cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఐఎస్ఐ టోకరా తిన్న సందర్భం

ఎమ్బీయస్‍: ఐఎస్ఐ టోకరా తిన్న సందర్భం

శత్రుదేశపు రహస్యాలను తెలుసుకోవడానికి ఆడవాళ్లను ఎఱగా వేయడం అనాదిగా లోకమంతటా వుంది. ఆడవాళ్లనే కాదు, అందమైన మగవాళ్లనూ వేసిన సందర్భాలను 2010 మేలో రాసిన ‘‘మాధురి గుప్తకథ’’ అనే వ్యాసంలో రాశాను. ఎంతమందికి గుర్తుందో తెలియదు. ఆమె పాకిస్తాన్‌లో ఇండియన్ హై కమిషన్‌ ఆఫీసులో పనిచేసేది. తన పై అధికారులపై యీమెకు అక్కసు, కసి వుందని గమనించి, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐయస్‌ఐవాళ్లు అందగాడైన ఓ ఐయస్‌ఐ ఏజంటుని (పేరు రాణా, పెట్టుడు పేరు కావచ్చు) యీమెపై ప్రయోగించారు. ఈమె వయసు 50 దాటినా అతని మైకంలో పడిపోయింది. 'నీకో విషయం తెలుసా? మా కమీషనర్‌ ఆఫీసులో ప్రెస్‌ డివిజన్‌కి యిన్‌ఛార్జిగా వున్న ఆర్‌.కె.శర్మ ఐఎఫ్‌ఎస్‌ క్యాడర్‌ అని చెప్పుకుంటాడు కానీ కాదు. అతను నిజానికి 'రా' (విదేశాలలో గూఢచర్యం చేసే భారత ప్రభుత్వ సంస్థ) తరఫున ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్న అధికారి. ఇది ఒట్టి ముసుగు మాత్రమే'' అని చెప్పేసింది.

వెంటనే రాణా అది తన అధికారులకు చెప్పడం, ఆ విషయాన్ని ఐయస్‌ఐలో మన యిండియా తరఫున పనిచేసే గూఢచారులు తెలుసుకుని శర్మకు చేరవేయడం జరిగిపోయాయి. తనెవరో అవతలివాళ్లకు తెలిసిపోయిందని గ్రహించాక శర్మ ఢిల్లీలో వున్న 'రా' అధికారులకు ఈ మాధురీ గుప్తా గురించి ఫిర్యాదు చేశాడు. ఇక అప్పణ్నుంచి మాధురి చర్యలను భూతద్దం వేసి చూడసాగారు. ఇదేమీ తెలియని మాధురి జోరుగా సమాచారం సేకరించడంలో మునిగిపోయింది. తనకు సంబంధించని విషయాలలో కూడా తలదూర్చి వివరాలు అడగసాగింది. అప్పుడు ఐబి (ఇంటెలిజెన్స్‌ బ్యూరో) వాళ్లు రంగంలోకి దిగారు. ఆమె దేశద్రోహానికి తిరుగులేని సాక్ష్యం సంపాదిద్దామనుకుని ఓ అబద్ధపు సమాచారాన్ని ఆమె ఒక్కదానికే చెప్పారు. ఆమె దాన్ని నమ్మి తన ప్రియుడికి చెప్పడం, వాడు పాకిస్తానీ అధికారులకు చెప్పడం, అక్కణ్నుంచి మన గూఢచారుల ద్వారా మనకు తిరిగి చేరడం వరుసగా జరిగిపోయాయి. ఈమె గూఢచారి అని తేలిపోయింది. వేరే కారణంపై దిల్లీ రప్పించి అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌లో ఒంటరి యువతులను పోస్ట్‌ చేయకూడదని ప్రభుత్వంలో రూలు వున్నా ఈమె విషయంలో అది ఉల్లంఘించడానికి కారణం జమ్మూ కశ్మీర్‌లోని ఓ జంట చేసిన సిఫార్సు అనీ వార్తలు వచ్చాయి. ఈమె వయసు పెద్దది కాబట్టి ఫరవాలేదను కున్నారేమో. కానీ ఇలాటి వ్యవహారాలకు వయసు అడ్డు రాదని ఆమె నిరూపించింది. ఇటీవల ఐఎస్‌ఐ చేస్తున్న హనీట్రాపింగ్ గురించిన బయటకు వచ్చిన కథనాలలో కూడా అక్కచెల్లెళ్ల కథ ఒకటి వుంది కానీ చాలా భాగం మగవాళ్ల గురించే! మాధురి విషయానికి, వీటికీ తేడా ఏమిటంటే, మాధురికి అవతలివాళ్లెవరో స్పష్టంగా తెలుసు. వీళ్లకి తెలియదు. మాధురి శారీరకంగా యిన్‌వాల్వ్ అయింది. వీళ్లు రసవత్తరమైన మాటలతోనే ఉచ్చులో పడ్డారు. తాము చెప్పేవి చిన్నచిన్న విషయాలే కదా అనుకున్నారు.

