ఎమ్బీయస్‌: సినీమూలం – అల్లరి ప్రియుడు – 1/2

1993 నాటి ''అల్లరి ప్రియుడు''కి మూలం అంతకు రెండేళ్ల క్రితం 1991లో రిలీజైన హిందీ సినిమా ''సాజన్‌''. హిందీ సినిమాలో ఒకమ్మాయిని యిద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. వారిలో ఒకరు ఆ అమ్మాయి మెచ్చిన కవి.…

1993 నాటి ''అల్లరి ప్రియుడు''కి మూలం అంతకు రెండేళ్ల క్రితం 1991లో రిలీజైన హిందీ సినిమా ''సాజన్‌''. హిందీ సినిమాలో ఒకమ్మాయిని యిద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. వారిలో ఒకరు ఆ అమ్మాయి మెచ్చిన కవి. అయితే ఆ కవి తన స్నేహితుడికోసం త్యాగం చేసి తన ఫ్రెండే ఆ కవి అని చెప్తాడు. తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ఒకబ్బాయి, యిద్దరమ్మాయిల కథ చేశారు. అమ్మాయిల్లో ఒకరు కవయిత్రి. తన స్నేహితురాలికోసం త్యాగం చేసింది. హిందీలో సెంటిమెంటల్‌ మ్యూజికల్‌ సినిమాగా తీస్తే తెలుగులోకి వచ్చేసరికి తెలుగువాళ్లకు తగ్గట్టుగా బోల్డంత హాస్యం పెట్టి, ఫైటింగులు పెట్టి, డాన్సులు పెట్టి ఫక్తు కమ్మర్షియల్‌ సినిమాగా తయారు చేసేశారు. 

ఒక స్కూల్లో కుంటి అనాథబాలుణ్ని అందరూ కలిసి ఏడిపిస్తూంటే హిందీ సినిమా ప్రారంభమయ్యింది. అతన్ని ఒక స్కూల్‌మేట్‌ సోదరుళ్లా ఆదుకున్నాడు. ఇంటికి తీసుకెళితే అతని అమ్మా, నాన్నా కూడా యితని సొంతకొడుకులా ఆదరించారు. పెంచి పెద్దవాణ్ని చేశారు. అనాథబ్బాయి పేరు అమన్‌ (సంజయ్‌ దత్‌). బుద్ధిమంతుడు. బాగా చదువుకున్నాడు. డబ్బున్నబ్బాయి పేరు ఆకాశ్‌ వర్మ (సల్మాన్‌ ఖాన్‌). మంచివాడే కానీ అల్లరిచిల్లరిగా తిరగడం అతని అలవాటు. చిన్నప్పటినుండీ అమ్మాయిల పిచ్చి. వీళ్ల కాలేజీ చదువులు పూర్తవగానే పెద్దాయన తీసుకెళ్లి బిజినెస్‌లో పెట్టాడు. అనాథ కుర్రవాడైన సంజయ్‌కు తన యింటిపేరు యిచ్చి ఎనౌన్సు చేశాడు. బిజినెస్‌ వ్యవహారాలు మొత్తం చూసుకోమన్నాడు. సల్మాన్‌్‌ను కూడా బిజినెస్‌లో వుండమన్నాడు కానీ అతనికి అమ్మాయిలతో రాసలీలల పనులు చాలా వున్నాయి.  పార్టీలకు రమ్మనమని తన ఫ్రెండ్‌ను సంజయ్‌ను అడుగుతూంటాడు. కానీ అతను రాడు. నిద్ర వస్తోందని సాకు చెప్పి పుస్తకాలు చదువుకుంటూంటాడు. అంతేకాదు, ఎవరికీ తెలియకుండా కవిత్వం రాస్తూ వుంటాడు. కనీసం తన బెస్ట్‌ ఫ్రెండ్‌కు కూడా చెప్పకపోవడమే తర్వాత తర్వాత కొంపముంచుతుంది. 

