Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : అందరూ ఇంజనీర్లే!

ఇవాళ తెలంగాణ బంద్‌. అధికారపార్టీ స్పాన్సర్‌ చేసే బంద్‌లు యింకా ఎన్ని జరుగుతాయో తెలియదు. పరిశ్రమలు పెట్టేవారికి కోసం ఎఱ్ఱ తివాచీ పరుస్తాం అంటూ యిలా ఎఱ్ఱ జండాలు పట్టుకుని వూపితే ఎవరొస్తారు? తెలంగాణ ఉద్యమధాటికి చాలా ఐటీ కంపెనీలు హైదరాబాదులో కొత్త ఆఫీసులు పెట్టడం మానేశాయి. ఉన్నవాటిని తరలించిన సందర్భాలూ వున్నాయి. తెలంగాణ సమస్య ఓ కొలిక్కి వచ్చింది కాబట్టి యిక బంద్‌లు, నిరసనలు వుండవనుకోవడం పొరబాటులా వుంది. పోలవరం, కృష్ణా జలాలు, మెట్రో అండర్‌గ్రౌండ్‌, విద్యుత్‌ పంపిణీ, ఉద్యోగుల ఆప్షన్లు, బజెట్‌లో ఏమీ ఎలాట్‌ చేయకపోవడం... యిలా ఏదో ఒక సమస్య వస్తూనే వుంటుంది. ఎవరో ఒకరు లేవనెత్తుతూనే వుంటారు. మాటిమాటికీ బంద్‌ అంటే ఎలా? సామాన్యులకు ఆ రోజు ఉపాధి పోయినట్లే కదా! శాంతి వున్నచోటే అభివృద్ధి వుంటుంది. సకలజనులకు అభివృద్ధి జరిగితేనే శాంతి నెలకొంటుంది. రెండూ పరస్పరాశ్రితాలు. పోలవరం ఆర్డినెన్సును బిల్లుగా చేయడం గురించి యివాళ బంద్‌ చేశారు. ఏం సాధించినట్లు? బిల్లు వెనక్కి తీసుకుంటారా? తీసుకునేవరకు ఆందోళన చేస్తాం అని టీవీ కెమెరాల ముందు ప్రతిజ్ఞలు చేయడం సులభమే. గట్టిగా వారం రోజులు స్కూళ్లు మూస్తే తలితండ్రులు పట్టుకుని ఉతుకుతారు. బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ ఎలాగూ వేస్తారట. మరి యింకేం! మధ్యలో యీ బంద్‌ ఎందుకు? 

కేంద్రం మూకబలంతో విభజన బిల్లుకు సవరణను తననుకున్న విధంగా చేసింది అంటున్నారు కెసియార్‌. నూటికి నూరు శాతం కరక్టు. అసలు విభజన బిల్లు కూడా అదే తీరుగా జరిగింది కదా. టీవీ కెమెరాలు ఆపేసి, ఎంపీలను చావగొట్టి చెవులు మూసి మరీ పాస్‌ చేశారు. దానికి కొనసాగింపే యిది. అప్పుడూ కాంగ్రెస్‌, బిజెపి చేతులు కలిపాయి. ఇప్పుడూ కలిపాయి. ఆ రోజు అభ్యంతరం పెట్టని తెరాస, తెలంగాణ ఎంపీలు ఈ రోజు ఎలా పెట్టగలరు? ఆ రోజు స్పీకరుదే సర్వాధికారం అన్నారు. ఈ నాటి స్పీకరూ అదే చేశారు. కాదనడం ఎలా? తాత్కాలిక ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం సంప్రదాయాలు మన్నించకపోతే  యిలాటి అనర్థాలే జరుగుతాయి. పోలవరంపై చర్చ జరుపుదామంటే సభ్యులు గొడవ చేస్తున్నారు అందుకని మూజువాణీ ఓటుతో ఆమోదించేశా అన్నారు స్పీకరు. ఖేల్‌ ఖతమ్‌! కోర్టులో ఏమవుతుందో తెలియదు. విభజన బిల్లు విషయంలో చూడండి, ముందుగా వెళితే 'ఇప్పుడు సమయం కాదు' అంటూ వాయిదా వేస్తూ పోయారు. విభజన తర్వాత వెళితే రాజ్యాంగ కమిటీకి నివేదించాలా వద్దా అని ఆలోచిస్తున్నాం అంటూ తాత్సారం చేస్తున్నారు. అంతా అయిపోయాక యిక చేసేదేముంది? ఈ సవరణ విషయంలో కూడా యిదే ముచ్చట జరగవచ్చేమో! కాదు, ఆర్టికల్‌ 3 ద్వారా చేయాలి అంటే అదెంతసేపు అంటాయి బిజెపి, కాంగ్రెసు! శకుని పాత్రలో జీవించిన జయపాల్‌ రెడ్డిగారు 'ఇది రాజ్యాంగవిరుద్ధం, మెజారిటీ వుంది కదాని ఆర్టికల్‌ 3 ద్వారా చేయబోతే అన్యాయం' అంటూ వాపోతున్నారు. తెలంగాణ బిల్లు విషయాలన్నీ కూలంకషంగా తెలిసిన ఆయనకు తమ అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ రాజ్యసభలో యిచ్చిన హామీ తెలియదా? రెండు నాలుకల ధోరణి అంటే యిదే!