ప్రతి దేశమూ గూఢచర్యం కోసం అనేక మార్గాలను ఉపయోగిస్తూ వుంటుంది. డబ్బు, అమ్మాయిలు, బ్లాక్‌మెయిల్, సాయం చేస్తాననే ఆఫర్లు.. యిలా! రష్యా అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోకండి అని యుఎస్ మిలటరీ తన ఉద్యోగులను తరచుగా హెచ్చరిస్తూ వుంటుంది. ఇటీవల చైనావాళ్లతో కూడా వద్దని చెప్తోంది. చైనా వాళ్లు తమ విద్యార్థులను తైవాన్ వాళ్లకు దూరంగా వుండండి అని హెచ్చరిస్తోంది. ఇలా వల విసరడానికి, వలలో పడడానికీ మన దేశమూ మినహాయింపు కాదు. లేకపోతే దేశభద్రత కాపాడుకోవడం, అవసరమైతే యితర దేశాలను లొంగదీసుకోవడం సాధ్యం కాదు. మన దేశం విసిరే వలల గురించి మన మీడియాలో రాదు కాబట్టి మన మీడియాలో వచ్చే ఐఎస్ఐ కథనాలే ముచ్చటించుకోగలం. ఇండియా పాకిస్తాన్‌ల మధ్య వచ్చిన చిక్కేమిటంటే పోలికల బట్టి ఎవరు ఇండియనో, ఎవరు పాకిస్తానీయో తెలుసుకోవడం కష్టం.

పుణెలో ఉన్న సదరన్ కమాండ్‌కు చెందిన మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) సేకరించిన సమాచారం ప్రకారం ఐఎస్ఐ కొందర్ని పిఐఓ (పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్)లుగా తయారు చేయడానికి కోటి రూ.లు బజెట్ కేటాయించింది. రావల్పిండి లోని యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ‘మిలటరీ వారి మీడియా హౌస్’ వారి సోషల్ మీడియా స్పెషలిస్టు పోస్టుకి ఇంగ్లీషులో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వున్న యువతులు అప్లయి చేయవచ్చును’ అని వాళ్లు 2019లో యిచ్చిన యాడ్ ఎంఐ దృష్టికి వచ్చింది. ఇదే ఐఎస్ఐ వారి ‘ఆపరేషన్ హైదరాబాద్’ అనే ప్రాజెక్టుకి ప్రారంభంట. హైదరాబాదంటే మనది కాదు, సింధ్‌లో వున్న హైదరాబాద్. ఈ పిఐఓలను భారతీయ హిందూ స్త్రీలుగా భ్రమింపచేసే ప్రాజెక్టు కాబట్టి ఆ పేరు పెట్టారేమో.