మేనక అనే సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మీ స్నేహితుడు సంజయ్‌ని వలలో వేసుకుని చూపిస్తాను చూడు అని అతనితో ఛాలెంజ్‌ చేసింది. మా వాడికి అమ్మాయిల ధ్యాస లేదని యితను పందెం వేశాడు. ఆ అమ్మాయి వచ్చి చొరవ తీసుకోబోతే సంజయ్‌ బయటకు నెట్టేశాడు. దాంతో ఆమెకు అహం పొడుచుకు వచ్చి 'నీలాటి అవిటివాడికి ప్రేమేమిటి?' అని తిట్టిపోసింది. సంజయ్‌ ఫీలయ్యాడు. తన స్నేహితురాలి ప్రవర్తనకు సల్మాన్‌ క్షమాపణ చెప్పాడు. అవి కాదు సంజయ్‌కి వూరట యిచ్చేవి. వేదనాభరితమైన తన కవిత్వమే అతనికి ఉపశాంతి నిస్తుంది. అతని పబ్లిషర్‌ ఓ సారి అడిగాడు – 'రాయల్టీ కూడా అనాథాశ్రమానికి పంపేస్తావు. సాగర్‌ అనే మారుపేరుతో రాస్తావ్‌. ఎందుకిదంతా?' అని. 'నా మనసులో యింత బాధ దాగి వుందని తెలిస్తే నన్ను పెంచిన తలిదండ్రులు బాధపడతారు అందుకని' అంటాడు. ఆ పబ్లిషర్‌ 'నీకో ఫాన్‌ వుంది పూజా అని. ఆమె తన పాడడానికి నిన్ను పాట రాయమని కోరింది' అని ఓ లెటర్‌ చేతి కిచ్చాడు. పూజా (మాధురీ దీక్షిత్‌) ఊటీలో వుంటుంది. ఇతని కవిత్వమంటే పడి ఛస్తుంది. ఇతని గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఓ ఫంక్షన్‌లో తను పాడడానికి ప్రత్యేకంగా పాట రాసి పంపమని అడిగింది. ఇతను పంపాడు. ఆ పాటకు ఆమెకు ప్రశంసలు చాలా వచ్చాయి. ఆమె ఫంక్షన్‌ తాలూకు పేపరు కటింగ్‌ పంపుతూ, తోడుగా సాగర్‌ అని లాకెట్‌ వున్న చెయిన్‌ను గిఫ్ట్‌గా పంపింది. తన ఫోటో  పంపుతూ యితని ఫోటో కూడా పంపమంది. ఆమె ఫోటో చూసి యిష్టపడిన యితను తన ఫోటో పంపబోతూ వుండగా మేనక యీసడించిన మాటలు గుర్తుకు వచ్చాయి. సంకోచపడి ఫోటో పంపకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాడు.

ఇదీ హిందీ సినిమా భూమిక. తెలుగులో ఎలా చూపించారంటే రావు గోపాలరావు ఓ కాంట్రాక్టర్‌. అతని కో కూతురు – మధుబాల. బాల్యంలో ఆమెను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ కూలీవాడు. అతని కూతురు రమ్యకృష్ణ కూడా ఈ అమ్మాయి యీడుదే. ఆ అమ్మాయిని యింటికి తీసుకుని వచ్చి తన కూతురుతో సమానంగా పెంచాడు. వాళ్లిద్దరూ ఒకరికోసం ఒకళ్లు అతి సులభంగా త్యాగాలు చేసేసుకుంటూ వుంటారు. వాళ్లిద్దరూ యుక్తవయసుకి వచ్చారు. రమ్యకృష్ణ పేరు లలిత. మధుబాల పేరు కవిత. పేరుకు కవితే కానీ ఆమెకు కవిత్వం రాదు. అస్తమానూ ఫిడేల్‌ వాయించుకుంటూ తిరుగుతుంది. నిజానికి కవితలు రాసేది లలిత పేరున్న రమ్యకృష్ణ. అయితే కవిత పేర రాసి పంపిస్తూ వుంటుంది, అదీ ఎవరికీ తెలియకుండా. ఒక వంద కవితలు పూర్తయ్యాక పుస్తకం చేసి కవితకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా యిద్దామని ప్లాను. ఆమె కవిత్వానికి ఓ ఫ్యాన్‌ వున్నాడు. అతనే హీరో రాజశేఖర్‌. ఓ పల్లెటూరి నుంచి వుద్యోగానికై పట్నం వచ్చి ఒకడి చేతిలో మోసపోయి పొట్టనింపుకోవడానికి యింకో ఐదుగురితో కలిసి ఫైవ్‌ స్టార్‌ అనే పేర ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ పెట్టుకున్నాడు. ఈమె రాసిన కవితలు చదివి మురిసిపోయి ఉత్తరాలు రాస్తూ వుంటాడు. 

హిందీలో కవి యైన సంజయ్‌కు తన ఫ్యాన్‌ ఎవరో ఎలా వుంటుందో తెలుసు, ఆమె ఎడ్రసు తెలుసు. అయితే హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ బహుశా పబ్లిషర్‌ పేర ఉత్తరాలు రాస్తోంది కాబట్టి ఆమెకు అతని అడ్రసు తెలియదు. తెలుగులో ఇంకాస్త డ్రామా పెంచి, యిద్దరూ ఒకరికొకరు తెలియనట్టు పెట్టారు. మరి ఉత్తరాలు ఎలా చేరుతున్నాయి అంటే కేరాఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ అని చూపించారు. కవయిత్రి రమ్యకృష్ణ పంపిన పాటలతోనే ప్రోగ్రాం యివ్వడానికి హీరో రాజశేఖర్‌, అతని టీము ఓ జీపులో వెళుతున్నారు. అంతలో ఆమే స్వయంగా స్కూటర్‌పై వచ్చి గుద్దేసింది. ఎవరెవరో తెలియదు కదా, భీకరంగా పోట్లాడేసుకున్నారు. ఈ కారణంగానే అతను అల్లరి ప్రియుడు అయ్యాడామెకు. నిజానికి రాజశేఖర్‌కు పోటీగా శ్రీహరిది ఇంకో ట్రూపు వుంది. వీళ్లు వాళ్లను మోసం చేసి ప్రోగ్రాంలు కొట్టేసి, రమ్యకృష్ణ రాసిన పాటలతో ప్రోగ్రాములిచ్చేసి డబ్బు సంపాదించేస్తున్నారు. అయితే ఆ పాటలకు మూలమైన అమ్మాయితో మాత్రం పోట్లాడుతూనే వున్నారు. 

