ఈ దృశ్యం 'స్పార్టకస్' సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ నవల ఆధారంగా 1960లో స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో ఓ సినిమా తయారయింది. కిర్క్ డగ్లస్ స్పార్టకస్ గా వేశాడు. లారెన్స్ ఆలివర్, పీటర్ ఉస్తినోవ్ కూడా వేశారు. ఆ సీనుని సినిమా యాక్టర్ గిరిబాబు 1978లో నిర్మించిన 'సింహగర్జన' సినిమాలో అలాగే దింపేశారు. కథ సగం దాకా స్పార్టకస్‌లాగానే నడుస్తుంది. మల్లయోధులు, ఒకరితో ఒకరు యుద్ధం చేయడం, అదీ నన్నమాట. ఈ తెలుగు సినిమా కూడా చాలా బాగా తీశారు.
స్పార్టకస్ అనుచరులు కనబడ్డ ప్రతి సైనికుణ్ని హతమార్చారు. స్పార్టకస్ అంటే స్పార్టా నగరం నుండి వచ్చినవాడు అని అర్థం. అతని వెంట ఓ ఆఫ్రికన్, ఓ గాల్, ఓ యూదుడు వున్నారు. వాళ్లందరూ వారి వారి జాతుల వారీగా దళాలుగా ఏర్పడి తమవాళ్లను అజమాయిషీ చేశారు. స్పార్టకస్‌ది ఫైనల్ అథారిటీ. ఈ రెండువందల మంది మల్లులు రోడ్డుమీద వెళుతూంటే పక్కనున్న తోటల్లోని బానిసలు వీళ్లని చూస్తూ నిలబడ్డారు. స్పార్టకస్ యూదుడిచేత వాళ్లకు కబురు పంపించాడు. వాళ్లు వచ్చి వీళ్లతో చేరారు. అంతకుముందు తోటల్లోంచి బానిసలు పారిపోయి అడవుల్లో తల దాచుకునేవారు. భూస్వాములు వాళ్లను వెంటాడి పట్టుకుని మిగతావాళ్లకు హెచ్చరికగా వుండేటందుకు కొరత వేసేవారు. అందుకని స్పార్టకస్ చెప్పాడు – 'మనం పారిపోకూడదు. మనం యిక్కడే వుండి, రోమన్ సైనికులతో పోరాడదాం, రోమ్‌నే మార్చివేద్దాం' అని.
స్పార్టకస్ జైత్రయాత్ర సాగుతూ పోయినప్పుడు దారిలో వున్న యిళ్లల్లో వున్న బానిసలు తమ యజమానులను చంపేసి వచ్చి వీళ్లతో చేతులు కలిపారు. వాళ్లకు భయం పోయింది. ఇంటిలో ఎప్పటికైనా యజమానుల కంటె బానిసలే ఎక్కువ మంది వుంటారుగా! పైగా ఈ యజమానులు ఎటువంటి వాళ్లంటే బానిస స్త్రీలతో సుఖించి పిల్లలు పుడితే ఓ ఆరేళ్లు వయసు వచ్చాక వాళ్లను అమ్మేసి డబ్బు చేసుకునే బాపతు. అంటే తమ స్వంత బిడ్డలనే అమ్ముకునే నీచులన్నమాట. ఇక వారిపై వీరికి జాలి ఏముంటుంది? బానిసల్లో పురుషులతో బాటు స్త్రీలు కూడా సమానంగా పోరాడారు. కేపువా ఊరినుండి ఏపియన్ మార్గం పట్టారు ఈ బానిస దళం. ప్రతి తోటకీ, ప్రతి యింటికీ వెళ్లడం, అక్కడి బానిసలను విముక్తి చేయడం ఇదే విధానం వీళ్లది. సంపాదించినది అందరికీ చెందుతుంది. ఎవరికీ స్వంత ఆస్తి వుండదు. ఇలా వచ్చిన బానిసలు వేలాదిమంది తయారయ్యారు.