భారత్, పాక్ సరిహద్దుల్లో వున్న ప్రాంతాల స్త్రీలు చూడడానికి ఉత్తర భారతీయుల్లాగానే వుంటారు. ఉర్దూ, పంజాబీ ఉచ్చారణలో కాస్త తేడా వుంటుంది కాబట్టి భారతీయ యాసను వాళ్లకు నేర్పించారు. దానితో పాటు చక్కటి హిందీ కూడా. హిందువుల కట్టుబొట్టూ నేర్పించారు. చీర కట్టించి, బొట్టు పెట్టించి, చేతికి కాశీతాడు వంటి రంగుల తాళ్లు (కలవా అంటారు) కట్టించి, వెనక్కాల గాంధీ, యితర జాతీయ నాయకులు, భారత జాతీయపతాకం సెట్టింగు పెట్టి ఫోటోలు తీయించి, వాటిని డిపిలుగా పెట్టి వాట్సాప్, ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ తయారు చేయించారు. కొంతమంది భారత మిలటరీ యూనిఫాంలలో ఫోటోలు తీయించుకుని డిపిలు పెట్టుకున్నారు, కొందరు డిఫెన్స్ సంస్థల లోగోలను తమ దుస్తులపైనో, గోడల మీదో పెట్టుకున్నారు.

కొందరు చిన్న స్థాయి మిలటరీ ఉద్యోగులను, కొందరు సివిలియన్స్‌ను కాంటాక్ట్ చేసి తాము మిలటరీ నర్శింగ్ సర్వీసులో ఉద్యోగులమని, లేదా మరో చిన్న ఉద్యోగస్తులమని, మిలటరీ ఉన్నతాధికారుల బంధువులమని, మిలటరీ సర్వీసుపై రిసెర్చి చేస్తున్నామని రకరకాలుగా చెప్పుకుంటారు వీళ్లు. మామూలు మాటలు మాట్లాడుతూ, ఉద్యోగ విషయాలు, యింటి విషయాలు షేర్ చేసుకుంటూ (వాళ్లు చెప్పేది అబద్ధమే, కానీ వీళ్లు నిజాలు చెప్పేస్తారుగా), స్నేహం పెంచుకుంటూ, ఏదైనా ఆర్థికంగా యిబ్బంది వున్నపుడు వాళ్ల ఖాతాలలో మారుపేర్లతో తెరిచిన భారతీయ బ్యాంకు ఎక్కవుంట్ల నుంచి, కొద్దికొద్దిగా డబ్బు వేస్తూ నమ్మకాన్ని సంపాదిస్తారు. వాళ్ల పేరు మీద సిమ్ తీసుకుని పంపమని కోరతారు. ఆ తర్వాత కొద్దికొద్దిగా సరస సంభాషణలోకి దిగుతారు. నగ్నచిత్రాలు పంపుతారు, పంపమంటారు. కవ్విస్తారు. తర్వాత వాటిని రికార్డు చేసి ఉంచుకుంటారు.

మాటలు మాట్లాడుతున్నట్లే సైన్యం కదలికల గురించి, మిలటరీ స్థావరాల లోపల వున్న సామగ్రి గురించి సమాచారం అడుగుతారు. అడిగినపుడు కాస్త డబ్బు పంపుతూంటారు. లాప్‌టాప్‌లు, ఐఫోన్లు బహుమతిగా యిస్తారు. తాము ఇన్‌ఫార్మర్లగా మారిపోయామన్న అనుమానం తగిలిన కొందరు కొంతకాలానికి అనుమానం వచ్చి మధ్యలో మానేస్తానని అంటే పాత సెక్స్ చాట్ రికార్డింగులు బయటకు లాగి, బ్లాక్‌మెయిలు చేస్తారు. ఇదీ వాళ్ల ఆపరేటింగ్ ప్రొసీజర్. ఒక పిఐఓ రోజుకి 50 మందిని హేండిల్ చేస్తుందట. సమాచారం యిచ్చేవాళ్లు కొద్దికొద్దిగా సమాచారం యిచ్చినా, మొత్తమంతా కలిపి చూస్తే వాళ్లకు మన సైన్యం గురించిన సమగ్రస్వరూపం తెలుస్తుంది. కొందరు పిఐఓలు మిలటరీ అధికారులతో కమ్యూనికేట్‌ చేస్తూ వాళ్ల ఫోన్‌లలో మాల్‌వేర్ చేరేట్లు చేశారు. దాని ద్వారా వాళ్ల ఫోన్లో వున్న సమాచారం మొత్తం హస్తగతం చేసుకున్నారు.

