Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఐర్లండ్‌కు భారత సంతతి ప్రధాని

ఐర్లండ్‌కు ప్రధాని అయిన లియో వారాడ్కర్‌ భారతీయ సంతతికి చెందినవాడు. ఆయన తండ్రి డా|| వారాడ్కర్‌ ముంబయికి చెందిన మహారాష్ట్రీయుడు. ఆయన ఇంగ్లండులో ఒక ఆసుపత్రిలో పనిచేసే రోజుల్లో ఐర్లండ్‌ లోని వాటర్‌ఫోర్డ్‌కు చెందిన నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు కూతురు పుట్టాక ఐర్లండ్‌లోని డబ్లిన్‌కు తరలిపోదామని నిశ్చయించుకున్నారు.

లియో అక్కడే పుట్టాడు. పెరిగాడు. డాక్టరీ చదివాడు. సెంటర్‌-రైటిస్టు భావాలకు చెందిన ఫైన్‌ గేల్‌ పార్టీలో 23 ఏళ్ల వయసులో 2002లో చేరాడు. ఐదేళ్లలో ట్రెయినీ డాక్టరుగా పనిచేస్తూనే ప్రజాప్రతినిథిగా ఎన్నికయ్యాడు. పదేళ్ల తర్వాత 38 ఏళ్ల వయసులో ఏకంగా ప్రధాని అయిపోయాడు. అతను ప్రధాని కావడం చిత్రమైన పరిస్థితుల్లో జరిగింది. 

ఇంగ్లండ్‌కు పక్కనున్న దీవి ఐర్లండ్‌. దానిలో ఉత్తర భాగమైన ఉత్తర ఐర్లండ్‌ గ్రేట్‌ బ్రిటన్‌లో భాగం. దక్షిణ ఐర్లండ్‌ బ్రిటన్‌ నుంచి విడిపోతూ వచ్చి చివరకు 1949లో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లండ్‌గా ఏర్పడింది. 2011లో దాని జనాభా 64 లక్షలు. 2011లో జరిగిన ఎన్నికలలో పార్లమెంటులో వున్న మొత్తం 157 సీట్లలో లియో పార్టీ ఐన ఫైన్‌ గేల్‌కు 76 వచ్చాయి. లేబర్‌ పార్టీకి 37 వచ్చాయి. ఇద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

లియో నాయకుడైన ఎండా కెన్నీ ప్రధాని అయ్యాడు. లియో ట్రాన్స్‌పోర్టు మంత్రి అయ్యాడు. ఆ ప్రభుత్వం జనాదరణ పొందకపోవడం చేత 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో ఫైన్‌ గేల్‌ 26 సీట్లు పోగొట్టుకుని 50 తెచ్చుకుంది. లేబర్‌ పార్టీ మరీ దారుణంగా 30 సీట్లు పోగొట్టుకుని 7 మాత్రమే తెచ్చుకుంది. ఫియన్నా ఫెయిల్‌ అనే పార్టీ గతంలో కంటె 24 సీట్లు ఎక్కువగా తెచ్చుకుని 44 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది.

సగం కంటె ఎక్కువ సీట్లు కావాలంటే 79 రావాలి. లేబరు పార్టీతో చేతులు కలిపినా లాభం లేదు కాబట్టి 50 సీట్ల ఫైన్‌ గేల్‌ 44 సీట్లున్న ఫియన్నా ఫెయిల్‌తో బేరసారాలు సాగించింది. 63 రోజుల పాటు చర్చలు జరిగినా ఏమీ తేలలేదు. చివరకు 'మేం ప్రభుత్వంలో పాలు పంచుకోము. మీరు మైనారిటీ ప్రభుత్వం ఏర్పరచండి.' అని ఫియన్నా ఫెయిల్‌ అంది. 