ఇదంతా తెలుగులో మనవాళ్లు పెట్టిందే. హిందీలో హీరో హీరోయిన్లు మరోలా కలిశారు. సంజయ్‌ దత్‌ పెంపుడు తండ్రి ఊటీలో ఓ హోటల్‌ కడదామనుకున్నాడు. ఆ వ్యవహారాలు చూడమని యితన్ని ముందుగానే ఊటీకి పంపించాడు. సల్మాన్‌ ఖాన్‌కు బొంబాయిలో చక్కబెట్టే వ్యవహారాలు – అదే.. అమ్మాయిలతో తిరగడాలు – ఉంటాయి కదా, అందుకని అతను రాలేదు. ఇతను ఊటీకి వచ్చి ఓ గెస్ట్‌హౌస్‌లో దిగాడు. ఊళ్లోకి దిగగానే పుస్తకాల షాపు ఎక్కడని వాకబు చేశాడు. పాప్యులర్‌ బుక్‌ స్టాల్‌ అని వుంది. అక్కడకు వెళ్లి చూస్తే ఆ షాపు మరెవరిదో కాదు, తన ఫ్యాన్‌ పూజాదే. ఆమెకు విధవరాలైన ఓ తల్లి వుంది. డబ్బు పెద్దగా లేదు. ఎవరో పుస్తకాల షాపు అమ్మేస్తూంటే అది కొనుక్కుంది. ఆమెను చూడగానే హీరో ఆమె ఎవరో – ఫోటో చూశాడు కాబట్టి – గుర్తుపట్టాడు. హీరోయిన్‌కి మాత్రం అతను తన అభిమాన రచయిత సాగర్‌ అని తెలియదు.  హీరో కవిత్వం పుస్తకాలు అడిగితే 'సాగర్‌ అనే గొప్ప కవి వున్నాడు. అతని పుస్తకాలు చదవండి' అని రికమెండ్‌ చేసింది. అతనెవరో కోన్‌కిస్కాయ్‌ అన్నట్టు మాట్లాడాడు హీరో. ఆమె కోపం తెచ్చుకుంది. చివరకి 'సర్లే పుస్తకాలు తీసుకుంటాను లెండి' అన్నాడు. ఆమెంటే యితనికి ప్రేమ కలిగింది. పుస్తకాల షాపు ఎదురుగా వున్న టీ కొట్టులో కూచుని ఆమె బొమ్మలు వేయసాగాడు. తనెవరో చెప్పేద్దామా అనుకున్నాడు కానీ అతని అంతరాత్మ వద్దని హెచ్చరిస్తోంది.

టీస్టాలు వాడి ద్వారా యితని గురించి విన్న హీరోయిన్‌ యితన్ని రెడ్‌హేండెడ్‌గా పట్టుకుందామని వచ్చి కూచుంది. ఆమె అక్కడ వుందని గ్రహించిన యితను సాగర్‌ గురించి మెచ్చుకోవడంతో విని ఐసై పోయింది. ఇతను ఆమె ఉత్సాహాన్ని గమనించి అతను సాగర్‌ తనకు తెలుసని చెప్పాడు. పరిచయం చెయ్యవా? అందామె. ఊరు తిప్పి చూపిస్తే… అన్నాడితను. సరే అంది. పోనుపోను ఇతను ఆమెను గాఢంగా ప్రేమించసాగాడు. ఆమె తన నృత్యప్రదర్శనకు పిలిచింది కూడా. ఇతను వెళ్లాడు. తిరిగి వస్తూంటే దార్లో రౌడీలు అడ్డుకున్నారు. ఇతను తన అవిటితనం వలన ఆమెను కాపాడలేకపోయాడు. అప్పుడు పోలీసు వచ్చి తిట్టాడు – నిన్ను నువ్వే కాపాడుకోలేనివాడివి. ఇంకొకర్ని ఏం కాపాడతావు? ఇంత రాత్రి వేళ తిరగడం దేనికి? అని. ఇతను బాధపడ్డాడు.చర్చి కెళ్లి నా వంటి అనాథకు ఒక కాలు లేకుండా కూడా చేశావేం? అని దేవుణ్ని నిందించాడు. అంతలో అతనికి రెండు కాళ్లు లేని వాడు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం చూశాడు. నాకు సమాధానం దొరికింది ప్రభూ అన్నాడు. –  (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]