ఇవాళ టీవీ చర్చలు వినివిని విసుగెత్తిపోయింది. ప్రతీవాడూ 'మేం ప్రాజెక్టు కట్టడానికి వ్యతిరేకం కాదు, కానీ డిజైన్‌ మార్చమంటున్నాం' అనేవాడే. ఎత్తు తగ్గిస్తే సరి, మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. ఎత్తు తగ్గిస్తే ప్రయోజనం సిద్ధించదని అవతలివాళ్లు అంటున్నారు. అసలు డిజైన్‌ గురించి మాట్లాడడానికి వీళ్లంతా ఇంజనీర్లా? వీళ్ల కెవరికైనా సాంకేతిక పరిజ్ఞానం వుందా? ఇది యిప్పుడు ఆమోదించిన డిజైనా? థాబ్దాల క్రితమే అనేకమంది నిపుణులు చర్చించి, తర్జనభర్జనలు పడి, నిర్ధారించిన డిజైన్‌. 1980లో అంజయ్యగారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు. ప్రాంతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదిది. జాతీయస్థాయిలో నిపుణులు వేసిన లెక్కలు వేస్తే టెండర్లు పిలిచారు. పనులు ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ నిపుణుల్ని నియమించి పునఃపరిశీలన చేయించాలని తెలంగాణ ఎంపీల డిమాండ్‌. ఎందుకట? తెలంగాణ ఏర్పడిందనా? అదే గోదావరి, అవే నీళ్లు, అదే ప్రాజెక్టు, అదే ఎత్తు. పాత డిజైన్‌ మారిస్తే మళ్లీ చర్చించాలి తప్ప, ఎప్పుడో ఆమోదించిన డిజైన్‌ గురించి మళ్లీ మళ్లీ చర్చలా? ఇదే కాదు, మెట్రో డిజైన్‌ మార్చాలి అంటారు. ప్రభుత్వం మారినప్పుడల్లా డిజైన్‌ మారుస్తూ పోతే కాంట్రాక్టు తీసుకున్నవాడు అడుక్కు తినాలి. పోలవరం ఎత్తు ఎంత పెడితే ఏం లాభం, ఏం నష్టం అనే సాంకేతిక విషయాలపై నాకైతే పెద్దగా అవగాహన లేదు. నా అనుమానం - యివాళ బంద్‌కు నాయకత్వం వహించి, టీవీ చర్చల్లో గొంతు చించుకున్నవారిలో నూటికి 90 మంది నా బోటి వాళ్లే. 'డిజైన్‌ మార్చాలా? ఎలా మార్చాలి? బొమ్మేసి చూపించు' అని టీవీ యాంకర్‌ ప్రశ్న వేస్తే గుటకలు మింగాల్సిందే. 