గత ఏడాదిగా పట్టుబడిన యిలాటి కేసుల సంఖ్య 200. కొన్ని కేసుల సంగతి చెపితే విషయమేమిటో బోధపడుతుంది. పాయల్ శర్మ అనే ఆమె తను సీనియర్ ఆఫీసరు బంధువునని, ఇండియన్ ఆర్మీపై పిఎచ్‌డి చేస్తున్నానని చెప్పుకుని జవాన్ల నుంచి సమాచారం సేకరించింది. సిద్రా ఖాన్ అనే 20 ఏళ్ల పిఐఓ 2020 జూన్ ప్రాంతంలో ఫిరోజ్‌పూర్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ ఐటీ సెల్ ఉద్యోగి కునాల్ కుమార్ బారియాను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుంది. క్రమేపీ చాటింగులోకి, ఫోన్ సెక్స్‌లోకి దింపి, ఫిరోజ్‌పూర్‌ కంటోన్మెంటులో సైన్యం కదలికలు ఎలా వున్నాయో సమాచారం సేకరిస్తూ పోయింది. రూ.10 వేలు డబ్బు పంపింది కూడా. దీన్ని కనిపెట్టిన ఎంఐవారు సమాచారం అందివ్వడంతో, అక్టోబరు 23న పంజాబ్ పోలీసు శాఖ వారి స్పెషల్ ఆపరేషన్ సెల్ ఉద్యోగులు అమృతసర్ నుంచి ఫిరోజ్‌పూర్ వచ్చి బారియాను అరెస్టు చేశారు.

రాజస్థాన్‌లోని నర్హర్ ఊరిలో సందీప్ కుమార్ అనే గ్యాస్ ఏజంటున్నాడు. అతను ఝున్‌ఝున్‌లోని ఆర్మీ కాంప్‌కు గాస్ సిలిండర్లు సప్లయి చేస్తాడు. అతన్ని పూజా రాజపుట్ పేరుతో వ్యవహరించే పిఐఓ ట్రాప్ చేసింది. తను జయపూర్ వాసినని చెప్పుకుంది. ఆర్మీ క్యాంపులో కీలకమైన ప్రాంతాలు ఫోటో తీసి పంపితే రూ.5 లక్షలిస్తానంది. ఇదంతా సరదాకే చేస్తున్నానంది. ఇతను ఫోటోలు పంపించి, డబ్బు పుచ్చుకున్నాడు. సెప్టెంబరులో అరెస్టయ్యాడు. ఇలా పిఐఓలు ఆర్మీ క్యాంపుల్లోని సైనికుల సంఖ్య, వాళ్ల వాళ్లు వాడే వాహనాలు ఎన్ని, ఏ కంపెనీవి, ఏ దారుల్లో తరచుగా వెళ్తూ వుంటారు యిలా అన్నీ అడుగుతారు. కొందరు అతి సెన్సిటివ్ సమాచారం కూడా యీ మార్గంలో సేకరిస్తారు. ఇండో-రష్యన్ జాయింటు వెంచరైనా బ్రహ్మో ఏరోస్పేస్‌లో భారతసైన్యానికి సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సయిల్స్ తయారు చేస్తారు. అక్కడ ఇంజనియర్‌గా పనిచేసే నిశాంత్ అగర్వాల్‌ను ‘నీహా శర్మ’, ‘పూజా రంజన్’ అనే పిఐఓలు ట్రాప్ చేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. నిశాంత్ ప్రస్తుతం నాగపూర్ జైల్లో వున్నాడు.

