Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: సినీమూలం - మాంగల్యబలం- 1

జవాబులు - ఇద్దరు మిత్రులు పై చర్చ సందర్భంగా రామాయణ ప్రస్తావన గురించి ఒక పాఠకుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.  'పాతది కాబట్టి అక్కరలేదనుకుంటే వేల సంవత్సరాల నాటి రామాయణం/కురాన్‌/బైబిల్‌/జెండ్‌ అవెస్థా/బుద్ధచరిత్ర మరే యితర మతగ్రంథమైనా సరే వాటి గురించి ప్రసంగాలు, ప్రవచనాలు మానేయాలి' - అని రాస్తున్నాను. నన్ను ఎంతమంది వెతుక్కుంటో వస్తారో గమనించి తెలియపరుస్తాను. ఆ పాఠకుడికి నేను చెప్పిన సందర్భం ఎలా అర్థమైందో నాకు తెలియకుండా వుంది. పాతదాన్ని తృణీకరించకూడదనే నేను రాశాను. ఇక రామాయణ ప్రస్తావన అనవసరం అంటూ మరి కొందరన్నారు. తెలుగు నుడికారం తెలిసినవాళ్లకు తెలుస్తుంది - పాతది అని చెప్పవలసి వచ్చినపుడు ఆదికావ్యం కాబట్టి రామాయణం అని ప్రస్తావిస్తారు. అదే విస్తృతి గురించి చెప్పవలసి వచ్చినపుడు భారతమంత.. అంటారు, లీలల గురించి చెప్పవలసి వస్తే భాగవతం, భాగోతం అంటారు. రామాయణం పట్ల, రాముని పాత్ర పట్ల నాకెంత గౌరవం వుందో ''సీతారామ కల్యాణం'' సినిమా గురించి రాసినప్పుడు చూపుకున్నాను. సినిమా కాలమ్‌లో రామాయణం అని ప్రస్తావించగానే అదేదో హిందూమతానికి నేను ద్రోహం చేసినంత బిల్డప్‌ అనవసరం. పాఠకులలో ఎంతమంది పూర్తి రామాయణం చదివారో ఎవరికి వారు గుండె మీద చెయ్యేసుకుని చెప్పమనండి. పిల్లల బొమ్మల రామాయణం, కామిక్స్‌, రామాయణం టీవీ సీరియల్‌, రామాయణంపై వచ్చిన సినిమాలు - నూటికి 90 మంది మహా అయితే యివి చదివి వుంటారు, చూసి వుంటారు. పుస్తకరూపంలో చదివేవారు అతి తక్కువ. టీవీలో, సినిమాల్లో ఏది చూపిస్తే అదే ప్రామాణికం. సీతా స్వయంవర ఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు అంటే చాలామంది నమ్మనే నమ్మరు. 

ఇక ''ఇద్దరు మిత్రులు'' యీ శీర్షికకు తగునా, తగదా అనే చర్చ గురించి - నేను హిట్‌ సినిమాల గురించే రాస్తానని చెప్పలేదు. దీనికి ముందు చెప్పిన ''మా దైవం'', ''రాముని మించిన రాముడు'', ''నిన్నే పెళ్లాడుతా'' వంటి సినిమాలు విజయవంతం కాలేదు. హిట్‌ కావడానికి, ఫెయిల్‌ కావడానికి సవాలక్ష కారణాలుంటాయి. హిట్‌ కాకపోయినా సినిమా బాగుంటేనే చెప్తాను అని కూడా నేను అనటం లేదు. ఎందుకంటే కథ ఎంత బాగా కూర్చినా దర్శకుడు బాగా తీయకపోయినా, తారాగణం సరిగ్గా నటించకపోయినా కథ పండదు. కథకుడి కళ మీదే యీ శీర్షిక ఫోకస్‌. అది గ్రహించాలి. ఇక సినిమా నచ్చడం, నచ్చకపోవడం పూర్తిగా వ్యక్తిగత యిష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. ఇద్దరు మిత్రులు శతదినోత్సవ చిత్రం. దాని ప్రజాదరణ గురించి యింకో విషయం చెప్పి ముగిస్తాను. మేము ''హాసం'' నడిపే రోజుల్లో ''బాపురమణీయం'' శీర్షికలో ''ఇద్దరు మిత్రులు'' వెండితెర నవల సీరియల్‌గా వేద్దామనుకున్నాం. ఎందుకంటే అది రాసినది ముళ్లపూడి వెంకటరమణ. ఆ పుస్తకం కాపీ ఎక్కడా దొరకలేదు. సినిమా రిలీజైనప్పుడు రూపాయి విలువ వున్న ఆ పుస్తకం కాపీ సంపాదించడానికి వెయ్యి రూపాయలు ఖర్చయింది. సీరియల్‌ పాఠకులను అలరించింది. తర్వాత ''హాసం ప్రచురణలు'' ద్వారా పుస్తకం వేస్తే వెయ్యి కాపీలు అమ్ముడుపోయాయి. ఇప్పుడు కాపీలు అలభ్యం.