వీళ్లు అనేక జాతులవాళ్లు. అందరికీ క్రమశిక్షణ లేదు. పోరాట పటిమ లేదు. అయినా స్పార్టకస్ వారికి వెలుగు చూపాడు. అతను వెస్యూవియస్ అగ్నిపర్వతం వైపుకు బానిసలను నడిపించాడు. అక్కడ మరణించిన బానిసలకు చిహ్నంగా స్మృతిచిహ్నాలను నిర్మించాడు. ఈ బానిసల దళాన్ని ఏం చేయాలో రోమ్‌లో వున్న సెనేట్ సభ్యులకు పాలుపోలేదు. వాళ్లు గ్రాఛూస్‌ను సంప్రదించారు. గ్రాఛూస్ గురించి కాస్త చెప్పుకోవాలి. అతను చెప్పులు కుట్టేవాడి కొడుకుగా పుట్టాడు. కానీ బతకనేర్చిన తెలివితేటలు నేర్చాడు. పందొమ్మిది ఏళ్లకే ఓట్లు కొనడం, అమ్మడం, లంచాలు గట్రా యిచ్చి ఉద్యోగాలు వేయిస్తూ, అప్పుడప్పుడు అడ్డం వచ్చినవాళ్లను ఖూనీ చేయిస్తూ ఎదిగాడు. మంచి బలమైన రాజకీయ ముఠా నొకదాన్ని సృష్టించుకుని, ముప్ఫై ఎనిమిదేళ్లు దాటకుండా ఓ ప్రఖ్యాత వార్డునుండి పోటీ లేకుండా ఎన్నికయి ప్రజానాయకుడయ్యాడు. ఇంకో ఐదు సంవత్సరాలకు మేజిస్ట్రేట్ అయ్యాడు. అంటే యితరులకు న్యాయం చెప్తాడన్నమాట! ఆ తర్వాత సెనేట్‌కి ఎన్నికయ్యాడు. అక్కడా చక్రం తిప్పాడు. అతను పెళ్లి చేసుకోలేదు.
అతను విషయమంతా విని బానిసలమీదకు పోలీసులను పంపకండి. బానిసలను వాళ్ల మానాన వాళ్లను వదిలితే వాళ్లలో వాళ్లే తన్నుకు ఛస్తారన్నాడు. ఈ లోపున యితర దేశాలకు పంపిన సైన్యాన్ని వెనక్కి రప్పించి పెట్టండి అన్నాడు. కానీ సెనేట్ గ్రాఛూస్ మాట వినలేదు. బానిసల తిరుగుబాటు అణిచేయడానికి పోలీసు పటాలాన్ని పంపింది. ఈ పోలీసు పటాలం అంటే ఏమిటంటే దీనికి నాయకత్వం వహించేది కులీనులైన యువకులు. వాళ్లు సరదాకోసం, హోదాకోసం వీటికి నాయకత్వం వహిస్తారు. యుద్ధం పెద్దగా రాదు. సైన్యంలా దేశాలు విడిచిపోరు. ఊళ్లోనే వుంటూ, మేస్తూ పోజు కొడుతూంటారు.
గ్లాబ్రూస్ అనే అతని నాయకత్వంలో ఆరు పటాలాలు పెద్ద పటాటోపంతో రోమ్‌నుండి బయలుదేరాయి. కాలినడకన వెళ్లి కేపువా చేరుకుని బానిసలను ఓడించి రమ్మన్నారు. అతను వెళ్లిన కొన్నిరోజులకే ఓ రిపోర్టు పంపాడు – 'స్పార్టకస్ వెంట నడిచే బానిసలు అతనంటే భయంతో వెళుతున్నారు కానీ భక్తితో కాదని.' సెనేట్‌కి ఆ రిపోర్టు యింపుగా కనబడింది. ఇకముందు ఏ బానిసలూ యిలా చేయకుండా వుండేట్లా వాళ్లకు భయం గరపడానికి ఓ యెనభై మంది బానిసలను కొరత వేయమని సెనేట్ ఆదేశం యిచ్చింది. అది తక్షణం అమలయింది. తిరుగుబాటు దారులను అణచలేక, చేతిలో వున్న బానిసలను చంపారన్నమాట ఈ విశ్వవిజేతలు!
ఆ తర్వాత ఆరురోజులకు ఓ చిన్న రిపోర్టు వచ్చింది. పంపిన పటాలాలన్నిటినీ, అంటే, మూడువేల సైనికులను, బానిసలు నాశనం చేశారని! ఇది ఎలా జరిగిందాని ఆశ్చర్యపడుతూండగా ఓ సైనికుడు తిరిగి వచ్చి సెనేట్‌కు తన కథనాన్ని వినిపించాడు – ఈ పటాలాలు రోడ్డుమీద వెళుతూంటే వీళ్లని చూడడానికి ముగ్గురు మగ బానిసలు, ఓ బానిస స్త్రీ వచ్చారు. రెండో పటాలం వాళ్లు ఆ స్త్రీని పట్టుకుని మానభంగం చేశారు. ఆ మొగవాళ్లను ఉత్తిపుణ్యానికి చంపేశారు. తర్వాత ఓ కొండమీద రాత్రి పూట మకాం వేశారు.