ఈ నీహా శర్మ పేరు పెట్టుకున్న అమ్మాయిది రావల్పిండి. ‘జస్మీత్ కౌర్’ది కూడా అదే ఊరు. ‘సోనియా పటేల్’, ‘ఇషాంకా ఆహిర్’, ‘పాయల్ శర్మ’, ‘అంకితా కౌర్’ ‘పూజా రంజన్’ పేర్లున్న అమ్మాయిల అసలు ఊరు లాహోర్. ఈ పేర్లు వీళ్లకు శాశ్వతం కాదు. ప్రొఫైల్ ఫోటో అదే ఉంచి, పేర్లు మార్చేస్తూంటారు. ఆ విధంగా కొందరికి ఇషాంకా ఆహిర్‌గా వున్న అమ్మాయి మరి కొందరికి నవ్యా చోప్డా, యింకొందరికి మానసీ దీక్షిత్ అయిపోతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం కనబడడంతో ఐఎస్‌ఐ పాకిస్తాన్ నుంచే కాదు, బంగ్లాదేశ్, ఇరాన్ దేశాల అమ్మాయిలను కూడా రిక్రూట్ చేసుకుంటోంది. ఎంఐ వాళ్లు యిదంతా గమనించి హెచ్చరించడంతో, ఇండియన్ ఆర్మీ తన ఉద్యోగస్తులకు సోషల్ మీడియా ఉపయోగించరాదని 2020లో ఆదేశాలిచ్చింది. అయినా కొందరు ఉల్లంఘించి చిక్కుల్లో పడుతున్నారు. వీళ్లను కనిపెట్టడానికి ఎంఐ వాళ్లు ‘మాయాజాల్’ పేరుతో తన ఉద్యోగుల సోషల్ మీడియా యాక్టివిటీలపై నిఘా వేసింది.

ఒక ఆర్మీ జవాన్‌ను ‘సోనియా పటేల్’ అనే పిఐఓ ట్రాప్ చేసింది. పరిచయం పెంచుకుని, ఆ తర్వాత కొన్నాళ్లకు సెక్స్ చాట్‌లోకి దింపింది. ‘నువ్వు ఒక ఆడదాన్ని తృప్తి పరచగలవని నిరూపించడానికి, మీ ఆవిడతో సెక్స్ చేస్తూండగా ఆ వీడియో రికార్డు చేసి పంపించు’ అని కోరింది. ఈ మహానుభావుడు అలాగే చేశాడు. ఇక అప్పణ్నుంచి ఆమె నేనడిగిన సమాచారం యివ్వకపోతే యీ వీడియోను వైరల్ చేస్తాను అని బెదిరించింది. ఆర్మీ ట్రూపుల కదలికలు, ఏ షిఫ్టులో ఎంతమంది వుంటారో ఆ వివరాలు అన్నీ రాబట్టింది. ఇదంతా మాయాజాల్ కంటపడింది. ముంబయి పోలీసుల ద్వారా అరెస్టు చేయించారు. కథంతా బయటకు వచ్చింది. ‘జవాన్లు స్మార్ట్ ఫోన్లు వాడకూడదని నిషేధించలేం. ఎందుకంటే వాళ్లు ఫ్యామిలీతో టచ్‌లో వుండాలి. అందువలన సైబర్ క్రైమ్ పాలిట పడకుండా రక్షించుకోవాలంటే ఏం చేయవచ్చో, ఏది చేయకూడదో 15 సూత్రాలు వారికి చెప్పాం.’ అన్నాడు ఓ అధికారి.