అన్నపూర్ణా వారి 'మాంగల్యబలం' 1959 నాటి సినిమా. దీనికి మూలం ''అగ్ని పరీక్షా'' అనే ఓ బెంగాలీ సినిమా. దానికి మూలం ఆశాపూర్ణాదేవి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి రాసిన బెంగాలీ నవల. బెంగాలీ సినిమాలో అగ్రశ్రేణి నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌, సుచిత్రా సేన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. అగ్రదూత్‌ అనే ఆయన దర్శకత్వం వహించారు. ఈ మ్యూజికల్‌ హిట్‌కు సంగీతదర్శకత్వం వహించినది అనుపమ్‌ ఘటక్‌. దీనిలో ఓ పాటను మాత్రం మనవాళ్లు తీసుకుని 'పెనుచీకటాయె లోకం'గా మార్చారు. అన్నపూర్ణావారు అప్పటికే శరత్‌ నవల ఆధారంగా ''తోడికోడళ్లు'' తీశారు. ఈ సినిమా కాపీని కలకత్తానుండి భావన్నారాయణ అనే నిర్మాత తెప్పించి మద్రాసులో నిర్మాతలకు చూపించారు. చాలామంది యాంటీ సెంటిమెంటు అనుకుని పెదవి విరిచారు. దుక్కిపాటి మధుసూదనరావుగారు మాత్రం ధైర్యం చేసి సినిమా హక్కులు కొని యాంటీ సెంటిమెంటు పాలు తగ్గించి, కొన్నిమార్పులు చేసి విజయం సాధించారు. 

బెనర్జీ అనే ఆయన తండ్రి యిష్టానికి వ్యతిరేకంగా ప్రేమవివాహం చేసుకున్నాడు. దానితో ఆయన ఆస్తి అంతా ఓ ముసలావిడకు రాసి చనిపోయాడు. దాంతో బెనర్జీగారి భార్య చిత్రలేఖ గయ్యాళిగా తయారయింది. ఆవిడకు సొసైటీలో చరచరా పైకి ఎక్కేయాలని తాపత్రయం. అత్తగారి చాదస్తాలంటే తగని మంట. బెనర్జీకి కూతురి పేరు తపసి. బేబీ అని పిలుస్తారు. ఆమెకు ఒక అన్న, ఒక తమ్ముడు. తపసికి 14 ఏళ్ల వయసుండగా వాళ్ల స్వంత వూరిలో కృష్ణుడి పండగ చూడడానికి బామ్మతోను, అన్నదమ్ములతోనూ కలిసి వెళ్లింది. అక్కడ ఆమెకు ఆ వూళ్లో జమీందారు ముఖర్జీ కలిశాడు. మీ ఆయనా, నేనూ స్నేహితులం కదా, మేమిద్దరం వియ్యంకులం అవుదామనుకున్నాం. కానీ యిద్దరికీ కొడుకులే. ఇప్పుడు మనవళ్లను కలుపుదాం.  నా చావు ఎప్పుడైనా ముంచుకు రావచ్చు కాబట్టి మీ మనవరాల్ని మా మనవడు 'బులు'కి యిచ్చి పెళ్లి చేస్తానని మాట యియ్యి. మా వాడు కలకత్తాలో కాలేజీలో చదువుకుంటున్నాడు. యోగ్యుడే. మాట అన్నాడు. ముసలావిడ సహజంగానే సందేహించింది. ముసలావిడ మాట యిచ్చి కొడుకుని వెంటనే రమ్మనమని టెలిగ్రాం యిచ్చింది. అతను వచ్చేలోపునే అవతలి ముసలాయనకు చావు ముంచుకు వచ్చింది. పెళ్లి జరిపించవలసి వచ్చింది. పెళ్లి జరుగుతూండగానే ముసలాయన పోయాడు. బెనర్జీ వచ్చేటప్పటికి పెళ్లి జరిగిపోయిందని తెలిసింది. నా కూతుర్ని చదివించి ఆధునికంగా పెంచుదామనుకున్నాను. మా ప్లాన్లు భగ్నం చేశావని తల్లిని నిందించి అతను ఆ అమ్మాయిని యింటికి తీసుకుపోయాడు. అతని భార్య కూతురు పెళ్లి ఆమోదించలేదు. పాపిట సిందూరం తుడిచిపారేసింది. 