రోమన్ సైన్య నిబంధనల ప్రకారం గుడారాల చుట్టూ గట్టి కాపలా వుండాలి. నాయకుడిగా వున్న గ్లాబ్రూస్ ఆ ఏర్పాట్లు చేద్దామన్నాడు. కానీ తక్కిన సైన్యాధికారులు 'బానిస ముండా కొడుకులకు భయపడేదేమిటి? రక్షణ శ్రేణి నిర్మిస్తే సిగ్గుచేటు కూడాను.' అన్నారు. అందరూ బాగా తిని తాగారు. నడిచివచ్చిన అలసటతో పడి నిద్రపోయారు. అర్ధరాత్రివేళ స్పార్టకస్ సైన్యం దాడిచేసి అందర్నీ నిద్రలోనే పీకలు కోసేసింది. ఈ సైనికుడు బతికున్నాడని గమనించి స్పార్టకస్ అతన్ని పిలిచి 'మిమ్మల్ని చూడడానికి వచ్చిన బానిసలను చంపేరెందుకు?' అని అడిగాడు. ఇతని వద్ద సమాధానం లేదు. 'సరే, నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. వెళ్లి నా మాటగా మీ సెనేట్‌కు చెప్పు' అంటూ ఓ సందేశం పంపాడు. 'మీము మీకంటే వెయ్యివేల రెట్లు అధికం. మీకంటె నాగరికులం. మేం రోమ్ జయిస్తాం. మీ సెనేట్ సభ్యులను పట్టుకుంటాం. వాళ్ల చేత దిగంబరంగా మల్లయుద్ధం చేయిస్తాం. రోమ్ కంటె మంచి నగరాలను నిర్మిస్తాం. ఆ పట్నాల చుట్టూ ప్రహారీగోడలుండవు. శాంతియుతంగా జీవిస్తాం…' అంటూ సందేశం.
దీని తర్వాత స్పార్టకస్ ఐదు యుద్ధాల్లో గెలిచాడు. అతన్ని నిరోధించడానికి రోమ్ సెనేట్ క్రాసస్ అనే సేనానికి సైన్యాధిపత్యం కట్టబెట్టింది. అప్పుడు అతను స్పార్టకస్ గురించి తెలుసుకోవడం మొదలెట్టాడు. అతనితో పరిచయం వున్నవాళ్లందరినీ కలిసి వారినుంచి సమాచారం రాబట్టేడు. అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే ఒక సైనికదళాన్ని తయారుచేయాలంటే ఐదేళ్లు పడుతుంది. రోజుకు పదిగంటల కఠోరశిక్షణ నివ్వాలి. క్రమశిక్షణతో మెలిగేట్లా చేయాలి. అటువంటి సైన్యాన్ని స్పార్టకస్ బానిసల సహాయంతో మట్టుపెడుతున్నాడు. ఆ బానిసలు వేర్వేరు జాతులవాళ్లు. సైన్యంలో నిత్యం కవాతు చేసినవారు కారు. స్పార్టకస్‌కు యుద్ధానుభవం లేదు. అయినా యుద్ధ ప్రణాళికలు బాగా వేశాడు. వాళ్లు మకాం వేసిన వెస్యూవియస్ పర్వతాన్ని మూడువైపుల నుండి పూబ్లియస్ ముట్టడించినపుడు అతనికంటె తెలివిగా ఆ మూడుదళాలను చితక్కొట్టి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఇంత గొప్పగా అతనెలా ప్లాన్ చేయగలుగుతున్నాడు? ఇది తెలుసుకోవాలని క్రాసస్ ఆరాటం.
ఇలా కనుక్కునే క్రమంలోనే రచయిత మనకు స్పార్టకస్ కథను కొంచెం కొంచెంగా చెప్పాడు.
క్రాసస్ స్పార్టకస్ సైన్యాన్ని ఎదుర్కొని మొదట్లో ఓడిపోయాడు. తర్వాత అతన్ని ఓడించాడు. స్పార్టకస్, క్రాసస్ తలపడినప్పుడు స్పార్టకస్ క్రాసస్ మీదకు వచ్చేశాడు. అడ్డుపడ్డ పది పదిహేనుమందిని హతమార్చాడు. అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేవరకూ పోరాడుతూనే వున్నాడు. ఇంతా చేసి బానిస యుద్ధంలో గెలిచినందుకు క్రాసస్‌కు రావలసినంత కీర్తి రాలేదు. ఎందుకంటే రోమన్ చరిత్రకారులకు బానిసల యుద్ధం గురించి గొప్పగా చెప్పుకోవడం రుచించలేదు. ఏదో జర్మన్లను ఓడించామంటే గర్వం కానీ పోయి పోయి బానిస వెధవలను ఓడించామని చరిత్రలో రాసుకుంటే భావితరాలు నవ్విపోతారు. చిన్నతనం కూడాను. అందుకని దానికి ప్రాధాన్యత యివ్వలేదు. ప్రాధాన్యతేమిటి, కనీసం గుర్తింపు కూడా యివ్వలేదు. అందుకని క్రాసస్ ఘనత అందరికీ తెలియలేదు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)