ఆ విధంగా ఎండా కెన్నీ రెండోసారి ప్రధాని అయ్యాడు. లియోకు యీ సారి సోషల్‌ ప్రొటెక్షన్‌ మంత్రిత్వ శాఖ లభించింది. పక్కదారి పట్టిన సంక్షేమ పథకాల నిధులు సంగతి తేల్చడానికి అతను నడుం బిగించడంతో అతనికి పేరు వచ్చింది. కానీ కెన్నీకే పాపం వ్యవహారం సజావుగా సాగలేదు. బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు రావడం అతనికి యిష్టం లేదు. బ్రెగ్జిట్‌ జరిగితే ఉత్తర ఐర్లండ్‌తో భద్రతా సమస్యలొస్తాయని వాదించాడు. దాన్ని బ్రిటన్‌ ఖండించింది. ఈ లోగా మారిస్‌ మెక్‌కాబే అనే విజిల్‌ బ్లోవర్‌ (పారా హుషారీ) వివాదం అతనికి యిబ్బంది తెచ్చిపెట్టింది.

ఐర్లండ్‌ పోలీసు వ్యవస్థలో జరుగుతున్న మోసాలను మారిస్‌ 2013లోనే అప్పటి ప్రధాని ఎండా కెన్నీకి, ట్రాన్స్‌పోర్టు మంత్రి లియో వారాడ్కర్‌కు విన్నవించాడు. వారిద్దరూ న్యాయశాఖా మంత్రికి చెప్పుకోమన్నారు. అతను విషయాలు బయటకు రాకుండా తొక్కేయడంతో బాటు రహస్యాలు బయటపెట్టినందుకు మారిస్‌ను పోలీసు కమిషనర్‌ ద్వారా హింసించాడు. ఇవన్నీ 2016 తర్వాత బయటకు రావడంతో కొందరు ప్రజాప్రతినిథులు ఎండా కెన్నీపై తిరగబడ్డారు.

పరిస్థితి చేజారుతోందని గ్రహించిన కెన్నీ తను పార్టీ అధ్యక్ష పదవి నుంచి, దాని తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకుంటాననిమే 17న ప్రకటించాడు. ప్రకటన చేశాక కాస్త ఊగిసలాడాడు కానీ చివరకు పార్టీలో జూన్‌ 2న ఎన్నికలు నిర్వహించాడు. ఆ ఎన్నికలలో పార్టీ నాయకుడిగా లియో నెగ్గాడు. జూన్‌ 13 నుంచి కెన్నీ స్థానంలో ప్రధాని కూడా అయిపోయాడు.

చాలా సనాతన భావాలున్న దేశంగా ఐర్లండ్‌కు పేరు. రోమన్‌ కాథలిక్‌ క్రైస్తవం అక్కడ చాలా పాప్యులర్‌. లియో చూడబోతే సగం ఇండియన్‌, పైగా హోమో సెక్సువల్‌. ఇద్దరు పురుషులు కానీ, ఇద్దరు స్త్రీలు కాని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని ఐర్లండ్‌లో 2015లో ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిగింది. 2015 మేలో సేమ్‌-సెక్స్‌ మారేజిని ఐర్లండ్‌ పార్లమెంటు ఆమోదించింది కూడా.

దానికి కొద్ది నెలల ముందే ఐరిష్‌ నేషనల్‌ రేడియోకి యిచ్చిన యింటర్వ్యూలో యితను బహిరంగంగా తను హోమో అని చెప్పేసుకున్నాడు. అయినా అతని పాప్యులారిటీకి ఏ లోపం రాలేదు. 2016లో మళ్లీ ఎన్నికయ్యాడు. ఐర్లండ్‌లో అబార్షన్‌ యిప్పటికీ చట్టవిరుద్ధమే. 'అది మరీ కఠినంగా వుంది. మార్చాలి' అంటాడితను. ఆర్థిక విధానాల విషయంలో అతను ఫ్రీ మార్కెట్‌ సిద్ధాంతాలను నమ్ముతాడు. అటువంటి భావాలే అతనికి పార్టీ నాయకత్వాన్ని కట్టబెట్టాయి. 

అతని ఎదుట  గృహవసతి, ప్రజారోగ్యం వంటి చాలా సమస్యలే వున్నాయి. అన్నిటి కంటె పెద్ద సమస్య బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌లోంచి బయట పడిన తర్వాత ఎదురయ్యే సమస్య. ఏది పరిష్కరిద్దామన్నా అతనిది మైనారిటీ ప్రభుత్వమే. అందువలన కత్తి మీద సాము లాటి ఉద్యోగమే లియోది. దాన్ని ఎంత సమర్థవంతంగా ఎంతకాలం నడుపుకుని వస్తాడో చూడాలి. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com