తెలుగులో ఈ భాగంలో చాలా మార్పులు చేశారు. కుటుంబస్నేహం బదులు మేనరికం పెట్టారు. ఆ తర్వాత హీరోయిన్‌ వయసు సగానికి సగం తగ్గించేశారు. పెళ్లినాటికి తెలుగు హీరోయిన్‌ వయసు 7 సం||లే. హీరో అప్పటికింకా హైస్కూలు చదువుకు కూడా రాలేదు. దీనివల్ల వాళ్లు పెళ్లి గురించి మర్చిపోయారంటే నమ్మశక్యంగా వుంది. హీరోయిన్‌ తండ్రి పాత్ర ఎస్వీ రంగారావు వేశారు. పేరు పాపారావు. ఆయన భార్య పాత్ర సూర్యకాంతం. పేరు కాంతం. పాపారావు చెల్లెలు ఓ డబ్బులేనివాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందువల్ల కుటుంబాలు విడిపోయాయి. ఆ వూళ్లో పొలాలు వున్నా పాపారావు అటువైపు వెళ్లలేదు. చెల్లెలి ఆర్థికస్థితి బాగాలేదు. గుండెజబ్బు వచ్చిందంటే  తల్లి పార్వతమ్మ (కన్నాంబ) వుండబట్టలేక వెళ్లింది. అక్కడ తన కొడుక్కి అన్నగారి కూతురికి చేసుకోమని కూతురు కోరింది. నేనెలా మాట యివ్వగలను అంది కన్నాంబ. టెలిగ్రాం యిచ్చి కొడుకుని రమ్మనమంది. అతను రైల్లో రావలసినది కారులో వచ్చాడు. రైలువేళ దాటిపోవడంతో అతను రాడనుకుంది తల్లి. ఇవతల కూతురుకి చావు ముంచుకు వచ్చింది. అందుకని పెళ్లి జరిపించేసింది. వచ్చీ రాగానే కొడుకు మండిపడ్డాడు. తన కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు. అతని భార్య మంగళసూత్రం తెంపిపారేసింది. అంతేకాదు, కోర్టు ద్వారా పెళ్లి రద్దు చేయించారు. పెళ్లి చేసినందుకు అబ్బాయి తండ్రికి జరిమానా వేయించారు. దాంతో కన్నాంబ మనుమరాలి తరఫున మనోవర్తి అడిగింది. పాపారావు ఆ వూళ్లో వున్న 10 ఎకరాలు ఆవిడ పేర రాశాడు. ఆ డబ్బుతో ఆ పిల్లవాడు పట్నం వచ్చి పై చదువులు చదివాడు. పెద్దయి నాగేశ్వరరావు అయ్యాడు. హీరోయిన్‌ సావిత్రి అయింది.

బెంగాలీలో ఈ కోర్టు కేసు గొడవ లేదు. ఇది వీళ్లు కల్పించినదే. అక్కడ హీరోయిన్‌ తండ్రికి గుండెపోటు తెప్పించి చంపేశారు. పోయేముందు కూతురికి  'మీ అమ్మ ఔనన్నా, కాదన్నా ఆ బులూయే నీ భర్త. మంత్రాలతో జరిగిన పెళ్లే పెళ్లి.' అని చెప్పి మరీ పోయాడు. ఈ దుర్ఘటనతో ముసలావిడకు ప్రాణం విసిగి, తన పేరు వున్న ఆస్తంతా మనుమరాలి పేర రాసి, కాశీకి వెళ్లిపోయింది. ఈ అమ్మాయి పెరిగి పెద్దదయి సుచిత్రా సేన్‌ అయింది. తల్లి హై సొసైటీ లేడీగా పెంచింది. అన్నగారికి పెద్దగా చదువు వచ్చినట్టు లేదు. తల్లికి దూరంగా వున్నాడు. తమ్ముడు హాస్యం వొలికిస్తూ జోకులు వేస్తున్నాడు. 

తెలుగులో హీరోయిన్‌ తండ్రిని చంపలేదు. అన్నగారు డాక్టరయి ప్రాక్టీసు చేస్తున్నాడు. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?