జవాన్లు జాగ్రత్తగా వుంటూండడం గమనించి ఐఎస్ఐ వాళ్లు రాజస్థాన్‌లోని బార్మర్‌లో బట్టల వ్యాపారం చేసుకునే జితేందర్ సింగ్ అనే అతన్ని హనీట్రాప్‌లో పడేశారు. అతను ఆర్మీ ఆఫీసరులా దుస్తులు వేసుకుని ఆర్మీ క్యాపుల్లో తిరుగుతూ సమాచారం సేకరించి పాకిస్తానీలకు పంపుతున్నాడు. అతను ఈ సెప్టెంబరులో పట్టుబడ్డాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చండీపూర్ దగ్గర డిఆర్‌డిఓ వారి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వుంది. అక్కడ పనిచేసే నలుగురు కాంట్రాక్టు వర్కర్లను పిఐఓలు హనీట్రాప్ చేసి సమాచారం సేకరించారు. అది బయటకు వచ్చి సెప్టెంబరులో ఒడిశా పోలీసు యీ వర్కర్లను అరెస్టు చేశారు. ఇప్పటిదాకా మగవాళ్ల గురించి చెప్పాను. ఆడవాళ్లూ యిరుక్కున్న సందర్భాలున్నాయి.

ఇండోర్ జిల్లాలోని ఇండియన్ ఇన్‌ఫాన్ట్రీకి సంబంధించిన ఆఫీసులెన్నో వున్న మహౌ పట్టణంలో యిద్దరు అక్కచెల్లెళ్లను సైబర్ నిపుణులు అనుమానించారు. మగ పిఐఓ ఒకడు సోషల్ మీడియా ద్వారా తనను పాకిస్తానీ పౌరుడిగా పరిచయం చేసుకుని అక్కగార్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాళ్లను కంటోన్మెంటుగా సంబంధించిన వివరాలు అడిగాడు. వీళ్ల బంధువొకడు కంటోన్మెంటులో డైలీ లేబరుగా పనిచేస్తూ వుంటాడు. అతని ద్వారా సమాచారం సేకరించి పంపేది యీ అమ్మాయి. అక్క ఓ పవర్ కంపెనీలో కంప్యూటరుగా ఆపరేటరుగా పని చేస్తుంది, చెల్లెలు స్కూలు టీచరు. తండ్రి పోయాడు. ఇద్దరికీ స్థానికంగా వున్న ఆర్మీ ఆఫీసర్లతో స్నేహాలున్నాయి. వాళ్ల ద్వారా కూడా కొంత సేకరించారు. చెల్లెలు టూవీలర్ వేసుకుని ఆర్మీ కాంపౌండు పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు తీసి పంపింది.

ఈ మేలో ఎంఐ వాళ్లకు పట్టుబడగానే ఈ సోదరీమణులు తమ ఫోన్లలోంచి సమాచారాన్నంతా డిలీట్ చేసేశారు. ఇప్పుడు దాన్ని రిట్రీవ్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఐఎస్ఐ యిలా మన పౌరులను, మిలటరీ ఉద్యోగులను లొంగదీసుకోవడంలో విజయాలు సాధిస్తూ, దిల్లీలోని ఆర్మీ కెప్టెన్ శేఖర్‌పై కూడా వల విసిరింది. అతని వయసు 40. సరసమాడతాడే గానీ సమాచారం యివ్వటం లేదని వాళ్లు విసుక్కుంటున్నారు. ఎంఐ వాళ్లు పిఐఓలను గుర్తించి, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారాని ఆచూకీ తీయడంలో యితను దొరికాడు. ఇతని పని పడదామని మనవాళ్లు వెళ్లి అదుపులో తీసుకుంటే తెలిసిందేమిటంటే అతని పేరు దిలీప్ కుమార్. ఓ చిన్న వ్యాపారి. అమ్మాయిలను యింప్రెస్ చేసి, బుట్టలో పెడదామని ఆర్మీ యూనిఫాం వేసుకుని కెప్టెన్ శేఖర్‌గా పోజు కొట్టుకుంటూ తిరుగుతూంటే నిజమైన ఆర్మీ ఆఫీసరేమోనని ఐఎస్ఐ బోల్తా పడింది. టైమంతా దండగ అని వాళ్లు విసుక్కుని వుంటారు. దిల్లీ గ్రేటర్ కైలాస్ పోలీసులు యితన్ని అరెస్టు చేశారు.

-  ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2021)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి