కుప్పల తెప్పలుగా విలన్లుండడం వల్ల హీరో ఎవర్ని కొడుతున్నా ఎమోషన్ అందదు. 

మణిశర్మ సంగీతం లౌడ్ గా ఉంది తప్ప కథనంలో డీలాతనాన్ని కవర్ చేయగలిగే మంత్రంలా అయితే పని చేయలేదు. 

పాటల్లో లాహే లాహే హిట్టయినా తెర మీద ఆకట్టుకోలేకపోయింది. బంజారా పాటలో ఒకటి రెండు స్టెప్పులు బాగున్నాయనిపించాయి. నీలాంబరి పాట ఆకట్టుకోలేదు. చానాకష్టం పాట ప్లేస్మెంటులోనే సమస్యుంది. దానివల్ల పాట వినోదాన్ని ఇవ్వకపోగా పంటికింద రాళ్లలాగ కళుక్కుమంటాయి. 

ఇద్దరు హీరోల పోరాటానికిగల కారణం ఆలస్యంగానే చెప్పినా ఆ కారణంలో బలం లేకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ కావడం కష్టం. 

తెర మీద చిరంజీవి, రామ్ చరణ్ కనిపిస్తే చాలు...వాళ్లేం చేసినా అది ప్రసాదమే అని ఆరాధనాభావంతో చూసే వీరాభిమానుల పరిస్థితేమో కానీ... కొత్తదనం, సెన్స్, సెన్సిబిలిటీ, వినోదం కోరుకునే ఆడియన్స్ కి మాత్రం నిరాశే మిగులుతుంది. 

"పాఠాలు చెప్పకపోయినా నన్ను ఆచార్య అంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో.." డైలాగ్ ని గుర్తుచేసుకుంటూ ఈ సినిమా గుణపాఠాన్నే మిగిల్చిందనుకోవాలి. తండ్రీకొడులిద్దరూ కలిసి నటించే అవకాశం దొరికిందని రంగంలోకి దిగిపోకుండా చిరంజీవి వర్గం కథ మీద మరింత పని చేయించుంటే బాగుండేది. 

బాటం లైన్: గుణపాఠం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?