డిజైన్‌ గోలతో బాటు, ఆదివాసీల గురించి వాపోవడం ఒకటి చిర్రెత్తించింది. ఎంతమంది ప్రభావితం అవుతారో తెలియదు, కొందరు రెండు లక్షల మంది అన్నారు, నా బోటి అజ్ఞానులు ఎందుకైనా మంచిదని 'లక్షలాది...' అన్నారు. ఏడు మండలాలలో జనాభా 1.90 లక్షలట. వారిలో కొందరి యిళ్లేగా మునిగేవి. (45 వేల కుటుంబాలని ఓ లెక్క వుంది) మరి రెండు లక్షలెలా అయింది? ఆదివాసీల గురించి యింత వాపోతున్న వీరిలో వారి శ్రేయస్సు గురించి పనిచేసిన వారెంతమంది చెప్పండి. వీళ్లు ఏదైనా చేసి వుంటే అక్కడ వారి శ్రమ దోపిడీ చేసిన భూస్వాములు ఎలా వుంటారు? వారిని రెచ్చగొట్టే నక్సలైట్లు, తీవ్రవాదులు ఎలా చేరతారు? మేధావులను పట్టుకుని 'మీరు వాళ్ల గురించి అంత బాధపడుతున్నారు కదా, పదండి ఏజన్సీ ప్రాంతానికి బదిలీ చేస్తాను' అంటే అమ్మో అంటారు. ఎందుకు అంటే అక్కడ వసతులు లేవు, ఆస్పత్రులు లేవు, రోడ్లు లేవు, మంచి నీరు లేదు అంటూ ఏకరువు పెడతారు. అందుకే కదా, వాళ్లకు పునారావసం కల్పించి యివన్నీ ఏర్పాటు చేస్తాం అంటూంటే 'అబ్బే అది వాళ్ల సంస్కృతిని ధ్వంసం చేయడమే' అంటూ కన్నీరు ఒలకపోస్తారు. వాళ్లకు విద్య, వైద్యం అక్కరలేదా? ఎప్పుడూ చిన్న గుడ్డలు కట్టుకుని టూరిస్టుల వినోదం కోసం, డాక్యుమెంటరీల కోసం,  గ్రూపు డాన్సులు చేస్తూ వుండాలా? కాలండర్‌ బొమ్మలకు మోడల్స్‌గా వుండేందుకు వాళ్ల ఆడాళ్లు జాకెట్లు వేసుకోకూడదా? వాళ్లు మారరు, మారకూడదు అని తీర్మానించడానికి మీరెవరు? వాళ్లు సెల్‌ఫోన్లు వుపయోగించడం లేదా? సినిమాలు చూడడం లేదా? పాంట్లు కట్టుకోవడం లేదా? అయినా లోకంలోని గిరిజనులంతా అక్కడే వున్నారా? అంత ప్రేమ వుంటే వేరే చోట ఉద్ధరించండి, ఎవరు కాదన్నారు? గిరిజనులకు ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఎన్నో వార్తలు వస్తూ వుంటాయి. వాటిపై ఉద్యమించండి, ఆ వూళ్లోకి వెళ్లి బంద్‌లు చేయండి. 

వాళ్ల పునరావాసం సరిగ్గా జరగదేమోనని మా అనుమానం అంటారు కమ్యూనిస్టులు. ఈరోజు ఉద్యమంలో వారిదే పెద్ద పాత్ర. గులాబీ జండాల కంటె ఎఱ్ఱ జండాలే ఎక్కువ రెపరెపలాడాయి. ఎన్నికలలో శృంగభంగమయ్యాక వాళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మేం యింకా బతికున్నాం అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి పట్టుకుని వేళ్లాడాలి. ఇవాళ దీని గురించి చేశారు కాబట్టి గులాబీదళం వారు చేతులు కలిపారు. రేపు తెరాస ప్రభుత్వం 'పారిశ్రామిక వేత్తలకై సెజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం, ఐటీ కంపెనీలకు ఎకరాలు యివ్వడానికి బంజరు భూమి యిచ్చాం, హైదరాబాదును సుందరంగా చేయడానికి కొన్ని చోట్ల గుడిసెలు తీసేశాం, వాళ్లందరికీ  వేరే చోట పునరావాసం కల్పిస్తాం' అంటుంది. వెంటనే లెఫ్టిస్టులు జండాలతో బయలుదేరతారు. అప్పుడు తెరాస కార్యకర్తలు, పోలీసులు వాళ్లకు అడ్డుపడతారు. ప్రగతి జరగాలంటే కొందరికి యిబ్బంది తప్పదు. వారికి నష్టపరిహారం యివ్వాలి. ఇస్తానని హామీలిచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చకపోతే ఆందోళన చేయాలి తప్ప ముందునుండే మీరు చేయరు, మాకు తెలుసు అంటూ అల్లరి చేస్తే ఎలా? 'ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో వుండిపోవడానికి ఎన్ని దొంగవేషాలైనా వేస్తారు, వాళ్లను ఎలాగైనా తరిమేయాలి' అంటూ వచ్చారు తెలంగాణ ఉద్యోగసంఘ నాయకులు. ఆంధ్రలో 60 ఏళ్ల రిటైర్‌మెంట్‌ అనగానే  ప్లేటు తిరగబడింది. తెలంగాణ ఉద్యోగులే అటు వెళ్లడానికి ఎగబడుతున్నారు. రేపు ఆంధ్రప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు అద్భుతమైన ప్యాకేజి ప్రకటించిందనుకోండి, ఆ గిరిజనులు '..అయితే ఓఖే' అనేస్తారు. ఇవాళ్టి బందుదారులు ఎవరైనా అప్పుడు అడ్డుపడితే తోసి అవతల పడేస్తారు. ఇప్పటికైనా గిరిజనులపై మొసలి కన్నీరు కార్చడం ఆపి, తమ రాష్ట్రంలో మిగిలిన గిరిజనుల జీవితాలను బాగు చేస్తే, అప్పుడు పోలవరం నిర్వాసితులు ఆంధ్ర వదలి, తెలంగాణ రాష్ట్రానికే వచ్చి సెటిల్‌ అవుతారు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2014)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?